1. సొంతింటి కలను నెరవేర్చిన బాబా2. ప్రార్థించినంతనే జ్వరం తగ్గిపోవడం బాబా కృపే!
సొంతింటి కలను నెరవేర్చిన బాబా
అందరికీ నమస్తే. నా పేరు అంజలి. నా జీవితంలో బాబా నాకు ప్రసాదించిన ఒక ముఖ్యమైన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. మేము ఎప్పటినుండో ఒక ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నాము. కానీ 2021, ఆగస్టు వరకు బాబా మాకు ఇల్లు కొనుక్కునేందుకు అనుమతినివ్వలేదు. అయితే ఆగస్టులో ఒకరోజు మేము గుంటూరులో ఒక ఫ్లాట్ తీసుకోవాలి అనుకుని బాబా ముందు చీటీలు వేస్తే, 'తీసుకోమ'ని బాబా సమాధానం వచ్చింది. అంతే, ఆలస్యం చేయకుండా గుంటూరు వెళ్లి అపార్ట్‌మెంట్‌లో ట్రిపుల్ మరియు డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్ చూశాము. మొదట ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ తీసుకుందామనుకున్నప్పటికీ డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ నాకు బాగా నచ్చి బాబాని అడిగితే, 'తీసుకోమ'ని వచ్చింది. వెంటనే బిల్డర్‌తో మాట్లాడి అదేరోజు లక్షరూపాయలు అడ్వాన్స్ ఇచ్చాము. బిల్డర్, "బ్యాంకు లోన్‌కి సంబంధించి అంతా తానే చూసుకుంటాన"ని చెప్పాడు. సరేనని, అదేరోజు నేను ఇవ్వవలసిన డాకుమెంట్స్ అన్నీ బ్యాంకులో ఇచ్చాను. తరువాత మూడు రోజుల్లో బిల్డర్ అగ్రిమెంట్ కాపీ బ్యాంకులో ఇచ్చి, 'ఫుల్ అమౌంట్ లోన్ మాకు రావాలంటే 50,000 రూపాయలు అదనంగా ఇవ్వమ'ని అడిగాడు. అందుకు నేను ఒప్పుకున్నాను. బ్యాంకులో లోన్ ప్రక్రియ మొదలైన తరువాత దాదాపు 20 రోజులకి బ్యాంకు లోన్ శాంక్షన్ టీమ్ వాళ్ళు, "లోన్ మొత్తం ఒకేసారి రాదు. మొదట కొంత మొత్తం వస్తుంది. ఉడ్ వర్క్ చేయించిన తరవాత బ్యాలన్స్ అమౌంట్ వస్తుంద"ని చెప్పారు. నేను సరేనన్నాను.
కానీ, చేతిలో రూపాయి కూడా లేనందున ప్రావిడెంట్ ఫండ్ డబ్బులకోసం ప్రయత్నిద్దామని అనుకున్నాను. అందుకోసం ఆన్లైన్లో అప్లై చేస్తుంటే, 'బ్యాంకు IFSC కోడ్ తప్పుగా ఉంది, సరిచూసుకోమ'ని వచ్చింది. అది సరిచేద్దామని రిక్వెస్ట్ పెడుతుంటే, నా పేరు బ్యాంకు రికార్డ్సుకి మ్యాచ్ అవ్వడం లేదని రిజెక్ట్ చేసింది. నిజానికి ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ బ్యాంకు అకౌంటులో నా పేరు సరిగానే ఉంది. కానీ సమస్య వస్తోంది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు నల్గొండ బ్రాంచిలో కూడా SBI అకౌంట్ ఉంది. అందులో నా పేరు కొంచెం తేడాగా ఉంది. నిజానికి ఆ అకౌంటుకి, నా EPF అకౌంటుకి సంబంధం లేదు. అయినప్పటికీ దాన్ని సరిచేయిస్తే సమస్య పరిష్కారమవుతుందేమోనని నాకు అనిపించి బ్యాంకుకు వెళ్ళాను. బాబా దయవలన వాళ్లు వెంటనే నా ఆధార్ ఆధారంగా పేరు మార్చేశారు. ఇక నేను బాబాని తలచుకుని మూడోసారి IFSC కరెక్షన్‌కి ఆన్లైన్లో అప్లై చేశాను. బాబా దయవల్ల అది అప్రూవ్ అయింది. అది కేవలం బాబానే చేయించారు. ఆయనే నాకు ప్రేరణనిచ్చి అకౌంటులో పేరు మార్పించారు. తరువాత నేను ఆన్లైన్లో EPF క్లైమ్‌కి అప్లై చేస్తే రిజెక్ట్ అయింది. తరువాత 2021, సెప్టెంబర్ 23, గురువారంనాడు నేను బాబాకి పూజచేసి, "బాబా! మీరే నా EPF సమస్యని పరిష్కరించాల"ని బాబాను వేడుకుని మరోసారి అప్లై చేశాను. తరువాత EPF అమౌంట్ సెటిల్ అవుతుందా, లేదా అని బాబా ముందు చీటీలు వేశాను. 'అవుతుంద'ని బాబా సమాధానం ఇచ్చారు. బాబా చెప్పినట్లే శుక్రవారం ఉదయం EPF అమౌంట్ సెటిల్ అయినట్లు మెసేజ్ వచ్చింది. అలాగే మూడు పనిదినాల్లో అమౌంట్ క్రెడిట్ అవుతుందని వచ్చింది. నా అకౌంట్లో డబ్బులు పడిన తరువాత నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని అనుకున్నాను. బాబా కృప చూడండి! మూడు పనిదినాల్లో అమౌంట్ క్రెడిట్ అవుతుందని మెసేజ్ వచ్చినప్పటికీ బాబా దయవలన అదేరోజు సాయంత్రానికల్లా అమౌంట్ నా అకౌంట్లో క్రెడిట్ అయింది. నేను కావాలని పెట్టుకున్న మొత్తం అమౌంట్ వచ్చేలా అనుగ్రహించారు బాబా.
ఇకపోతే బ్యాంకువాళ్ళని, "లోన్ ప్రక్రియ పూర్తయిందా?" అని అడిగితే, "వెరిఫికేషన్ టీమ్ వాళ్ళు హైదరాబాద్ నుండి రావాలి. అందుకే ఆలస్యం అవుతుంద"ని చెప్పారు. సరేనని, నేను హైదరాబాద్ వాళ్లని కాంటాక్ట్ అయితే, వస్తామని చెప్తూ వాయిదా వేయసాగారు. దాంతో నేను, "బాబా! ఎలాగైనా నువ్వే ఆ ప్రక్రియను పూర్తిచేయించాలి" అని బాబాను శరణువేడాను. అసలు ఆ టీమ్ రాకుండానే వెరిఫికేషన్ పూర్తి చేయించారు బాబా. మరుసటిరోజు మావారు గుంటూరు బ్యాంకుకి వెళ్తే లోన్ శాంక్షన్ టీమ్ మేడమ్, "లోన్ ప్రక్రియలో ఇంకా కొన్ని సమస్యలున్నాయి. అగ్రిమెంట్ ల్యాప్స్ అయ్యింది. అగ్రిమెంట్ మార్చాలి" అని చెప్పారు. బిల్డర్‌ని అడిగితే, "అది బ్యాంకువాళ్ళ సమస్య. నాకేంటి సంబంధం?" అని మాట్లాడాడు. ఇంక నేను బాబా ముందు నిల్చొని, "బాబా! నువ్వు తీసుకోమంటేనే ఫ్లాట్‌కి అడ్వాన్స్ ఇచ్చాను. ఇప్పుడు బ్యాంకువాళ్ళు అగ్రిమెంట్ ల్యాప్స్ అయిందంటున్నారు. ఎలాగైనా ఆ సమస్యలన్నీ నువ్వే పరిష్కరించాలి" అని కన్నీళ్ళతో బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఆ రాత్రికే బిల్డర్ అగ్రిమెంట్ మార్చి ఇచ్చాడు.
తరువాత బాబా దయవలన నేను అక్టోబరు 3 నుండి 8 వరకు సెలవు తీసుకుని గుంటూరు వెళ్లేముందు బాబా గుడికి వెళ్లి, "బాబా! మీరు ఎలాగైనా బ్యాంకు పని పూర్తిచేయించి అక్టోబరు 7, గురువారం ఇంటి రిజిస్ట్రేషన్ అయిపోయేలా అనుగ్రహించండి. అలాగే, మేమంతా క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చేలా చూడండి" అని బాబాను వేడుకుని బయలుదేరాము. గుంటూరు చేరుకున్న తరువాత ఒకరింట్లో ఉండేలా బాబా మాకు ఏర్పాటు చేశారు. లేదంటే మేము రోజూ వేటపాలెం నుండి గుంటూరు తిరగడానికి చాలా ఇబ్బందిపడేవాళ్ళము. అక్టోబరు 4, సోమవారం సాయంత్రానికి బిల్డర్(vendor) kyc ok అయింది. మంగళవారం లోన్ శాంక్షన్‌కి పెట్టి, ఆరోజు సాయంత్రానికి డి.డి ఇష్యూ చేస్తామని బ్యాంకువాళ్ళు చెప్పారు. అయితే ఆరోజు సాయంత్రం నా పేరు మీద లోన్ అకౌంట్ ఓపెన్ చేసి, బుధవారం ఉదయం డి.డి. ఇచ్చారు. మేము మంగళవారం సాయంత్రమే రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్ సిద్ధం చేయించి, చలానా కూడా కట్టేశాము. (బాబా కృపవలన బుధవారం సాయంత్రం మా పాపకి ఒక బంగారు నెక్లెస్ తీసుకున్నాము.) బాబా నేను కోరుకున్నట్లే గురువారం ఏ ఆటంకం లేకుండా ఇంటి రిజిస్ట్రేషన్ పూర్తిచేయించారు. మొదట్లో నేను, "ఇంటి లోన్ ప్రక్రియ ఆలస్యం ఎందుకవుతుంద"ని బాబాను అడిగినప్పుడు "ఆలస్యం వెనుక అద్భుతం జరుగుతుంది" అని సందేశం ఇచ్చారు. నిజమే, అద్భుతం జరిగింది! ఎంతవరకు లోన్ శాంక్షన్ అవ్వాలో అంత చేయించి, అదనంగా 50,000 రూపాయలు బిల్డర్‌కి కట్టకుండా మమ్మల్ని కాపాడారు బాబా.
శుక్రవారం ఉదయం నా భర్తకి బాగా తలనొప్పి వస్తే, కొద్దిగా బాబా ఊదీ ఆయన నోట్లో వేసి, "తలనొప్పి తగ్గించమ"ని బాబాను వేడుకున్నాను. కాసేపటికి ఆయన నార్మల్ అయ్యారు. తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీసుకని బయలుదేరాము. అప్పుడు మా పాప, "నిన్న సాయంత్రం టాయిలెట్‌కి వెళ్ళినప్పుడు టాయిలెట్‌లో బ్లడ్ పడింద"ని చెప్పింది. నాకు భయమేసి బాబాకి దణ్ణం పెట్టుకుని, బాబా ఊదీ పాప నోట్లో వేసి, "రేపు తెల్లవారి పాపకి నార్మల్‌గా టాయిలెట్ అయ్యేలా చూడు బాబా" అని వేడుకున్నాను. నా తండ్రి దయామయుడు. బిడ్డలమైన మనం బాధపడితే ఆయన తట్టుకోలేరు. మరుసటిరోజు పాప నార్మల్‌గా టాయిలెట్‌కి వెళ్ళింది. ఇంకో విషయం, మళ్ళీ మళ్ళీ తిరగకుండా శుక్రవారమే బ్యాంకు మోడ్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుని క్షేమంగా మా ఇంటికి చేరుకున్నాము. అంతా బాబా దయ. ఆయన ఆజ్ఞ ఉంటే అన్నీ అలా జరిగిపోతాయి. "బాబా! మీ ప్రేమకు వేలవేల ధన్యవాదాలు. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న నా సొంతింటి కలను నెరవేర్చారు. ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం బాబా, మీ పాదసేవ చేయడం తప్ప?" ఇంకా కొన్ని అనుభవాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
ప్రార్థించినంతనే జ్వరం తగ్గిపోవడం బాబా కృపే!
2021, అక్టోబరు 2 నుండి మా తమ్ముడు నాలుగు, ఐదు రోజులపాటు విపరీతమైన జ్వరం, వణుకు, ఒళ్లునొప్పులతో బాధపడ్డాడు. టాబ్లెట్లు వేసుకున్నా తగ్గలేదు. టెస్టు చేయించుకోమంటే, తను ఒప్పుకోలేదు. చివరికెలాగో ఒప్పుకున్నాడు. అప్పుడు నేను, "బాబా! టెస్ట్ రిపోర్టు నార్మల్ ఫీవర్ అని రావాలి. ఎందుకంటే, ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడ చూసినా టైఫాయిడ్, డెంగ్యూ జ్వరాలే ఉన్నాయి. మా తమ్ముడి గురించి మీకు తెలియనిది ఏముంది? వాడు మొండిఘటం. ఎవరు చెప్పినా వినడు, తనకి నచ్చిందే చేస్తాడు. ఇప్పటివరకూ వాడు వ్యాక్సిన్ కూడా వేయించుకోలేదు. అమ్మ ఏమో నా పిల్లల్ని చూసుకుంటూ నా దగ్గరే ఉంటున్నందున వాడొక్కడే అక్కడ మా ఇంట్లో ఉంటున్నాడు. అటువంటి తనకి ఏదైనా ప్రమాదకరమైన జ్వరం వస్తే మా పరిస్థితి ఏమిటి? వాడు టైమ్‌కి తినడు, మందులు వేసుకోడు, హాస్పిటల్ అంటే దండగ ఖర్చులు అంటాడు. అలాంటివాడిని అక్కడ ఎవరు చూసుకుంటారు? కాబట్టి రిపోర్టు నార్మల్ వచ్చేలా చేయండి బాబా. అలా అయితే నా అనుభవాన్ని బ్లాగ్ ద్వారా తోటి భక్తులందరితో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. ఆయన దయవల్ల రిపోర్టు నార్మల్ ఫీవర్ అని వచ్చింది. జ్వరం కూడా తగ్గిపోయింది. నిజంగా ఇది బాబా చేసిన అద్భుతం. 4, 5 రోజులపాటు తను పడ్డ బాధను చూస్తే, అది నార్మల్ జ్వరం కానేకాదు అనిపిస్తుంది. అలాంటిది బాబాను ప్రార్థించినంతనే నార్మల్ జ్వరం అని రావడం, హఠాత్తుగా జ్వరం తగ్గిపోవడం జరిగాయి. "బాబా! మీ ప్రేమ ఎల్లప్పుడూ మామీద ఇలాగే ఉండాలి. దయచేసి మా కుటుంబం అనుభవిస్తున్న మేజర్ సమస్యల నుంచి మమ్మల్ని బయటపడేయండి బాబా. నేను సమస్యల సుడిగుండంలో చిక్కుకుని ఉన్నాను బాబా. బహుశా ఒకే మనిషికి తన జీవితంలో ఎవరికీ ఇంతలా ఇన్ని సమస్యలు ఉండకపోవచ్చు. ప్రతిదీ నాదే, అందరూ నావాళ్లే అనుకుని వాళ్ళ సమస్యలను కూడా నా సమస్యలే అనుకోవడం వల్ల నేను మనశ్శాంతితో ఉండలేకపోతున్నాను. దయచేసి నాపై దయచూపండి బాబా".
Om sai ram today is Acupious day. Shiva aradhana this month is very acupious. Baba is Shiva, Narayana all God's are baba only ������❤❤❤
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha
ReplyDeleteJaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness. Jaisairam
ReplyDeleteOM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete