సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 433వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • సాయి - నాన్న

సాయిభక్తురాలు చీనా తన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

అందరికీ సాయిరాం! ప్రతి నిమిషం సాయి నాతో ఉంటూ నా మనస్సు వింటూ ఉన్నారు. అటువంటి అనుభవాలను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పబోయే అనుభవం విచారకరమైనదే అయినప్పటికీ సాయి ఎలా సహాయం చేశారో తెలియజేస్తాను. 

మా నాన్నగారు ఆర్మీలో పనిచేశారు. రిటైర్మెంట్ అయ్యాక ఆయన గోవా వచ్చారు. నేను నాన్నకు ముద్దులపట్టిని. నా జీవితంలో ప్రతిరోజూ, ప్రతిదీ ఆయనదే. నేను పట్టలేని ఆనందంతో నాన్నని చూడటానికి ముంబాయి నుండి బయలుదేరాను. అయితే నేను ఎలాగూ వస్తున్నానని, ముందునుండే నన్ను ఒత్తిడికి గురిచేయడం ఇష్టంలేని మా అమ్మ, సోదరుడు నాన్న ఆరోగ్యం బాగాలేదన్న విషయం నాకు చెప్పలేదు. ఆ రాత్రి నాన్న ఆరోగ్యం మరింత దిగజారిపోయింది. దాంతో నాన్నను సమీపంలో ఉన్న క్లినిక్‌కు తీసుకువెళ్లారు. అప్పట్లో గోవాలో వైద్యం అంత మెరుగ్గా లేదు. ఇది 2004 నాటి పరిస్థితి. క్లినిక్‌లోని డాక్టరు నాన్నకు గుండెనొప్పి వచ్చిందని చెప్పారు. ఇంకో విషయం, ఆయనకు డయాబెటిస్ కూడా ఉంది. సాధారణ వ్యక్తుల కంటే డయాబెటిస్ రోగికి గుండెనొప్పి అంటే చాలా ప్రమాదం. కానీ ఆ డాక్టర్ చికిత్సేమీ చేయడంలేదు. మరుసటిరోజు తెలిసిన విషయం ఏమిటంటే ఆ డాక్టరుకి చెవుడని. ఇక అక్కడ ఉండటం మంచిది కాదని ఆరోజు ఉదయం నాన్నను పేరున్న గోవా మెడికల్ కాలేజీకి(జిఎంసి) మార్చాము. నాన్నను ఐసియులో ఉంచారు. దారుణమైన పరిస్థితి అని చెప్పాలి. అక్కడి డాక్టర్స్ చాలా మంచివాళ్ళు. వాళ్ళు తమవంతు కృషి చేశారు. అక్కడున్న పన్నెండు రోజులు నేను వాళ్ళ బ్రెయిన్ తిన్నాను.

మేము ఎక్కడ నివాసమున్నా వంద మీటర్ల లోపు సాయి మందిరం ఉండేది. మరి ఈ పరిస్థితుల్లో సాయి నా చుట్టూ ఎలా ఉన్నారో తెలియజేస్తాను. గోవాలో దేవి, విష్ణు ఆలయాలు కనిపిస్తాయి కానీ సాయి మందిరాలు చాలా అరుదు. మేమున్న హాస్పిటల్లో అయితే దేవుడి విగ్రహాల్లాంటివి అస్సలు లేవు. ఒకసారి నేను అనుకోకుండా హాస్పిటల్ ప్రవేశద్వారం వద్ద ఉన్న ఒక గుడిసె వద్దకు వెళ్ళాను. అక్కడ నేను చిన్న సాయి విగ్రహాన్ని చూసి ఆశ్చర్యానందాలలో మునిగిపోయాను. ఆయన మాతో ఉన్నానని నాకు భరోసా ఇచ్చారు. ప్రతిరోజూ ఉదయాన్నే నేను బాబాను దర్శించి, నాన్నను జాగ్రత్తగా చూసుకోమని, తిరిగి వారి పాదాల చెంతకు రప్పించుకోమని హృదయపూర్వకంగా వేడుకుంటూండేదాన్ని. డాక్టర్స్ ఉత్తమ వైద్యాన్ని అందిస్తూ తమవంతు చాలా ప్రయత్నం చేశారు. కానీ గుండెపోటు కారణంగా గుండెకు సంబంధించిన మూడు కవాటాలు విఫలమయ్యాయి. అంటే, మొదటి క్లినిక్‌కి వెళ్ళినప్పుడు నాన్నకి వచ్చింది పెద్ద గుండెపోటు. ఒక అవయవానికి సమస్య వచ్చిదంటే మిగిలిన వాటిపై ఆ ప్రభావం ఉంటుంది. అదే జరిగింది. నెమ్మదిగా నాన్న మూత్రపిండాల పనితీరు తగ్గుముఖం పట్టింది. దాంతో డయాలసిస్ చేస్తున్నారు. నాన్న తీవ్రంగా బాధపడుతూ మంచంమీద పడివున్నారు. అది నేనస్సలు తట్టుకోలేకపోయాను.

ప్రతిరోజూ నాన్నకు తిరిగి జీవితాన్ని ఇవ్వమని సాయిని ప్రార్థిస్తున్న నాకు పన్నెండవరోజు ప్రత్యేకమైనది. ఆరోజు నేను సాయి వద్దకి వెళ్లి, "సాయీ! నాన్న చాలా బాధపడుతున్నారు, మీకు కనిపించడం లేదా? ఆయన ఎందుకిలా బాధపడాలో నాకు తెలియడంలేదు. నాన్న ఆరోగ్యాన్ని సాధారణ స్థితికి తిరిగి తెమ్మని నేను మిమ్మల్ని అడిగాను. కానీ మీరు నా మాట వినడం లేదనిపిస్తుంది. మీరు నాన్నకి నయం చేయలేకపోతే నా మాట మన్నించి ఆయన్ని మీ పాదాల చెంతకు తీసుకుపోండి. అంతేకానీ నాన్నని ఇంకా బాధించకండి" అని చెప్పుకుని తిరిగి ఐసియు వద్దకు బయలుదేరాను. నేను మెట్లెక్కి ఐసియు ఉన్న మొదటి అంతస్తుకు వెళ్లేసరికి నా సోదరుడు బయటకు వచ్చి, "లోపలికి రా!" అని పిలిచాడు. నేను లోపలికి వెళ్లగా నాన్న నన్ను చూస్తూ చివరిశ్వాస తీసుకున్నారు. అకస్మాత్తుగా నేను నాన్న ముఖంలో ప్రశాంతతని చూశాను. నా గుండె బద్దలైపోయింది. కానీ నా మనసులోకి వచ్చిన ఒకే ఒక్క ఆలోచన ఏమిటంటే - 'నాన్న సాయిలో ఐక్యమై శాంతిని పొందారు' అని. నా తండ్రి బాధపడుతూ మంచంమీద ఉండటం చూడలేకపోతున్నానన్న నా ప్రార్థనను సాయి విన్నారు, నాన్నకి మోక్షాన్నిచ్చారు.

తరువాత 13 రోజుల్లో సాయి, నాన్న చాలాసార్లు కలలో కనిపించారు. అప్పుడు నేను శిరిడీ వెళ్లి సాయి దర్శనం చేసుకున్నాను. అంతటితో కలలు ఆగిపోయాయి. 'నాన్న తనతో ఉన్నార'ని ఆవిధంగా సాయి నాకు తెలియజేసారు. ఇప్పుడు నేనెప్పుడు సాయి దర్శనానికి శిరిడీ వెళ్లినా ఒకవిధంగా సాయితో పాటు నాన్నని కూడా చూడడానికే.

సాయి మనం చెప్పే ప్రతి మాటా వింటారు. కాబట్టి ఆయన ఆశీస్సులకు కృతజ్ఞులై ఉండండి. ఆయన తన భక్తులకు ఏది ఉత్తమమో అదే చేస్తారు.

సాయి! సాయి! సాయి!


8 comments:

  1. అమ్మా
    మీ శ్రద్ధ సబూరి కి పాదాభి వందనాలు.

    ఓం సాయి రామ్ జై సాయి మాస్టర్.

    ReplyDelete
  2. 🙏🌹 ఓం శ్రీ సాయిరాం తాతయ్య 🌹🙏

    ReplyDelete
  3. సాయి కథ శ్రవణం సకల పాప హరణం మోక్ష కారకము.
    సాయి సచ్చరిత్ర'లో మేగుడు తన శరీరాన్ని వదిలి పెట్టిన తర్వాత బాబా వారు చెప్పినటువంటి అమృతవాక్కులు. మరణం అనేది శరీరానికే కాని ఆత్మకు కాదు మరణించిన వారు మళ్ళి జన్మిస్తూ మన మధ్యనే కలిసి ఉంటారు. ఆ సాయినాధుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మీ నాన్నగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.సాయి భక్తులందరూ చల్లగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఓం సాయి రామ్🙏🙏🙏

    ReplyDelete
  4. సాయి! సాయి! సాయి!

    ReplyDelete
  5. om sairam
    sai always be with me

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. ఓం సాయిరాం...,,🌹🙏🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo