సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా బ్యాంకు మేనేజర్ రూపంలో పరీక్షించి, సహాయం చేసారు


భువనేశ్వర్ నుండి దామోదర్ గారి అనుభవం:-

2004వ సంవత్సరంలో నేను షిర్డీకి వెళ్లినప్పుడు ఉదయం దర్శనం అయిన తరువాత నేను సాయి సత్యనారాయణ పూజ చేయించుకోవడానికి హాల్ కి వెళ్లాను. కానీ హాల్ ఇంకా తెరచి లేకపోవడం వల్ల నేను తలుపు పక్కన కుర్చీలో  కూర్చుని మనసులో బాబా మంత్రం - "ఓం సాయి నమో నమః" స్మరించుకుంటున్నాను. కొంతసమయం తరువాత ఒక అతను వచ్చి నా పక్కన కూర్చున్నారు. నేను అతనిని "ఓం సాయిరామ్" అని పలకరించాను. అతను తన పేరు నితిన్ కుమార్ అని, తను బ్యాంకు మేనేజర్ని అని, తను నాసిక్ లో ఉంటున్నాను అని చెపుతూ తాను సాయి సత్యనారాయణ పూజకోసం షిర్డీ వచ్చానని చెప్పి, "మీరు కూడా పూజకోసం వచ్చారా?" అని అడిగారు. నేను అవునని సమాధానం చెప్పి, నా పేరు దామోదర్ అని, ఒరిస్సాలోని భువనేశ్వర్ నుండి వచ్చానని చెప్పాను. తరువాత కొంతసేపటికి హాల్ తెరిచారు. మేము ఇద్దరం లోపలకు వెళ్లి, పూజ చేసుకుని, పూజ పూర్తయిన తరువాత ప్రసాదం, కొబ్బరికాయ తీసుకుని  భక్తనివాస్ కి తిరిగి వచ్చాము. భక్తనివాస్ కి వెళ్లిన తరువాత నా లాకర్ ఓపెన్ చేసి, తీసుకుని వచ్చిన ప్రసాదం, కొబ్బరికాయ ప్యాక్ చేస్తున్నాను. నితిన్ కుమార్ గారు వచ్చి, "దామోదర్ గారూ! మీరు ఇంకా ఇక్కడే ఉంటారా?" అని అడిగారు. "ఉంటాను సార్! నేను ఎప్పుడు షిర్డీ వచ్చినా, భక్తనివాస్ లోనే ఉండడానికి ప్రయత్నిస్తాను. తోటి భక్తులతో మాట్లాడుకుంటూ బాబా లీలల గురించి చర్చించుకుంటాం" అని చెప్పాను. నితిన్ కుమార్ గారు, "చాలా బాగుంది! నేను మీ పక్కన కూర్చోవచ్చా?" అని అడిగారు. నేను కూర్చోమని చెప్పాను. అతను నా పక్కన కూర్చుని, "దామోదర్ గారూ! మీరు ఒడిశా నుండి బాబా కోసం ఏం తీసుకుని వచ్చారు?" అని అడిగారు. "నేను బాబా కోసం లడ్డూలు తీసుకుని వచ్చాను. వాటిని ఇంతకుముందే బాబాకు నైవేద్యముగా పెట్టి తెచ్చాను" అని చెప్పి, అతనికి బాబా ప్రసాదం ఇచ్చాను. అతను ప్రసాదం తీసుకుని, "దామోదర్ గారూ, నాకు ఒక చిన్న సహాయం చేస్తారా? నా పర్స్ పోయింది. నేను బస్సులో నాసిక్ తిరిగి వెళ్ళడానికి డబ్బులు లేవు. మీరు సహాయం చేస్తారా?" అని అడిగారు. ఆ సమయంలో నా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే వున్నాయి. నేను సాయిబాబా సీరియల్ కి నిర్మాణ ఖర్చులు భరించడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానని చెప్పి, నాసిక్ వెళ్ళడానికి ఎంత ఖర్చవుతుందని అడిగాను. అప్పుడు అతను 75 రూపాయలు అవుతుందని చెప్పాడు. నేను 80 రూపాయలు ఇచ్చి, 75 రూపాయలు టికెట్ కోసం, 4 రూపాయలు అన్నప్రసాదము టోకెన్ కోసం, 1 రూపాయి టీ టోకెన్ కోసం అని చెప్పాను. అంత మాత్రమే సహాయము చేయగల పరిస్థితి నాది అని కూడా చెప్పాను. అప్పుడు అతను నా అడ్రస్ అడిగి తీసుకుని, "ఏడు రోజుల్లో మీ డబ్బులు మీకు పంపుతాను" అని చెప్పి వెళ్లిపోయారు.

ఆ తరువాత రోజు నేను భువనేశ్వర్ వచ్చి నా పనులలో నిమగ్నమైపోయాను. వచ్చిన ఆరవ రోజున అద్భుతం జరిగింది. ఆరోజు నాకు ఒక ఫోన్ వచ్చింది.  ఫోన్ చేసిన వాళ్ళు నాతో, "దామోదర్ గారూ! మేము ఐసీఐసీఐ బ్యాంకు నుండి  మాట్లాడుతున్నాము. మీ స్నేహితుడు మీ వద్ద సాయిబాబా సీరియల్ కి డబ్బులు లేవని చెప్పారు. అందుకే మా బ్యాంకు నుండి మీకు 1,80,000 రూపాయలు ఇస్తాము. రేపు మీరు మీ శాలరీ సర్టిఫికెట్ మరియు రెండు ఫోటోలు తీసుకునిరండి" అని చెప్పారు. తరువాత రోజు వాళ్ళు మా ఇంటికి వచ్చి డాక్యుమెంట్స్ ప్రక్రియ పూర్తి చేసారు.  సాయంకాలం మళ్ళీ ఫోన్ చేసి, మరుసటి ఉదయం బ్యాంకు తెరిచే సమయానికి వచ్చి డబ్బులు తీసుకోవచ్చని చెప్పారు.

ఇది ఖచ్చితంగా బాబా లీల. బాబా షిర్డీలో బ్యాంకు మేనేజర్ రూపంలో వచ్చి నన్ను పరీక్షించి నాకు సహాయం చేసారు.

సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!

సేకరణ: శ్రీమతి మాధవి

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo