శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
సౌత్ ఆప్రికా నుండి సాయి భక్తురాలు కరిష్మా గరాచ్ గారు తన అనుభవాలని మనతో ఇలా చెప్తున్నారు. నా సంతోషాన్ని ఈప్రపంచంలోని సాయి భక్తులందరితో పంచుకోవాలని నా అనుభవాన్ని షేర్ చేస్తున్నాను.
నాకు అసలు పిల్లలు కలుగుతారా? అనే అనుమానం నన్ను ఎప్పుడు వేదించేది. కానీ బాబా ఆశీర్వాదంతో నేను మే 2017లో గర్భవతిని అయ్యాను. నాకు కూడా తల్లినయ్యే భాగ్యాన్ని బాబా ప్రసాదించినందుకు నేను ఎంతో అదృష్టవంతురాలిగా భావించాను.
నా కడుపులో ఉన్న బేబీ ఆరోగ్యంగా ఉండాలని సాయి సత్చరిత్ర చదవడం ప్రారంభించాను. ప్రతిరోజు నా బేబీని జాగ్రత్తగా మీరు చూసుకోండి అని రోజు సాయికి చెప్పుకోనేదాన్ని. ఇలా నాకు 8వ నెల వచ్చాక ఒకసారి గైనకాలజిస్ట్ ని కలిసినప్పుడు నార్మల్ డెలివరీ ద్వారా బేబీ పుట్టాలని నాకు కోరికగా ఉంది అని చెప్పాను. కానీ ఆమె అందులో ఉండే చెడు ఫలితాల గురించి వివరిస్తూ, వాటిలో ముఖ్యంగా బేబీ బ్రెయిన్ కి సమస్య రావచ్చు అని చెప్పారు. దానితో నార్మల్ డెలివరీ అంటేనే నాకు చాలా భయం వేసింది.
అప్పుడు నేను సాయిని వేడుకొని సత్చరిత్ర చదువుతూ ఉండగా 34వ అధ్యాయం వచ్చింది. అందులో బొంబాయి స్త్రీ అనుభవం ఇలా ఉంటుంది.
“బొంబాయి స్త్రీయొకతె ప్రసవించు సమయమున మిగుల బాధపడుచుండెను. అమె కేమియు తోచకుండెను. బాబా భక్తుడు కళ్యాణ్ వాసుడగు శ్రీరామమారుతి ఆమెను ప్రసవించు నాటికి షిరిడీకి తీసికొని పొమ్మని సలహా యిచ్చెను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి. కొన్నిమాసము లక్కడనుండిరి. బాబాను పూజించిరి. వారి సాంగత్యమువలన సంపూర్ణ ఫలము పొందిరి. కొన్నాళ్ళకు ప్రసవవేళ వచ్చెను. మామూలుగనే యోనిలో అడ్డు గనిపించెను. ఆమె మిగుల బాధపడెను. ఏమి చేయుటకు తోచకుండెను. బాబాను ధ్యానించెను. ఇరుగుపొరుగువారు వచ్చి, బాబా ఊదీని నీళ్ళలో కలిపియిచ్చిరి. 5 నిమిషములలో నా స్త్రీ సురక్షితముగా, ఎట్టి కష్టము లేక ప్రసవించెను. దురదృష్టముకొలది చనిపోయినబిడ్డ పుట్టియుండెను. కాని తల్లి ఆందోళనము, బాధ తప్పెను. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తియందుంచుకొనిరి”.
ఇది చదివాక అది బాబా సంకేతంగా భావించి, నాకు కూడా నార్మల్ డెలివరీ అవుతుందని అని గట్టిగా అనుకున్నాను. అదే విషయం డాక్టర్ కి కూడా తెలియజేసాను.
నాకు నొప్పులు వచ్చే సమయానికి నా భర్త నాతో నాకు తోడుగా నా పక్కనే ఉండాలని బాబాని ప్రార్ధించేదాన్ని. మావారు ఆఫీస్ నుండి ఇంటికి రావడానికి గంట సమయం పడుతుంది. అందువలన నాకు డెలివరీ వీకెండ్ లో గాని, రాత్రి సమయంలో గాని అవ్వాలని బాబాని కోరుకోనేదాన్ని. బాబా ప్రేమతో నా ఈరెండు కోరికలు నెరవేర్చారు. జనవరి 21, 2018 ఆదివారం నాడు తెల్లవారుజామున 2.30 గంటలకి చిన్నగా నొప్పులు మొదలైయ్యాయి. నా భర్తని లేపి హాస్పిటల్ కి వెళ్దాం అని చెప్పాను. బయలుదేరే ముందుగా నేను ఊదీ నీళ్ళలో కలుపుకొని త్రాగాను. 3.30amకి హాస్పిటల్ చేరుకున్నాం. 5గంటలకి నొప్పులు ఎక్కువ అయ్యాయి. డాక్టర్ 5.50కి వచ్చారు. ఫైనల్ గా బేబీ 5 గంటల 53 నిమషాలకి పుట్టింది.
బాబా అనుగ్రహం వలన బేబీ వీకెండ్ లో పుట్టింది. కాబట్టి నా భర్త నాతోనే ఉన్నారు. నేను మూడున్నర గంటల సమయం మాత్రమే నొప్పులు అనుభవించాను. బాబా నాకు ముందుగా సూచించినట్లుగా, నేను కోరుకున్నట్లుగా నార్మల్ డెలివరీ అయ్యింది. ఇంకా బేబీ చాలా ఆరోగ్యంగా పుట్టింది. చక్కటి పాపని ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా. పాపకి శరణ్య అని పేరు పెట్టుకున్నాం.
బాబాపై నమ్మకం ఉంచండి. ఆయన మన ప్రార్ధనలకి తప్పకుండా సమాధానం ఇస్తారు.
ఓం సాయిరాం!!!
Om sai ram
ReplyDelete