సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

లక్ష్మణ్ గోవింద్ ముంగే



సాయిభక్తుడు లక్ష్మణ్ గోవింద్ ముంగే మహారాష్ట్రలోని నాసిక్‌ నివాసి. 1890కి ముందు ఇతను సాయిభక్తుడైన చిదంబర్ కేశవ్ గాడ్గిల్ అనే సీనియర్ మామల్తదారు వద్ద గుమస్తాగా పనిచేస్తుండేవాడు. అప్పుడొకసారి గాడ్గిల్, నానాసాహెబ్ నిమోన్కర్‌లు శిరిడీ వెళ్తుంటే, ముంగే కూడా వాళ్లతోపాటు మొదటిసారి శిరిడీ వెళ్ళాడు. వాళ్ళు ముగ్గురూ మసీదులో బాబా దర్శనం చేసుకొని అక్కడే కూర్చున్నారు. అప్పుడు ముంగే, 'ఫకీరైన బాబాను హిందువులు ఎలా పూజిస్తున్నారు?' అని ఆలోచిస్తుండగా బాబా గాడ్గిల్‌ను, "నా ఖర్జూరాలు, సాంబ్రాణికడ్డీలు, నా రూపాయి నాకివ్వు" అని అన్నారు. బాబా మాటలు ముంగే దృష్టిని ఆకర్షించాయి. కారణం, ముందురోజు రాత్రి నిద్రకుపక్రమించే ముందు గాడ్గిల్ బాబాకి సమర్పించేందుకుగాను కొన్ని ఖర్జూరాలు, ఒక రూపాయి, సాంబ్రాణికడ్డీల ప్యాకెట్టును ప్రత్యేకించి విడిగా పెట్టుకున్నాడు. బాబా ఆ మూడింటినే గాడ్గిల్‌ను అడిగి స్వీకరించారు. తరువాత నానాసాహెబ్ నిమోన్కర్ తనంతట తానే బాబాకి పదిరూపాయల నోటును దక్షిణగా ఇవ్వబోయాడు. బాబా ఆ పదిరూపాయలను తీసుకోవడానికి నిరాకరిస్తూ, "నేను ఫకీరును. నేను ఈ డబ్బు తీసుకోను" అని అన్నారు. తరువాత బాబా గాడ్గిల్ నుండి స్వీకరించిన ఆ రూపాయిని మసీదులో వెలిగించే దీపాలకు అవసరమైన నూనెను సరఫరా చేసే నూనెవర్తకునికి ఇచ్చి, సాంబ్రాణికడ్డీలు వెలిగించి, ఖర్జూరాలను అక్కడున్న భక్తులందరికీ పంచిపెట్టారు. ఇదంతా చూశాక, బాబా సర్వజ్ఞులనీ, మహనీయులనీ, వారిని పూజించటం సరైనదేననీ ముంగే భావించాడు.

