సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 951వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఇంటర్వ్యూ లేకుండా నాలుగురోజుల్లో జాబ్ ఆఫర్‌తో మహిమను చూపిన బాబా
2. 'బాధ్యతగా వ్యవహరించాలి - ఆరోగ్యాన్ని చూసుకోవాల'ని తెలిపిన బాబా
3. బాబా కృపతో దొరికిన ఉంగరం

ఇంటర్వ్యూ లేకుండా నాలుగురోజుల్లో జాబ్ ఆఫర్‌తో మహిమను చూపిన బాబా


ఓం శ్రీ సాయినాథాయ నమః. నేనొక సాయిభక్తురాలిని. ముందుగా, సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. రోజూ సాయిలీలలు చదివి తరించే అవకాశం కల్పిస్తున్న సాయిభక్తులకు నా శతకోటి వందనాలు. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా చిన్నతనంలోనే మా తాతగారు పూజ్యశ్రీ సాయిమాస్టర్ ఎక్కిరాల భరద్వాజగారు విచ్చేసిన ఒక బాబా గుడికి నన్ను తీసుకుని వెళ్లి ఆయన సన్నిధిలో నన్ను బాబాకి అప్పజెప్పి, సాయిలీలామృతంలోని బాబా లీలలు చెప్పి బాబా సన్నిధిలో పెరిగేలా చేసి నా జన్మ సార్థకమయ్యేందుకు మార్గం చూపారు. బాబా దయవల్ల అలా సాయిలీలామృతం పారాయణతో మొదలైన నా జీవన ప్రయాణం సాయిచాలీసా, సాయినాథ స్తవనమంజరి, సాయినామస్మరణ, సాయికోటి, బాబా ఆరతులు, మహాపారాయణము, గురుచరిత్ర, అవధూతల చరిత్రల పారాయణలతో నిరాటంకంగా నేటికీ సాగుతూనే ఉంది. బాబా లేని జీవితం నా ఊహకు కూడా అందదు. "నన్ను ఆశ్రయించినవారిని నిరంతరం రక్షించడమే నా కర్తవ్యం" అన్న తమ మాటననుసరించి బాబా నన్ను ఏరోజూ వదల్లేదు. ముఖ్యంగా నేను ఎన్ని తప్పులు చేసినా, ఆయనకు ఇచ్చిన మాట తప్పినా, 'తల్లి బిడ్డలను తరిమివేయనట్లు, సముద్రం నదులను త్రిప్పివేయనట్లు' నన్ను  క్షమించి తమ  అక్కున చేర్చుకున్నారు. నా కోసమేకాక ఇతరుల క్షేమం కోసం నేను చేసిన ఎన్నో ప్రార్థనలకు, పారాయణలకు పలుకుతూ బాబా అనుగ్రహించిన అనుభవాలు లెక్కలేనన్ని. అవన్నీ చెప్పాలంటే నా జీవితకాలం సరిపోదు. ఇప్పుడు మాత్రం ఇటీవల నా జీవితంలో బాబా చేసిన అద్భుతమైన లీలను ఆయనకు మాటిచ్చిన ప్రకారం మీతో పంచుకోవాలనుకుంటున్నాను.


ఒకప్పుడు కుటుంబపరిస్థితులు అనుకూలించక మరియు పిల్లల పెంపకం వల్ల ఉద్యోగం చేయాలని ఉన్నా చేయలేకపోయాను. ఇప్పుడు నా వయస్సు 43 సంవత్సరాలు. పైగా ఆధ్యాత్మిక జీవితానికి అలవాటుపడినందువల్ల ఉద్యోగం చేయాలన్న ఆసక్తి పోయింది. మావారు కూడా నాకు సహకరిస్తున్నప్పటికీ ఆయన మనసులో మాత్రం నేను ఉద్యోగం చేయాలని ఉంది. అందువలన నాకు ఏదైనా చేయాలనిపించి 2021, సెప్టెంబరు 15, బుధవారం రాత్రి, "బాబా! మావారి కోసం ఉద్యోగ ప్రయత్నం చేస్తాను. కానీ మీ సేవకు ఆటంకం లేకుండా, ఎటువంటి పని ఒత్తిడి లేని ఉద్యోగాన్ని ప్రసాదించు" అని బాబాతో చెప్పుకున్నాను. తరువాత గురువారంనాటి మధ్యాహ్న ఆరతి సమయంలో 'ఫెడరల్ గవర్నమెంట్ జాబ్ పోస్టింగ్' కనిపిస్తే, వెంటనే దానికి దరఖాస్తు చేశాను. మూడురోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్, అది కూడా టైం లిమిట్ టెస్ట్ వ్రాయాల్సి ఉంది. ఏ మాత్రమూ ప్రిపరేషన్ లేదు. ఆదివారంనాడు నా లాప్టాప్‌కి బాబా ఊదీ పెట్టి, "బాబా! నా చేతి పరీక్ష వ్రాయించేది మీరే, నేను కాదు" అని బాబాతో చెప్పుకుని సచ్చరిత్రలోని శేవడే న్యాయవాద పరీక్షకు సంబంధించిన లీలను తలచుకుంటూ పరీక్ష వ్రాశాను. ఆ టెస్ట్ రిజల్ట్ వెంటనే వస్తుంది, కానీ "ఆకలి కడుపుతో ఏమీ చేయరాద"న్న బాబా వచనాన్ని గుర్తుచేసుకుని ముందు భోజనం చేసి, తరువాత రిజల్ట్ చూస్తే, 'passed/eligible' అని ఉంది. అది చూసి నాకు  కన్నీళ్లు ఆగలేదు. అయినా సహజ మానవనైజాన్ని అనుసరించి, "బాబా! సచ్చరిత్రలోని టెండూల్కర్ లాగా టాప్ స్కోర్ కాదు కదా! నాకు వచ్చింది 76 శాతమేగా" అని నిరాశతో ఉన్నాను. కానీ బాబా నన్ను వదలలేదు. ఎటువంటి కనీస ఇంటర్వ్యూ అయినా లేకుండా నాలుగురోజుల్లో జాబ్ ఆఫర్‌తో తమ మహిమను చూపించారు. మిరాకిల్స్ అంటే అసలు ఒప్పుకోని మావారు కూడా, "ఇది నిజంగా మిరాకిల్" అన్నారంటే, నా పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో మీరు అర్థం చేసుకోగలరనుకుంటా. "సాయీ! మీరు అనుక్షణం నాతో ఉన్నారని తెలుసు. అయినా అడుగడుగునా తప్పులు చేస్తూ, మిమ్మల్ని బాధపెడుతుంటాను. తల్లివలే నా తప్పులను క్షమించి మీ పాదాల చెంత ఎల్లప్పుడూ ఉండే భాగ్యాన్ని నాకు ప్రసాదించు తండ్రీ. మీ పాదాలకు సర్వస్య శరణాగతి వేడుతూ శరణాగతికి నిజమైన అర్థంతో మేము మెలిగేలా మమ్మల్ని మలచమని ఆర్తితో మిమ్మల్ని వేడుకుంటున్నాను బాబా".


చివరిగా, సాయి మనందరికీ తల్లి, తండ్రి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆయన మనల్ని రక్షిస్తారు, మనకు మంచిది, అవసరమైనది అయితే తప్పకుండా ఇస్తారన్న నమ్మకం (శ్రద్ధ), సంతోషంతో కూడిన సహనం (సబూరీ)తో ఉండడం - ఇవే మనం ఆయనకి ఇవ్వాల్సిన దక్షిణ.


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


'బాధ్యతగా వ్యవహరించాలి - ఆరోగ్యాన్ని చూసుకోవాల'ని తెలిపిన బాబా


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. ముందుగా అనేకమంది సాయిభక్తుల అనుభవాలను 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో ప్రచురిస్తూ తద్వారా శ్రీసాయి ప్రేమస్వరూపాన్ని అందరికీ చవిచూపిస్తున్న సాయికి నా  ప్రణామాలు. నా పేరు సూర్యనారాయణమూర్తి. మాది విజయనగర్ కాలనీ, హైదరాబాద్. నేను ఇదివరకు బాబా నాకు ప్రసాదించిన చాలా అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా తోటి సాయిబంధువులతో  పంచుకున్నాను. ఇప్పుడు 2021, సెప్టెంబరు 29, 30, అక్టోబరు 1 తేదీలలో బాబా నాపై చూపిన అనుగ్రహాన్ని పంచుకుంటున్నాను.


సెప్టెంబరు 29న నేను నాతోపాటు మా ఆఫీసులో పనిచేసే ఒక సహోద్యోగి తన వృత్తిపట్ల ఈమధ్య చూపిస్తున్న నిర్లక్ష్యానికి ఒక పైఅధికారిగా అతన్ని గట్టిగా మందలించాను. ఆ సమయంలో నా స్వరం పెంచి బిగ్గరగా అరవడంవల్ల నా శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. గుండె వేగంగా కొట్టుకోసాగింది. అదీగాక, ఒక సాయిభక్తుడిని అయివుండి తోటిమనిషిని అవమానించినందుకు మానసికంగా నేను చాలా బాధపడ్డాను. సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత కూడా ఆ బాధ అలాగే ఉంది. రాత్రికి బి.పి కూడా ఎక్కువైంది. నిద్రకు ఉపక్రమిస్తూ మన దైవమైన బాబాను, "నా తప్పును మన్నించండి బాబా. అలాగే ఈరాత్రి నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి" అని ప్రార్థించాను. అలాగే, "అంతా సవ్యంగా ఉన్నట్లయితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు మ్రొక్కుకుని, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని జపిస్తూ పడుకున్నాను. రాత్రి బాగా నిద్రపట్టింది. తెల్లవారితే గురువారం (2021, సెప్టెంబరు 30). ఉదయం సుమారు ఐదు గంటల ప్రాంతంలో బాబా ఒక ఫకీరు రూపంలో దర్శనమిచ్చి, "నువ్వు నీ ఆఫీసు విషయంలో బాధ్యతగా వ్యవహరించావు. కానీ, నీ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా!" అని అదృశ్యమయ్యారు. ఆరోజు ఆఫీసులో ఎటువంటి సమస్యా రాలేదు. ఆ ఉద్యోగి కూడా తన తప్పు తాను గ్రహించాడు. తరువాత 2021, అక్టోబరు 1వ తేదీ ఉదయం ఒక దివ్యతేజస్సుతో బాబా శిరిడీలో ఉన్నట్లు దర్శనమిచ్చి అంతర్థానమయ్యారు. "ఈ అద్భుతాన్ని వెంటనే బ్లాగుకు పంపుతాను" అని బాబాకు మాటిచ్చిన ప్రకారం మీ అందరితో పంచుకున్నాను. "ధన్యవాదాలు బాబా".


'భక్తులారా! సాయిని నమ్మండి; సాయే మన సద్గురువు'.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా కృపతో దొరికిన ఉంగరం


సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు రమ్య. నేనొక సాయిభక్తురాలిని. కొన్ని రోజుల క్రితమే ఈ బ్లాగ్ గురించి ఒక సాయిబంధువు ద్వారా తెలిసి బ్లాగులో ప్రచురితమయ్యే 'సాయిభక్తుల అనుభవమాలిక' మరియు 'సాయి అనుగ్రహసుమాలు' చదువుతూ ఎంతో ఆనందం పొందుతున్నాను. ఇటీవల దత్తసాయి ప్రసాదించిన ఒక అనుభవాన్ని మొదటిసారి ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకుంటున్నాను. 2021, అక్టోబరు 2, ఉదయం రోజూలాగే మా ఇంట్లో ఎవరి రోజువారీ పనులు వాళ్ళు చేసుకుంటున్నాము. గాంధీ జయంతి కారణంగా సెలవు దినమైనందున మావారు కారు శుభ్రపరచడానికని కిందికి వెళ్లి, అన్ని పనులు పూర్తిచేసుకుని వచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆయన తన వేలికి ఉండాల్సిన ఉంగరం లేకపోవడం గమనించారు. కారు శుభ్రపరచినప్పుడు అక్కడెక్కడైనా జారిపడి ఉంటుందని వెంటనే కిందకి వెళ్లి అంతా వెతికారు. కానీ, ఉంగరం కనిపించలేదు. దాంతో ఇంట్లో అంతా వెతికాము. తరువాత నేను కూడా కిందకి వెళ్లి చూశాను. అయినా ఉంగరం మాత్రం దొరకలేదు. అది డైమండ్ పొదగబడిన ఉంగరమైనప్పటికీ ఆశ్చర్యంగా నాలో ఏ బాధా లేదు. మనసులో మాత్రం ఒకపక్క, 'బాబా! ఏదో కర్మ వలన ఎక్కువ బాధను అనుభవించనీయకుండా దాన్ని ఇలా తీసేశావా తండ్రీ? మాకు ఏది మంచిదో, అదే మీరు చేస్తారు' అనీ, మరోపక్క ఉంగరం కనిపిస్తే బాగుండేదనీ అనిపిస్తోంది. అంతలో మా ఇంటికి ఎదురుగా ఉండే ఒక సాయిబంధువుకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పేలా నా బుద్ధికి ప్రేరణనిచ్చి ఫోన్ చేయించారు బాబా. ఆమె నాతో, "ఇంకోసారి వెతికి చూద్దాం. దొరికేవరకు వెతుకుదాం, ఖచ్చితంగా దొరుకుతుంది. మన ప్రయత్నలోపం లేకుండా చూద్దాం. తరువాత బాబా దయ. నువ్వు బాబాకి దణ్ణం పెట్టుకుని, దక్షిణ సమర్పించి కిందికి రా" అని చెప్పింది. దాంతో నేను మరోసారి వెతకడానికి కిందికి వెళ్తూ, వెళ్లే ముందు బాబాకి దక్షిణ సమర్పించడంతోపాటు "ఉంగరం దొరికితే, 'సాయి మహరాజ్ సన్నిధి'లో నా అనుభవాన్ని పంచుకుంటాను తండ్రీ" అని బాబాకి చెప్పుకున్నాను. సరిగా అప్పుడే నాకు దత్తపురాణంలోని కార్తవీర్యార్జునునికి దత్తులవారు ప్రసాదించిన వరం గుర్తుకొచ్చింది. సమయానికి బాబానే గుర్తుచేశారు. దాంతో నేను, "ఓ తండ్రీ! దత్తుడు ఎవరు? బాబా ఎవరు? అంతా నువ్వే కదా! ఆ కార్తవీర్యార్జునుడి సంఘటనను గుర్తుచేసి, నామం చెప్పుకుంటూ వెతకమని చెప్తున్నావా తండ్రీ?" అని నామం చెప్పుకుంటూ కిందకి వెళ్ళాను. తరువాత ఫోన్లో మాట్లాడిన సాయిబంధువు వస్తారని చూస్తుంటే, అప్రయత్నంగా అక్కడే మట్టిలో పడివున్న ఉంగరంపై నా దృష్టి పడింది. ఆశ్చర్యమేమిటంటే, అదేచోట నేను, మావారు ఇద్దరమూ వెతికాము. అప్పుడు కనపడనిది, ఇప్పుడు కనపడింది. ఇదెలా సాధ్యమంటే, నామజపం వలన. "నామజపం చేయమ"ని ఆ సాయితండ్రి చెప్తారు కదా! ముందు ప్రయత్నంలో నేను నా స్వబుద్ధిపై ఆధారపడ్డాను. తరువాత ప్రయత్నంలో నేను బాబాపై ఆధారపడి, ఆయన నామాన్ని జపిస్తూ వెతకటం వలన నాకు మేలు జరిగింది. నామం యొక్క మహిమ ఋజువైంది. ఎంత కరుణామయుడు, ఎంత దయామయుడు నా తండ్రి! ద్వారకామాయి అమ్మ, అమ్మలగన్న అమ్మ, సద్గురు మహరాజ్ నా బాబా. ఆనందభాష్పాలతో ఆయనను అభిషేకించటమే నా తండ్రికి ఇచ్చేటి గురుదక్షిణ. అంతకంటే ఏం చేయగలం? "బాబా! శతకోటి ప్రణామాలు తండ్రీ".


పాహిమాం పాహిమాం పాహి పాహి.



6 comments:

  1. Jaisairam bless amma for her eye operation recovery and bless me for getting good health and getting wealthy.jai sairam

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. Om sai ram 2,3 experiences are very nice. Sai you saves every devotees from their problems. That is your power. Baba i love you❤❤❤

    ReplyDelete
  4. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete
  5. Om sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo