ఒకసారి బాబా లెండీ నుండి తిరిగి వస్తూ ఒక మేకల యజమాని వద్ద ముప్పైరెండు రూపాయలకు రెండు మేకలను కొన్నారు. సాధారణంగా అయితే ఒక మేక ధర రెండు రూపాయలో, మహా అయితే మూడు నాలుగు రూపాయలో ఉంటుంది. అంతకుమించి ఉండదు. అలాంటిది బాబా ఒక్కో మేకకు 16 రూపాయలిచ్చి కొనడమేమిటో ఎవరికీ అర్థం కాలేదు. ధర అడిగిన తరువాత కనీసం బేరమైనా ఆడకుండా బాబా ఆ మేకల యజమానికి అంత డబ్బివ్వడం చూసిన తాత్యా, షామాలు ఆశ్చర్యపోయారు. బాబా అనవసరంగా ఎక్కువ డబ్బు చెల్లించి మోసపోయారని ఇద్దరూ కోపంతో చిరచిరలాడసాగారు. కానీ బాబా మాత్రం అసలు ఏ నష్టమూ వాటిల్లనట్లు కించిత్తైనా చలించకుండా సంతోషంగా, నిశ్చింతగా, ప్రశాంతంగా ఉన్నారు. కాసేపటి తరువాత తాత్యా, షామాలు బాబా వద్దకు వచ్చి ఎంతో వినయంగా, "ఏంటి బాబా! ముప్పైరెండు రూపాయలు వృధాగా పోయాయి. మరీ ఇంత ఉదారత్వమైతే ఎలా? ఎందుకిలా చేశారు?" అని ప్రశ్నించారు. కేవలం డబ్బును గురించిన ప్రశ్నను విని బాబా చిరునవ్వు నవ్వి వారితో, "నాకు ఇల్లుగానీ, కుటుంబంగానీ లేవు. మరి నేను ఎందుకోసం డబ్బు ప్రోగుచేసుకోవాలి?" అన్నారు. వెంటనే, "ముందు మీరు దుకాణానికి వెళ్లి, ఒక శేరు పప్పులు కొని తీసుకొచ్చి ఆ మేకలకు తృప్తిగా మేత పెట్టండి. తరువాత ఆ మేకలను వాటి యజమానికి ఇచ్చేయండి" అని అన్నారు. బాబా ఆదేశం మేరకు వాళ్ళు అలాగే చేశారు. అప్పుడు బాబా ఆ మేకల పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పి తాత్యా, షామాలను శాంతపరచారు. బాబాకు వారిరువురిపై అంతులేని ప్రేమ.
అయితే, తాత్యా ఎప్పుడూ బాబా అనురాగామృతాన్నే కాకుండా, అప్పుడప్పుడు ఆయన ఆగ్రహాన్ని కూడా చవిచూడవలసి వచ్చేది. 1911వ సంవత్సరంలో మసీదు ముంగిలి భక్తులు కూర్చునేందుకు చాలా ఇరుకుగా ఉందని, దాన్ని విశాలపరచే పనిని ప్రారంభించాడు కాకాసాహెబ్ దీక్షిత్. బాబా చావడిలో నిద్రించే రాత్రి భక్తులంతా కలిసి ఎంతో శ్రమకోర్చి ఇనుపస్తంభాలు నాటారు. ఉదయాన్నే చావడి నుండి వచ్చిన బాబా అది చూచి కోపించి, ఎంతో ఆవేశంతో (ఇద్దరు ముగ్గురు కలసిగానీ నాటనలవిగాని) ఆ స్తంభాలను ఒక్కరే పీకిపారేశారు. ఆయన ఒక చేత్తో స్తంభాన్ని పెరికివేస్తూ, మరొకచేత్తో సమీపంలోని తాత్యాపాటిల్ గొంతు పట్టుకున్నారు. అతని తలపాగాను బలవంతాన లాక్కుని, దానికి నిప్పంటించి, దానిని ఆ స్తంభాన్ని పాతిన గుంటలో వేశారు. కోపంతో బాబా కన్నులు ఎర్రగా అగ్నికణాలలాగా వెలగసాగాయి. అందరూ భయభ్రాంతులై చూస్తుండగా శ్రీసాయి తమ జేబులోనుంచి ఒక రూపాయి నాణేన్ని తీసి, భగవదర్పితమన్నట్టు గౌరవంతో ఆ గుంటలో వేసి ఒకటే తిట్లు, శాపనార్థాలు కురిపించారు. అంతసేపూ ఆయన తాత్యా గొంతు విడచిపెట్టలేదు. తాత్యా భయంతో వణికిపోతున్నాడు. అతనికేమి జరుగనున్నదో ఎవ్వరికీ అంతుపట్టలేదు. జోక్యం చేసుకోవడానికి ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. ధైర్యంచేసి వారింపచూచిన భాగోజీషిండే బాబా చేతికి చిక్కి తన్నులు తిన్నాడు. తరువాత షామా కూడా జోక్యం చేసుకోబోతే అతనిమీద ఇటుకముక్కలు విసిరారు బాబా. ఇలా ఎవరెవరైతే జోక్యం చేసుకోవడానికి ధైర్యం చేశారో వాళ్లంతా బాబా చేత అదేవిధమైన సత్కారం పొందారు. ‘ఇక ఇప్పుడు బాబా ముందుకు వెళ్లే సాహసం ఎవరు చేస్తారు? తాత్యా ఎలా ఈ కష్టం నుండి బయటపడతాడు?’ అని భక్తులంతా అనుకోసాగారు. కొంతసేపటికి బాబా కోపం చల్లారి, శాంతించారు. వెంటనే ఒక దుకాణదారుని పిలిచి ఒక జరీతలపాగా తెమ్మని ఆదేశించారు. అతను అది తీసుకొని రాగానే దాన్ని తాత్యా తలపై ఉంచి రాజాలా అలంకరించారు. అది చూచి భక్తులంతా ఆశ్చర్యపోయారు.
తాత్యాకోతేపాటిల్, శ్రీరామచంద్రకోతేపాటిల్‌లు చిన్నప్పటినుండి మంచి స్నేహితులు. వారిద్దరికీ బాబాతో కలిసి మసీదులో భోజనం చేసే భాగ్యం దక్కింది. భోజన సమయంలో వారిద్దరూ బాబాకు కుడివైపున కూర్చునేవారు. బాబా వారిద్దరికీ ఒకే పళ్లెంలో వడ్డించేవారు. 1916లో రామచంద్రపాటిల్ ఇన్‌ప్లూయెంజాతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అన్నిరకాల ఔషధాలు ఉపయోగించినప్పటికీ అవేమీ గుణమివ్వలేదు. దాంతో అతడు పూర్తిగా నిరాశచెంది భయంతో సాయిని స్మరిస్తున్నాడు. ఒకరాత్రి బాబా అతనికి సాక్షాత్కరించి, "భయపడవద్దు, నీకు చాలా ఆయుష్షు ఉంది (తూ గాబ్రో నాకోస్, తులా పుష్కల్ ఆయుసే అహాయ్)" అని చెప్పారు. బాబా మాటలతో రామచంద్రపాటిల్ ఎంతో ఉపశమనం పొందాడు. తరువాత బాబా, "కానీ, తాత్యా గురించే నా ఆలోచన. ఈరోజు నుండి సరిగ్గా రెండు సంవత్సరాల తరువాత విజయదశమిరోజున తాత్యా మరణిస్తాడు. ఈ విషయం నువ్వు ఎవరికీ చెప్పకు!" అన్నారు. బాబా అభయమిచ్చినట్లుగానే కొద్దిరోజుల్లో రామచంద్రపాటిల్ కోలుకున్నాడు. కానీ తాత్యా విషయంలో బాబా చెప్పినదాని గురించి చాలా కలత చెందాడు. బాబా మాట ఎప్పుడూ నిజమై తీరుతుందనే నమ్మకం ఉన్న అతను త్వరలోనే తాత్యాను కోల్పోతానన్న ఆలోచనను తట్టుకోలేకపోయాడు. తన బాధను తనలోనే దాచుకోలేక ఆ విషయం గురించి తనకెంతో నమ్మకస్తుడు, మంచి స్నేహితుడైన బాలాషింపీతో మాత్రం చెప్పి, "ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు" అని అన్నాడు. అప్పటినుండి వాళ్లిద్దరికీ తాత్యా గురించి చింత పట్టుకొంది. రోజులు లెక్కిస్తూ లెక్కిస్తుండగా కాలం తెలీకుండానే గడిచిపోయింది.
1918వ సంవత్సరంలో నవరాత్రులు ఆరంభమవుతూనే రామచంద్రపాటిల్, బాలషింపీలు భయపడుతున్నట్లే తాత్యాకు తీవ్రంగా జబ్బు చేసింది. అనారోగ్యంతో అతడు బాబా దర్శనానికి మసీదుకు కూడా వెళ్ళలేకపోయాడు. బాబాకు కూడా తీవ్రంగా జ్వరమొచ్చి రోజురోజుకీ ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. బూటీవాడాను పావనం చేయకుండానే బాబా సమాధి అవుతారని భక్తులు భయపడ్డారు. తాము అనారోగ్యంగా ఉన్నప్పటికీ బాబా నిత్యమూ తాత్యాకు ఊదీ పంపేవారు. ఒకరోజు అతనిని భోజనానికి మసీదుకు రమ్మని బాబా కబురుపెట్టారు. లేవలేక మంచాన ఉన్న తాత్యాను కొందరు భక్తులు సాయంపట్టి ఎలాగో మసీదుకు తీసుకొచ్చారు. అంత జబ్బులో ఉన్న తాత్యాకు బాబా స్వయంగా పాయసం తినిపించారు. అతడెంతో కష్టపడి మ్రింగాడు. అప్పుడు బాబా అతనితో, "తాత్యా! మొదట మనిద్దరికోసమని రెండు ఊయలలు తెప్పించాను. కానీ, తరువాత మనసు మార్చుకొన్నాను. ప్రస్తుతానికి నేనొక్కడినే వెళ్తున్నాను. ఇక నీవు ఇంటికి వెళ్ళు!" అని అన్నారు. బాబా మాటలలోని భావాన్ని గ్రహించిన తాత్యా వెక్కి వెక్కి ఏడుస్తూ, "బాబా, నన్నే ముందుగా పంపకూడదా?" అన్నాడు. దానికి బాబా, "నేను ఫకీరును. నేను పోతే శోకించేవారెవ్వరూ లేరు. కానీ, నీవు పోతే నీవాళ్ళందరూ దుఃఖిస్తారు" అన్నారు. ఆ మాటలకు తాత్యాకు దుఃఖం ఇంకా కట్టలు త్రెంచుకొంది. అతను దుఃఖంతో వెక్కిళ్ళు పెడుతూ, "నేను పోతే నా బంధువులే దుఃఖిస్తారు. మీరు లేకపోతే ఎంతోమంది అనాథలవుతారు. మీరుంటే మీ దర్శనం చేతనే ఎందరో తరిస్తారు. ఇక నేనంటారా? నా జీవితం నాకు, నా సాటివాళ్ళకూ ఒక భారం" అన్నాడు. అతని ధోరణిని అడ్డుకొంటూ బాబా, "సరేలే! ఇక నోరుమూసుకొని ఇంటికి పో!" అని ప్రేమతో కసిరారు. బాబాకు నమస్కరించి సెలవు తీసుకుంటున్న తాత్యా నొసట ఊదీపెట్టి, బరువైన గుండెతో ఇంటికి పోతున్న తాత్యాను అతను కనుమరుగయ్యేదాకా అలాగే చూస్తూ ఉండిపోయారు బాబా.
విజయదశమి రానే వచ్చింది. బాబా దేహత్యాగం చేశారు. బాబా మహాసమాధి చెందిన కొన్ని గంటలకు అప్పటికి ఎంతో విషమించిన తాత్యా ఆరోగ్యస్థితి విచిత్రంగా మెరుగుపడటం మొదలై తరువాత ఒకటి రెండురోజులలో పూర్తిగా కోలుకున్నాడు. తాత్యా ప్రాణాలు కాపాడటంకోసం అతని ప్రాణాలకు బదులు బాబా తమ ప్రాణాలే అర్పించారని ప్రజలు భావించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ శ్రీహేమాడ్పంత్ తమ ‘శ్రీసాయిసచ్చరిత్ర’ (42వ అధ్యాయం)లో ఇలా అంటారు: “వారిలో వారు (బాబా-తాత్యాలు) తమ మరణము మార్చుకొన్నట్లనిపించెను. బాబా తమ ప్రాణమును తాత్యా కొరకు అర్పించిరని జనులనుకొనిరి. సత్యము బాబాకే తెలియును. ఈ విధముగ తాత్యా పేరు చెప్పి తమ సమాధిని బాబా సూచించిరి". బాబాకు, తాత్యాకు ఉన్న ప్రాణాధికమైన ప్రేమానురాగాల దృష్ట్యా ప్రజలు అలా భావించడంలో ఆశ్చర్యం లేదు. అయితే, అది కేవలం వారి భావనే తప్ప, ఆ భావనకు బలమైన కారణం ఏదీ కనిపించదు. ఎందుకంటే, మొదట తమ కోసం, తాత్యా కోసం రెండు ఊయలలు తెప్పించాననీ, కానీ తరువాత మనసు మార్చుకొని ఒక ఊయలను ఖాళీగా త్రిప్పి పంపేశాననీ, తాను మాత్రమే వెళుతున్నాననీ బాబా స్పష్టంగా చెప్పారు. అంతేగానీ, తాత్యా కోసం ఒక్క ఊయలనే సిద్ధంచేసి దానిలో తాత్యా బదులు తాము వెళ్తామని బాబా చెప్పలేదు. తాత్యా కూడా, "నన్ను ముందుగా పంపరాదా?" అని బాబాను అర్థించాడే తప్ప, "మీ బదులు నన్ను పంపరాదా?" అని అడగలేదు. బాబా వంటి దివ్య అవతారమూర్తుల దేహం యొక్క ఆవిర్భావం, పరిణామం, అదృశ్యం ఎందరో భక్తుల ప్రారబ్ధంతో, తరింపుతో ముడిపడివుంటుంది. అంతేగాక, ఎందరో భక్తులను మరణం నుండి కాపాడటమేగాక, మరణించినవారిని కూడా పునర్జీవితులను చేసిన సర్వశక్తిసంపన్నుడైన శ్రీసాయికి తాత్యా ప్రాణాలు కాపాడటం ఒక లెక్కలోని పనికాదు. అతని ప్రాణాలు కాపాడాలంటే దానికి బదులు తమ ప్రాణాలు అర్పించాల్సినంత పని అసలే లేదు. శ్రీహేమాడ్పంతు సూచించినట్లు తమ సహజ నిగూఢరీతిలో తమ పేరుకు బదులు తాత్యా పేరు చెప్పివుండవచ్చు. అయితే, తాత్యా కోసం బాబా తమ ప్రాణాలనే అర్పించారనే ప్రజల 'భావన' బాబాకు, తాత్యాకు మధ్యనున్న ప్రాణాధికమైన మమతానురాగాలకు అద్దంపడుతున్నది.
తాత్యాకు పెళ్ళైన చాలాకాలం వరకు సంతానం కలగలేదు. దాంతో, రెండో వివాహం చేసుకుంటేనైనా సంతానం కలగవచ్చన్న ఆశతో అతను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. కానీ రెండవ భార్య వలన కూడా అతనికి సంతానం కలగలేదు. అందువలన మరో వివాహం చేసుకున్నాడు. అయితే దురదృష్టం కొద్దీ మూడవ భార్య వలన కూడా అతనికి సంతానభాగ్యం కలగలేదు. అంతటితో అతను నిరాశచెంది తన తలరాతలో సంతానం కలిగే యోగం లేదని భావించి, తన స్నేహితుడైన రామచంద్రపాటిల్ కొడుకును దత్తత తీసుకోడానికి నిశ్చయించుకొని అందుకు సన్నాహాలు కూడా మొదలుపెట్టాడు. ఒక శుభదినాన దత్తత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, అందుకు సంబంధించిన పత్రాలు తీసుకొని బాబా ఆశీస్సుల కోసం మసీదుకు వెళ్ళాడు. బాబా ఆ పత్రాలను చూసి, "నువ్వెందుకు ఎవరినైనా దత్తత తీసుకోవాలి? నీకే పిల్లలు కలుగుతారు" అని అన్నారు. బాబా మాటలపై అచంచలమైన విశ్వాసమున్న తాత్యా దత్తత కార్యక్రమాన్ని ఆపేశాడు. అయితే, తర్వాత కూడా చాలాకాలం వరకు అతనికి సంతానం కలగలేదు. చివరకు తాత్యా ఒకరోజు బాబా వద్దకు వెళ్లి, "దేవా! మీరు నాకు పిల్లలు కలుగుతారని చెప్పినందువల్ల నేను దత్తత స్వీకార కార్యక్రమాన్ని ఆపేశాను. కానీ అది జరిగి చాలారోజులు గడిచిపోయాయి. నాకిప్పటికీ సంతానం లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు?" అని అడిగాడు. అప్పుడు బాబా, "తాత్యా, నీకు సంతానం కలిగితే సంపదను కోల్పోతావు. నీకు సంపద కావాలో, సంతానం కావాలో తేల్చుకో" అని అన్నారు. పగలూరాత్రీ పిల్లల కోసం తపించిపోతున్న తాత్యా, "సంపద పోతే పోనివ్వండి. నాకు పిల్లలే కావాలి" అని అన్నాడు. బాబా నవ్వి, "సరే అయితే, నీకు సంపద కంటే పిల్లలే కదా కావాలి? నీకు ఒకే సమయంలో గంపెడు పిల్లలు పుడతారు. ఇక వెళ్ళు!" అని అన్నారు. ఆ తరువాత తాత్యాకు 55 సంవత్సరాల వయస్సు వచ్చాక ముగ్గురు భార్యలకు సంతానం కలగసాగి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు జన్మించారు. ఇప్పుడు మనవలు, మునిమనవళ్లతో అతని కుటుంబంలో వందకు పైగా సభ్యులున్నారు. కానీ, బాబా చెప్పినట్లే అతని సంపద హరించుకుపోయింది. అతను అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఏదేమైనప్పటికీ శ్రీసాయిబాబా కృపవలన తాత్యా తన చివరిరోజుల్లో ఎవరికీ పైసా అప్పు లేకుండా, ఎటువంటి చింతా లేకుండా 1945, మార్చి 12న మరణించాడు. (ఈ వివరాలను శ్రీతాత్యా రెండవ భార్య కుమారుడైన శ్రీఉత్తమ్‌రావుకోతేపాటిల్ వెల్లడించాడు.)
శ్రీతాత్యాకోతేపాటిల్ సమాధి లెండీవనం ప్రహరీగోడకు, శ్రీసాయిబాబా సంస్థాన్ పవర్‌హౌస్‌కి మధ్య ఉంది. శ్రీసాయిబాబా కంటివెలుగుగా భావింపబడే తాత్యా సమాధి సంస్థాన్ మొత్తానికి వెలుగునిచ్చే పవర్‌హౌస్ ప్రక్కనే ఉండటం శ్రీసాయిబాబా సంకల్పమేగానీ యాదృచ్ఛికం కాదు.
తాత్యా తదనంతరం అతని వారసులకు పల్లకీ ఉత్సవ సమయంలో బాబా ఫోటోను తీసుకువెళ్ళే గౌరవాన్ని ఇచ్చి సత్కరిస్తోంది శ్రీసాయిబాబా సంస్థాన్. వివరాలలోకి వెళితే... ప్రతి గురువారం పల్లకీ ఉత్సవం ప్రారంభం కావడానికి కొంచెం ముందుగా తాత్యాకోతేపాటిల్ వారసులలో ఒకరు, అలాగే బయ్యాజీపాటిల్ వారసులలో ఒకరు సమాధి మందిరానికి చేరుకుంటారు. అక్కడున్న పూజారి బాబా ఫోటోను తాత్యా వారసునికి, బాబా పాదుకలు ఉన్న పెట్టెను బయ్యాజీపాటిల్ వారసునికి అందజేస్తారు (మొదట్లో వాళ్ళే స్వయంగా సమాధి ఉన్న అరుగుమీదకెక్కి వాటిని తీసుకునేవారు). వాళ్ళు ఆ బాబా ఫోటోను, పాదుకలను తీసుకొని అందంగా అలంకరించబడి ఉన్న పల్లకీలో ఉంచుతారు. ఆపై బాజాభజంత్రీలతో పల్లకీ ఊరేగింపుగా ద్వారకామాయికి చేరుకుంటుంది. తాత్యా వారుసులు బాబా ఫోటోను పల్లకీలో నుంచి తీసి, కొద్దిసేపు సభామండపంలో ఉన్న రాయిపై ఉంచుతారు. కొద్దిసేపటి తర్వాత బాబా ఫోటోను మసీదులో ఎప్పుడూ బాబా కూర్చునే గద్దెమీద కొంతసేపు ఉంచి, ఆపై ఆ పటాన్ని తీసుకొచ్చి పల్లకీలో ఉంచుతారు. నాడు చావడి ఉత్సవం సమయంలో తాత్యా వచ్చి బాబాను లేవదీసి బయలుదేరదీస్తేగానీ బాబా బయలుదేరేవారు కాదని చెప్పుకున్నాం కదా! అచ్చం అదే సంప్రదాయాన్ని పాటిస్తూ నేడు తాత్యా వారసులు సైగచేసేవరకు పల్లకీ మోసేవాళ్లు పల్లకీని భుజానికెత్తుకొని ముందుకు సాగేందుకు నిరీక్షిస్తూ ఉంటారు. ఆపై పల్లకీ చావడికి చేరుతుంది. అక్కడ బాబాకు ఆరతి నిర్వహింపబడుతుంది. ఆ సమయంలో నాడు తాత్యా చేసినట్లే అతని వారసులు చిలిం వెలిగించి బాబాకు సమర్పిస్తారు.
సమాప్తం...
సోర్స్: శ్రీసాయిసచ్చరిత్ర,
సాయిలీల మ్యాగజైన్ అక్టోబర్, 1960 సంచిక,
Ambrosia in Shirdi & Baba's Gurukul by విన్నీ చిట్లూరి,
Ref : శ్రీసాయిభక్త విజయం బై పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ.
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteTatya have no punarjanma. He is sai's loving devotee. He is very lucky soul. Om sai ram. ❤❤❤
ReplyDeleteOM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram
ReplyDeleteOm sai ram baba kapadu thandri sainatha
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete