సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 966వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నమ్మకాన్ని కాపాడిన బాబా
2. పుణ్యతిథినాడు బాబా నాపై చూపిన ప్రేమ
3. ఎన్నో సంవత్సరాలనాటి ఇంటి కలను నెరవేర్చిన బాబా

నమ్మకాన్ని కాపాడిన బాబా


ముందుగా సాయిభక్తులకు, ఈ బ్లాగు నిర్వాహకులకు నా హృదయపూర్వక వందనాలు. మనమందరం సాయిభక్తులం అవడం నిజంగా మన అదృష్టం. నా పేరు సునీత. నేను ఇదివరకు చాలా అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని మీ అందరితో పంచుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 2020, అక్టోబరు నెలలో మా అబ్బాయి ఒక పరీక్ష వ్రాసాడు. అప్పుడు నేను, "బాబా! మీరు పసుపురంగు వస్త్రాల్లో దర్శనమిస్తే మా బాబు పరీక్షలో ఉత్తీర్ణుడవుతాడు, లేకుంటే లేదు" అని మనసులో అనుకున్నాను. బాబా ఆరోజు పసుపురంగు వస్త్రాల్లో దర్శనమివ్వలేదు, మా బాబు ఆ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేదు. మేము చాలా బాధపడ్డాము కానీ, 'మనం చేయవలసింది బాధపడటం కాదు. నమ్మకంగా ఎదురుచూడటమ'ని నమ్మకంతో ఎదురుచూడసాగాము. ఇంకా ఆ రోజే నేను నా మనసులో, "వచ్చే సంవత్సరమైనా పసుపురంగు వస్త్రాల్లో దర్శనమివ్వు తండ్రీ" అని బాబాతో అనుకున్నాను. తరువాత సాయి దివ్యపూజ చేసాము. 2021, అక్టోబరులో ఒకరోజు మా బాబు మళ్లీ ఆ పరీక్ష వ్రాయడానికి వెళ్ళాడు. నేను 'నాలుగు ఆరతుల్లో ఏదో ఒక ఆరతికి బాబా పసుపురంగు వస్త్రాల్లో దర్శనమివ్వాలి' అనుకుని బాబా గుడిలో సచ్చరిత్ర పారాయణ చేద్దామని వెళ్లి గుడిలో కూర్చున్నాను. సచ్చరిత్ర పారాయణ పూర్తి అయ్యేటప్పటికి రాత్రి తొమ్మిది గంటలైంది. ఇంకా అప్పుడు 11 మందికి అన్నదానం చేసి ఇంటికి వచ్చాను. అప్పటివరకు నేను ఆ రోజు బాబా ఆరతి ఫోటోలు చూడలేదు. అప్పుడు చూస్తే, కాకడ ఆరతికి తెలుపురంగు, మధ్యాహ్న ఆరతికి ఎరుపురంగు, సంధ్య ఆరతికి నీలం రంగు వస్త్రాల్లో బాబా ఉన్నారు. అప్పుడు రాత్రి పదకొండు గంటలైంది. నేను, "బాబా! సంవత్సరం క్రితమే నేను మిమ్మల్ని అడిగాను. నా నమ్మకాన్ని కాపాడు" అనుకుని శేజారతి చూశాను. అద్భుతం! బాబా పసుపురంగు వస్త్రాల్లో దర్శనమిచ్చారు. నా ఆనందానికి అంతులేదు. మా బాబు కూడా పరీక్ష బాగా వ్రాశాడు. "చాలా సంతోషం బాబా. ఇదంతా మీ మహిమే. మా బాబుని పూర్తిగా నీ చేతుల్లో పెడుతున్నాను బాబా. వాడి భాధ్యత అంతా నీదే బాబా. తనకి ఇంకా రెండు పరీక్షలున్నాయి. అవి కూడా మీరే దగ్గరుండి వ్రాయించాలి".


మా బాబు కోచింగ్ కోసం ఒక రూమ్ కావాలని 2021, అక్టోబర్ 19, మంగళవారం ఉదయమంతా వెతికినా రూమ్ దొరకలేదు. దాంతో చాలా నిరాశ చెందాము. అప్పుడు నేను, "బాబా! సహనం కలిగి ఉండాలని మీరు చెప్పిన మాటను మేము పాటిస్తాము. రూమ్ దొరికేలా అనుగ్రహించండి. రూమ్ దొరికితే శిరిడీలో పాలకోవా పంచుతాన"ని బాబాకి చెప్పుకున్నాను. అలా బాబాకి చెప్పుకోగానే రూమ్ దొరికింది. ఆలస్యం చేయకుండా మేము మర్నాడు బుధవారం రాత్రి శిరిడీకి ప్రయాణమయ్యాము. గురువారం సాయంత్రం బాబా దర్శనం చేసుకుని, పాలకోవా పంచాను. "ధన్యవాదాలు బాబా. నా కుటుంబాన్ని, నా తోటి సహచరుల కుటుంబాలను ఎల్లప్పుడూ కాపాడు తండ్రి".


శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


పుణ్యతిథినాడు బాబా నాపై చూపిన ప్రేమ

 

నేను సాయిభక్తురాలిని. మేము యు.ఎస్.ఏలో నివాసముంటున్నాము. దసరా రోజు బాబా నాకు ప్రసాదించిన ఒక అందమైన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఇక్కడ యు.ఎస్.ఏలో, బాబా మందిరంలో గురువారం దసరా జరుపుకున్నాము. ఆరోజు మద్యాహ్నం నా భర్త, పిల్లలకి పనులున్నందున నేను నా కుటుంబంతో ఉదయం 10:00 గంటలకే బాబా గుడికి వెళ్లాను. నేను మందిరంలో అడుగుపెడుతూనే నాకిష్టమైన రాములవారి పాట వినిపించడంతో నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ సమయంలో బాబాకి అభిషేకం జరుగుతుంది. బాబాకి చేసే అభిషేకం చూసే భాగ్యం దక్కడంతో నా ఆనందం మరింత రెట్టింపు అయింది. అంతలో బాబాకి అభిషేకం చేయడానికి చేతిలో కలశాలు పట్టుకుని లైన్‌లో ఉన్న కొంతమందిని చూసి వాళ్లంతా అదృష్టవంతులు అనుకున్నాను. ఇంతలో ఒక వాలంటీర్, "దయచేసి బయట దుర్గమాత దగ్గర ఉన్న కలశం తీసుకొచ్చి లైన్‌లో నిలబడండి" అని చెప్పారు. అది వింటూనే నాకు చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే మావారు వెళ్లి మాకోసం ఒక కలశం తీసుకుని వచ్చారు. మేము లైన్లో వెళ్లి నిలుచున్నాము. సాధారణంగా అక్కడున్న పూజారి మా వద్దనున్న కలశాలు తీసుకుని బాబాకు అభిషేకం చేస్తారు. కానీ ఆరోజు మమ్మల్నే బాబాని అభిషేకించమన్నారు. ఆనందంతో నా హృదయం నాట్యమాడింది. నిజానికి బాబా వారి పెద్ద విగ్రహానికి అభిషేకించాలన్నది మా చిన్నబాబు కోరికను బాబా ఆవిధంగా అనుగ్రహించారు. మేమంతా బాబా పుణ్యతిథినాడు బాబా పాదాలు కడిగి వారి ఆశీస్సులు అందుకున్నాము. నాపై బాబా చూపిన ప్రేమను నేను ఏమని చెప్పను? నేను గత పది సంవత్సరాలుగా ఆ మందిరానికి వెళ్తున్నాను. గురుపౌర్ణమి రోజు మరియు బాబా పుణ్యతిథి నాడే బాబా పాదాలు తాకేందుకు భక్తులకు అనుమతిస్తారు. కాని బాబాకి అభిషేకించేందుకు భక్తులను, అదీ కూడా స్పాన్సర్స్ కాని భక్తులను అనుమతించడాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఇంకో విషయం, దసరా ముందు వారం రోజుల్లో మా ఇంట్లో అందరమూ అనారోగ్యానికి గురయ్యాము. అందరూ కోలుకున్నా నేను ఇంకా అనారోగ్యంతో చాలా అలసటగా ఉన్నాను. అయినా బాబాను చూడాలని మందిరానికి వెళ్ళాను. బాబా పాదాలు తాకిన మీదట నా శరీరంలో కొత్త శక్తి ప్రవహించింది. ఇంకా మందిరం వాళ్ళు ప్రతి సంవత్సరం మందిరంలో ఇండియాలోని ఆలయాల సెట్లు వేస్తారు. ఈ సంవత్సరం కూడా చేసారు. అందులో నాకు ఇష్టమైన పండరీపురం సెట్ కూడా ఉండటం చూసి నేను చాలా సంతోషించాను. ఎందుకంటే పండరీపురం దర్శించాలన్నది నా కల. దసరానాడు బాబా నా కుటుంబాన్ని ఎలా ఆశీర్వదించారో చూడండి. ఇంతకన్నా నేను బాబాను ఏమి అడగను? సాధారణంగా నేను ఎప్పుడు మందిరానికి వెళ్లినా బాబాను, "దయచేసి ఈవిధంగా(నా మనసుకి అనిపించినట్లు) దర్శనం ఇవ్వండి" అని అడుగుతాను. కానీ ఈసారి నేను ప్రత్యేకించి బాబాను ఏమీ అడగక, "మీరు ఏది ఇస్తే, అది సంతోషంగా ఇంటికి తీసుకెళ్తాను, అస్సలు బాధపడను" అని మనసులో అనుకున్నాను. కానీ బాబా పొంగిపొర్లే ఆనందంతో నా హృదయాన్ని నింపేశారు. ఇదేవిధంగా నేను 2019లో శిరిడీ వెళ్లినప్పుడు అనుకున్నాను. అప్పుడు బాబా తమ దర్శనంతో నన్ను ఎలా అనుగ్రహించారో మీకు తెలిసిందే. ఇదివరకే ఆ అనుభవాన్ని మీతో పంచుకున్నాను. ఈ సంవత్సరం నేను బాబాకు మరింత దగ్గరయ్యాను. మన్నించాలి, బాబానే నన్ను మరింత దగ్గరకు తీసుకున్నారు. నేను మరింత మంచి వ్యక్తిగా మారాలని, నా మంచి ప్రవర్తనను చూసి బాబా నన్ను అమితంగా ప్రేమించాలని కోరుకుంటున్నాను. "అందుకోసం నేను నా వంతు ప్రయత్నిస్తున్నాను బాబా. దయచేసి మీరు కూడా నాకు సహాయం చేయండి, లేకపోతే నేను నిలబడలేను".


ఎన్నో సంవత్సరాలనాటి ఇంటి కలను నెరవేర్చిన బాబా


ఓం శ్రీ సాయినాథాయ నమః. నా పేరు విజయ. మాది వైజాగ్. ముందుగా సాయిభక్తులకు నా నమస్కారాలు. మేము చాలా సంవత్సరాల నుంచి ఇల్లు కొనుక్కోవాలని చూస్తున్నాం. కానీ మాకు ఎక్కడా కుదిరేది కాదు. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. చివరికి నేను సాయినాథునికి నా కోరిక చెప్పుకుని, "(అది) త్వరగా నెరవేరితే, మీ బ్లాగులో పంచుకుంటాను బాబా" అని అనుకున్నాను. బాబా దయవలన ఒక సంవత్సరంలోనే మాకు మంచి ఇల్లు  కుదిరింది. సాయి కృపవలన నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. "చాలా చాలా ధ్యన్యవాదాలు బాబా. తొందరగా ఆ ఇంటికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేయించి మేమంతా సంతోషంగా ఉండేలా దీవించండి సాయి".



9 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Om sai ram i forgot leelas when I read here. I am old person.i keep my reading glasses some where and searching for glasses after some time I found my glasses.i forget everything. Om sai ram❤❤❤

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATHAYA NAMAH..OM SAI RAM

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Om sai ram sai me blessings tho na korika neraverchu thandri

    ReplyDelete
  6. Om sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo