సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1073వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఈ లోకంలో సాయే నాకున్న దిక్కు
2. ప్రార్థనను విని మా కోరిక తీర్చిన బాబా
3. షుగర్ మాత్రల అవసరం లేకుండా చేసిన బాబా

ఈ లోకంలో సాయే నాకున్న దిక్కు


ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయి బంధువులందరికీ నమస్కారం. నా అనుభవాలను పంచుకునే అవకాశమిచ్చిన 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు అశోక్ కుమార్. ప్రస్తుతం నా వయస్సు 38 సంవత్సరాలు. నాకు భార్య, ఇద్దరు పిల్లలు. మాది విజయవాడ. నేను ఇదివరకు లారీడ్రైవరుగా పనిచేస్తూ జీవనం సాగిస్తుండేవాడిని. లారీ ఫీల్డ్‌లో క్రమంగా మద్యపానానికి బానిసనై భార్య, పిల్లల గురించి, వారి ఆలనాపాలనా, కుటుంబ పోషణ వంటివేవీ అస్సలు పట్టించుకోకుండా వాళ్ళని ఎన్నో రీతుల బాధపెట్టాను. ఈ భూమి మీద నా అంతటి వాడు లేడని గర్వహంకారాలతో విర్రవీగుతూ, ఎన్నో అకృత్యాలకు పాల్పడుతూ అడ్డు చెప్పబోయిన వారిపై చిన్నంతరం, పెద్దంతరం చూడకుండా, చివరికి కన్నతండ్రి అని కూడా లేకుండా ఒళ్లూపై తెలియకుండా మదమెక్కి అందరిపై తిరగబడేవాడిని. అటువంటి నా ప్రవర్తనతో విసుగు చెందిన నా భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయి తన తల్లిదండ్రుల సహకారంతో నా నుండి విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది. నేను విడాకులకు అంగీకరించక నాకు వచ్చిన లాయర్ సమన్లును తిరస్కరించాను. సరిగా అదే సమయంలో(2015లో) తప్పతాగి ప్రమాదవశాత్తు మేడ మీద నుంచి కాలుజారి క్రింద పడిపోయాను. ఆ ప్రమాదంలో నా వెన్నుముక దెబ్బతిని శరీరం చచ్చుబడిపోవడంతో నేను శాశ్వతంగా మంచానికి పరిమితమయ్యాను. ఇకపోతే నేను కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి నా భార్యకు వన్ సైడ్ డైవర్స్ ఇచ్చి కేసు క్లోజ్ చేశారు. అప్పుడు నేను 'దేవుడు నా గర్వహంకారాలను పూర్తిగా అణచి, నన్ను మంచానికి పరిమితం చేసి నాకు సరైన గుణపాఠం చెప్పి, తగిన శాస్తి చేశాడ'ని  గ్రహించాను. మనుషుల విలువ వాళ్ళు మనతో ఉన్నంతవరకు మనకు తెలియదు అంటారు. అదే నిజమేమో! భార్యబిడ్డలను దూరం చేసుకున్నాకే నేను ఎంత దురదృష్టవంతుడినో, నా బ్రతుకెంత వ్యర్దమో నాకు అర్థమైంది.


పై సంఘటనలతో తీవ్ర మనస్తాపానికి గురైన మా నాన్నగారు దిగులుతో ఆరునెలలు అయ్యేసరికి మృతి చెందారు. అప్పటినుంచి నన్ను మా అమ్మగారే చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె వయస్సు 58 సంవత్సరాలు. ఆమె ఒక హృద్రోగి. ఒకపక్క ఆమె ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడం, మరో ప్రక్క నన్ను చూసుకోవడం వల్ల అమ్మ ఎంతో కష్ట పడుతుంది. అదీకాక అమ్మకొచ్చే కొద్దిపాటి పింఛనుతో నేను, అమ్మ జీవనం సాగించడం, ఇల్లు గడవడం చాలా కష్టంగా, ఇబ్బందికరంగా ఉంది. అందువలన నాన్నగారు కొద్దో గొప్పో సంపాదించి మిగిల్చి వెళ్లిన డబ్బు రెండు, మూడు లక్షల్లో కొంత ఎవరికైన వడ్డీకిస్తే వచ్చిన ఆదాయంతో ఇల్లు గడపవచ్చన్న ఆలోచనతో 2018లో ఓ వ్యక్తికీ లక్ష పాతికవేల రూపాయలు ఇచ్చాము. అతను మా బలహీనతను గమనించి వడ్డీ డబ్బులుగానీ, అసలుగానీ ఇవ్వకుండా ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని నమ్మించి మోసం చేస్తుండేవాడు. అమ్మా, నేనూ అతడి కాళ్ళావేళ్ళాపడి ఎంతలా బ్రతిమాలినప్పటికీ మా డబ్బు మాకు ఇవ్వలేదు. ఇక లాభం లేదని ఒక లాయరుని సంప్రదించి కోర్టులో కేసు వేశాము. అయినా అతనిలో ఏ మార్పు రాలేదు. ఆ సమయంలో నేను బాబా మీద నమ్మకం ఉంచి, "బాబా! ఆ వ్యక్తికి సద్బుద్ధిని ప్రసాదించి, జ్ఞానోదయమయ్యేలా చేసి మా డబ్బు మాకు తిరిగి ఇప్పిస్తే శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకుని, మీ పేరిట కలకండ పంచుతాను. మీరు చేసిన అద్భుత లీలను 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. నాకు ప్రతిరోజూ నాలుగు పూటల శిరిడీలో జరిగే బాబా హారతులు మొబైల్‍లో వీక్షించే అలవాటు. ఒకరోజు సాయంత్రం ధూప్ హారతి చూస్తుండగా లాయర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. విషయమేమిటంటే, మేము డబ్బిచ్చిన వ్యక్తి సెటిల్‍మెంట్‍కి వచ్చి 'ఒకటి, రెండు నెలల్లో లక్ష రూపాయలు ఇస్తాన'ని లాయరుకి మాట ఇచ్చాడట. ఆ విషయం తెలియజేసి బాబా నాకు ఎంతో ఆనందాన్ని ప్రసాదించారు.  తరువాత 2022, జనవరి 30, సాయంత్రం ఆ వ్యక్తి మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేశాడు. ఇదంతా ఆ సాయినాథుని దయ.


నిజానికి నేను అదివరకే శిరిడీ దర్శనం మూడు, నాలుగుసార్లు చేశానుకానీ, బాబా నిజతత్వం గ్రహించలేకపోయాను. కానీ నాకు ఇప్పుడు బాబా పాదాలు, వారి దివ్యమంగళ స్వరూపమే సర్వస్వం. ఆయన తప్ప నాకు ఈ లోకంలో వేరు దిక్కులేదు. నేను ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి నుదుటన ఊదీ ధరించి, శిరిడీ హారతి వీక్షించి, ఆపై శ్రీగురుచరిత్ర, శ్రీసాయి సచ్చరిత్ర నిత్య పారాయణ చేయడం అలవాటు చేసుకున్నాను. 2022, జనవరి నెల చివరిలో ఒక వారం రోజులుపాటు నాలో ఒమిక్రాన్ లక్షణాలు కనిపించి పారాయణ చేయడానికి నా శరీరం సహకరించలేదు. అప్పుడు నేను, "బాబా! ఎలాగైనా మీరు నాచేత పారాయణ పూర్తి చేయించాలి" అని వేడుకుని నుదుటన ఊదీ పెట్టుకుని చదవటం ప్రారంభించాను. అంతే, బాబా నాకు శక్తిని ప్రసాదించి నాచేత పారాయణ పూర్తి చేయించారు. బాబా అనుగ్రహానికి నాకు చాలా సంతోషం కలిగింది.


బాబాకు అన్నదానం అంటే ఎంతో ప్రీతి. నేను శ్రీసాయి సచ్చరిత్ర చదవడం ద్వారా మధ్యాహ్నాం 12 గంటలకు భోజనం దొరకకపోతే జీవుడు ఆకలితో అలమటిస్తాడని తెలుసుకున్నాను. ఇంకా శ్రీగురుడు తమ భక్తులను అనుగ్రహించడానికి మధ్యాహ్నవేళ అనేక రూపాలలో భిక్షకోసం భక్తుల ఇంటి ముంగిట దర్శనమిచ్చినట్టు శ్రీగురుచరిత్రలో చెప్పబడింది. అదేవిధంగా శ్రీసాయిబాబా అనేక రూపాలలో మధ్యాహ్నవేళ భిక్షకోసం మా ఇంటి ముందుకు వచ్చిన సందర్భాలు నాకు చాలా ఎదురయ్యాయి. నేను సరిగ్గా పారాయణ చదువుతున్నప్పుడు, ఒక్కోసారి సరిగ్గా శిరిడీలో మధ్యాహ్న హారతి పూర్తయిన వెంటనే మా ఇంటికొచ్చి ఎవరో ఒకరు భిక్ష అడగటం నాకు చాలా ఆనందం కలుగజేసేది. అందువలన నేను 'భిక్షకోసం ఇంటి ముందుకొచ్చే అతిథికి లేదని పంపకుండా, ఉన్న దాంట్లో ఎంతో కొంత పెట్టాల'ని నిర్ణయించుకున్నాను. 2022, సంక్రాంతి పండుగరోజు ఉదయం సరిగా 6గంటలకు నేను పారాయణ చేస్తుండగా మాసిన గడ్డంతో ఉన్న ఒక పండు ముసలాయన  మా ఇంటికొచ్చి భిక్ష అడిగాడు. ఆయన ముఖ లక్షణాలు బాబాను పోలి ఉన్నాయి. నా తల్లి అతనితో, "పొద్దున్నే ఏమీ లేదు, వెళ్ళిరా" అని పంపేసింది. నా మనసు చాలా కలత చెంది మనసులో బాబాను, "బాబా! నన్ను క్షమించండి. మారు రూపంలో భిక్షకోసం మా ఇంటికొచ్చింది మీరేనని నా తల్లి గ్రహించలేకపోయింది బాబా. నా తల్లి తరపున నేను మిమ్మల్ని క్షమాపణలు వేడుకుంటున్నాను. ఇంటికి వచ్చిన అతిథికి భిక్ష లేదని పంపివేయకూడదన్న సద్భుద్ధిని నా తల్లికి ప్రసాదించు తండ్రి. దయచేసి మా అజ్ఞానాన్ని మన్నించి మళ్లీ భిక్షకు రండి బాబా" అని మనసులో వేడుకున్నాను. కానీ తరువాత రెండు, మూడురోజులు వరకు మా ఇంటికి ఎవరూ భిక్షకోసం రాలేదు. దాంతో నేను, 'అయ్యో! ఇంటి ముందుకొచ్చిన అతిథిని ఒట్టిచేతులతో పంపేసి నా తల్లి అపచారం చేసింది' అని బాధపడ్డాను. తరువాత 2022, జనవరి 27, ఉదయం నా పారాయణ ముసిగిసిన వెంటనే ఒక ముదుసలి వ్యక్తి భిక్షకోసం మా ఇంటికి వచ్చారు. ఆ వ్యక్తి వేరెవరో కాదు, ఆరోజు నా తల్లి భిక్ష లేదని పంపేసిన అదే వ్యక్తి. ఆయన మళ్ళీ రావడం నా మనసుకు ఎంతో సంతోషాన్నిచ్చింది. అంతా ఆ సాయినాథుని దయ. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


చివరిగా నా గత జీవిత చేదు జ్ఞాపకాలను, ప్రస్తుత జీవితంలో బాబా ప్రసాదిస్తున్న అనుభవాలను కలిపి ఇంత పెద్ద భారతం వ్రాసి నా దరిద్రపు జీవితాన్ని ఇంత గొప్ప 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకోవాలనుకోవడం నా అజ్ఞానమే అనుకుంటున్నాను. అయితే, చేసిన పాపాలను చెప్పి, తప్పు ఒప్పుకుంటే కొంచమైనా ప్రాయశ్చిత్తం కలుగుతుందన్న మనోవేదన తప్ప మరేమీ లేదు. కానీ అనవసరముగా మీ విలువైన సమయాన్ని వృథా చేసిఉంటే నన్ను క్షమించమని వేడుకుంటున్నాను.