1890లో 26 ఏళ్ల వయసులో ముంగేకు వివాహం నిశ్చయమైంది. వివాహ సమయంలో పెళ్లికూతురుని అలంకరించేందుకు అతనికి నగలు అవసరమయ్యాయి. ఆ విషయంలో అతను రహతాలో ఉన్న తన మేనత్త భర్త సహాయం చేస్తాడని ఆశించి రహతా వెళ్ళాడు. అప్పుడు బాబా రహతాలోని మారుతీ ఆలయంలో ఉన్నారు. బాబాను అక్కడ చూసి వారి దర్శనానికి వెళ్ళాడు ముంగే. బాబా అతన్ని చూసి, "అబ్బాయీ, రా! నిన్న నీ గురించే ఆలోచిస్తున్నాను" అంటూ ఆహ్వానించి తమ కాళ్ళు వత్తమన్నారు. అతను అలాగే చేశాడు. అప్పుడు బాబా అతనికి ఒక మామిడిపండు ఇచ్చి తినమన్నారు. ముంగే ఆ మామిడిపండును తిన్నాడు. అది ఎంతో మధురంగా ఉంది. అప్పుడు బాబా, "నువ్వు దేనికోసం వచ్చావు?" అని అడిగారు. అందుకు ముంగే, "బాబా! నా వివాహం నిశ్చయమైంది. నా వద్ద నగలు లేవు. వాటిని అరువు తీసుకోవడానికి వచ్చాను" అని బదులిచ్చాడు. అప్పుడు బాబా అతనితో, "ఎవరికి ఎవరు? ఇచ్చేదెవరు? పుచ్చుకొనేదెవరు? అవసరానికి ఎవరూ సహాయం చేయరు. నీకు అవసరమైతే 1,000 రూపాయలుగానీ, 2,000 రూపాయలుగానీ నా దగ్గర నుండి తీసుకో!" అన్నారు. గోనెగుడ్డలు ధరించి, చేతిలో కేవలం ఒక రేకుడబ్బా పట్టుకొని ఉన్న బాబాను చూస్తూ, "ఈయన నాకు అవన్నీ ఎలా ఇస్తారు?" అని అనుకున్నాడు ముంగే. తరువాత అతను అక్కడినుండి తన మేనత్త ఇంటికి వెళ్లి, ఆమె భర్తతో తన అవసరాన్ని చెప్పాడు. అతని మామ ‘తన దగ్గర నగలేమీ లేవ’ని చెప్పాడు. దాంతో, ప్రస్తుతానికి వివాహం వాయిదా వేసుకోక తప్పదన్న బాధతో ముంగే వెనుదిరిగాడు. అదేసమయంలో అతని స్నేహితుడొకడు కలవగా అతనికి తన పరిస్థితిని వివరించాడు ముంగే. వెంటనే ఆ స్నేహితుడు ముంగేకి సహాయం చేయదలచి సిన్నేరుకు చెందిన ఒక గుజరాతీ షావుకారును అతనికి పరిచయం చేశాడు. ఆ షావుకారు ముంగేకి కాలిఅందెలు, ముక్కుపుడక అరువుగా ఇచ్చాడు. అంతేకాదు, 30 తులాల బంగారంతో ముంగేకి అవసరమైన నగలను ఒక్కరోజులో తయారుచేయించి నెలవారీ వడ్డీకి అప్పుగా ఇచ్చాడు. దాంతో ముంగే వివాహం వాయిదాపడకుండా సకాలంలో సక్రమంగా జరిగింది. ఆ విధంగా ముంగే స్నేహితుడు మరియు గుజరాతీ షావుకారుల ద్వారా అతనికి సహాయం అందేలా చేసి తమ మాటను నిలుపుకున్నారు బాబా. అప్పటినుండి ముంగే ప్రతి సంవత్సరం శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకొనేవాడు.

మొదట్లో ముంగే దంపతులకు కలిగిన సంతానంలో ఇద్దరు ఆడపిల్లలు మినహా మిగతా బిడ్డలందరూ అతి తక్కువ కాలంలోనే మరణించారు. 1912లో అతను బాబాను దర్శించి తన దురదృష్టానికి దుఃఖిస్తూ, "బాబా! నాకు దీర్ఘాయువు గల ఒక్క కుమారుడిని ప్రసాదించండి" అని ప్రార్థించాడు. బాబా అతనితో, "నువ్వు ఎందుకు ఒక్క పిల్లవాడినే కోరుకుంటావు? నీకు నేను ఇద్దరు కుమారులను  ప్రసాదిస్తాను" అని అన్నారు. బాబా ఆశీర్వదించినట్లుగానే ఆ తరువాత ముంగే దంపతులకు ఇద్దరు కుమారులు కలిగారు. ముంగే నిత్యమూ తన ఇంట్లో బాబా చిత్రపటాన్ని పూజిస్తుండేవాడు. బాబా అతని కోరికలన్నీ తీర్చారు. అందుకు ఈ క్రింది సంఘటనే నిదర్శనం.

ఒకసారి ముంగే ఇంట్లో ఒక వ్యక్తి, అతని కుమార్తె కొద్దిరోజులు అతిథులుగా ఉన్నారు. ఒకరోజు ఆ అమ్మాయికి తీవ్రంగా జబ్బుచేసి స్పృహ కోల్పోయింది. ఆమె బ్రతుకుతుందనే ఆశ ఎవరికీ లేకపోయింది. ఆ రాత్రి ముంగే బాబా ఫోటోను ఆమె తల దగ్గర పెట్టి, ఆమెకి ఊదీ పెట్టాడు. బాబా అనుగ్రహంతో మరుసటిరోజు ఉదయం ఆ అమ్మాయికి స్పృహ వచ్చింది. ఆమె తల్లి బాబాకు 10 రూపాయలు దక్షిణ సమర్పిస్తానని మ్రొక్కుకొని వాటిని బాబాకు సమర్పించింది.

సోర్స్: డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ సాయిబాబా బై బి.వి.నరసింహస్వామి.

4 comments:

  1. Very nice story.These stories we don't know.Reading here we know this stories. Very nice concept.devotees are lucky. Om sai ram ❤❤❤

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. Om sai ram baba bless us thandri sainatha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo