ఒక అపరిచిత సాయి బంధువు తన స్నేహితుని కుటుంబంలో జరిగిన ఒక మంచి సాయి లీలని ఇలా తెలియజేస్తున్నారు.
నా స్నేహితుడు చెన్నైలో ఒక స్వంత గృహాన్ని నిర్మించుకున్నాడు. అతను గ్రౌండ్ ఫ్లోర్ లో ఇల్లు పూర్తి చేసి, గృహప్రవేశం చేసుకొని, కుటుంబంతో - అంటే, అతని భార్య మరియు నాలుగు సంవత్సరాల కుమార్తెతో ఆ ఇంట్లో ఉంటుండేవాడు. మేడపైన చుట్టూ పిట్టగోడ ఇంకా నిర్మించలేదు. అదికాక ఇంటిపైన డమ్మీ పిల్లర్స్ కోసం ఐరన్ రాడ్స్ పెట్టి వున్నాయి. నా స్నేహితుని భార్య మేడపైన బట్టలు ఆరేయడం కోసం ఒక త్రాడును ఆ ఐరన్ రాడ్స్‌కు కట్టింది. ఒకరోజు సాయంత్రం 4గంటల సమయంలో ఆమె ఆరిన బట్టలను తీయడానికి తన కూతురితోపాటు మేడపైకి వెళ్ళింది. ఆమె బట్టలను తీసుకుంటూ ఉండగా, పాప ఆడుకుంటూ బంతి వెంట పరుగులు పెడుతూ స్లాబ్ చివరికి వెళ్లి, ఎటువంటి పిట్టగోడ లేనందున క్రింద వున్న రాళ్ళ మీద పడిపోయింది. అది చూసిన పాప తల్లి కేకలు వేస్తూ మూర్ఛపోయింది. కొన్ని నిమిషాల తరువాత, పాప, 'అమ్మా, అమ్మా, లే' అంటూ తన తల్లిని లేపుతుంటే తల్లికి స్పృహ వచ్చి, కూతురిని పట్టుకొని, "నీకేమీ కాలేదు కదా?" అని అడిగింది. ఇంకా పాపకు ఎటువంటి గాయాలూ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయింది. ఆమె కూతురిని ప్రేమతో గుండెలకు హత్తుకొని, "నువ్వు పై నుండి క్రిందకు పడుతుండగా చూసాను. కానీ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? పైగా ఎలాంటి గాయాలూ లేకుండా?" అని అడిగింది. అప్పుడు ఆ పాప, "అమ్మా! నేను కింద వున్న రాళ్ల మీద పడిపోయాను. నా ముఖమంతా గాయాలయ్యాయి. ఒక ముసలాయన నా దగ్గరకు వచ్చి, నన్ను లేపి, ఎత్తుకొని, రక్తం కారుతున్న నా నుదుటిని తాకి, "పాపా! బాధపడకు, నీకేమీ కాలేదు, బాగున్నావు, పైకి వెళ్లి మీ అమ్మని లేపు" అని చెప్పారు. చూస్తే, నా గాయాలు మాయమైపోయాయి. నేను మెట్లపై నుండి పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చాను" అని సమాధానం చెప్పింది. పాప మాటలు విన్న ఆ తల్లి మరింత దిగ్భ్రాంతి చెంది, 'అతను ఎలా ఉన్నారు?' అని పాపను అడిగింది. 'అమ్మా, అతను మన పూజా గదిలోని ఫోటోలో ఉన్నట్లే ఉన్నారు. నువ్వు రోజూ పూజిస్తావే, అదే ముసలాయన' అని పాప చెప్పింది. ఆ మాటలు విన్న ఆ తల్లి కట్టలు తెంచుకొస్తున్న కన్నీటి ప్రవాహాన్ని నియంత్రించుకోలేకపోయింది,
వెంటనే ఆ ముసలాయనను వెతికేందుకు వీధులోకి పరుగెత్తింది. కానీ, పాప చెప్పిన అనవాలతో ఉన్న వ్యక్తి ఎక్కడా కనిపించలేదు. ఆమె తన కూతురిని తీసుకొని పూజాగదికి వెళ్లి, బాబా ఫోటోను చూపిస్తూ, "ఈ బాబాయే ఆ వృద్ధుడా?" అని తన కూతురిని అడిగింది. 'అవునమ్మా, ఈ బాబానే' అని చెప్పింది పాప. ఆ తల్లి కన్నీటితో బాబాకు కృతజ్ఞత చెప్పుకుంది. ఆమె అంతకన్నా ఏమి చేయగలదు మరి?
విశ్వాసం మరియు ఓర్పు (శ్రద్ధ మరియు సబూరి) ఉన్నవారికి బాబా అందుబాటులో ఉంటారు. ఆయన శాశ్వతమైనవారు.
Om sai ram
ReplyDelete