సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీమతి భికూబాయి



సాయిభక్తురాలు శ్రీమతి భికూబాయి అహ్మద్‌నగర్‌లో జన్మించింది. అహ్మద్‌నగర్‌లో బాబాసాహెబ్ గణేష్ అనే ప్లీడరుండేవాడు. అతని మనవరాలైన శ్రీమతి రాధాకృష్ణఆయి అతనింట్లోనే ఉండేది. ఆయీ వద్ద సాయిబాబా ఫోటో ఒకటి ఉండేది. ఆయీ ప్రతినిత్యం భక్తిప్రపత్తులతో ఆ ఫొటోకు పూజ, ఆరతి చేస్తూ, ‘ఎప్పుడెప్పుడు శిరిడీలోని బాబా సన్నిధికి చేరుకుంటానా’ అని ఆరాటపడుతుండేది. తరువాత కొంతకాలానికి బాబా అనుగ్రహంతో ఆయీ శిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకుని, వారి ఆజ్ఞానుసారం శిరిడీలోనే నివసిస్తూ బాబా సేవ చేసుకోసాగింది. రాధాకృష్ణఆయీకి భికూబాయి మంచి స్నేహితురాలు. ఆయీ ద్వారానే భికూబాయికి బాబా గురించి తెలిసింది.

భికూబాయికి చిన్నవయస్సులోనే సంగమనేరుకి చెందిన బయ్యాజీ పాటిల్‌తో వివాహమయింది. అతనొక సైనికోద్యోగి. పెళ్ళైన కొంతకాలానికే అతను యుద్ధంలో మరణించడం వల్ల భికూబాయికి నెలకు ఆరు రూపాయల పింఛను వస్తుండేది. ఒకసారి వంజర్‌గావ్‌కు చెందిన శ్రీగంగగిర్ మహరాజ్ శిరిడీలోని వాడాకు సమీపంలో ఉన్న చింతచెట్టు కింద పెద్ద ఎత్తున నామసప్తాహం నిర్వహించారు. ఆ సప్తాహానికి ప్రతిరోజూ ఎంతోమంది యాత్రికులు హాజరయ్యేవారు. ఆ యాత్రికులలో సంగమనేరుకు చెందిన భక్తబృందమొకటి ఉంది. ఆ భక్తబృందం సంగమనేరుకి తిరిగి వెళ్ళేటప్పుడు వారి ద్వారా రాధాకృష్ణమాయి తన స్నేహితురాలైన భికూబాయికి ఒక బాబా ఫోటో, బర్ఫీ ప్రసాదం పంపింది. అంతేకాదు, ఆమెను శిరిడీకి వచ్చి ఉండమని ఆహ్వానం పంపింది. ఆ ఆహ్వానాన్ని అందుకున్న భికూబాయి తన ఆస్తిని, బంగారు నగలను వదిలేసి తన పద్నాల్గవ ఏట (1908లో) శిరిడీ వచ్చి బాబాను దర్శించుకుంది. బాబా ఆమెను ఆశీర్వదించి ఆయీతో ఉండి, సేవ చేసుకోమని ఆదేశించారు.

1916 చివరిలో, అంటే, రాధాకృష్ణఆయి మరణించిన ఒకటి, రెండు నెలల తరువాత భికూబాయి పింఛనుకోసం అహ్మద్‌నగర్ వెళ్ళింది. పింఛను తీసుకొని తిరిగి వస్తూ బాబాకు సమర్పించడానికి ఒక పూలమాల, ఒక పుచ్చకాయ, కొన్ని పేడాలు కొన్నది. కోపర్‌గావ్‍‍లోని గోదావరి తీరానికి చేరుకోగానే తన స్నేహితురాలైన రాధాకృష్ణఆయి అక్కడే దహనం చేయబడిన విషయం గుర్తొచ్చి ఆమె మనసంతా వికలమైపోయింది. తరువాత ఆమె శిరిడీ చేరుకొని నేరుగా మశీదుకు వెళ్ళింది. తనతో తీసుకొని వెళ్లిన పూలమాలను బాబా మెడలో వేయడానికి ప్రయత్నించగా, "అశాంతచిత్తంతో తెచ్చిన ఆ పూలమాల నాకక్కరలేదు!" అంటూ బాబా ఆ పూలమాలను నిరాకరించారు. ఆమె ఎంతో కష్టానికోర్చి అహ్మద్‌నగర్ నుండి ఆ పూలమాలను తెచ్చినందువల్ల దానిని స్వీకరించమని బాబాను అర్థించాడు దీక్షిత్. భికూబాయి మరలా ముందుకెళ్లి ఆ పూలమాలను బాబా మెడలో వేయడానికి చేతులు రెండూ పైకెత్తగానే చిత్రంగా ఆ పూలమాల మూడు ముక్కలై, ఒక చేతిలో ఒక ముక్క, రెండవ చేతిలో మరో ముక్క మిగిలిపోయి, మూడవ ముక్క క్రింద పడిపోయింది. ఆ పూలమాల ఎలా తెగిందో ఆమెకు అర్థం కాలేదు.

తరువాత ఆమె తనతోపాటు తెచ్చిన పుచ్చకాయని ముక్కలుగా కోసి, ఆ పుచ్చకాయ ముక్కలను, పేడాలను బాబా ముందుంచింది. బాబా వాటిని తీసుకొని భక్తులందరికీ పంచారు. ఆమె ఒక పుచ్చకాయముక్క తీసుకొని, దాని చెక్కు తీసి బాబాకు ఇచ్చి తినమని ప్రార్థించింది. కానీ బాబా నిరాకరించారు. దీక్షిత్ కూడా ఆ పుచ్చకాయముక్కను తినమని బాబాను ప్రార్థించాడు. అప్పుడు బాబా అతనితో, "ఈమె గోదావరి ఒడ్డున కూర్చొని విలపిస్తూ కన్నీరు కార్చింది. హృదయవేదనతో తెచ్చిన వీటిని నేను స్వీకరించను" అని అన్నారు. వాస్తవం ఏమిటంటే, ఆమె గోదావరి తీరంలో ఏడుస్తూ రాధాకృష్ణఆయీని అంతటి హేయమైన చావు నుండి కాపాడలేదని బాబాను నిందించింది. ఆమె హృదయవేదన తెలిసినందునే బాబా ఆమె తెచ్చినవాటిని స్వీకరించలేదు.

బాబా ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనం సమయంలో భికూబాయికి ఒక పాత్ర నిండా ఆహారం ఇచ్చేవారు. ఆమె ఆ ప్రసాదాన్ని తన ఇంటికి తీసుకొని వెళ్లి తినేది. బాబా మహాసమాధి చెందినరోజు తాను దిక్కులేనిదానినయ్యానన్న బాధతో భికూబాయి హృదయవిదారకంగా విలపించింది. ఆరోజు రాత్రి పది గంటల సమయంలో ఆమె తన ఇంటిలో, "బాబా! నేను ఇక మిమ్మల్ని చూడలేను కదా?" అని దుఃఖిస్తూ బయటకి వెళ్లగా ఇంటి వాకిలిలో ఆమెకు ఒక పాము కనిపించింది. బాబానే ఆ పాము రూపంలో దర్శనమిచ్చారని తలచి, "బాబా! మిమ్మల్ని ఈ సర్పరూపంలో నేను గుర్తించలేను. కానీ ఈ రూపంలో ఉన్నది మీరేనని నాకు తెలుసు" అని అన్నదామె. వెంటనే ఆ పాము అదృశ్యమైంది
(మూలం: డివోటీస్ ఎక్స్పీరియెన్సెస్ ఆఫ్ సాయిబాబా బై శ్రీబి.వి.నరసింహస్వామి).

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo