1. బాబా చల్లని చూపు
2. మొర ఆలకించి టెన్షన్ తొలగించిన బాబా
3. బాబా కృప
బాబా చల్లని చూపు
సాయిభక్తులందరికీ నమస్కారాలు. 'సాయి మహరాజ్ సన్నిధి' నడుపుతున్న అన్నయ్యకి బాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. నేనొక సాయిభక్తురాలిని. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక గొప్ప అనుభవాన్ని పంచుకుందామని మరోసారి మీ ముందుకు వచ్చాను. నా భర్త సాయిబాబా భక్తుడు. ఆయన ఉద్యోగరీత్యా మేము యు.ఎస్.ఏ.లో ఉంటున్నాము. కొద్ది నెలలుగా నా ఆరోగ్యం ఏం బాగాలేక చాలామంది డాక్టర్లను కలిశాము. వెళ్లిన ప్రతిచోటా బ్లడ్ టెస్టులు చేశారు. మూడునెలల కాలంలో ఆరుసార్లు టెస్టులు చేశారు. కానీ నాకున్న సమస్యేమిటో ఎవరూ కనుక్కోలేకపోయారు. అందుచేత సమస్య నన్ను వదలలేదు. నాకున్న ఆ అనారోగ్య సమస్య వల్ల ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకున్న భర్తని సరిగా చూసుకోలేక నేను చాలా బాధపడుతుండేదాన్ని. అంతేకాదు, మానసికంగా కృంగిపోతున్న సమయంలో బాబా కూడా తోడుగా లేరని బాధపడేదాన్ని. మేమున్న ప్రాంతంలో వివిధ దేవతలు కొలువైయున్న ఒక గుడి ఉంది. ప్రస్తుతం కరోనా కారణంగా శనివారం 12 నుండి 2 గంటల వరకు మాత్రమే ఆ గుడి తెరుస్తున్నారు. అయితే ఆ ప్రాంగణంలో ఉన్న బాబా గుడి మాత్రం గడిచిన ఆరునెలల కాలంలో కేవలం ఒకే ఒక్కసారి తెరిచారు. ఒకరోజు మేము కనీసం గుడికి వెళ్లి దేవుని దర్శనం చేసుకుంటేనైనా నా పరిస్థితిలో ఏదైనా మార్పు వస్తుందని బయలుదేరాము. అయితే నేను గుడికి వెళ్లేముందు, "బాబా! నువ్వు నిజంగా నా బాగోగులు చేసుకునేలా ఉంటేనే మీ గుడి తెరచి ఉండాలి" అని బాబాకి మ్రొక్కుకుని ఆయననే తలచుకుంటూ గుడికి వెళ్ళాను. ముందుగా వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని, తరువాత బాబా గుడిని సమీపిస్తుండగా, "గుడి మూసివుంద"ని ఎవరో చెప్పారు. ఆ మాట విని బాధపడుతూనే ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్ళాను. అక్కడ ఆంజనేయస్వామి విగ్రహం వద్ద ఒక చిన్న బాబా విగ్రహం, దత్తాత్రేయస్వామి ఫోటో దర్శనమిచ్చాయి. వాటిని చూడగానే, 'దర్శనం కావాలి' అని అడిగినందుకు ఈవిధంగా బాబా నన్ను అనుగ్రహించారని నేను చాలా సంతోషించాను. తరువాత మేము శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుని, కేవలం ఐదు నిమిషాల్లో మళ్ళీ ఆంజనేయస్వామి గుడి దగ్గరికి వచ్చాము. వస్తూనే చూస్తే, అంతకుముందు అక్కడున్న బాబా, దత్తాత్రేయస్వామి స్వరూపాలు కనపడలేదు. అంతలోనే అవి అక్కడ నుంచి ఎలా అదృశ్యం అయ్యాయోగానీ, ఆ విధంగా బాబా తమ ఉనికిని తెలియపరచి నాకు మనోధైర్యానిస్తున్నారని నేను అర్థం చేసుకున్నాను. ఇది నిజంగా బాబా ఇచ్చిన నిదర్శనం కాకపోతే మరేంటి?
తరువాత మేము ఒకసారి నా ఆరోగ్య సమస్య విషయంగా ఒక ప్రఖ్యాత వైద్యుడిని కలిసినప్పుడు ఆయన నాకున్న ఇబ్బందులను బట్టి, ఒక దీర్ఘకాలిక అనారోగ్యం ఉండవచ్చని చెప్పారు. అంతేకాదు, అందుకు సంబంధించి అదివరకు చేసిన ఒక టెస్టులో పాజిటివ్ వచ్చింది కాబట్టి, చివరిగా ఒక టెస్టు చేద్దామని బ్లడ్ తీసుకున్నారు. ఆ సమయంలో నేను ఎంత భయపడ్డానో, బాధపడ్డానో ఆ సాయినాథునికే తెలుసు. పెళ్ళయి సంవత్సరమే అయింది, ఇంకా పిల్లలు లేరు. ఇలాంటి సమయంలో చికిత్సలేని రోగాన్ని జీవితాంతం భరించాలంటే ఎవరు మాత్రం తట్టుకోగలరు? డాక్టరు చెప్పిన లక్షణాలు మరియు నేను గూగుల్లో చూసిన వివరాలను బట్టి నాకు ఆ రోగం 60% ఉండే అవకాశం ఉంటుందని అర్థమై సాయిబాబా మీద దృఢమైన నమ్మకముంచి ఆయనతో ఒకటే చెప్పుకున్నాను: "బాబా! డాక్టరు చూపిన లక్షణాలన్నీ నాలో ఉన్నాయి. అయినా నన్ను ఈ సమస్య నుంచి బయటపడేసి నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని నేను మిమ్మల్ని అడుగుతున్నాన"ని. నిజంగా ఆ తండ్రి కరుణ చూపించారు, నన్ను చక్కగా ఆశీర్వదించారు. టెస్టు రిపోర్ట్ నెగిటివ్ వచ్చింది. డాక్టరు, "గుడ్ న్యూస్. నీకు ఎలాంటి సమస్యా లేద"ని చెప్పగానే బాబాకి మనసారా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అప్పటినుండి బాబా ఊదీనే నమ్మి నీళ్లలో వేసుకుని త్రాగుతూ ఉండగా నాకున్న నొప్పులు తగ్గుతూ వస్తున్నాయి. బాబా నా కర్మానుసారం నేను అనుభవించాల్సినదానిని తప్పించి, నేను భరించగలిగే నొప్పుల రూపంలో నా సమస్యను తొలగిస్తున్నారని నా విశ్వాసం.
మొర ఆలకించి టెన్షన్ తొలగించిన బాబా
ఓం సాయి. నేను సాయిభక్తురాలిని. ఈ బ్లాగులో పంచుకుంటానని సాయికి మ్రొక్కుకున్న ఒక అనుభవం గురించి నేనిప్పుడు వ్రాయబోతున్నాను. 2021, అక్టోబరు 1, శుక్రవారం మావారికి జలుబు చేసింది. మావారు పెద్దగా పట్టించుకోక అలాగే ఆఫీసుకి వెళుతుండేవారు. అలా రెండు రోజులయ్యేసరికి దగ్గు, జ్వరం కూడా మొదలయ్యాయి. ఈ కోవిడ్ రోజుల్లో ఆ మూడు లక్షణాలు ఉంటే కరోనా కాక వేరే ఆలోచన ఏం వస్తుంది? వస్తే వచ్చిందిలే, అదే తగ్గుతుందిలే అనుకునే పరిస్థితి కాదు నాది. ఎందుకంటే, ఈ మధ్యనే కరోనా వల్ల మా పుట్టింటివైపు కుటుంబమంతా దారుణమైన నరకాన్ని చూశాము, ఆప్తులను పోగొట్టుకున్నాం కూడా. ఆ రాత్రంతా మావారు దగ్గుతుంటే నా కంటిపై కునుకులేదు. అలాంటి పరిస్థితిలో బాబా తప్ప మనకు వేరే దిక్కెవరు? బాబా నామాన్నే రాత్రంతా జపిస్తూ, 'తెల్లవారగానే రాపిడ్ టెస్ట్ చేయిద్దామ'ని అనుకున్నాను. "ఏదేమైనా టెస్టులో కోవిడ్ నెగెటివ్ రావాల"ని గట్టిగా బాబాకి చెప్పుకుని, బాబా మీదనే భారం వేసి, మావారి నుదుటన బాబా ఊదీ పెట్టి ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూశాను. తెల్లవారాక టెస్టు చేస్తుంటే ఆ పది నిమిషాలు నేను పడ్డ టెన్షన్ అంతా ఇంతా కాదు, నరకం అనుభవించాను. ఆ సమయమంతా సాయినామం నా నోట్లో కదులుతూనే ఉంది. బాబా అనుగ్రహం వల్ల రిజల్ట్ నెగెటివ్ వచ్చింది. కాసేపు చాలా రిలాక్స్‌గా అనిపించింది. కానీ అంతలో ఆర్.టి.పి.సి.ఆర్ టెస్టు రిజల్ట్ మాత్రమే పూర్తి నమ్మశక్యమని తెలిసింది. అయితే ఆరోజుకి టెస్టులు చేసే సమయం అయిపోయింది. పైగా మావారికి బయటకు వెళ్లే ఓపిక కూడా లేదు. అందువలన మరుసటిరోజు ఉదయం ఆర్.టి.పి.సి.ఆర్ టెస్టుకు వెళ్ళాము. రాత్రికి రిపోర్ట్ నెగెటివ్ అని వచ్చింది. అప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుని ఆ రాత్రి హాయిగా నిద్రపోయాను. ఆ రెండురోజులూ నేను అనుభవించిన టెన్షన్ మాటల్లో చెప్పలేను కానీ, బాబా దయవల్ల మాత్రమే పెద్ద కష్టం తప్పిందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే, ఆ లక్షణాలుకానీ, అంత నీరసంకానీ ఇదివరకు ఎన్నడూ మావారికి రాలేదు. ఎంత జలుబు చేసినా సరే ఆయన అంత ఇబ్బంది ఎప్పుడూ పడలేదు. నా స్వామి నా మొర ఆలకించి తనని ఆరోగ్యంగా ఉంచారు. బాబాకి మ్రొక్కుకున్నట్టే నా అనుభవాన్ని ఇలా మీతో పంచుకున్నాను. "బాబా! ఏ రోగమొచ్చినా ఆప్తులు దగ్గరుండి సేవచేసే అవకాశమైనా ఉంటుంది. కానీ ఈ కోవిడ్ వస్తే అసలు రోగం కన్నా, ఎవరూ దగ్గరకు రాని పరిస్థితి అత్యంత మానసిక వేదనకు గురిచేస్తోంది సాయీ. దయచేసి ఈ మహమ్మారిని తొందరగా తరిమేయండి. అసలు ఈ ప్రపంచంలోనే దాని ఉనికి లేకుండా చేసేయండి స్వామీ".
అన్యథా శరణం నాస్తి
త్వమేవ శరణం మమ!!!
బాబా కృప
సాయిబంధువులకి, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలు పంచుకుంటున్నాను. మాకు రెండేళ్ల వయస్సున్న బాబు ఉన్నాడు. జ్వరం అంటేనే భయపడుతున్న ప్రస్తుత కాలంలో బాబుకి ఒకసారి జ్వరం వచ్చి మూడురోజులైనా తగ్గలేదు. దాంతోపాటు పన్నునొప్పి కూడా ఉండేసరికి బాబు చాలా బాధను అనుభవించాడు. అప్పుడు నేను, "బాబా! మీ దయవల్ల బాబుకి జ్వరం తగ్గితే నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల బాబుకి జ్వరం తగ్గింది. అయితే బాబుకి జ్వరం తగ్గుతూనే మావారికి వచ్చింది. ఆయనకి కూడా మూడురోజుల వరకు జ్వరం తగ్గలేదు. అప్పుడు కూడా నేను, 'మావారికి జ్వరం తగ్గితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. తరువాత బాబా దయవల్ల మావారికి జ్వరం తగ్గింది. "థాంక్యూ వెరీ మచ్ బాబా".
మేము ఒకరోజు షాపింగుకి వెళ్లి షాపింగ్ పూర్తిచేసుకుని తిరిగి ట్రామ్‌లో వస్తున్నాము. హఠాత్తుగా మా ట్రామ్ కార్డులో ఉన్న అమౌంట్ అయిపోయింది. వెంటనే రీఛార్జ్ చేసే అవకాశం కూడా లేకపోవడంతో మాకు ఏం చేయాలో తెలియదు. సాధారణంగా అటువంటి పరిస్థితిల్లో టిక్కెట్ కలెక్టర్లు ఫైన్ వేస్తారు. కానీ టికెట్ కలెక్టర్ మాకు ఎంతగానో సహాయం చేశారు. బాబానే ఆ రూపంలో మాకు సహాయం చేశారని నేను అనుకున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteJaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth growth. Jai sairam
ReplyDeleteOm sai ram ❤❤❤
ReplyDelete🕉 sai Ram
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri
ReplyDeleteOM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🤗🌸😃🌼😀🌺🥰🌹💕
ReplyDelete