ప్రార్థనను విని మా కోరిక తీర్చిన బాబా


సాయి భక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. మేము హైదరాబాదులో నివాసముంటున్నాము. వివాహమైన తర్వాత నేను బాబాను ఎక్కువగా నమ్ముతున్నాను. వివాహం కాకముందు కూడా నాకు సాయితో అనుబంధం ఉండేది కానీ, ఇప్పుడు సాయిని పూజించేంతగా లేదు. చాలాసార్లు, చాలా విషయాలలో అనుకున్నది జరగాలని బాబాను తలుచుకోగానే నేను అనుకున్నట్లుగానే అన్నీ జరిగేవి. నేను ఇప్పుడు ఈమధ్య బాబా ప్రసాదించిన అటువంటి ఒక అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకోవాలనుకుంటున్నాను. రోజూ మీ అందరి అనుభవాలను తప్పకుండా చదువుతున్న నాకు నా ఈ అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనిపించింది. ఇక అసలు విషయానికి వస్తే...  ఈమధ్య మా పెద్దమ్మాయి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ప్రస్తుతం ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతుంది. మేము తను చదివిన స్కూలు నుండి తన టెన్త్ క్లాసు మార్కుల లిస్ట్ తీసుకుని ఒక ఫైల్‍లో భద్రపరిచాము. ఈమధ్య ఆ సర్టిఫికెటుతో అవసరంపడి దాని గురించి వెతికితే అది కనపడలేదు. ఇంట్లో అన్ని చోట్ల దాని గురించి వెతికాము. అయితే ఎంత వెతికినా మిగిలినవన్నీ కనపడుతున్నాయి కానీ ఆ సర్టిఫికెటు మాత్రం కనపడలేదు. అప్పుడు నేను, "బాబా! సర్టిఫికెటు కనబడితే, నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను. దయచేసి నా అభ్యర్థనను మన్నించండి" అని వేడుకున్నాను. రెండు, మూడు రోజుల తర్వాత నేను ఉదయం పూజ చేస్తుంటే పూజగదిలోని ఒక అలమారపై ఒక ఫైలు కనబడింది. నేను ఎంతో ఆశ్చర్యంగా ఆ ఫైలు తీసి చూస్తే, అందులో మా పాప మార్కుల లిస్టు, ఇంకా కొన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి. నిజానికి నేను అంతకుముందు కూడా ఆ చోట చాలా వెతికి చూశాను కానీ, అప్పుడు అవి అక్కడ కనబడలేదు. బాబాని ప్రార్థించిన తరువాతే ఆ ఫైలు నాకు దొరికింది. దాంతో జీవితంలో ఎంతో విలువైన టెన్త్ సర్టిఫికెటుని పోగొట్టుకున్నామని చాలా బాధపడిన మాకు చాలా ఆనందం కలిగింది. "బాబా! మా ప్రార్థనను విని మా కోరిక తీర్చిన మీకు చాలా చాలా ధన్యవాదాలు సాయి. ఇలాగే మాకున్న ఒక పెద్ద సమస్యను కూడా తొందరగా పరిష్కరించి మాకు మనశ్శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను బాబా". ఆ కోరిక తీరిన వెంటనే నేను మరల నా అనుభవాన్ని మీతో పంచుకుంటాను. అందరికీ ధన్యవాదాలు.


షుగర్ మాత్రల అవసరం లేకుండా చేసిన బాబా

'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారం. నా పేరు లలిత. మాది రాజాం. నేను ఒక సాయి భక్తురాలిని. సాయి నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. అందులో నుండి ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఈ మధ్య మా నాన్నగారికి షుగర్ ఉందని, అది కూడా చాలా ఎక్కువగా ఉందని, రోజూ షుగర్ మాత్రలు వేసుకోవాలని డాక్టరు చెప్పారు. మా నాన్నగారికి ముందే మెదడుకి సంబంధించిన సమస్య ఉన్నందున నేను నా బాధని సాయికి  చెప్పుకుని, "బాబా! నాన్నకి షుగర్ తగిపోవాలి. రోజూ మాత్రలు వేసుకోవాల్సిన అవసరం ఉండకూడదు సాయి" అని నమస్కారం చేసుకున్నాను. నా సాయి దయవలన షుగర్‍కి సంబంధించిన మాత్రలు వేసుకునే అవసరం నాన్నకి రాలేదు. అంతా ఆ సాయి తండ్రి దయ. "ధన్యవాదాలు సాయి తండ్రి. నా తమ్ముడికి సంబంధించిన ఒక సమస్య గురించి  మీకు చెప్పుకున్నాను. మీ దయతో అది పరిష్కారమతే మళ్ళీ నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాను".


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!



3 comments:

  1. Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Baba na korika tirchu tandri. Please baba Karuninchu 👏👏👏👏👏👏👏👏👏👏👏👏NA husband eye operation manichiga ayyetttu cheye tandri.. Ne midey NA baram.. Nuvey ayaniki treatment cheyali aa doctor ruprm lo.. Plz bless me Baba always my head under your feet 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Repey aayana eye opretion kapadu tandri👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞

    ReplyDelete
  2. Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam. Bless me and pass me for my MBA exam

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo