1. బాబా అందించిన సహాయం
2. కరోనా నెగిటివ్ వచ్చేలా అనుగ్రహించిన బాబా
3. తలచుకుంటే ప్రక్కన ఉండి రక్షిస్తారు సాయి
బాబా అందించిన సహాయం
సాయిభక్తులకు నమస్కారం. నా పేరు చిరంజీవి కుమార్. మాది నర్సీపట్నం. నా చిన్నతనంనుండి, అంటే 5వ తరగతి చదువుతున్నప్పటినుండి నేను బాబాను పూజిస్తున్నాను, ధ్యానిస్తున్నాను. నేను ఆయనను హృదయపూర్వకంగా నమ్ముతాను. బాబా లీలలు చాలా అద్భుతమైనవి. నా జీవితంలో బాబా ప్రసాదించిన అనుభవాలను ఇప్పుడు మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. 2020వ సంవత్సరం అక్టోబరు నెలలో మా రెండు సంవత్సరాల బాబుకి ఫిట్స్ వచ్చాయి. ఆ సమయంలో నేను ఉద్యోగ నిమిత్తం అస్సాంలో ఉన్నాను. హఠాత్తుగా బాబుకి అలా జరిగేసరికి ఇంట్లో ఉన్న నా భార్య, అత్తగారు చాలా భయపడిపోయారు. వెంటనే బాబుని హాస్పిటల్‍కి తీసుకుని వెళితే, డాక్టర్ తనను పరీక్షించి కొన్ని మందులు ఇచ్చారు. వాటితో బాబుకి నయమైంది. తరువాత నేను నవంబరు నెలలో ఇంటికి వచ్చాను. గతంలో నా భార్యకు డెలివరీ సక్రమంగా జరిగితే బాబాకు పట్టుబట్టలు, స్వీట్లు సమర్పించుకుంటానని మ్రొక్కుకున్న మా అత్తగారు ఆ మ్రొక్కు తీర్చుకుని రమ్మని చెప్పడంతో ఒకరోజు ఉదయం 6 గంటలకు నేను, నా భార్య, మా బాబు బాబా గుడికి వెళ్ళాము. కరోనా కారణంగా పంతులుగారు మమ్మల్ని కొంతసేపు కూర్చోమని చెప్పారు. మా అబ్బాయి ఆడుకుంటూ ఆడుకుంటూ మళ్ళీ ఫిట్స్ వచ్చి ఒక్కసారిగా వెనక్కి పడిపోయి కొట్టుకోసాగాడు. మాకు చాలా భయం వేసింది. నేను కంగారుగా టాబ్లెట్ కోసం ఇంటికి పరుగుతీశాను. స్వామిమాల వేసుకుని ధ్యానం చేసుకుంటున్న ఒక భక్తుడిని నా భార్య పిలిచి, "మీ వద్ద బైక్ ఉన్నట్లయితే, కాస్త మమ్మల్ని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళండి" అని సహాయం అడిగింది. ఆ స్వామి నా భార్యని, బాబుని హాస్పిటల్లో దించి నాకోసం మా ఇంటికి వచ్చారు. నేను టాబ్లెట్స్ తీసుకుని ఇంట్లోనుండి బయటకు వచ్చేసరికి ఆయన వెయిట్ చేస్తూ కనిపించారు. మా అడ్రస్ కూడా తెలియని ఆయన మా ఇంటికి ఎలా వచ్చారో నాకు అర్థం కాలేదు. కానీ కంగారులో నేను అతన్ని ఏమీ అడగలేదు. ఆయన నన్ను హాస్పిటల్లో దించి వెళ్ళిపోయారు. నేను నిత్యం ధ్యానించే బాబానే ఆ రూపంలో నాకు సహాయం చేశారనిపించింది. నేను ఆరోజు కంగారులో ఆ స్వామికి కృతజ్ఞతలు తెలపడం మర్చిపోయాను. ఈరోజు ఈ బ్లాగు ద్వారా ఆయనకు నేను, నా కుటుంబం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.
ఈ సంవత్సరం(2021) జులై నెలలో నాకు ఒంట్లో బాగాలేక హాస్పిటల్‍కి వెళితే డాక్టర్ చాలా టెస్టులు వ్రాశారు. టెస్ట్ రిపోర్టులు ఎలా వస్తాయోననని కంగారుపడ్డాను. చాలా భయమేసి బాధతో ఒంటరిగా ఏడ్చాను. కానీ మనస్ఫూర్తిగా బాబాను నమ్మాను. నా నమ్మకం వృధాకాలేదు. బాబా దయామయుడు, నన్ను రక్షించారు. రిపోర్టులన్నీ నెగిటివ్ అని వచ్చాయి. అప్పుడు చాలా మనశ్శాంతిగా అనిపించి మనస్సులోనే బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. "బాబా! నేను ఎల్లప్పుడూ మీ బిడ్డగానే ఉండాలి".
కరోనా నెగిటివ్ వచ్చేలా అనుగ్రహించిన బాబా
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య. మేము యు.ఎస్.ఏలో నివాసముంటున్నాము. బాబా అంటే నాకు చాలా ఇష్టం. చిన్నతనంనుండి నేను బాబాను నా స్నేహితునిలా చూశాను. ఆయన నా బెస్ట్ ఫ్రెండ్. ఆయన నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. ఈమధ్యకాలంలో జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. మాకు ఇద్దరు పిల్లలు. ఇటీవల ఒకరోజు మా బాబు చదివే స్కూలువాళ్ళు ఫోన్ చేసి, "మీ బాబు క్లాసులోని ఒక పాపకి కరోనా వచ్చింది. ఆ పాపకి దగ్గరగా మీ బాబు కూర్చుంటాడు. కాబట్టి, మీ బాబుని 14 రోజులు క్వారంటైన్‍లో ఉంచండి" అని చెప్పారు. అది విని మాకెంతో భయమేసి, "బాబా! మీ దయవలన మా బాబుకి ఏమీ కాకూడదు" అని బాబాను ప్రార్థించి, సచ్చరిత్ర వారంరోజులు పారాయణ చేశాను. బాబుకి ఎటువంటి లక్షణాలు లేకపోయినప్పటికీ రోజూ చాలా చాలా టెన్షన్ పడుతూ బయటకి కూడా వెళ్లకుండా బాబాను ఎంతగానో ప్రార్థిస్తూ ఉండేవాళ్ళం. "బాబుకి కరోనా నెగిటివ్ వస్తే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకుని టెస్ట్ చేయిస్తే, బాబా దయవలన నెగిటివ్ వచ్చింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మమ్మల్ని ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూడు బాబా. నువ్వే మాకు దిక్కు. మా పిల్లల్ని, నా భర్తని, నన్ను చల్లగా చూడండి బాబా. అందరిపై మీ ఆశీస్సులు సదా ఉండనీయండి. నాకున్న మరో కోరిక మీకు తెలుసు. దాన్ని కూడా త్వరగా నెరవేర్చండి బాబా. ఎప్పుడూ నీ నామస్మరణతో సంతోషంగా ఉండేలా చూడు తండ్రీ. చివరిగా, ఈ అనుభవాన్ని ఆలస్యంగా పంచుకున్నందుకు క్షమించండి బాబా".
శ్రీ సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నమస్కారాలు. నా పేరు మిరియాల వెంకటేశ్వర్రావు. మాది హైదరాబాద్. శ్రీసాయి ప్రసాదించిన అనుభవాలు సాయిబంధువులతో పంచుకుంటున్నాను. సాయిని తలచుకుంటే మన ప్రక్కన ఉండి రక్షిస్తారని నా నమ్మకం. 2021, సెప్టెంబరు 13న నాకు హెర్నియా ఆపరేషన్ జరిగింది. చిన్న ఆపరేషన్ అనుకున్నది మేజర్ ఆపరేషన్ అయ్యేసరికి నేను చాలా భయపడి, 'శ్రీసాయి అరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని జపించసాగాను. శ్రీసాయినాథుని దయవల్ల ఆపరేషన్ బాగా జరిగి రెండవరోజు ఇంటికి వచ్చాను. తరువాత ఒకరోజు రాత్రి తలలో ఓ చోట పోటులా వచ్చింది. నేను చాలా భయపడి శ్రీసాయి ఊదీ తీసుకుని పోటు ఉన్నచోట రాసి, "రేపు ప్రొద్దునకల్లా తగ్గిపోతే శ్రీసాయి నామం 108 సార్లు వ్రాస్తాన"ని అనుకుని, 'శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' మంత్రాన్ని జపిస్తూ నిద్రపోయాను. శ్రీసాయి దయవల్ల పోటు తగ్గిపోయింది. అనుకున్న ప్రకారం 108 సార్లు సాయి నామాన్ని వ్రాసి సాయికి సమర్పించాను. "ధన్యవాదాలు బాబా".
Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness. Jaisairam
ReplyDeleteOm sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha
ReplyDeleteOM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram
ReplyDelete🕉 sai Ram
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete