సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 962వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:

1. అపారమైన బాబా ప్రేమ
2. విపరీతమైన కడుపునొప్పిని తగ్గించిన బాబా
3. కరోనా, దాని సైడ్ ఎఫెక్ట్స్ నుండి కాపాడిన బాబా

అపారమైన బాబా ప్రేమ


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. నా పేరు సంధ్య. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును నిర్వహిస్తున్న సాయికి మరియు సాయిబంధువులకు నా నమస్కారాలు. శ్రీ సాయినాథుని దివ్యపాదాలకు శిరసు వంచి నమస్కరిస్తూ నా అనుభవాలను పంచుకుంటున్నాను. దసరా పండుగ సందర్భంగా, హాస్టల్లో ఉండి చదువుకుంటున్న మా అమ్మాయిని ఇంటికి తీసుకుని వచ్చాము. అప్పటికే కొద్దిగా జలుబుతో ఉన్న తనకి దసరారోజు బాగా దగ్గు వచ్చింది. తగ్గిపోతుందిలే అనుకున్నాం, కానీ రెండురోజులైనా ఆ దగ్గు అలాగే ఉంది. ఆదివారం తను తిరిగి హాస్టల్‌కి వెళ్ళాల్సి ఉండగా దగ్గుతో బాధపడుతున్న తనని హాస్టల్‌కి ఎలా పంపాలన్న భయంతో, "సాయీ! ఈరోజు నుండి పాపకి దగ్గు తగ్గిపోయి తను హాస్టల్‌కి వెళ్ళాలి. దయచూపండి బాబా. అపారమైన మీ ప్రేమను 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ ద్వారా సాయిబంధువులతో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించి, ఊదీతీర్థాన్ని పాపకి త్రాగమని ఇచ్చాను. బాబా దయచూపారు. మరుసటిరోజు తెల్లవారేసరికి 90% దగ్గు తగ్గిపోగా పాపని సంతోషంగా హాస్టల్‌కి పంపాము. మరుసటిరోజు పాప ఫోన్ చేసి, "దగ్గు పూర్తిగా తగ్గిపోయింద"ని చెప్పింది. "మీ ప్రేమకు ధన్యవాదాలు సాయితండ్రీ. సాయీ! హాస్టల్లో పాపకి తోడుగా ఉండి చక్కగా చదివించి మంచి మార్కులతో ఉత్తీర్ణురాలు అయ్యేలా, ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించి ఫ్రీ సీటు సంపాదించేలా, మంచి కాలేజీలో సి.ఎస్.ఈ. కోర్సు చదివేలా అనుగ్రహించండి. తను స్తవనమంజరి చదువుతోంది. మీ కృప ఉంటేనే అది సాధ్యం బాబా. స్తవనమంజరి చదివే శ్రద్ధను తనకు కలిగించినందుకు మీకు వేలవేల కృతజ్ఞతలు తండ్రీ".


మా అబ్బాయి దసరా సెలవుల్లో తన స్నేహితులతో కలిసి గోవా టూర్ వెళతానని వాళ్ళ నాన్నగారిని అడిగాడు. అందుకాయన, "సరే, వెళ్ళు" అని చెప్పారు. కానీ ఒక తల్లిగా నేను వాడికి ఈతరాదనే భయంతో ఆందోళన చెంది, "బాబా! బాబు స్నేహితులతో గోవా వెళ్తానంటున్నాడు. అక్కడ ఎలా ఉంటుందో, ఏమిటో నాకు తెలియదు. వాడు మీ బిడ్డ. వాడికి తోడుగా ఉండి గోవా తీసుకెళ్ళి క్షేమంగా ఇంటికి తీసుకుని రండి. మీదే భారం తండ్రీ. వాడు క్షేమంగా తిరిగి వస్తే, మీ అపారమైన ప్రేమని సాయిబంధువులతో పంచుకుంటాను సాయీ" అని ప్రార్థించాను. అలా వాడి భారమంతా బాబా మీద వేసి, గోవాలో ఎలాంటి దురలవాట్లకి పోకుండా బాబుకి తోడుగా ఉండి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యతను బాబాకు అప్పగించి 'బాబా ఉన్నారు, ఆయన చూసుకుంటార'ని ప్రశాంతంగా ఉండసాగాను. బాబా దయవలన వాళ్ళ ప్రయాణం చక్కగా జరిగింది. బాబు అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు పంపించి ఐదురోజుల తర్వాత క్షేమంగా ఇంటికి చేరాడు. "ధన్యవాదాలు సాయితండ్రీ. నా పిల్లల బాధ్యత మీదే బాబా. వారి చేయి పట్టుకుని నడిపించండి గురుదేవా సాయినాథా. మీ అపారమైన ప్రేమలో నా పిల్లలు తడిసి ముద్దయ్యేలా అనుగ్రహించండి బాబా. మీ పాదాలే శరణం సాయీ".


మేము చాలారోజుల నుండి శ్రీశైల క్షేత్ర దర్శనం చేసుకోవాలని అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఎంతకీ వీలయ్యేదికాదు. మా మనసు తెలుసుకున్న బాబా మమ్మల్ని శ్రీశైలం దర్శించుకునేలా అనుగ్రహించారు. ఆయన కృపవలన అనుకోకుండా ఈమధ్య శ్రీశైలం వెళ్లేందుకు ప్లాన్ వేసుకున్నాం. అయితే అధిక వర్షాల కారణంగా టీవీలో వస్తున్న వార్తలు మమ్మల్ని భయాందోళనలకు గురిచేశాయి. అప్పుడు నేను, "బాబా! మాకు తోడుగా ఉండి శ్రీశైల దర్శనం చేయించండి. అపారమైన మీ ప్రేమను బ్లాగ్ ద్వారా సాయిబంధువులతో పంచుకుంటాన"ని బాబాను వేడుకున్నాను. బాబా అనుగ్రహం వలన శ్రీశైలం వెళ్లి ముందుగా పాతాళగంగ దర్శనం చేసుకుని సాక్షిగణపతి, పాలధార, పంచధార క్షేత్రాలను దర్శించుకున్నాము. తరువాత శ్రీమల్లిఖార్జునస్వామికి రుద్రాభిషేకం జరిపించాము. కొద్దిగా వర్షంలో తడిసినప్పటికీ వర్షంలో తడవడం కూడా ఒకవిధమైన ఆనందాన్ని ఇచ్చింది. ఈ విధంగా బాబా దయతో వర్షాలలో సైతం శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకుని ఆనందంగా తిరిగి వచ్చాము.


కొన్నిరోజుల క్రిందట చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్‌తో నేను బాధపడ్డాను. బాబా ఊదీని, ఊదీతీర్థాన్ని తీసుకుని, "ఈ ఇన్ఫెక్షన్ తగ్గించండి బాబా. చర్మంపై దురద భరించలేకపోతున్నాను. నాపై దయచూపి నన్ను రక్షించండి సాయీ" అని బాబాను ప్రార్థించాను. తరువాత ఒకరోజు హాస్పిటల్‌కి వెళ్లి చూపించుకుంటే, డాక్టరు మందులు వ్రాశారు. ఆ మందులు తీసుకుని ముందుగా వాటిని బాబా పాదాలకు తాకించి, "బాబా! ఆశీర్వదించండి" అని ప్రార్థించి ఒక టాబ్లెట్ తీస్తే, అది క్రింద పడిపోయింది. 'క్రిందపడిపోయింది వేసుకోవాలా, వద్దా' అనే సందిగ్ధంలోనే ఒక టాబ్లెట్ వేసుకుని ఆయింట్‌మెంట్ రాసుకున్నాను. తెల్లవారేసరికి నాకు పూర్తిగా ఉపశమనం లభించింది. ఎక్కువ మందులు వాడకుండా ఒక రోజులోనే నాకు పూర్తిగా నయమైంది. "ధన్యవాదాలు సాయితండ్రీ. మీరు ప్రసాదించిన అమూల్యమైన ఆధ్యాత్మిక అనుభవాలను బ్లాగులో పంచుకునేలా ఆశీర్వదించండి. మీ పాదాలే మాకు శరణం బాబా. మా పెద్దదిక్కు మీరే సాయీ. ఐ లవ్ యు బాబా తండ్రీ!"


సద్గురు చరణం - భవభయహరణం.!


రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


విపరీతమైన కడుపునొప్పిని తగ్గించిన బాబా


నా పేరు సత్య. నేను సాయిభక్తుడిని. మా బాధలు తీర్చడానికి ఈ ప్రపంచంలో బాబా ఒక్కరే ఉన్నారని నేను తలుస్తాను. నాకు ఏ సమస్య వచ్చినా బాబాని తలచుకుని ఆయనకే చెప్పుకుంటాను. ఆయన ఆ సమస్యను వెన్నలా కరిగించేస్తారు. మా కుమార్తె ప్రతినెలా వచ్చే నెలసరి సమయంలో కడుపునొప్పితో చాలా బాధపడుతుంది. ప్రతినెలా వచ్చే బాధే కదా అని మేమంతా చాలా తేలిగ్గా తీసుకునేవాళ్ళం. అలాగే 2021, అక్టోబరు 12, మంగళవారంనాడు కూడా తను నొప్పిని ఓర్చుకోలేక బాధతో విలవిలలాడిపోయింది. అప్పుడు కూడా మేము 'ఎప్పుడూ ఉండే సమస్యే కదా' అని అంతగా పట్టించుకోలేదు. అయితే సాయంత్రం అయ్యేకొద్దీ విపరీతమైన కడుపునొప్పితో తను బాధపడుతుంటే చూసి నేను భరించలేకపోయాను. హఠాత్తుగా నాకు ఒక సంఘటన గుర్తుకువచ్చింది. '15 సంవత్సరాల క్రితం నా భార్య కూడా ఇలానే భరించలేని నొప్పితో బాధపడుతుంటే నేను వెంటనే తనని డాక్టరు వద్దకు తీసుకుని వెళ్ళాను. డాక్టరు 'అపెండిసైటిస్' అని చెప్పి,  స్కానింగ్ చేసి వెంటనే ఆపరేషన్ చేశారు. అలా బాబానే మమ్మల్ని ఆదుకుని ఆ కష్టం నుండి గట్టెక్కించారు'. ఆ విషయం గుర్తుకువస్తూనే నేను, "బాబా! నా కుమార్తెకు అటువంటి ఏ సమస్యా లేకుండా కాపాడు తండ్రీ" అని మనస్పూర్తిగా బాబాని వేడుకున్నాను. వెంటనే నా కుమార్తెను తీసుకుని హాస్పిటల్‌కి బయలుదేరాను. కారు నడుపుతూ కూడా, "బాబా! ఏ సమస్యా లేకుండా త్వరగా నా కుమార్తెకు నొప్పి తగ్గించండి తండ్రీ. నేను ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అంతలో హాస్పిటల్ వచ్చింది.  కారు దిగి నా కుమార్తెను డాక్టరుకి చూపించాం. ఆ డాక్టరు అమ్మాయికి మంచి ఆహారం తీసుకోమని మంచిగా నచ్చచెప్తూ ఒక ఇంజక్షన్ చేసి నెలరోజులపాటు టాబ్లెట్స్ వాడమని చెప్పి పంపించారు. బాబా దయవలన ఇంటికి వచ్చేసరికి 50% నొప్పి తగ్గింది. మరో రెండు గంటల్లో పూర్తిగా నొప్పి తగ్గిపోయి అమ్మాయి నార్మల్ అయ్యింది. ఇదంతా బాబా దయవల్లనే సాధ్యమైందని నా నమ్మకం. ఇలా మార్గదర్శిలా బాబా ఎల్లప్పుడూ మాతోనే ఉంటూ మమ్మల్ని కాపాడుతూ ఉంటున్నారు. "ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ మమ్మల్ని ఇలాగే కాపాడుతూ ఉండండి బాబా".


ఓం శ్రీ సాయినాథాయ నమః!!

ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః!!


కరోనా, దాని సైడ్ ఎఫెక్ట్స్ నుండి కాపాడిన బాబా


అందరికీ నమస్తే. నా పేరు హేమ. మేము విజయవాడలో నివాసముంటున్నాము. ఈమధ్యకాలంలో ఒకసారి నా భర్తకి ఒక ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు, అది తగ్గిపోతే నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటానని అనుకున్నాను. ఆ అనుభవాన్నే నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2021, మే నెలలో నాకు, నా భర్తకు కరోనా వచ్చి ఇద్దరమూ హాస్పిటల్లో చేరాము. బాబా దయవలన మావారికి ఫర్వాలేదుకానీ, నా పరిస్థితి మాత్రం చాలా విషమించి, డాక్టర్స్ ఎటువంటి ఆశలు లేవని చేతులెత్తేశారు. అటువంటి స్థితి నుండి బాబా దయవల్ల నేను బ్రతికి బయటపడ్డాను. హాస్పిటల్లో ఉన్నన్ని రోజులూ బాబా నాతోనే ఉన్నట్లు, నాతో మాట్లాడుతున్నట్లే ఉండేది నాకు. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక చిన్నచిన్న సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. బాబా దయవల్ల నేను వాటినుండి కూడా బయటపడ్డాను. కానీ మావారికి మాత్రం భుజంలో నొప్పి, ఇంకా గొంతులో ఏదో ఉన్నట్లుగా ఉండి నిద్రపోవడానికి చాలా ఇబ్బందిపడేవారు. అప్పుడు నేను, "బాబా! నా భర్తకి నయం చేయి తండ్రీ. ఆయనకి తగ్గిపోతే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. ఆ సాయినాథుడు ఎంతో కృపతో మావారికి తగ్గేపోయేలా చేశారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా". 


శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!



9 comments:

  1. Om sai ram today is my son wedding anniversary.please bless couple with health and long life.om sai ram������

    ReplyDelete
  2. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness. Jaisairam

    ReplyDelete
  3. షిరిడి సాయి నాధుని దయతో నేను అనారోగ్యం నుండి కోలుకొని.. ఆరోగ్యంగా అందంగా ఉన్నాను థాంక్యూ సాయి నాధ నీవే కలవు

    ReplyDelete
  4. షిరిడి సాయినాథ్ దయ తో నేను అనారోగ్యం నుంచి కోలుకుని ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉన్నాను థాంక్యూ థాంక్యూ సాయినాథ

    ReplyDelete
  5. సాయినాధుని దయతో నేను నా భార్య పిల్లలు అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉన్నాము తండ్రి థాంక్యూ థాంక్యూ థాంక్యూ

    ReplyDelete
  6. Baba ee bada nundi naku vimukti prasadinchu thandri

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo