సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1083వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. పెద్ద సమస్యను ఎటువంటి సమస్యా లేకుండా పరిష్కరించిన బాబా
2. బాబా ప్రసాదించిన కొత్త జీవితం
3. ప్రత్యక్ష అనుభవంతో సంశయాన్ని తీర్చిన బాబా

పెద్ద సమస్యను ఎటువంటి సమస్యా లేకుండా పరిష్కరించిన బాబా


నేనొక సాయిభక్తురాలిని. ముందుగా సాటి సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నమస్కారం.  బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. వాటిలో నుండి నేను ఇదివరకే నా అనుభవం ఒకటి పంచుకున్నాను. ఈమధ్యకాలంలో జరిగిన మరో రెండు అనుభవాలను ఇప్పుడు పంచుకుంటున్నాను. కొంతకాలం క్రితం మేము మా స్థలం ఒకటి వేరేవాళ్లకు అమ్మాము. వాళ్ళు ఆ స్థలంలో ఇంటి నిర్మాణం మొదలుపెట్టారు. అంతా బాగానే జరిగి ఇల్లు పూర్తయింది. ఆ తరువాత వేరేవాళ్ళు(బడాబాబులు) వచ్చి, "ఈ స్థలం మాది, నువ్వు ఇల్లు ఎందుకు కట్టావు?" అని ప్రహరీగోడను పడగొట్టి పెద్ద గొడవ చేశారు. దాంతో, మా దగ్గర ఆ స్థలం కొన్న వ్యక్తి మా వద్దకొచ్చి జరిగిందంతా చెప్పారు. మేము డాక్యుమెంట్లు చూపించాం. కానీ వాళ్ళు వినకుండా గొడవ చేశారు. అవతలివాళ్ళు పెద్దమనుషులు అవటంతో మేము ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు నేను ఈ విషయం గురించి బాబాను అడిగాను. అందుకు బాబా సమాధానంగా '16వ అధ్యాయం 16 వారాలు చదవమ'ని వచ్చింది. నేను బాబా ఆదేశానుసారం ఆ అధ్యాయం చదవడం మొదలుపెట్టాను. ఆ అధ్యాయంలో చెప్పబడిన జ్ఞానం బహుశా వాళ్లకు కలిగింది కాబోలు! 16 వారాలు పూర్తయ్యేసరికి సమస్య లేదు. ఆ స్థలం గురించి అడిగేవాళ్లెవరూ లేరు. ఇప్పుడు అంతా బాగానే ఉంది. బాబా దయవలన అంత పెద్ద సమస్య ఎటువంటి సమస్యా లేకుండా సమసిపోయింది. "థాంక్యూ బాబా".


నాకు ఈమధ్య గొంతునొప్పి వచ్చినప్పుడు కరోనా ఏమోనని చాలా భయమేసింది. బాబాకి దణ్ణం పెట్టుకుని, "గొంతునొప్పి తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకుని ఊదీ పెట్టుకున్నాను. తెల్లారేసరికి ఏ నొప్పీ లేదు. వెంటనే బ్లాగులో పంచుకుంటానని ఏరోజుకారోజు వాయిదా వేస్తూ ఉండేసరికి మళ్ళీ నొప్పి వచ్చింది. అందుకే ఇంక ఆలస్యం చేయకుండా వెంటనే నా అనుభవాన్ని బ్లాగుకి పంపుతున్నాను. బాబా దయవలన నొప్పి తగ్గిపోతుందని ఆశిస్తున్నాను. "బాబా! రెండు అనుభవాలు పంచుకోవడంలో ఆలస్యమైంది, నన్ను క్షమించండి. ప్లీజ్ బాబా! నొప్పిని తగ్గించి నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. థాంక్యూ బాబా".


శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


బాబా ప్రసాదించిన కొత్త జీవితం


నా పేరు లావణ్య. నాకు పెళ్ళై 19 సంవత్సరాలు అయ్యింది. ఒకప్పుడు మావారు చెడువ్యసనాల వల్ల ఏ పనీ చేసేవారు కాదు. నన్ను, పిల్లలను పట్టించుకోకుండా తిరిగేవారు. ఇలాంటి పరిస్థితులకు తోడు మా తమ్ముడు కూడా మరణించడంతో నేను చాలా డిప్రెషన్‍లోకి వెళ్లిపోయాను. ఆ సమయంలో ఎనిమిది నెలల గర్భిణిని అయిన నాకు ఏం చేయాలో తోచలేదు. పెళ్లికాకముందు నేను ట్యూషన్ చెప్పేదాన్ని. అప్పట్లో ఒక విద్యార్థి నన్ను 'అక్కా' అని పిలిచేవాడు. ఆ పిల్లాడి పేరు 'సాయి కిరణ్'. ఆ సాయిబాబా నాకోసమే ఆ పిల్లాడి రూపంలో వచ్చారని నాకు అప్పుడు తెలీదు. ఒకరోజు నేను ఆ పిల్లాడిని తీసుకుని కొండపై ఉన్న బాబా గుడికి వెళ్లి, "బాబా! నా భర్తకు ఒక ఉద్యోగం చూపించండి. ఆయనకి ఉద్యోగమొస్తే ఐదు వారాలు మీ గుడికి వస్తాను" అని బాబాను వేడుకున్నాను. రెండు వారాలు గడిచేసరికి మావారికి బాబా గుడిలో పూజారిగా పని దొరికింది. మావారు తన చిన్నతనంలో తన తండ్రిగారి దగ్గర కొద్దిగా పౌరోహిత్యం నేర్చుకున్నారు. తన తండ్రితో కొన్ని కార్యక్రమాలలో హాజరయ్యేవారు. కానీ పౌరోహిత్యానికి సంబంధించి మొత్తం రాదు.  అయినా ధైర్యం చేసి మా చెల్లెలి భర్త చూపించిన గుడికి వెళ్ళాము. అక్కడ మావారు ఒక సంవత్సరం తీర్థప్రసాదాలు ఇస్తూ నెమ్మదిగా అన్నీ నేర్చుకుని ఒక మంచి పూజారిగా పేరు తెచ్చుకున్నారు. బాబా దయవల్ల ఇప్పుడు అన్ని చెడు అలవాట్లు వదిలేసి నన్ను, నా పిల్లలను బాగా చూసుకుంటూ బాధ్యతగా ఉంటున్నారు. అంతా అయిపోయిందనుకున్న నా జీవితంలోకి ఆ సాయిబాబా దయవల్ల మళ్లీ సంతోషాలు వచ్చాయి. ఇలా మొదలైన నా కొత్త జీవితంలో ప్రతి అడుగులో బాబా దయవల్ల జరిగిన అద్భుతాలను, అనుభవాలను ముందు ముందు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కానీ బాబా తన భక్తులను ఎలా అనుగ్రహిస్తారో, ఆయన ప్రతి విషయంలోనూ ఒక తండ్రిలా ఎలా ఆదుకున్నారో చెప్పడానికి ఈ జీవితం సరిపోదేమో! ఏమైనా ఇలా తోటి భక్తులతో నా అనుభవం పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. బాబా దయవల్ల నా అనుభవం బ్లాగులో ప్రచురితమవుతుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.


ఓం శ్రీసాయినాథాయ నమః!!!


ప్రత్యక్ష అనుభవంతో సంశయాన్ని తీర్చిన బాబా


సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు. నా పేరు శిరీష. నేను దాదాపు రెండు సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా ప్రతిరోజూ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతున్నాను. తద్వారా నాకు ఎంతో ఆనందం, తృప్తి కలుగుతున్నాయి. 2022, జనవరి నెల చివరిలో ఒకేరోజు నేను, మా పాప కోవిడ్ బారినపడ్డాము. ఇద్దరికీ మూడు రోజులపాటు చాలా తీవ్రంగా జ్వరం ఉండేది. కానీ నేను, 'బాబా తోడు ఉండగా భయమెందుకు?' అని కొద్దిగా ఊదీని నా నుదుటన ధరించి, పాప నుదుటన పెట్టి, మరికొంత ఊదీని నీళ్లలో కలిపి నేను త్రాగి, పాపచేత త్రాగించేదాన్ని. నాల్గవరోజు జ్వరం తగ్గి బాగుంది అనుకున్నాము, కానీ ఐదవరోజు మళ్ళీ జ్వరం వచ్చింది. దాంతో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న నాకు చాలా భయమేసి, "బాబా! మాకు ఏమీ కాకుండా ఉంటే, మా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకుని, ఊదీనీళ్లు నేను త్రాగి, పాపకి కూడా ఇచ్చాను. తరువాత బ్లడ్ టెస్టు చేయించుకుంటే పాప విషయంలో చాలా తేడాలు కనిపించాయి. కానీ బాబా దయవల్ల క్రమంగా మేమిద్దరమూ కోలుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాము. అదివరకు నేను భక్తుల అనుభవాలు చదివేటప్పుడు ఎవరైనా భక్తులు 'బ్లాగులో పంచుకుంటానని మ్రొక్కుకున్నాము' అని వ్రాసినప్పుడు 'అలా మ్రొక్కుకుంటే నిజంగా అనుకున్నది జరిగిందా లేక యాదృచ్ఛికంగా జరిగిందా?' అని నాకు అనిపించేది. ఆ సంశయాన్ని బాబా ఈ ప్రత్యక్ష అనుభవాన్ని ఇవ్వడం ద్వారా తీర్చారు. "థాంక్యూ బాబా".



7 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. Om Sai Ram 🪔🙏🙏🙏🪔

    ReplyDelete
  3. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  4. Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above average grade Jaisairam

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  6. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo