1. ఎలాంటి సమస్య నుండైనా నమ్ముకున్న భక్తులను కాపాడతారు బాబా
2. పోయిన వాచి దొరికేలా అనుగ్రహించిన బాబా
ఎలాంటి సమస్య నుండైనా నమ్ముకున్న భక్తులను కాపాడతారు బాబా
సమస్త సాయి భక్తులకు నా వందనాలు. నా పేరు సాయిశ్రీ. నేను నా భర్తతో కెనడాలో నివాసముంటున్నాను. 2021, ఫిబ్రవరి నెలలో ఒకరోజు క్వశ్చన్ & ఆన్సర్స్ వెబ్సైటులో "There is a danger of death. avoid sleeping whole night (ప్రాణాపాయం పొంచి ఉంది. రాత్రంతా నిద్రపోవడం మానుకో)" అని సాయి నాకు ఒక ముందస్తు సూచన ఇచ్చారు. అది చదవగానే నేను చాలా భయపడిపోయాను. ఆ సమయంలో నేను కడుపుతో ఉన్నందున నా ఆరోగ్యం బాగా చెడిపోయింది. విపరీతమైన ఆరోగ్యసమస్య వల్ల రాత్రంతా నిద్రలేకుండా గడపడం అనేది నావల్ల అయ్యేపని కాదు. అందుచేత నేను, "బాబా! నా ఆరోగ్యం ఏ మాత్రమూ బాగోలేదని మీకు తెలుసు. నేను ఉన్న ఈ పరిస్థితుల్లో రాత్రంతా మేల్కొని ఉండలేను. మీపై భారం వేసి పడుకుంటున్నాను. అందరినీ రక్షించు. ఎవరికీ ఏమీ జరగకుండా చూడు తండ్రీ" అని బాబాను వేడుకుని పడుకున్నాను. మధ్యరాత్రి గం.2:30 నిమిషాలకి ఉన్నట్టుండి నాకు మెలుకువ వచ్చింది. అప్పుడు కూడా నేను బాబా దగ్గరికి వెళ్లి, "అందరినీ కాపాడు తండ్రీ" అని వేడుకుని పడుకున్నాను. పొద్దున్న లేవగానే ఇండియా నుండి అమ్మ నాకు ఫోన్ చేసి, "సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంటకు అంటే మాకు రాత్రి గం.2:30నిమిషాలకి ఉన్నట్టుండి మీ డాడీకి పక్షవాతం రావడం గమనించి వెంటనే ఆయన్ని హాస్పిటల్‍కి తీసుకెళ్లాము. డాక్టర్లు బ్రెయిన్‍లో బ్లడ్ క్లాట్ అయిందని డాడీని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు" అని చెప్పింది. ఆ విషయం తెలిసినప్పటి నుండి నేను, "బాబా! నువ్వే దిక్కు. ఎలాంటి సమస్య లేకుండా డాడీ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళాలి. ఆయన్ని నువ్వే కాపాడాలి బాబా" అని బాబాను వేడుకున్నాను. తరువాత కూడా బాబాను ప్రతిక్షణమూ తలచుకుంటూ ఉండేదాన్ని. డాడీ హాస్పిటల్లో ఉన్న రెండు రోజుల్లో డాడీకి ఏమీ కాదని బాబా నాకు క్రింది నాలుగు విధాలుగా భరోసా ఇచ్చారు.
మొదటిది: క్వశ్చన్&ఆన్సర్స్ వెబ్సైటులో "ఆరోగ్యం మెరుగవుతుంది" అని వచ్చింది.
రెండవది: సాధారణంగా నేను నాకు ప్రశాంతంగా లేనప్పుడు బాబా చరిత్ర పుస్తకం తెరుస్తాను. అలా తెరిచినప్పుడు ఏ పేజీ వచ్చినా అందులో నా మనసులో ఉన్న ఆందోళనకు సమాధానం దొరుకుతుంది. అలా ఆరోజు కూడా సచ్చరిత్ర తెరిస్తే, ఇరానీ బాలికకు మూర్ఛరోగం రావడం, బాబా ఊదీతో నయం చేయడం గురించి వచ్చింది. ఇక అప్పటినుండి నేను డాడీని తలుచుకుని ఆయనకి పెడుతున్నట్లు భావిస్తూ ఊదీ పెట్టుకుంటూ ఉండేదాన్ని. (మా ఇంట్లో నేను ఒక్కదాన్నే బాబాను నమ్ముతాను. అందువల్ల మావాళ్ళ వద్ద బాబా ఊదీ ఉండదు).
మూడవది: నేను రోజూ రాత్రి పడుకునే ముందు ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదివి నిద్రపోవడం నాకు అలవాటు. ఆ అలవాటు ప్రకారం డాడీ హాస్పిటల్‍లో ఉన్నప్పుడు కూడా బ్లాగు ఓపెన్ చేసాను. అక్కడ ఒక భక్తురాలు హఠాత్తుగా తన తల్లికి కళ్ళు తిరిగి అపస్మారక స్థితికి వెళితే, ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేశామని, ఎమ్.ఆర్.ఐ స్కాన్ చేస్తే బాబా దయవల్ల రిపోర్టు నార్మల్ అని వచ్చి, ఆమె క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినట్లు పంచుకున్నారు. అదేవిధంగా డాడీ ఆరోగ్యం కుదుటపడుతుందని బాబా చెపుతున్నారనిపించి నా మనసు కుదుటపడి చాలా సంతోషించాను.
నాల్గవది: ఆ అనుభవం చదివాక నేను నిద్రపోతే బాబా స్వప్న దర్శనమిచ్చారు. ఆ స్వప్నంలో డాడీ హాస్పిటల్ బెడ్‍పై ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించారు. ఆయన బెడ్ పక్కన తెలుపురంగు వస్త్రాల్లో బాబా నిలుచుని, "నేనుండగా ఏమీ జరగదు. భయం లేదు. అంతా బాగుంటుంది" అని మాటిచ్చారు. బాబా ఇంకా ఏదేదో మాట్లాడుతున్నారు కానీ, గాఢనిద్రలో ఉన్న నాకు స్పష్టంగా వినపడటం లేదు. కానీ నా మనసు ఏదో చెప్పలేని అద్భుతమైన ఆనందంతో చాలా తేలికై ప్రశాంతమైన స్థితిలోకి వెళ్ళింది. దాంతో నాకు చాలా ఊరట లభించింది.
ఆ తర్వాత రోజు డాడీ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు. తర్వాత ఆయన ఆరోగ్యం కొంచెం కొంచెంగా మెరుగై నార్మల్ అయింది. బాబాను పూర్తిగా నమ్ముకున్న భక్తులకు మాత్రమే బాబా అనుగ్రహం అర్థమవుతుంది. వాళ్ళకు మాత్రమే బాబా ప్రసాదించిన అనుభవాన్ని పొందిన తరువాత కలిగే ఆనందం ఎలా ఉంటుందో, దాని విలువ ఏమిటో తెలుస్తుంది. అందుకే నేను ఆ రెండురోజుల్లో బాబా నాకు ఇచ్చిన అనుభవాలను ఇప్పటివరకు ఎవరితోనూ చెప్పుకోలేదు. ఇప్పుడే ఈ బ్లాగు ద్వారా సాయిని పూర్తిగా నమ్మే నాతోటి భక్తులతో పంచుకుంటున్నాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
2021, మార్చిలో ఒకరోజు అర్ధరాత్రి ఒంటిగంటకి ఉన్నట్టుండి నా భర్తకి విపరీతమైన చలి జ్వరం మొదలైంది. జాకెట్ వేసుకుని, ఎన్ని బ్లాంకెట్లు కప్పుకున్నా చలిని తట్టుకోవడం ఆయన వల్ల కాలేదు. ఒక్కసారిగా జ్వరం 103 డిగ్రీలకు చేరుకుంది. టాబ్లెట్లు వేసుకున్నా కూడా ఎలాంటి ఉపశమనం కలగలేదు. నేను 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని నిరంతరాయంగా చదవటం మొదలుపెట్టి, "బాబా! నేను ఈ రాత్రంతా మీ నామస్మరణ చేస్తాను. రేపు ఉదయానికల్లా మావారికి నార్మల్ అయిపోవాలి" అని బాబాతో చెప్పుకున్నాను. తరువాత బాబా నామస్మరణ చేస్తూ క్వశ్చన్ & ఆన్సర్స్ వెబ్సైటులో చూస్తే, "నిరంతరాయంగా నామస్మరణ చేయమ"ని వచ్చింది. బాబా దయవల్ల మరుసటిరోజు ఉదయానికి మావారు నార్మల్ అయిపోయారు. ఆఫీసుకి కూడా వెళ్లారు. మనస్ఫూర్తిగా బాబాను నమ్మి ఆయనపై భారం వేస్తే ఎలాంటి సమస్య నుండైనా బాబా కాపాడుతారు. "ధన్యవాదాలు బాబా".
ఒకసారి ఒక పనికోసంగా మావారి ఒరిజినల్ సర్టిఫికేట్ ఒకటి ఇండియాకి పంపాల్సిన అవసరం వచ్చింది. అంతలో మావారి ఫ్రెండ్ ఒకరు ఇక్కడనుండి ముంబయి వెళ్తుంటే, తనతో పాటు ఆ సర్టిఫికెట్ పంపించాము. తను ముంబయి వెళ్ళాక ఆ సర్టిఫికెట్‌ను డిటిడిసి కొరియర్ ద్వారా హైదరాబాద్‌కి పంపారు. అయితే ముంబయిలోని డిటిడిసి కొరియర్‌వాళ్ళు పిన్ కోడ్ తప్పుగా ఎంట్రీ చేయడం వల్ల మేము కొరియర్ స్టేటస్ చెక్ చేస్తుంటే, డెలివరీ లొకేషన్ బెంగుళూరు అని చూపిస్తుంది. అలా పిన్ కోడ్ తప్పుగా ఎంటర్ చేసిన కొరియర్లు కొన్నిసార్లు కొరియర్పై ఇచ్చిన ఫ్రామ్ అడ్రసుకి రిటర్న్ బ్యాక్ అవుతాయి లేదా కొన్నిసార్లు మిస్ ప్లేస్ అయి ఎక్కడికీ చేరుకోవు. అయితే అందులో ఉన్నది ఒరిజినల్ సర్టిఫికేట్ కావడం వల్ల మేము చాలా టెన్షన్ పడి డిటిడిసి కొరియర్ సర్వీస్‌కి కాల్ చేయసాగాము. అక్కడ ఉదయం 9 గంటలంటే, ఇక్కడ మాకు రాత్రి 11:30. అప్పటినుండి ఉదయం నాలుగు గంటల వరకు ఎంత ప్రయత్నించినా ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అప్పుడు నేను, "బాబా! మీ దయవల్ల సర్టిఫికెట్టు కరెక్ట్ అడ్రసుకి డెలివరీ అయితే మూడు ఆరతులు చదువుతాను" అని మ్రొక్కుకున్నాను. అలా బాబాను ప్రార్థించిన తర్వాత ఒక వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి, "మీరు కొరియర్ చేసిన చోటుకి వెళ్లి కంప్లైంట్ చేయండి. అప్పుడే ఆ కొరియర్ సరైన అడ్రసుకి వెళుతుంది" అని చెప్పారు. దాంతో మావారి ఫ్రెండ్ వెళ్లి కంప్లైంట్ చేయడం, కొరియర్ సురక్షితంగా హైదరాబాద్ చేరడం జరిగాయి. తర్వాత మావారు డిటిడిసి సంస్థలో కొన్ని సంవత్సరాలు పనిచేసిన ఒక వ్యక్తితో ఈ విషయం గురించి చెప్తే అతను, "డిటిడిసి కొరియర్ సర్వీస్‌వాళ్ళకి కాల్ అస్సలు కనెక్ట్ కాదు. ఒకవేళ కనెక్ట్ అయినా ఎవరూ రెస్పాండ్ కారు. అలాంటిది మీ ఫోన్ ఒక వ్యక్తి లిఫ్ట్ చేయడం, మీ ప్రాబ్లంకి ఆన్సర్ చేయడం చాలా విచిత్రంగా ఉంది. మీరు చాలా లక్కీ" అని అన్నారు. దాంతో ఆ వ్యక్తి రూపంలో బాబానే మాకు సహాయం చేశారని చాలా స్పష్టంగా అర్థమైంది. బాబాకి మ్రొక్కుకున్న విధంగా మూడు బాబా హారతులు చదువుకున్నాను. ఇప్పుడు మీ అందరితో నా అనుభవం పంచుకున్నాను. "థాంక్యూ సో మచ్ బాబా".
2022, జనవరి మొదటి వారంలో ఒకరోజు మేము బయటికి వెళ్లి వచ్చాక నాకు గొంతునొప్పి, ఛాతిలో నొప్పి మొదలయ్యాయి. అయితే ఆరోజు ఇక్కడ మైనస్ 15 డిగ్రీల టెంపరేచర్ ఉండటం వల్ల బహుశా చలివల్ల అలా నొప్పి అనిపిస్తుంది కావచ్చు అనుకున్నాము. కానీ తర్వాత రోజు విపరీతమైన జ్వరం మొదలైంది. టాబ్లెట్ వేసుకున్నా కూడా ఏ మాత్రమూ తగ్గలేదు. రెండు రోజులు అలానే ఉంది. ఇక ఆ రోజు రాత్రి ఆరు సంవత్సరాల మా బాబు, ఐదు నెలల పాప పడుకున్నాక మేము కోవిడ్ టెస్టు చేయించుకున్నాము. నాకు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇక ఒక్కసారిగా పిల్లలకు ఏమవుతుందోనని మాకు భయం మొదలైంది. బాబుని వేరే గదిలో ఉండమని, నేను వేరే గదిలో ఉండేదాన్ని. కానీ పాపకి ఇంకా బయట పాలు అలవాటు చేయనందువల్ల పాలు పట్టడం కోసం మావారు పాపని నాదగ్గరికి తీసుకువచ్చేవారు. ఆ సమయంలో నా వల్ల పాపపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండాలని మనస్పూర్తిగా బాబాని వేడుకుని, బాబా ఊదీ పాపకి పెట్టేదాన్ని. ఇంకా "బాబా! నా కారణంగా ఇంట్లో ఉన్న మావారికి, పిల్లలకి ఏమీ జరగకూడదు. వారం రోజుల్లో ఇంట్లోనే నాకు తగ్గిపోయి, ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి" అని బాబాని వేడుకున్నాను. బాబా అనుగ్రహం వల్ల వారం రోజుల పాటు లేవకుండా ఉన్నప్పటికీ, తర్వాత కోలుకున్నాను. అయితే మా వారికి కొద్దిపాటి కోవిడ్ లక్షణాలు మొదలయ్యాయి. కానీ బాబా దయవల్ల తను తొందరగానే నార్మల్ అయ్యారు.
ఓం శ్రీసాయినాథాయ నమః!!!
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
Omsairam
ReplyDeleteOmsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteJaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete