సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

నా తోడుగా ఉండి – నీడగా కాపాడిన బాబా


సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు కిరణ్మయి. 'నేను బాబా భక్తురాలిని' అని మీకు పరిచయం చేసుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. బాబా భక్తురాలిగా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ప్రస్తుతం అమెరికా(యూ. ఎస్.ఏ)లో ఉంటున్నాను. నా జీవితంలో జరిగిన ఒక లీలను "సాయిమహరాజ్ సన్నిధి బ్లాగ్" ద్వారా మీకు తెలియచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. “సప్త సముద్రాల అవతల ఉన్నాగానీ నా భక్తులని రక్షించడానికి నేను సదా సంసిద్ధుడను” - ఇవి బాబా వాక్కులు. USAలో ఉన్న నాకు బాబా తోడు-నీడగా ఉంటూ నన్ను ఎలా కాపాడారో ఆ లీలను మీతో పంచుకోవడానికి నాకు బాబా అనుమతి ఇచ్చినందుకు బాబాకి నా పాదాభివందనాలు.

ఈ లీలని బాబానే నాతో మీ అందరికీ చెప్పిస్తున్నారని భావిస్తున్నాను. నా పెళ్లి చూపులకి వచ్చినప్పుడు మా అత్తగారికి, మా ఆయనకు నేను నచ్చాను. వాళ్ళు వచ్చేముందు మా అత్త నాతో, “బాబా! ఈ సంబంధం కుదరాలి. సంబంధం కుదిరితే "సాయి సచ్చరిత్ర పారాయణ" ఒక్కరోజులోనే చేస్తానని మొక్కుకున్నా"నని చెప్పి నన్ను కూడా పారాయణ చేయమన్నారు. బాబా అనుగ్రహంతో మా పెళ్లి జరిగిపోయింది.

మావారు అమెరికాలో ఉంటారు. నేను అక్కడకు వెళ్ళడానికి పాస్‌పోర్ట్  విషయంలో కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా బాబా అన్నీ సక్రమంగా ఏర్పాటుచేశారు. అమ్మానాన్నలని, పుట్టి పెరిగిన దేశాన్ని వదిలి వెళ్లే ముందు, “బాబా! అన్నీ వదిలి వెళ్తున్నాను. నాకు తోడుగా, నీడగా ఉండి నన్ను రక్షించు. నన్ను నువ్వే చూసుకో! ఇక నా భారం నీ మీదనే వేస్తున్నాన"ని బాబాతో చెప్పుకొని అమెరికాకు వెళ్ళాను.

బాబా దయవలన కొన్ని నెలలకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అత్తావాళ్ళు, అమ్మావాళ్ళు అందరూ సంతోషపడ్డారు. కానీ, “ఇక్కడ తొమ్మిది నెలలు ఎలా గడుస్తాయి బాబా? ఇక్కడ ఒక్కదాన్నే ఉండాలి. ఎవరూ ఉండరు. నాకు అనారోగ్యంగా ఉంటే ఎవరు చూసుకుంటారు నన్ను?” అని మొరపెట్టుకున్నాను. బాబా నా మొర ఆలకించారో ఏమో, తొమ్మిది నెలలూ ఎలా గడిచాయో తెలియలేదు. ఎలాంటి అనారోగ్యం లేకుండా బాబా నా పక్కన ఉండి నన్ను చూసుకున్నారు. తొమ్మిది నెలలు నిండాయి. డెలివరీ టైం వచ్చింది. నన్ను హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. నాకు నొప్పులు రావడం లేదు. డాక్టర్, "తనకి నార్మల్ డెలివరీ అవదు, C-SECTION(సిజేరియన్) చేయాలి" అని చెప్పింది. కానీ నేను, “బాబా! ఆపరేషన్ అయితే నేను చేయించుకోలేను. తరువాత అన్ని పనులూ ఒక్కదానినే చేసుకోలేను. నార్మల్ డెలివరీ అయ్యేలా చూడు, నా పక్కన చూసుకునేవాళ్ళు కూడా ఎవరు లేరు” అని బాబాకు చెప్పుకొని ఏడ్చేశాను. డాక్టర్ ఆపరేషన్‌కు అన్నీ సిద్ధం చేస్తున్నారు. 'రెండు గంటల తరువాత ఆపరేషన్' అని చెప్పి వెళ్లారు. అద్భుతం! ఆశ్చర్యం! బాబా మహిమ చూడండి. నాకు నొప్పులు మొదలయ్యాయి. నేను ఆ క్షణంలో కూడా బాబానే తలచుకున్నాను. నొప్పులు ఎక్కువయ్యాయి. డాక్టర్లు ఆశ్చర్యపోయారు. "ఆమెకు నార్మల్ డెలివరీ అయ్యేలా ఉంది, సిజేరియన్ అవసరం లేద"ని చెప్పారు. ఒక గంటలోనే నార్మల్ డెలివరీ అయ్యింది. నాకు నొప్పులు వస్తున్నప్పుడు ఆ బాధ కూడా తెలియకుండా బాబానే చూసుకున్నారు. నేను చేసిందల్లా బాబాని స్మరించుకుంటూ సహాయాన్ని అర్ధించటమే! ఒక గంటలోనే అన్నీ జరిగిపోయాయి. మగబిడ్డని బాబానే ప్రసాదించారు. 'సాయీ' అని పిలిస్తే 'ఓయీ' అని పలికే బాబా ఉండగా మనకు భయమెందుకు? నాకు బాబా ఉన్నారు. తన ప్రేమ, కరుణ నాపైన ఉంది. అందుకే నార్మల్ డెలివరీ అయ్యేలా చూశారు. నాకు ఇంతకన్నా అద్భుతం ఇంకొకటి ఉండదేమో సాయీ. నేను బ్రతుకుతున్న బ్రతుకు, అనుభవిస్తున్న ఈ జీవితం సాయిబాబా నాకు ఇచ్చిన భిక్ష. ఏమిచ్చి నేను ఋణం తీర్చుకోగలను? కేవలం సచ్చరిత్ర చదవడం వలన బాబా నాకోసం "సప్త సముద్రాల అవతలున్నా నిన్ను కాపాడతాను" అన్న మాటను నా ద్వారా రుజువు చేశారు. ఈ అవకాశం ఇచ్చినందుకు 'సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్' నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు.

2 comments:

  1. Mee biddaku yemi Peru pettaaru. Jawaabu ivvandi plz...

    ReplyDelete
  2. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి"

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo