1. విపత్కర పరిస్థితి నుండి కాపాడిన బాబా - సమాధిమందిరంలో ప్రసాదించిన అద్భుత లీల
2. దర్శనంతో సంతానభాగ్యాన్ని ప్రసాదించిన బాబా
3. పెద్ద సమస్యలో పడకుండా తక్షణమే కాపాడిన బాబా
విపత్కర పరిస్థితి నుండి కాపాడిన బాబా - సమాధిమందిరంలో ప్రసాదించిన అద్భుత లీల
శ్రీసాయి బంధువులకు, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు ఇందిర. మాది హైదరాబాద్. నేనిప్పుడు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటాను. ఒకసారి రోడ్డు ప్రమాదంలో మా నాన్నగారి తలకు పెద్ద గాయమై మెదడులో రక్తం గడ్డకట్టింది. మా అమ్మ డాక్టరుతో మాట్లాడుతుండగా, 'ఆపరేషన్ చేయడం కష్టం' అంటున్న డాక్టర్ మాటలు నేను ఫోనులో విన్నాను. నాకు ఏమి చేయాలో దిక్కుతోచక విపరీతమైన దుఃఖంతో ఇంట్లోని బాబా పాదాల చెంత, "బాబా! మా నాన్నకి ఆపరేషన్ జరగాలి. ఇంతకుముందులా మాతో సంతోషంగా ఉండాలి" అని వేడుకున్నాను. వెంటనే మా అమ్మ నుండి నాకు ఫోన్ వచ్చింది. అమ్మ నాతో, "ఆపరేషన్ చేస్తారు. ఏ ప్రమాదం లేదు" అని చెప్పింది. అది విన్న వెంటనే, "ఏ ఇబ్బందీ లేకుండా సర్జరీ విజయవంతమైతే శిరిడీ వస్తాను బాబా" అని మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల ఎటువంటి ఇబ్బందీ లేకుండా సర్జరీ పూర్తికావడం, నాన్న తొందరగా కోలుకుని నార్మల్ అవడం జరిగాయి. "శతకోటి ధన్యవాదాలు సాయీ".
శిరిడీ ప్రయాణం: ఇప్పుడొక అద్భుతమైన బాబా లీలను పంచుకుంటాను. నాన్నగారి ఆరోగ్యం కుదుటపడుతున్న సమయంలో మా పిన్నీవాళ్ళు తమ శిరిడీ ప్రయాణం గురించి చెప్పారు. నాకు వెంటనే బయలుదేరి వాళ్ళతో శిరిడీ వెళ్ళాలనిపించింది. అలాగే వాళ్ళతో కలిసి శిరిడీ వెళ్ళాను. నేను సమాధిమందిరం దర్శనానికి వెళ్ళేటప్పుడు 'ఒక ఆరెంజ్ రంగు శాలువాను బాబాకి సమర్పించి, తరువాత దాన్ని బాబా ప్రసాదంగా మా నాన్నకి ఇస్తే బాగుంటుంద'ని అనుకున్నాను. కానీ దర్శనానికి వెళ్ళేటప్పుడు నాకు ఆ విషయం గుర్తులేదు. తీరా సమాధిమందిరం లోపలికి వెళ్ళాక చూస్తే, బాబా ఆరంజ్ రంగు శాలువా ధరించి ఉన్నారు. అది చూసి, 'అయ్యో! బాబా కోసం శాలువా కొనడం మర్చిపోయాన'ని ఎంతో బాధపడుతూ ముందుకు కదులుతున్నాను. బాబాను సమీపిస్తుండగా ఒక భక్తుడు కొన్ని ఆరంజ్ కలర్ శాలువాలు పట్టుకుని కనిపించాడు. ఆ భక్తుడు తన వద్దనున్న ఆరు శాలువాలలో ఐదు శాలువాలను బాబాకి సమర్పించుకోదలచి మిగిలిన ఒక శాలువా ఎవరికైనా ఇద్దామని చూస్తూ అక్కడ అంతమంది ఉండగా నాతో, "నీకు శాలువా కావాలా? ఇదిగో తీసుకో" అంటూ ఆ శాలువాను నాకు ఇచ్చేసి వెళ్లిపోయాడు. ఆ సమయంలో నాకు కలిగిన అనుభూతి, ఆనందం నా జీవితంలో మరువలేనిది. "మీకు కోటికోటి ప్రణామాలు సాయీ". ఆ శాలువాను సాయికి సమర్పించి, వారి అనుగ్రహ ప్రసాదంగా తిరిగి తీసుకుని ఇంటికి వచ్చాను. ఇలా నా జీవితంలో మరెన్నో అనుభవాలు, లీలలు బాబా అపార అనుగ్రహం వల్ల జరిగాయి. వాటిని ముందు ముందు మీతో పంచుకుంటాను.
సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
దర్శనంతో సంతానభాగ్యాన్ని ప్రసాదించిన బాబా
సాయిబంధువులకు, "సాయి మహరాజ్ సన్నిధి" బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు సువర్చల. నా వయసు 50 సంవత్సరాలు. నేనిప్పుడు బాబా ప్రసాదించిన అనుగ్రహాన్ని మీతో పంచుకుంటాను. నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడే వివాహం అయింది. పెళ్ళైన అయిదేళ్ల వరకు మాకు సంతానం కలుగలేదు. ఎన్నో దేవాలయాలను దర్శించి, ఎన్నో పూజలు చేసినా ఫలితం లేకపోయింది. అటువంటి తరుణంలో మాకు తెలిసిన ఒక సాయిబంధువు ద్వారా మేము సాయిబాబా గురించి తెలుసుకుని మా గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక ఊరిలోని సాయిమందిరంలో విగ్రహప్రతిష్ఠ జరుగుతుంటే నేను, మావారు వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాము. బాబా దర్శనంతో మాకు సంతానభాగ్యం కలిగింది. మొదట బాబు, తర్వాత పాప పుట్టారు. ఇంకో విషయమేమిటంటే, అప్పట్లో మావారు దేవుడిని నమ్మేవారు కాదు, నాస్తికుడిగా ఉండేవారు. అలాంటివారు బాబా మహత్యం వల్ల ఆస్తికత్వంలోకి మారారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీరు చేసిన మేలు జీవితంలో నేను మరువను సాయీ".
శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
పెద్ద సమస్యలో పడకుండా తక్షణమే కాపాడిన బాబా
నా పేరు మురళీమోహన్. 2022, ఫిబ్రవరి 1న ఒక పెద్ద సమస్యలో చిక్కుకుపోవలసిన నన్ను బాబా తృటిలో కాపాడారు. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఆరోజు సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూ కాసేపు రిలాక్స్ అవుదామని నేను, నా ఫ్రెండు వెంచర్ గ్రౌండులో కూర్చున్నాము. అప్పుడు సమయం సాయంత్రం 7 గంటలు. కాస్త చీకటిగా ఉంది. హఠాత్తుగా సివిల్ డ్రెస్సులో ఉన్న పోలీసులు కొందరు అక్కడికి వచ్చి, "మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు? మీ మీద కేసు బుక్ చేస్తాం" అన్నారు. కారణం, అక్కడికి కొంచెం దూరంలో ఎవరో డ్రింక్ చేస్తున్నారట, అక్కడ మర్డర్లు జరుగుతుంటాయట, ఇంకా ఆ ప్రదేశంలో బ్లేడ్ బ్యాచ్ కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయట. ఈ విషయాలు గానీ, ఆ చీకటిలో ఎవరు ఎక్కడున్నారో అన్నది గానీ మాకు తెలియదు. అయినా పై కారణాల వల్ల పోలీసులు మమ్మల్ని కూడా అనుమానించారు. అప్పటికీ నేను, "మాకు ఈ ప్రదేశం కొత్త. తెలియక వచ్చాం. సారీ" అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. కానీ వాళ్ళు వినిపించుకోకుండా "ఎస్పీగారు వస్తారు. అప్పుడు చూద్దాం" అని అన్నారు. నేను వెంటనే మనసులో బాబా నామస్మరణ చేస్తూ, "రక్షించు బాబా" అని అదేపనిగా బాబాను ప్రార్థించసాగాను. కాసేపటికి ఎస్పీ తదితర ఆఫీసర్లందరూ వచ్చి అక్కడున్న అందరిమీదా కేసులు బుక్ చేయసాగారు. బాబా దయవల్ల ఒక పోలీసు నాతో, "వెంటనే ఈ చోటు విడిచి వెళ్ళిపోండి" అని చెప్పి మమ్మల్ని మాత్రం విడిచిపెట్టారు. ఒక్క నిమిషంలో ఈ అద్భుతం జరిగింది. లేకుంటే నేను చాలా పెద్ద సమస్యలో పడేవాడిని. ఇలా సాయినాథుడు అడుగడుగునా మమ్మల్ని కాపాడుతున్నారు. "బాబా! మీకు అనంతకోటి కృతజ్ఞతలు. నిన్నే నమ్ముకున్నాము తండ్రీ. బాబా, నాకు ఒక మంచి ఉద్యోగాన్నిచ్చి ప్రతిక్షణమూ టెన్షన్‌గా ఉండే ప్రస్తుత ఉద్యోగం నుంచి కాపాడు తండ్రీ. మీ అనుగ్రహం కోసం ఎదురుచూస్తున్నాను బాబా".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteJaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above average grade Jaisairam
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOM SAI
ReplyDeleteSACHIDANANDA SADGURU SAINATH MAHARAJ KI