ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా దయకు ప్రతిరూపమైన అనుభవాలు
2. దయ చూపిన బాబా
బాబా దయకు ప్రతిరూపమైన అనుభవాలు
సాయి బంధువులందరికీ నమస్కారం. బాబాకున్న అనంతకోటి ప్రేమమయ భక్తుల్లో నేను ఒక చిన్న పరమాణువు వంటి భక్తురాలిని. నేను బాబా మీద చూపించే భక్తి, ప్రేమలకన్నా ఆయన నా మీద చూపించే ప్రేమే ఎక్కువ. నేను అప్పుడప్పుడు ఆయనను మరిచినా ఆయన నన్ను మరవరు. నా నీడ నన్ను వదిలినా ఆయన నన్ను వీడరు. అది వారి గొప్పతనం. వారి గొప్పతనాన్ని, ప్రేమను పొగిడే శక్తి నాకు లేదు. అంతటి ప్రేమమూర్తికి కేవలం ధన్యవాదాలు చెప్పటం తప్ప నేనేం చేయగలను? ఈరోజు నేను జీవించి ఉన్నానంటే అది వారు నాకు ప్రసాదించిన ప్రాణభిక్షే. నిత్య జీవితంలో మనం ఎన్నెన్నో విషయాల్లో బాబా మీద ఆధారపడి బతుకుతాము. ఆయా పరిస్థితులను బట్టి అవి ఎంత అవసరమో అనుభవించే వాళ్ళకే అర్థమవుతాయి. అయితే మన అవసరాలు చిన్నవైనా, పెద్దవైనా అడిగిన వెంటనే బాబా వాటిని తీరుస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన జీవితాలలో ప్రతీక్షణం బాబా దయాభిక్షే.
రెండేళ్ళ కిందట మేము మా ఇంటిని మరమ్మత్తు చేసి పునర్నిర్మించాము. ఆ సమయంలో నేను ఒక ఫంక్షన్ కోసమని బంగారు నగలు ఉంచే బ్యాగు తీసి అందులో ఉన్న అవసరమైన నగలు తీసుకునే క్రమంలో ఏ డిజైన్ చెవి కమ్మలు పెట్టుకోవాలని చూస్తుండగా మావాళ్లు ఆలస్యం అవుతుందని కాస్త హడావిడి చేసేసరికి ఒక చెవి కమ్మ ఎక్కడో పడిపోయింది. వెంటనే బ్యాగులో, నేలపై వెతికాను కానీ, అది కనిపించలేదు. ఫంక్షన్ వేరే ఊళ్ళో కావడం, పైగా అప్పటికే ఆలస్యమవడంతో వెతికే సమయం ఎక్కువగా లేదని, తిరిగి వచ్చాక వెతకొచ్చని వేరే డిజైన్ చెవి దిద్దులు పెట్టుకుని వెళ్ళిపోయాను. కానీ నా మనసులో ఒకటే బాధ. ఎందుకంటే, అవి మా మమ్మీ నాకు, మా చెల్లికి ఒకే డిజైన్‍లో ఎంతో ఇష్టంగా చేయించినవి. అవంటే నాకు చాలా ఇష్టం. సరే ఫంక్షన్ నుండి ఇంటికి వచ్చాక ఆ చెవికమ్మ కోసంగా బ్యాగులో ఆణువణువూ గాలించాను, ఇల్లు ఊడిచి మరీ వెతికాను. కానీ ఆ చెవికమ్మ దొరకలేదు. దాంతో నేను, 'ఇంటి మరమత్తు పనులవల్ల రకరకాల పనివాళ్ళు ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. వాళ్లలో ఎవరికి ఆ చెవికమ్మ దొరికినా ఇక అంతే సంగతి' అని దాదాపుగా ఆ చెవికమ్మపై ఆశ వదిలేసాను. కానీ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా దొరుకుతుందేమోనన్న ఆశతో ఆ బ్యాగులో చెవికమ్మకోసం వెతుకుతుండేదాన్ని. కొన్నాళ్ళకి ఆ ఆశ కూడా పోయింది. అయితే నా మనసు అట్టడుగు పొరల్లో ఏదో ఒక మూలన 'బాబా నాకు న్యాయం చేస్తారు. అది కష్టపడి సంపాదించినది కాబట్టి, నాది నాకు దొరుకుతుంది' అనే నమ్మకం ఉండేది. కానీ బయట పరిస్థితి అందుకు భిన్నంగా అంటే దొరకటానికి ఆస్కారమే లేని విధంగా ఉండేది.
కొన్నాళ్ళకి ఇంటి పనులు పూర్తయ్యాక ఆ గదికి రంగులు వేసి, సామానంతా సర్ది గృహప్రవేశం, హోమం చేసాము. ఆ కార్యక్రమాలకి స్నేహితులు, చుట్టాలు వచ్చారు. ఆరోజు ఉదయం నగలు వేసుకునేటప్పుడు కూడా నేను ఆ చెవికమ్మకోసం వెతికానుకానీ, దొరకలేదు. హోమం పూర్తయ్యాక ఆ రాత్రి భోజనానికి ముందు నేను, నా స్నేహితులందరూ బెడ్‍రూమ్‌లో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటున్నాము. ఆ సమయంలో నేను వేసుకున్న నగలు తీసేసి అక్కడే ఉన్న ఒక బ్యాగులోని రోజూ పెట్టుకునే కమ్మలు తీసివ్వమని నా స్నేహితురాలిని అడిగాను. తను, "ఇందులో చాలా ఉన్నాయి కదనే. ఏవి ఇవ్వాలి?" అంటూ ఒక కమ్మ తీసి చూపించింది. దాన్ని చూసి నేను బాధతో, "ఆ జతలోని ఇంకో కమ్మ పోయిందే, వేరేవి ఇవ్వు" అని అన్నాను. అందుకు తను, "నీ తలకాయ. ఇందులో రెండూ ఉన్నాయి కదనే" అంది. "ఏ లేవే, ఒక్కటే ఉందే" అని నేనంటే తనకి కోపమెచ్చి, "ఏంటే, రెండు ఉన్నాయంటే, పోయింది అంటావేంటీ? నా చేతిలో రెండు పెట్టుకుని మాట్లాడుతుంటే, ఒక్కటి ఉందంటావేం?" అని తిట్టింది. నేను ఒక్క క్షణం షాకై, "ఇంకో కమ్మ నీకు ఎక్కడ దొరికింది" అని అడిగాను. అందుకు తను, "ఎక్కడేంటి, రెండూ ఒక దగ్గరే ఉన్నాయి" అంది. అది విని నేను, 'ఐదు నెలల కింద పోయి ఆ రోజు ఉదయం వరకూ నేను, మా ఇంట్లోవాళ్లు చాలాసార్లు వెతికినప్పటికీ దొరకని ఆ చెవికమ్మ ఎప్పుడూ నా నగల బ్యాగుని చూడని నా స్నేహితురాలికి ఆబ్యాగులో రెండు చెవి కమ్మలు ఎలా దొరుకుతాయి? ఇది బాబా దయ కాదా! వారి అద్భుత లీల కాదా!' అని నిర్ఘాంతపోయాను. అప్పుడు వాళ్ళతో జరిగిందంతా చెప్పి నిజంగా ఇది బాబాగారి మిరాకిలే అని సంతోషంగా చెప్పాను. అలా పోయిందనుకున్న బంగారం దొరికేలా అనుగ్రహించిన మన సాయికి అనేకానేక కృతజ్ఞతలు.
2022, జనవరి మూడో వారంలో మా వారికి జ్వరం, దగ్గు వచ్చాయి. ప్రస్తుతమున్న కోవిడ్ పరిస్థితుల్లో భయం కలిగించే లక్షణాలు అవి. వాటి వల్ల మూడు రోజులు బాధననుభవించిన తర్వాత మావారు ఇంక భరించలేక రాత్రి పడుకునే ముందు బాబాని తీవ్రంగా ప్రార్థించి పడుకున్నారు. బాబా దయవల్ల మరుసటిరోజు ఉదయం మావారు నిద్రలేచాక అవి తగ్గుముఖం పట్టి రెండో రోజుకి పూర్తిగా తగ్గిపోయాయి. తర్వాత నాకు కూడా జ్వరం, చలి, జలుబు, పొడిదగ్గు, వాసన తెలియకపోవడం, రుచి కోల్పోవటం మొదలైన లక్షణాలు మొదలై నాలుగైదు రోజులు భాదపడ్డాను. మా అమ్మాయికీ జ్వరం, దగ్గు వచ్చాయి. కోవిడ్ అనుకుందామంటే నెల రోజులుగా మేము ఎవరమూ బయటకు వెళ్ళిందే లేదు. మా ఇంటికి ఎవరూ వచ్చింది లేదు. కనీసం వేరే వాళ్ళను కలిసిందీ లేదు. నేను ఎక్కువగా బాబా ఊదీనే నమ్ముకుంటాను, మరీ తట్టుకోలేననుకున్నప్పుడు మాత్రమే టాబ్లెట్ వేసుకుంటాను. అదే నమ్మకంతో ఊదీ నుదుటన ధరిస్తూ, మరికొంత ఊదీ నీళ్ళలో వేసుకుని తాగుతుండటం వల్ల అన్ని సమస్యలు తగ్గిపోయాయి. కానీ దగ్గు పూర్తిగా తగ్గలేదు, పరవాలేదు తొందరలో అది కూడా తగ్గుతుంది. అంతా బాబా దయ.
ఒకరోజు విద్యుత్ కార్యాలయం నుంచి, 'రేపు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది' అని మెసేజ్ వచ్చింది. మరుసటిరోజు గురువారమైనందున బాబాకి అభిషేకం చేయాల్సి ఉంది. మరి 9 తర్వాత విద్యుత్ సరఫరా లేకపోతే ఎలా అని నేను టెన్షన్ పడుతూ "బాబా! మా స్నానాలు పూర్తయేవరకూ కరెంట్ పోకుండా ఉంటే, ఈ అనుభవం మన బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. ఆశ్చర్యం! ఆరోజు కరెంట్ అస్సలు పోలేదు. మనం అడిగేవి చిన్నవైనా, పెద్దవైనా ఆ స్థాయికి దిగొచ్చి తండ్రివలే మన కోరికలు తీరుస్తారు బాబా. కానీ మనమే ఆయన బోధలు సక్రమంగా పాటించము. నిజానికి బాబా బోధలు వినటానికి ఎంత సులభంగా ఉంటాయో, ఆచరించటానికి అంత కష్టంగా ఉంటాయి. అవి ఆచరణలో పెట్టడమంటే మనస్సుని పూర్తిగా జయించటమే. మనస్సును జయిస్తే ఇంకేంటీ యోగత్వమే కదా. కానీ అదంత సులభమేమీ కాదు. అందుకే బాబా తమ తత్వం గురించి అనుభవాల ద్వారా మనకి అవగాహన కల్పిస్తూ తాము చెప్పిన అలతిఅలతి పదాల లోతెంతో, వాటి నిగూఢత్వమేంతో అనుభవంలోకి తీసుకొస్తారు. కొన్ని అనుభవాలైతే బాబా పర్ఫెక్ట్ టైమింగ్, బ్రాండింగ్ కలగలిపి ఉంటాయి. ఆయనకు ఆయనే సాటి.
దయ చూపిన బాబా
ముందుగా సాయి భక్తులకు నమస్కారం. భక్తులకు తమ అనుభవాలను తోటి భక్తులతో పంచుకునే అవకాశమిచ్చిన బ్లాగు నిర్వాహకులకు కృతజ్ఞతలు. నేను ఒక సాయి భక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన తొలి అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఒకరోజు మా ఇంట్లో నాకు, నా భర్తకి మధ్య చిన్న గొడవ జరిగింది. ఆ కారణంగా మావారు మనస్తాపం చెంది ఇంటి నుండి బయటకి వెళ్ళి సాయంత్రం వరకు రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్‍లో పెట్టారు. నాకు చాలా భయమేసి బాబాను తలుచుకుని, "మావారు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని ప్రార్థించి బాబా ఊదీ స్వీకరించాను. బాబా నా మీద, నా కుటుంబం మీద దయ చూపించారు. మావారు తిరిగి ఇంటికి వచ్చారు. దాంతో నా మనస్సు శాంతించింది. "ధన్యవాదాలు బాబా". ఇంకా కొన్ని అనుభవాలు త్వరలో పంచుకుంటాను.
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteJaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to pass above average grade Jaisairam
ReplyDeleteOm sai ram ��
ReplyDelete