సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 965వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆరోగ్యప్రదాత సాయి
2. విశ్వాసంతో తమపై ఆధారపడ్డ భక్తులపై బాబా అనుగ్రహానికి లేదు కొదవ!
3. ఖచ్చితంగా బాబా మనల్ని కాపాడతారు

ఆరోగ్యప్రదాత సాయి


పరాత్పర గురువైనటువంటి సాయినాథుని పాదపద్మములకు నమస్కరిస్తూ, ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సాయినాథుడు చూపిన మరో లీలామహత్యాన్ని వివరిస్తున్నాను. నా పేరు కృష్ణ. ఈమధ్య మా అమ్మగారి రక్తంలో అల్బుమిన్ తగ్గటం వల్ల, యూరిన్‌లో ప్రోటీన్ పోవడం వల్ల ఆమె శరీరానికి నీరుపట్టి బాధపడ్డారు. అందువలన డాక్టరు అల్బుమిన్‌ని ఇంజెక్ట్ చేయమన్నారు. దానికోసం హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి ఉంది. కానీ ఒకసారి హాస్పిటల్లో జాయిన్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా నరకం అనుభవించాలి. నేను మెడికల్ ఫీల్డ్‌లో ఉండటంవల్ల హాస్పిటల్‌వాళ్ళు పెట్టే బాధలు నాకు బాగా తెలుసు. అందువల్ల నేను, "హాస్పిటల్లో జాయిన్ కాకుండానే సహజంగా అల్బుమిన్ పెరిగేలా చూడమ"ని బాబాను గట్టిగా ప్రార్థించి, అమ్మ ఆహారంలో మార్పులు తీసుకొచ్చాను. సాయినాథుని దయవల్ల పరిస్థితిలో మార్పు కనపడింది. కానీ ఆ మార్పు చాలా నిదానంగా జరుగుతున్నందున వారాలు గడిచిపోతున్నాయి. దాంతో నేను, "బాబా! అమ్మ పడుతున్న బాధను చూడలేకుండా ఉన్నాను. ఎలాగైనాసరే హాస్పిటల్లో జాయిన్ కాకుండా కాస్త తొందరగా, అదికూడా సహజసిద్ధంగా అల్బుమిన్ పెరిగేలా చూడమ"ని బాబాను వేడుకున్నాను. కొన్నిరోజుల తర్వాత ఎందుకోగానీ 'ఈమధ్య నేను తరచుగా దర్శిస్తున్న మొగిలిచర్లలోని దత్తాత్రేయస్వామి అనే అవధూతకి మ్రొక్కుకొమ్మ'ని సాయిబాబా నాకు స్పురణ కలిగించారు. 'ఏదో కార్యకారణ సంబంధం లేనిది బాబా ఆవిధంగా నాకు ప్రేరణ కలిగించడం జరగద'ని నమ్మి, వారి సూచనమేరకు మొగిలిచర్ల దత్తాత్రేయస్వామి రూపంలో ఉన్న సాయినాథునికి నేను మ్రొక్కుకున్నాను. మా అమ్మని కూడా స్మరణ చేయమని చెప్పాను. చాలా విచిత్రంగా అప్పటినుంచి అమ్మకు చాలా త్వరగా స్వస్థత చేకూరుతూ ఆరోగ్యవంతులయ్యారు. ఆ క్రమంలో చాలాసార్లు స్వయంగా సాయిబాబానే అమ్మకు వైద్యం చేస్తున్నట్లు నేను చాలా అనుభూతిని పొందాను. సర్వాంతర్యామి, సకల దేవతాస్వరూపుడు, అవధూతలందరిలోనూ ఉన్నటువంటి ఆ పరాత్పర గురువైన సాయినాథుని దయ, కృపాకటాక్షాలతో మా అమ్మగారు ఆరోగ్యవంతులయ్యారు


మరో చిన్న అనుభవం: మా మేనత్తగారి కాలిలో ఆనె లేచి ఆమె చాలా ఇబ్బందిపడ్డారు. ఒకరోజు జ్వరం కూడా వచ్చింది. అప్పుడు నేను సాయినాథుని గట్టిగా ప్రార్థించి, "రేపు ఉదయానికల్లా జ్వరం తగ్గించి, ఆమె ఆరోగ్యాన్ని సాధారణం చేయమ"ని వేడుకున్నాను. బాబా దయతో ఉదయానికి మా మేనత్తగారికి జ్వరం తగ్గింది. మరుసటిరోజుకి కాలినొప్పి కూడా తగ్గి గురువారం సాయిబాబా కోసం ప్రసాదం తయారుచేయగలిగారు. ఈ విధంగా ఆ సాయినాథుడు నన్ను, నా కుటుంబాన్ని వెన్నంటి ఉండి కాపాడుతున్నారు. అతిత్వరగా నాకు, మా అమ్మగారికి, మా మేనత్తగారికి శిరిడీలో తమ దర్శనభాగ్యాన్ని ప్రసాదించమని బాబాను కోరుకుంటూ వారిని దర్శించేంతవరకు నాకు ఇష్టమైన తీపిపదార్థాన్ని తినకుండా ఉంటానని మ్రొక్కుకున్నాను. బాబా అనుగ్రహంతో శిరిడీ దర్శనభాగ్యం ప్రాప్తిస్తుందని ఆశిస్తున్నాను. "ధన్యవాదాలు బాబా".


అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ

తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయినాథ!!!


విశ్వాసంతో తమపై ఆధారపడ్డ భక్తులపై బాబా అనుగ్రహానికి లేదు కొదవ!


శ్రీసాయినాథుని దివ్యపాదాలకు శిరసు వంచి నమస్కరిస్తూ నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును నిర్వహిస్తున్న సాయికి మరియు సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు సంధ్య. సరిగ్గా రెండు నెలల క్రితం మా దగ్గర బంధువు ఒకరు మమ్మల్ని డబ్బులు అడిగారు. మేము బాగా ఆలోచించుకుని, "మాకు డబ్బు అవసరం ఉంది, ఇప్పుడు మీకు డబ్బులిస్తే మా పని ఆగిపోతుంది. తీసుకున్న డబ్బులు సమయానికి ఇవ్వకపోతే మాకు ఇబ్బంది కలుగుతుంది" అని వారు నొచ్చుకోకుండా చెప్పాము. కానీ, "నాకు వేరే ఒకచోట రావాల్సిన డబ్బులు రానందున, మీరు నాకు డబ్బులిస్తే నాలుగురోజుల్లో మీకు కావాల్సిన సమయానికి ఇచ్చేస్తాను" అని చెప్పారు. 'సరే, నాలుగురోజుల్లో ఇచ్చేస్తామంటున్నారు కదా, డబ్బులు ఇద్దామ'ని నేను, మావారు మాట్లాడుకుని పెద్ద మొత్తం డబ్బులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము. ఇచ్చేముందు ఆ డబ్బులను బాబా పాదాలకు తాకించి, "ఈ డబ్బులు త్వరగా తిరిగి రావాలి సాయీ" అని బాబాకు చెప్పుకుని మా బంధువులకు ఆ డబ్బులిచ్చాము. నాలుగురోజులు కాస్తా వారం అయింది. ఎప్పుడు ఫోన్ చేసినా, ఫోన్ ఎత్తేవాళ్లు కాదు. ఒకసారి మాత్రం ఫోన్ ఎత్తి, "రెండు రోజుల్లో ఇస్తాను" అన్నారు. కానీ మళ్లీ మామూలే. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఉండేది కాదు. ఎప్పుడైనా ఫోన్ లిఫ్ట్ చేసినా 'ఈరోజు, రేపు' అని వాయిదా వేస్తుండేవాళ్లు. డబ్బులు తీసుకున్నప్పుడు ఉన్న మాట తరువాత లేదు. ఒకరోజు నాకు చాలా భయమేసి, "బాబా! నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించండి. నమ్మకంతో డబ్బులు ఇచ్చాము. అదే నమ్మకంతో తీసుకున్న డబ్బులు మాకు తిరిగి ఇచ్చేలా మా బంధువుని అనుగ్రహించండి. దయచూపండి బాబా. మీ దయవలన ఈరోజు గనక మా డబ్బులు మాకు తిరిగి వస్తే, మీ అపారమైన ప్రేమను, అద్భుతలీలను 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ ద్వారా సాయిబంధువులతో పంచుకుంటాను సాయీ" అని బాబాను ప్రార్థించాను. తరువాత దృఢమైన విశ్వాసంతో 'ఓం శ్రీసాయి అద్భుతానంత చర్యాయ నమః' అనే నామాన్ని 108 సార్లు జపించాను. ఆ తరువాత, "బాబా! మేము మీ మీదే ఆధారపడి ఉన్నాము తండ్రీ" అని బాబాతో చెప్పుకుని, 'ఓం శ్రీసాయి సర్వాధారాయ నమః' అనే నామాన్ని 108 సార్లు జపించాను. ఇలా ప్రార్థించడం బాబా ప్రేరణే అని నా విశ్వాసం. అద్భుతం! సాయి దయచూపారు. డబ్బులు తీసుకున్న మా బంధువు మా ఫోన్ లిఫ్ట్ చేసి, "ఒక గంటలో డబ్బులు తీసుకుని వస్తాను" అని చెప్పి సాయంత్రానికి డబ్బులతో వచ్చి మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చారు. "ధన్యవాదాలు సాయితండ్రీ. 'మా డబ్బులు మాకు ఇప్పించి అద్భుతం చేయండి' అని ప్రార్థించినంతనే దయతో మా డబ్బులు మాకు వచ్చేలా చేశారు సాయీ. మీకు వేలవేల కృతజ్ఞతలు. సాయీ! నీవే తల్లితండ్రివి, నీవే దైవం, నీవే గురువు, నీవే బంధుబలగం, నీవే సఖుడవు, నీవే సర్వం, నిజంగా నీవే నా తోడునీడ సాయీ".


ఖచ్చితంగా బాబా మనల్ని కాపాడతారు


శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!! నేనొక సాయిభక్తురాలిని. బాబా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఎప్పుడూ మన వెంటే ఉంటూ మనల్ని కాపాడుతారని చెప్పడానికి ఉదాహరణగా నా జీవితంలో జరిగిన ఒక సంఘటనను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2021, జూన్ నెలలో మా కుటుంబమంతటికీ, అంటే నాకు, నా భర్తకి, మా నాలుగు సంవత్సరాల పాపకు కరోనా వచ్చింది. నాకు, మా పాపకి లక్షణాలేమీ లేవుగానీ, నా భర్తకి మాత్రం జ్వరం ఉండేది. అందరూ ఏమీకాదు అనేవారు. కానీ ఐదవరోజు ఎందుకో అనుమానమొచ్చి చెక్ చేయిస్తే 6% ఉండాల్సిన వైరల్ శాతం 114% ఉంది. 'వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయకపోతే రెండురోజుల్లో పల్స్ డౌన్ అయిపోతుంద'ని అన్నారు. దాంతో మాకు చాలా భయమేసింది. కానీ, బాబా మమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతారని నమ్మకంతో మావారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. మావారికి తోడుగా నేను హాస్పిటల్లో ఉన్నాను. గురువారం పారాయణ చేసి హాస్పిటల్‌కి వెళ్లిన మేము బాబా దయవలన మరుసటి గురువారానికి పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చాము. మనం బాబాను మనస్ఫూర్తిగా నమ్మి పూజిస్తే ఆయన మనల్ని ఖచ్చితంగా కాపాడుతారు, ఎప్పుడూ మనకి తోడుగా ఉంటారు.


ఓం సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!



9 comments:

  1. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness. Jaisairam

    ReplyDelete
  2. Om sai ram every day sai baba's leelas are very nice.baba you blesses every devotee every minute.that is your power tandri. Om sai ram ❤❤❤

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATHAYA NAMAH..OM SAI RAM

    ReplyDelete
  4. Samastha sadguru sainadh maharaj ki Jai,on sairam.

    ReplyDelete
  5. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🤗🌺😃🌼😀🌸🥰🌹💕

    ReplyDelete
  6. Om sai ram baba amma arogyam bagundali thandri

    ReplyDelete
  7. Baba ma arogya samasyalani teerchu thandri sainatha

    ReplyDelete
  8. Baba please help me thandri sainatha sainatha

    ReplyDelete
  9. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo