1. నమ్మకముంటే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవచ్చని నిరూపించిన బాబా
2. బాబా ప్రసాదించిన బాబు
3. ఇష్టాన్ని నెరవేర్చిన బాబా
నమ్మకముంటే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవచ్చని నిరూపించిన బాబా
సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. నా పేరు తులసి. మా కుటుంబమంతా ప్రతి చిన్న విషయానికి బాబా మీద ఆధారపడతాము. బాబాతో మాకు చాలా అనుభవాలున్నాయి. వాటిలోనుండి కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2 నెలల క్రితం మా తమ్ముడి ఆరోగ్యం కాస్త బాగాలేకుంటే ముందుగా మేము మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక డాక్టరుకి చూపించాము. అతను మూడు రోజులకు మందులు ఇచ్చారు. కానీ తమ్ముడికి తగ్గలేదు. అప్పుడు సాధారణంగా ఎప్పుడూ చూపించే డాక్టరు దగ్గరకి తమ్ముడిని తీసుకుని వెళ్ళాము. డాక్టరు మొత్తం స్కాన్ చేసి, "కిడ్నీలో పెద్ద స్టోన్స్ ఉన్నాయి" అని చెప్పారు. అది వింటూనే మాకు చాలా టెన్షన్‌గా అనిపించింది. ఎందుకంటే, మా తమ్ముడు చాలా అమాయకుడు. తనకొచ్చిన బాధను కూడా చెప్పుకోలేడు. అలాంటి తనకి ఈ పరిస్థితేమిటని చాలా బాధపడ్డాము. డాక్టరు కూడా "ఇంత స్టోన్స్ ఉంటే, చాలా నొప్పి ఉంటుంది. తను ఎలా ఓర్చుకున్నాడు?" అని అన్నారు. అంటే, మా తమ్ముడు కనీసం ఆ బాధను కూడా చెప్పుకోలేకపోయాడు. డాక్టరు "సరే, స్టోన్స్ అయితే పెద్ద పరిమాణంలోనే ఉన్నాయి. ముందు 20 రోజులకు టాబ్లెట్స్ వాడి చూద్దాం. బాగా నీళ్లు కూడా త్రాగించండి, ఈ మెడిసిన్స్ అయ్యాక వస్తే, మళ్ళీ చూద్దాం. అప్పుడు అవసరమైతే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది" అని చెప్పారు. మా తమ్ముడికి బాబా అంటే చాలా ఇష్టం. తను ఎక్కువగా బాబా ఆరతులు వింటూ ఉంటాడు. అలాంటి తనకొచ్చిన కష్టానికి మేము, "బాబా! తన బాధను కూడా చెప్పుకోలేని తమ్ముడికి ఈ పరిస్థితి ఏంటి?" అని చాలా ఏడ్చాము. తరువాత హాస్పిటల్ నుంచి నేరుగా మేము బాబా గుడికి వెళ్లి, "బాబా! వాడి పరిస్థితి ఇలా ఉంది. స్కానింగ్‌కి కూడా తమ్ముడు మొదట సహకరించలేదు. అలాంటిది ఆపరేషన్ అంటున్నారు. మొత్తం మీరే చూసుకోవాలి బాబా" అని బాబాకు చెప్పుకుని ఇంటికి వచ్చి డాక్టర్ చెప్పినట్లు టాబ్లెట్స్ వాడటం మొదలుపెట్టాము. దానితోపాటు ఆ 20 రోజులూ తమ్ముడు తాగే నీళ్లల్లో బాబా ఊదీ కలిపి ఇచ్చాము. ఇరవైరోజుల తర్వాత మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్తూ, "బాబా! వాడు ఏమీ తెలియని మీ అమాయక భక్తుడు. తన బాధను కూడా చెప్పుకోవడం తెలియనివాడు. తన పరిస్థితి మీకే బాగా తెలుసు" అని చెప్పుకున్నాము. డాక్టరు స్కానింగ్ కోసం వేరే చోటుకి పంపించారు. అక్కడ స్కాన్ చేసినవాళ్ళు, "ఇతనికి ఆపరేషన్ చేయించారా? లోపల చాలా క్లియర్‌గా ఉంది" అని అడిగారు. తరువాత స్కాన్ రిపోర్టు చూసిన డాక్టరు కూడా ఆశ్చర్యపోతూ, "ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లోపలంతా చాలా క్లియర్‌గా ఉంది" అని ఫీజు కూడా వద్దని ఇంటికి పంపించారు. చూశారా! మన బాబా ఎంత అద్భుతం చేశారో? మేమందరమూ చాలా సంతోషించాము. ఈ అనుభవం ద్వారా తమపై నమ్మకముంటే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవచ్చని బాబా నిరూపించారు. "థాంక్యూ సో మచ్ బాబా".
మరో అనుభవం: మా పెదనాన్నగారు 1987 నుంచి హైదరాబాదులో ఒక ప్రముఖ సాయిబాబా గుడిలో పనిచేస్తున్నారు. అంటే, ఆయనకి బాబాతో దాదాపు 34 ఏళ్ల అనుబంధం. ఆయన తన జీవితంలో ఎన్నో అద్భుతాలు చూశారు. గత సంవత్సరం 2020, జూన్ నెలలో కరోనా కేసులు ఎంతలా ఉన్నాయో మనందరికీ తెలుసు. పూర్తి లాక్‌డౌన్ నడుస్తున్న సమయమది. ఆ సమయంలో కూడా పెదనాన్న ప్రతిరోజూ గుడికి వెళ్లి బాబాకి నైవేద్యం పెట్టి, ఆరతిచ్చి వస్తుండేవారు. అలా పెదనాన్న రోజూ బండిమీద వెళ్లి, వస్తుంటే ఏరోజూ పోలీసులు ఆయనని అడ్డగించలేదు. ఇలా ఉండగా ఒకరోజు పెదనాన్న ఇంటికి వస్తూనే, "బాగా చలిగా ఉంద"ని పడుకున్నారు. సాయంత్రం కొంచెం టెంపరేచర్ కూడా వచ్చింది. ఆ సమయంలో గుడిలో డాక్టర్స్ ఫ్రీ సర్వీస్ చేస్తుండేవాళ్ళు. వాళ్ళకి ఫోన్ చేస్తే, పెదనాన్నను ముందు వెళ్లి వేరుగా ఒక గదిలో ఉండమని చెప్పారు. అప్పుడున్న ఘోరమైన పరిస్థితుల దృష్ట్యా మాకు చాలా భయం వేసింది. పెదనాన్న ఇల్లు, గుడి తప్ప వేరెక్కడికీ వెళ్లేవారుకాదు. ఆ సమయంలో గుడి లోపలకి భక్తులకు ప్రవేశం కూడా లేదు. కాబట్టి రోజూ బాబా అలంకరణకోసం వచ్చే పూలు, పూలదండల వల్ల ఏమైనా ఇబ్బంది కలిగి ఉండవచ్చు అనుకున్నాము. డాక్టరు ఐదురోజులకి టాబ్లెట్లు ఇచ్చి, "తగ్గకపోతే కోవిడ్ టెస్టు చేయిద్దామ"ని చెప్పి రోజూ ఫోన్ ద్వారా కాంటాక్ట్‌లో ఉండేవారు. మేమంతా చాలా టెన్షన్ పడి, "బాబా! మీ భక్తులెవరూ గుడికి రాకపోయినా, రోజూ వస్తూ మీకు అలంకరణ చేసి, నైవేద్యం పెట్టి, ఆరతి ఇచ్చే పెదనాన్న ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. మీరే ఆయనను కాపాడుకోవాలి తండ్రీ" అని బాబాను ప్రాధేయపడుతూ రోజూ స్తవనమంజరి పారాయణ చేశాము. ఆ ఐదురోజులు పెదనాన్నకి ఊదీనీళ్లు ఇచ్చాము. అయిదు రోజుల కోర్సు పూర్తయ్యాక డాక్టరు, "రేపు టెస్టుకి ఇచ్చి రండి" అని చెప్పారు. ఆ రోజంతా మేము చాలా టెన్షన్ పడ్డాం. కానీ, మరుసటిరోజు డాక్టరుగారు ఫోన్లో పెదనాన్నతో మాట్లాడి, "టెస్టు వద్దులేండి" అని చెప్పారు. అలా బాబా డాక్టరుగారి రూపంలో పెదనాన్నకి నయంచేసి, టెస్టుతో కూడా పనిలేకుండా చేశారు. ఆ కష్టసమయంలో పెదనాన్నతోపాటు ఇంట్లో ఏడుగురు ఉన్నారు. వాళ్లలో ఎవరికీ ఏ ఇబ్బందీ లేకుండా అందరినీ రక్షించారు బాబా. ముఖ్యంగా బాబా ఊదీ దివ్య ఔషధంలా పనిచేసింది. "ధన్యవాదాలు బాబా. పెదనాన్నవాళ్ళ అమ్మాయి పెళ్లి కుదిరింది. చక్కగా పెళ్లి జరిగి, వాళ్ళ జీవితాలు బాగుండేలా ఆశీర్వదించండి సాయీ".
బాబా ప్రసాదించిన బాబు
నేను సాయిభక్తురాలిని. మాది అనంతపురం. నాకు 2010లో పెళ్ళైంది. కొంతకాలానికి మాకు ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. చిన్నపాపకు నాలుగు నెలలు ఉన్నప్పుడు నేను మరోసారి గర్భం దాల్చాను. అసలే పాపకు పాలు చాలక కష్టపడుతున్న తరుణంలో మళ్లీ గర్భవతినైనందువల్ల పిల్లల్ని చూసుకోవడం కష్టమైపోతుందని అబార్షన్ చేయించుకున్నాను. తరువాత మూడు సంవత్సరాలకి మళ్లీ గర్భవతినయ్యాను. మేము బాబుకోసం ఆశపడ్డాం కానీ కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిసి అబార్షన్ చేయించుకోవడానికని వెళ్ళాను. కానీ, హాస్పిటల్లో పనిచేసే మావారి ఫ్రెండ్ ఒకతను టాబ్లెట్లు ఇచ్చి, "రెండురోజులు వాడండి. అబార్షన్ అవుతుంద"ని చెప్పాడు. అయితే రెండురోజుల తరువాత చాలా ప్రాబ్లమ్ అయింది. ఇంట్లోనే అబార్షన్ అవుతుందనుకుంటే, నొప్పి తట్టుకోవడం నావల్ల కాలేదు. అప్పుడు రాత్రి 10 గంటలవుతుంది. హాస్పిటల్‌కి వెళదామని వెళ్తే, ఏ హాస్పిటల్లోనూ నన్ను అడ్మిట్ చేసుకోలేదు. నర్సులు నొప్పి లేకుండా ఉండటానికి ఒక ఇంజక్షన్ వేసి, ఉదయం రమ్మన్నారు. మేము మావారి సిస్టర్ వాళ్ళింటికి వెళ్ళాము. రాత్రి 12 నుంచి మళ్ళీ నొప్పులు మొదలై నేను అస్సలు భరించలేకపోయాను. అబార్షన్ అయి కడుపులోని బిడ్డ బయటకి వచ్చింది కానీ, మాయ రాలేదు. ఇక నేను చనిపోతానని అనుకున్నాను. అప్పటికి నేను బాబా గుడికి వెళ్లేదాన్నిగానీ, బాబాపట్ల అంత భక్తిలేదు. మా వదిన మాత్రం బాబాకు మంచి భక్తురాలు. ఆమె కొద్దిగా బాబా ఊదీని నీళ్లలో కలిపి నాకు ఇచ్చింది. అది తీసుకున్నాక నాకు కొంచెం బాగా అనిపించింది. కానీ, పూర్తిగా నయంకాక 3 గంటలకి గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళాము. అక్కడ నైట్ డ్యూటీలో ఉన్న ఒక ప్రెగ్నెంట్ నర్సు వల్ల నేను బ్రతికాను. బాబా ఊదీ, ఇంకా ఆ నర్సు రూపంలో బాబానే నన్ను కాపాడారని మా వదిన చెప్పింది. అప్పటినుండి నేను బాబాను పూర్తిగా నమ్మడం మొదలుపెట్టాను.
కొంతకాలానికి నేను మరోసారి గర్భవతినయ్యాను కానీ 2 నెలల్లోనే అబార్షన్ అయింది. అయినా నేను బాబాను ఏమీ అడగలేదు. 3 సంవత్సరాలకి నేను మళ్ళీ గర్భవతినయ్యాను. అప్పుడు నేను, "బాబా! ఈసారైనా గర్భం నిలిచేలా చూసి, నాకు ఒక మగబిడ్డని ప్రసాదించండి" అని బాబాను చాలా వేడుకున్నాను. కానీ 4వ నెలలో మళ్ళీ అబార్షన్ అయింది. అప్పుడు నేను బాబా ముందు చాలా ఏడిచాను. బాబా మా FB (ఫేస్బుక్) గ్రూపులో సాయి వచనాల రూపంలో నాకు సమాధానమిస్తూ, "ఓర్పు వహించమ"ని చెప్తుండేవారు. ఒక సంవత్సరానికి నేను మళ్ళీ గర్భవతినయ్యాను. అప్పుడు నేను, "బాబా! మీ దయవలన మళ్ళీ గర్భవతినయ్యాను. ఇక నువ్వే నన్ను చూసుకోవాలి. నాకు బాబు కావాలి. నాకు ఈసారి అబార్షన్ కాకుండా మీరే చూడాలి. లేకుంటే ఆ బాధ భరించకుండా నన్నే నీ సన్నిధికి చేర్చుకో" అని కన్నీళ్లతో బాబాను వేడుకున్నాను. అప్పటికి నేను 8 సంవత్సరాలుగా బాబాను నమ్ముకుని ఉన్నాను. కొంచెం కొంచెంగా బాబాపై భక్తి పెరుగుతూ వచ్చింది. రెండుసార్లు బాబా చరిత్ర పారాయణ కూడా చేశాను. గర్భవతినని తెలిశాక మూడోసారి పారాయణ మొదలుపెట్టాను. పారాయణ పూర్తయ్యాక 5వ నెలలో డాక్టరుకి చూపించుకుంటే, 'బాబు' అని చెప్పారు. ఆరోజు గురువారం. నాకు చాలా చాలా సంతోషంగా అనిపించి, "బాబా! ఏ సమస్య లేకుండా కాన్పు కూడా మీరే చూసుకోవాలి" అని బాబాను వేడుకున్నాను. తరువాత 11 గురువారాలు ధునిలో కొబ్బరికాయలు వేశాను. బాబా చరిత్ర కూడా మరోసారి పారాయణ చేశాను. నేను, "నా చెంతనే ఉండి నాకు కాన్పు చేయమ"ని బాబాను వేడుకున్నట్లే బాబా నన్ను అనుగ్రహించారు. వారి ఆశీస్సులతో నాకు పండంటి బాబు పుట్టాడు. వాడికి సాయి నామం కలిసి వచ్చేలా పేరు పెట్టుకున్నాము. ఇప్పుడు బాబుకి రెండేళ్లు. బాబా దయవలన వాడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. నా తండ్రి, గురువు, సర్వస్వమూ అయిన బాబాకు సమర్పించనిదే నేను ఏమీ తినను. అలాగే నా బాబుని కూడా ఆయనకే సమర్పించుకున్నాను. వాడి బాగోగులన్నీ చూసుకోమని, నా సంతానాన్ని దీవించమని, నన్ను ఇంకా మంచి భక్తురాలిగా మార్చమని బాబాను వేడుకుంటున్నాను. బాబా ఇంకా చాలా అనుభవాలు నాకు ప్రసాదించారు. మరోసారి వాటిని పంచుకుంటాను.
ఇష్టాన్ని నెరవేర్చిన బాబా
ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయిబంధువులందరికీ మరియు 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు ప్రసాదరావు. నాకు 63 సంవత్సరాలు. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. నాకు కారు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. కానీ విపరీతమైన భయం. ఆ భయం వలన నేను రెండు కార్లు కొని అమ్మేశాను. చివరికి నేను బాబాని ఒకటే విన్నవించుకున్నాను, "నేను ఏ విధమైన భయం లేకుండా కారు డ్రైవింగ్ చేసేటట్లు మీరు అనుగ్రహిస్తే నేను కారు కొనుక్కుంటాన"ని. బాబా దయవల్ల నేను ఇప్పుడు కారు కొనుక్కుని ఆనందంగా డ్రైవ్ చేస్తున్నాను. ఇది నిజంగా బాబా నాకిచ్చిన గొప్ప అనుభవం. నాకు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి తీరిన వెంటనే మరలా బ్లాగులో పంచుకుంటాను.
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sai ram today experiences are very nice�� om sai ram ❤❤❤
ReplyDeleteOm sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha
ReplyDeleteOm sairam
ReplyDeleteOM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🤗🌸😃🌼😀🌺🥰🌹💕
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
🕉 sai Ram
ReplyDelete