సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా ఎల్లప్పుడూ నాతోనే ఉన్నారు


సాయిబాబా దేవుడు. నేను 'శ్రీసాయిబాబా దేవుని కంటే ఎక్కువ' అని చెప్తాను. సాయిబాబా ఇప్పటికీ ఈ విశ్వంలో ఉన్నారని నా అభిప్రాయం.  ప్రాచీనకాలంలో నిజమైన భక్తులు దేవుణ్ణి చూశారని అంటారు. వారు దేవుని దర్శనం కోసం తపస్సులు చేశారు. కానీ శ్రీసాయిబాబా శిరిడీలో కొన్ని సంవత్సరాలపాటు సత్పురుషులుగా ఉన్నారు. ఎంతోమంది వారిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందారు. తద్వారా వారంతా ఎంతో మేలు పొందారు. ఇప్పటికీ బాబా పట్ల పూర్తి విశ్వాసం ఉన్నవారు బాబా దీవెనలు, సహాయం పొందుతున్నారు. నేటికీ ఎంతోమంది భక్తులు శ్రీసాయిబాబా దర్శనం పొందుతున్నారు. ఆరాధనకు సంబంధించినంతవరకూ ఏ దేవునియందైనా విశ్వాసం చాలా ముఖ్యమైన అంశం. "ఏ సాధారణ రాయిని పూర్ణ విశ్వాసంతో ఆరాధన చేసినా, ఆ రాయిలో దేవుని చూడవచ్చు" అని మరాఠీలో ఒక సామెత ఉంది. కాబట్టి మీకు నచ్చిన దేవతని పూజించేటప్పుడు పూర్ణ విశ్వాసం ఉండాలి.

నేను శ్రీసాయిబాబా యందు పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉన్నాను. ఆయన ఎల్లప్పుడూ నాతో ఉంటూ నా కష్టాలలో నాకు సహాయం చేశారు. ఎప్పుడైనా నేను ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు బాబాను తలచుకొని 'ఆ పని విజయవంతం కావాల'ని ప్రార్థిస్తాను. బాబా ఆశీర్వాదం వలన నా పనులన్నీ విజయవంతంగా నిర్వహించబడ్డాయి.

1985 జూన్ చివరి వారంలో బొంబాయి నగరం మరియు శివారు ప్రాంతాలలో భారీ వర్షపాతం నమోదైంది. అన్ని లోకల్ రైళ్ళు అస్తవ్యస్తంగా నడపబడుతున్నాయి. ఒకరోజు ఉదయం పరిస్థితి బాగుండటం వలన పోర్ట్ ప్రాంతంలో ఉన్న 'బొంబాయి పోర్ట్ ట్రస్ట్' కార్యాలయానికి వెళ్ళాను. కానీ మధ్యాహ్నం 2 గంటల నుండి వాతావరణం పూర్తిగా మారిపోయి, నిరంతరాయంగా వర్షం కురుస్తోంది. దాని ఫలితంగా సెంట్రల్ రైల్వే లోకల్ రైళ్లు పూర్తిగా అస్తవ్యస్తం అయ్యాయి. అన్ని స్థానిక రైళ్ళు కుర్లా స్టేషన్ వరకు నడుస్తున్నాయి. కుర్లా తర్వాత ఉన్నవారు కుర్లా వరకు స్థానిక రైళ్ల ద్వారా వెళ్లి అక్కడి నుండి టాక్సీ లేదా ఆటోరిక్షాను అద్దెకు తీసుకొని థానేకు వెళ్ళాలి. నా నివాసం బద్లాపూర్. అది బొంబాయి V.T(విక్టోరియా టెర్మినల్) నుండి చాలా దూరంలో ఉంది. ఇప్పుడు ఇంటికి చేరుకోవడం నాకు ఒక పెద్ద సమస్య అయ్యింది. బొంబాయి నగరంలో ఉండటానికి నాకు మరో ప్రత్యామ్నాయం లేదు. భారీవర్షం కురుస్తూ ఉండటంతో నాకు ఏమి చేయాలో తోచక కలత చెందుతున్నాను. ఈ పరిస్థితులలో నేను నా బంధువుల వద్దకు వెళ్ళలేను. ఈ పరిస్థితిలో నా సాయిబాబా నాకు గుర్తుకు వచ్చి ఆయనను ప్రార్థించాను. ఆయన నన్ను ఎటువంటి పరిస్థితిలోనైనా ఇంటికి తీసుకువెళతారని నేను నిశ్చయించుకున్నాను. ఇలా అనుకున్న తర్వాత బాబా నన్ను మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్లాట్‌ఫాం వద్దకు నడిపించారు. డెక్కన్ క్వీన్ రైలు బొంబాయి V.T. స్టేషన్ 9వ నెంబర్ ప్లాట్‌ఫాంలో నిలబడి ఉంది. నిజానికి అది గంట క్రితం వెళ్లిపోవల్సినది, కానీ ఒక గంట ఆలస్యమై ప్లాట్‌ఫాం పైన ఉంది. డెక్కన్ క్వీన్ సాయంత్రం 6.10కి V.T. స్టేషన్‌లో బయలుదేరింది. ఇది బద్లాపూర్ దాటిన తర్వాత వచ్చే కర్జత్ స్టేషన్లో మాత్రమే ఆగుతుంది. అయినప్పటికీ నేను 'కర్జత్‌కి వెళ్లి అక్కడినుండి లోకల్ రైలులో బద్లాపూర్ తిరిగి రావచ్చులే' అని మనసులో అనుకున్నాను. భారీవర్షం కారణంగా డెక్కన్ క్వీన్ దాదర్, థానా, కళ్యాణ్ వంటి ప్రధాన స్టేషన్లలో మాత్రమే ఆగుతూ పోతుంది. కళ్యాణ్ తర్వాత కర్జత్‌లో మాత్రమే ఆగుతుంది. కానీ నా ఆశ్చర్యానికి అవధులు లేవు. డెక్కన్ క్వీన్ బద్లాపూర్ స్టేషన్‌లో ఆగింది. "నా ప్రియమైన బిడ్డా! ఇది నీవు దిగవలసిన స్టేషన్, దిగి ఇంటికి వెళ్ళు" అని బాబా చెప్తున్నట్లు అనిపించింది. బాబా ఆశీర్వాదంతో నేను బద్లాపూర్ స్టేషన్‌లో సంతోషంగా దిగాను. నేను రాత్రి 9.30 గంటలకు సురక్షితంగా ఇంటికి చేరుకున్నాను. ఇంటిలో నా భార్యాపిల్లలు ఆందోళనగా ఉన్నారు. రైళ్ళు కుర్లా స్టేషన్ వరకు మాత్రమే వస్తున్నాయని వారికి తెలిసిన కారణంగా వారు నన్ను చూసి ఆశ్చర్యపోయారు. బాబానే నన్ను క్షేమంగా ఇక్కడకు తీసుకువచ్చారని నేను వారికి చెప్పి, బాబా ఫోటో ముందు నిలిచి తలవంచి నమస్కరించుకొని, హృదయపూర్వకంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. బాబా నిజంగా సర్వశక్తిమంతుడు. ఈవిధంగా బాబా ఎప్పుడూ నాతోనే ఉన్నారు.

మధుకర్ వఖరే, బద్లాపూర్.

సోర్స్: శ్రీ సాయిలీల, సెప్టెంబర్ 1985.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo