1906లోనే మరోసారి కనీత్కర్ తన కుటుంబంతో యేవలా నుండి శిరిడీ వెళ్తూ రానూపోనూ ఒక టాంగా మాట్లాడుకున్నాడు. శిరిడీ చేరుకున్నాక కనీత్కర్ కుటుంబంతోపాటు షామా, అతని పిల్లలు కూడా బాబా దర్శనానికి మసీదుకు వెళ్లారు. బాబా వారిని చూడగానే కనీత్కర్‌తో, “నువ్వు ఇప్పుడే ఎక్కడికి వెళ్ళిపోదామని అనుకుంటున్నావు? తెల్లవారుఝామున 2 గంటలకు నువ్వు ఒక్కడివే ఇక్కడినుండి వెళ్తావు” అని అన్నారు. బాబా మాటలతో తాము ఆ రాత్రి అక్కడే బసచేయాల్సి ఉందని శ్రీమతి కనీత్కర్ గ్రహించింది. తరువాత వాళ్ళు వెళ్లి పాత మరాఠీ స్కూలులో బసచేశారు. అర్థరాత్రి యేవలా నుండి ఒక అధికారి ఒక టెలిగ్రామ్ తీసుకొని కనీత్కర్ వద్దకి వచ్చాడు. ఆ టెలిగ్రామ్ అతని సోదరుడు చింటూ వద్దనుండి వచ్చింది. అందులో, తమ తల్లి తీవ్రంగా అనారోగ్యం పాలైందనీ, వెంటనే బయలుదేరి రమ్మనీ అతను పేర్కొన్నాడు. ఆ సమాచారం తెలుసుకున్న కాశీబాయి వెంటనే తన భర్త ప్రయాణానికి బ్యాగు సర్ది ఇచ్చింది. బాబా చెప్పినట్లే సరిగ్గా తెల్లవారుఝామున 2 గంటలకి కనీత్కర్ శిరిడీ నుండి ప్రయాణమయ్యాడు.
మరుసటిరోజు శ్రీమతి కాశీబాయి తన బ్యాగు సర్దుకుని శిరిడీ విడిచి బయలుదేరడానికి సిద్ధమై అనుమతి కోసం బాబా వద్దకు వెళ్ళింది. అయితే, బాబా వాళ్ళ ప్రయాణానికి తమ అనుమతినివ్వలేదు. దాంతో, వాళ్ళు అక్కడే మసీదులో కూర్చున్నారు. అప్పుడు బాబా, “పదేపదే అతను వెళ్లి ఆమెను కలుస్తానని వాగ్దానం చేశాడు. కానీ ప్రతిసారీ వాయిదా వేశాడు. ఇప్పుడు టెలిగ్రాం వచ్చింది. ఎవరో అనారోగ్యంతో ఉన్నారు. కానీ, లక్షణాలు వేరొకరిలో ఉన్నాయి” అని అన్నారు. అంతేకాదు, "అనారోగ్యమెవరికి? లక్షణాలు ఎవరికి?" అని కూడా అన్నారు. బాబా ఏమి చెబుతున్నారో, ఎవరినుద్దేశించి ఎవరికి చెబుతున్నారో అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు. కొంతసేపటికి శ్రీమతి కాశీబాయి తిరిగి తన బసకి వెళ్ళాక బాబా ఆమె కోసం ఒక పళ్ళెం నిండా బర్ఫీలు పంపించారు. నిజానికి ఆరోజు ఏకాదశి. ఆమె ఏకాదశివ్రతంలో ఉంది. ఆమె చేత ఆ వ్రతానికి ఉద్వాసన చెప్పించేందుకే బాబా ఆ బర్ఫీలు పంపారు. కొంతసేపటి తరువాత కాశీబాయి తన కుటుంబసభ్యులతో మళ్ళీ మసీదుకి వెళ్ళింది. అప్పుడు బాబా ‘శీరా’ తయారుచేయడానికి సిద్ధమవుతూ, "ఎవరైనా శీరా తినాలనుకుంటున్నారా?" అని అడిగారు. అది వింటూనే కాశీబాయి మనసులో, “ఒక ముస్లిం తయారుచేసే శీరాని ఎలా తినడం?” అన్న ఆలోచన తలెత్తింది. మరుక్షణం బాబా తమ రెండు చేతులను తమ చెవులపై వేసుకుని, “అరే! నేను ఎవరి మతవిశ్వాసాలనూ అపవిత్రం చేయడానికి ప్రయత్నించడం లేదు. సరే, ఇది బాగుంది, ఎవరైనా ఈ శీరాను తినాలనుకుంటే వాళ్ళు తినవచ్చు” అని అన్నారు. తరువాత బాబా లేచి ప్లేట్లు కడిగి, వాటిని తుడిచి, వేడివేడి శీరాను వాటిలో వడ్డించారు. శ్రీమతి కాశీబాయి సోదరి, పిల్లలతో సహా ఇతర కుటుంబసభ్యులందరూ శీరా తినసాగారు. కొద్దిసేపటి తర్వాత శ్రీమతి కాశీబాయి తాము బయలుదేరడానికి బాబాను అనుమతి అడిగింది. కానీ బాబా మౌనంగా ఉన్నారు. అంతలో దాదాకేల్కర్ మసీదుకు వచ్చాడు. బాబా శ్రీమతి కాశీబాయిని చూపిస్తూ అతనితో, “ఆమె నా తల్లి, చాలాదూరం నుండి ఇక్కడికి వచ్చింది. ఆమె ఏకాదశి ఉపవాసవ్రతాన్ని చేపట్టినందువల్ల ఆమె, ఆమె కుటుంబం ఆకలితో ఉంది. నువ్వు కొన్ని భాక్రీలు(రొట్టెలు) తయారుచేసి ఆమెకి, పిల్లలకి పెట్టలేవా? అలా చేస్తే నీ ఆత్మ సంతృప్తి చెందుతుంది” అని అన్నారు. దాంతో దాదాకేల్కర్ వాళ్ళని తమ ఇంట భోజనానికి రమ్మని ఆహ్వానించి వారందరినీ తనతో తీసుకొని వెళ్ళాడు. తరువాత శ్రీమతి కాశీబాయికి తన భర్త వద్ద నుండి ఒక లేఖ వచ్చింది. అందులో అతను 'తన తల్లికి ఆరోగ్యం బాగుందనీ, అయితే తన సోదరి గంగూ తీవ్రమైన ప్రసవవేదననుభవించి ఆ రాత్రి ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింద'ని తెలియజేశాడు. దాంతో, "ఎవరో అనారోగ్యంతో ఉన్నారు. కానీ, లక్షణాలు వేరొకరిలో ఉన్నాయి" అన్న బాబా మాటలకర్థం కాశీబాయికి బోధపడింది.
1906లోనే ఇంకోసారి కనీత్కర్ కుటుంబం శిరిడీ దర్శించినప్పుడు మురికిగా, జిడ్డుగా ఉన్న ఒక గుడ్డను బాబా తమ వేలికి చుట్టుకొని ఉన్నారు. అది చూసి శ్రీమతి కాశీబాయి బాబా వేలికి ఏమైందోనని ఆందోళన చెందింది. వెంటనే బాబా, "నా వేలు కాలిపోయింది, అందుకే ఈ కట్టు కట్టుకున్నాను" అంటూ తమ వేలికున్న కట్టును విప్పి కాలిపోయి తెల్లగా ఉన్న తమ వేలిని ఆమెకు చూపించారు. తరువాత శ్రీమతి కాశీబాయి సాటి సాయిభక్తుల ద్వారా 'నాసిక్‌కి చెందిన మాధవనాథ్ మహరాజ్ తమ వేలిని కాల్చుకున్నారనీ, ఆ కాలిన గాయాన్ని బాబా తీసుకున్నార'నీ విని ఆశ్చర్యపోయింది. ఆ సమయంలోనే గ్రామస్థులు వాళ్లతో ఇలా చెప్పారు: "శిరిడీలో ఒక కుక్క ఉంది. దానికి పిచ్చిపట్టడంతో దానిని చంపాలని మేము కర్రలతో వెంబడించాము. అది ప్రాణభయంతో గ్రామమంతా తిరిగి చివరికి మసీదుని ఆశ్రయించి బాబా వెనుక కూర్చుంది. గ్రామస్థులు బాబాతో, “బాబా! ఆ కుక్కను తాకవద్దు. అది పిచ్చికుక్క. మిమ్మల్ని కరుస్తుంది" అని అన్నారు. బాబా ఆగ్రహించి గ్రామస్థులను అక్కడినుండి తరిమేశారు. ఆ కుక్క కొద్దిసేపు బాబా వెనుక విశ్రాంతి తీసుకొని తరువాత వెళ్లిపోయింది. అప్పటినుండి దాని పిచ్చిలక్షణాలు పోయి గ్రామంలో యథేచ్ఛగా తిరుగుతోంది. అది ఎవరిపైనా దాడి చేయడంగానీ, కరవడంగానీ జరగలేదు".
ఒకసారి కనీత్కర్ చిన్నకూతురు అనూబాయి తమ ఇంటి బాల్కనీలో కూర్చుని ఇంటి గేటు వద్ద విధినిర్వహణలో ఉన్న కాపలాదారుని చూస్తూ ఉంది. అంతలో ఒక ఫకీరు భిక్షకోసం గేటు వద్దకు వచ్చాడు. ఆ ఫకీరు పొడవుగానూ, చూడటానికి బాబావలే తన తలకి ఒక తెల్లని వస్త్రాన్ని కట్టుకొని ఉన్నాడు. అతని కుడిభుజంపై ఒక చిన్న ఆకుపచ్చరంగు రుమాలు ఉంది. అతను భిక్ష ఇవ్వమని కాపలాదారుని అడిగాడు. అందుకు ఆ కాపలాదారుడు ఒక డబ్బాని చూపిస్తూ, "ఈ డబ్బాలోని జొన్నలు నిండుకున్నాయి. యజమాని ఇంకా డబ్బాను నింపలేద"ని చెప్పి, "కొద్దిసేపటి తరువాత రమ్మ"ని ఆ ఫకీరుతో చెప్పాడు. ఆ ఫకీరు నవ్వుతూ వెళ్లిపోయాడు. సుమారు 20 నిమిషాల తరువాత ఆ ఫకీరు మళ్ళీ వచ్చి భిక్ష అడిగాడు. “డబ్బా ఖాళీగా ఉంద”ని మునపటి సమాధానమే చెప్పాడు కాపలాదారుడు. అప్పుడు ఆ ఫకీరు, "డబ్బాలో నాలుగైదు గింజలన్నా ఉంటాయి, వాటినే భిక్షగా ఇవ్వు" అని అడిగాడు. దాంతో కాపలాదారుడు ఆ డబ్బాను చేతిలోకి తీసుకొని ఫకీరు వద్ద ఉన్న ఆకుపచ్చ రుమాలులో ఆ డబ్బాను బోర్లించాడు. ఫకీరు తన రుమాలులో పడ్డ కొన్ని జొన్నగింజలను చూస్తూ, "ఇవి పుష్కలంగా ఉన్నాయి" అని, వాటిని తన అరచేతిలో పెట్టుకొని మరోచేతితో రుమాలు అంచులను లోపలున్న గింజలు కనపడకుండా మడిచాడు. కొన్ని క్షణాల తరువాత అతను ఆ రుమాలును తెరిచాడు. అందులో జొన్నలు నిండుగా ఉన్నాయి. అది చూసి కాపలాదారుడు ఆశ్చర్యపోయాడు. తరువాత ఆ ఫకీరు నవ్వుతూ వెనుతిరిగి కొన్ని అడుగులు వేసి అదృశ్యమయ్యాడు. ఇదంతా చూస్తున్న అనూబాయి పరుగున క్రిందికి దిగి అప్పుడే జరిగిన ఆ అద్భుతం గురించి అందరికీ చెప్పింది. అది విన్న శ్రీమతి కాశీబాయి ‘ఆ ఫకీరు వేరెవరో కాదు, బాబానే’ అని గుర్తించి వెంటనే కాపలాదారుని పిలిచి ఫకీరుని వెతకమని పంపింది. కానీ ఆ ఫకీరు కనిపించలేదు. ఒక సంవత్సరం తరువాత కాశీబాయి శిరిడీ వెళ్లి బాబాను దర్శించినప్పుడు బాబా ఆమెతో, "నేను మీ ఇంటికి వచ్చాను" అని చెప్పారు. ఆమె ఎంతో సంతోషించి, శిరస్సు వంచి బాబాకు నమస్కరించింది. అలా కాశీబాయి, ఆమె కుటుంబం తమకు వీలైనప్పుడల్లా శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుంటుండేవారు. ఆమె భర్త గోవిందరావు కనీత్కర్ పదవీవిరమణ చేశాక 1909లో వాళ్ళు పూణే వెళ్లిపోయారు. దురదృష్టంకొద్దీ వాళ్ళు మళ్ళీ శిరిడీ వెళ్లలేకపోయారు. అయినప్పటికీ బాబా ఆశీస్సులు, ఆయన తమ స్వహస్తాలతో ఇచ్చిన ఊదీ వారి జీవితంలో ఏర్పడ్డ కష్టనష్టాల నుండి వాళ్ళను బయటపడేశాయి.
రెఫ్: శ్రీసాయి సాగర్ మ్యాగజైన్, దీపావళి సంచిక, 2008,
శ్రీసాయి సాగర్ మ్యాగజైన్, వాల్యూమ్ 12, నం 3, దీపావళి సంచిక 2012.
మూలం: బాబాస్ డివైన్ మేనిఫెస్టేషన్స్ బై విన్నీ చిట్లూరి.
Om Sai Ram 💖
ReplyDeleteOm sai ram very nice sai leela. Tanishkar is his devotee. Mrs kasi bhai is baba's beloved devotee with faith and trust she prayed to baba.we must learn how to pray to baba every minute. ❤❤❤
ReplyDeleteON SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATHAYA NAMAH..OM SAI RAM
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATHAYA NAMAH..OM SAI RAM
ReplyDeleteOm sa ram
ReplyDeleteOm sai ram
ReplyDelete