1. క్లిష్ట పరిస్థితి నుంచి కాపాడిన బాబా
2. శ్రీసాయినాథుని కృపాకటాక్షాల వలన తగ్గిన బిపి
3. వెర్టిగో నుండి కాపాడిన బాబా
క్లిష్ట పరిస్థితి నుంచి కాపాడిన బాబా
శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
నా పేరు కుమార్. నేను, నా భార్య వృత్తిరిత్యా హైదరాబాదులో స్థిరపడ్డాము. 2022వ సంవత్సరం తొలి నెలల్లో నా భార్య ఒక కొత్త కంపెనీలో జాయిన్ అయ్యింది. ఆ కంపెనీలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మూడునెలలు శిక్షణ ఇచ్చిన తరువాత ప్రాజెక్టులో వేస్తారు. కొన్నిరోజులు శిక్షణ బాగానే జరిగింది. తరువాత నా భార్యకి శిక్షణనిచ్చే కోచ్ ఏదో ఒక వంకతో తన మీద ప్రతిరోజూ నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అంతేకాక శిక్షణ కూడా సరిగా ఇవ్వకుండా ప్రతి చిన్న విషయాన్ని చాలా పెద్దదిగా చేసి వాళ్ళ మేనేజరుతో చెప్తుండేవాడు. అలా రోజురోజుకి ఆ కోచ్ ఆగడాలు మరింత ఎక్కువ అవుతూ ఉండేవి. అందువల్ల నా భార్యపై ఒత్తిడి ఎక్కువైపోయి ప్రతిరోజూ బాధపడుతూ చివరికి ట్రైనింగ్‍కి వెళ్లాలంటేనే భయపడే స్థితికి వచ్చి, 'అసలే కొత్త కంపెనీ, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వల్ల ముందు ముందు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయోన'ని నా భార్య చాలా ఆందోళన చెందసాగింది. ఇలా ఉండగా ఒకరోజు తను తెలియక చేసిన ఒక పొరపాటు వలన ఆ కంపెనీకి 12 లక్షల రూపాయల నష్టం వచ్చే పరిస్ధితి ఏర్పడింది. అదే అదనుగా తీసుకుని ఆ కోచ్ నా భార్యను ఉద్యోగంలో నుంచి తొలగించడానికి చాలా ప్రయత్నించాడు. నిజానికి అదంతా ఆ కోచ్ వల్లనే జరిగింది. అతను సరిగ్గా ట్రైనింగ్ ఇచ్చి ఉంటే ఆ సమస్య వచ్చేదే కాదు. ఇక ఆ రోజు నా భార్య ఇంట్లో గట్టిగా ఏడుస్తూ జరిగినదంతా చెప్పి, "తనని ఉద్యోగంలో నుంచి తీసేస్తార"ని చాలా బాధపడింది. ఏ కష్టం వచ్చినా నా తండ్రి సాయినాథునికి చెప్పుకోవడం ఎప్పటినుండో నాకు అలవాటు. అందుచేత నా భార్య అలా ఏడవడం చూసిన నేను వెంటనే పూజగదిలోకి వెళ్ళి బాబా పటం ముందు నిల్చొని, దణ్ణం పెట్టుకుని సమస్యను ఆయనతో చెప్పి, "ఈ సమస్య నుండి నా భార్యను కాపాడి, ట్రైనింగ్‍లో తనకి సహాయం చేసి ఉద్యోగం నిలబడేలా చేయండి" అని ఆర్తిగా బాబాను వేడుకున్నాను. నా తండ్రి సాయినాథుడు ఎంతో పెద్ద అద్బుతం చేశారు. సరిగ్గా మూడవరోజున మేనేజర్ నా భార్యకి ఫోన్ చేసి, "జరిగిన దాని గురించి ఆలోచించకుండా ట్రైనింగ్‍లో శ్రద్ధగా ఉంటూ అన్నీ సవ్యంగా నేర్చుకో" అని చెప్పారు. ఆ మాటలు విని మేమంతా చాలా ఆశ్చర్యపోయాము. నా తండ్రి సాయినాథుని దయవలన మాత్రమే మేము ఇంత పెద్ద సమస్య నుండి బయటపడ్డాము. అంతేకాదు బాబా ఆశీస్సులతో నా భార్య తన ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రాజెక్ట్‌లో జాయిన్ అయింది. ఇప్పుడు సాయినాథుని దయవలన తన పని తను చక్కగా చేసుకోగలుగుతుంది. అంత పెద్ద క్లిష్ట పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడిన మా సాయినాథునికి కోటానుకోట్ల హృదయపూర్వక కృతజ్ఞతలు సమర్పించుకుంటూ...
అఖిలాండకోటి అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
