1. 'ఏమీ భయపడకు! నేనెప్పుడూ కాపలా కాస్తున్నాను'
2. చిన్న సమస్యతో సరిపెట్టిన బాబా
'ఏమీ భయపడకు! నేనెప్పుడూ కాపలా కాస్తున్నాను'
ఓం నమో శ్రీ సాయినాథాయ. నేను విశాఖపట్నం నుండి వెంకట శ్రీదేవి. బాబా నాకు ప్రసాదించిన వివిధ అనుభవాలను మీతో పంచుకోవాలని ఇలా వ్రాస్తున్నాను. ముందుగా ఈ బ్లాగును ఆదరిస్తూ తమ తమ అనుభవాలను పంచుకుంటున్న భక్తులకు మరియు ఆయా అనుభవాలను భక్తుల మది పులకరించేలా కూర్చి అడుగడుగునా, అణువణువునా సాయితండ్రే నిండి ఉన్నారన్న నమ్మకంతో మన రోజును మొదలుపెట్టేలా బ్లాగును నిర్వహిస్తున్న సాయిబంధువులకు, ఇంకా సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నేను ప్రతి ఉదయం నా నిత్య దైవారాధన పూర్తికాగానే ముందుగా ఈ బ్లాగులోని భక్తులు అనుభవాలను (ఆధునిక సాయి సచ్చరిత్రను)చదివాక నా రోజువారీ పనులు మొదలుపెడతాను.
నేను గత ఒకటిన్నర సంవత్సరంగా ద్వారకాతిరుమల వెళ్లి మ్రొక్కు తీర్చుకోవాలని చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నాను. కానీ పలురకాల కారణాల వల్ల అది వాయిదాపడుతూ వచ్చింది. విచిత్రంగా, 2021 వినాయకచవితి సమయంలో వరుసగా మూడురోజులు సెలవులు వచ్చాయి. ఇక అప్పుడు వెళ్ళొద్దామని నాకు బలంగా అనిపించింది. అయితే మావారికి శనివారం ఒక్కరోజే పర్మిషన్ దొరికింది. మరుసటిరోజు ఆదివారం అయినప్పటికీ ఆయన విశాఖలో ఉండాల్సిన పరిస్థితి అన్నమాట. కాబట్టి భక్తిశ్రద్ధలతో వినాయకచవితి జరుపుకుని మరునాడు శనివారం వేకువఝామున 5 గంటలకు ద్వారకాతిరుమల బయలుదేరాము. మాతోపాటు సాయిసచ్చరిత్ర, బాబా జీవితచరిత్ర, శిరిడీ నుండి తెచ్చుకున్న బాబా శేషవస్త్రం రక్షగా తీసుకుని వెళ్ళాము. ఎందుకంటే, కారులో ప్రయాణం, అదీ 24 గంటల్లో తిరిగి విశాఖ చేరుకోవాలి. అందువలన ఏ ఇబ్బందీ లేకుండా బాబానే మా ప్రయాణాన్ని సాఫీగా జరిపించాలని గట్టిగా సంకల్పించుకుని బయలుదేరాము. కొంతదూరం వెళ్ళాక నేను మన 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ ఓపెన్ చేశాను. అక్కడ 'బాబా దయతో ఎప్పటినుండో, ఎంతగానో అనుకుంటున్న తిరుపతి బాలాజీ దర్శనం ఎలా సాధ్యమయిందో, బాబా ఎలా తనకి మార్గం సుగమం చేశారో' ఒక భక్తురాలు పంచుకున్న అనుభవం కనబడగానే నా ఒళ్ళు పులకరించిపోయిందంటే నమ్మండి. ఆనందాశ్రువులతో ఆ భక్తురాలి అనుభవం చదివి ఎంతో ఆశ్చర్యపోయాను. నేను ఎదురుచూస్తున్నది ద్వారకాతిరుమల వెంకన్న దర్శనం కోసం, మ్రొక్కు తీర్చుకోవడానికైతే, ఆ భక్తురాలు తిరుపతి వెంకన్న దర్శనం కోసం. బాబా దయతో ఆమె కోరిక నెరవేర్చిన అనుభవం అదేరోజు బ్లాగులో రావడం, తద్వారా నేను కూడా వారి దయతోనే ద్వారకాతిరుమలకు బయలుదేరానని నాకు తెలిసేలా చేశారు బాబా. ఆయన దయతో ముందుగా అన్నవరం, తరువాత చిన్నతిరుపతి దర్శనాలు చక్కగా పూర్తిచేసుకున్నాము.
అక్కడినుండి భీమవరం మావుళ్ళమ్మవారి దర్శనానికి బయలుదేరాము. దారి కనుక్కుంటూ సాయంత్రం 6 గంటలకి భీమవరం చేరుకున్నాము. తృప్తిగా అమ్మవారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యాము. దారిలో ఒకచోట టీ స్టాల్ దగ్గర ఆగి విచారిస్తే, "తాడేపల్లిగూడెం రోడ్డు బాగాలేదు, వీరవాసరం వైపుగా వెళ్లి హైవేకి చేరుకోవచ్చు" అని చెప్పారు. దాంతో వాళ్ళు చెప్పిన మార్గంగుండా గూగుల్ మ్యాప్ సహాయంతో వెళదామనుకున్నాము. అయితే అప్పటికే చీకటి పడిపోయింది. దారులు తెలీవు, ఊరిపేర్లు తెలిపే బోర్డులు కూడా లేవు.
అందువలన వాళ్లని, వీళ్ళని అడుగుతూ కటిక చీకటి, గోతులమయమైన రహదారిలో ఎక్కడ ఏం జరిగినా, కారుకి రిపేర్ వచ్చినా మా పరిస్థితి ఊహకందనంత భయంకరంగా ఉంది. అయితే భయమెంత ఉన్నప్పటికీ మనకు బాబా అండగా ఉన్నారన్న నమ్మకం అంతకన్నా ఎక్కువగా ఉంది. నేను నా బ్యాగులో ఉన్న సాయిబాబా జీవితచరిత్ర పుస్తకం బయటకి తీసి కారు స్టీరింగు ముందుభాగంలో పెట్టి, "సాయీ! నా తండ్రీ! నువ్వే క్షేమంగా మమ్మల్ని ఇంటికి చేర్చాలి" అని దణ్ణం పెట్టుకున్నాను. పదేపదే బాబా చరణాలను గట్టిగా పట్టుకుని మనసులోనే ప్రార్థిస్తున్నాను. అంతలో ఒరిస్సా రిజిస్ట్రేషన్ గల ఒక తెల్లని కారు మా ముందు వెళ్తూ కనపడింది. దాని వెనుకభాగంలో సాయిబాబా స్టిక్కర్ ఉంది. వెంటనే నేను మావారితో, "అనుమానం లేదు. ఆ కారుని అనుసరిస్తూ పోండి" అని చెప్పాను. ఆ కారు వైజాగ్ వరకు వెళ్తుందని మేము అనుకున్నాముగానీ, కాదు. ఓ చోట ఆ కారు నడుపుతున్న అతనితో మాట్లాడితే, దగ్గరలో వాళ్ళ సొంత ఊరు ఉందనీ, ఇంకా మేము వెళ్లాల్సిన దారి కూడా చెప్పి ఒక మలుపు తీసుకుని వెళ్ళిపోయారు. చిమ్మచీకటి దారిలో సుమారు 35 కిలోమీటర్లు ఆ కారును అనుసరిస్తూ బాగా లైట్లు ఉన్న ఊరి వరకు చేరుకున్నాము. మా రెండు కార్లు తప్ప జన సంచారం కూడా లేని ఆ మార్గంలో బాబానే ఆ కారు రూపంలో మాకు తోడుగా ఉండి, మా ప్రయాణాన్ని ముందుకు నడిపించారు. మొత్తానికి అతికష్టంమీద పెనుగొండ జంక్షన్‍కి చేరుకున్నాము. అక్కడ మలుపు తిరిగితే హైవేకి చేరుకుంటామని అనుకున్నాము. కానీ మావారు ఒక ఆటోడ్రైవరుని అడిగితే, పెరవలి వరకూ వెళ్లాలన్నారు. అంటే, మరో 20 కిలోమీటర్ల దూరమన్నమాట. కొంతదూరం వెళ్ళాక ఒక బడ్డీకొట్టు దగ్గర జనం కనిపించారు. నేను మావారితో, "వాళ్ళని అడిగి చూద్దాం. ఇప్పటికే 8:45 అయింది. నాకెందుకో ఆ జనాన్ని అడగమని బాబా ప్రేరణ ఇస్తున్నారు" అని అన్నాను. వాళ్ళని అడిగితే వాళ్ళు, "పెరవలి వరకూ ఎందుకు?" అని చెప్పి, ఆ బడ్డీకి పక్కనే ఉన్న ఒక చిన్న రోడ్డు చూపించి, "ఈ రోడ్డు గుండా వెళితే 3 కిలోమీటర్ల ప్రయాణంతో హైవే చేరుకుంటారు" అని చెప్పారు. దాంతో ఆ మార్గాన్ని బాబానే చూపించారని ఆ మార్గంగుండా ప్రయాణం సాగించాము. చిమ్మచీకటిమయమైన ఆ ఇరుకు మార్గం వెంబడి మూడు కిలోమీటర్లు ప్రయాణించేసరికి నేషనల్ హైవే వచ్చింది. ఉదయం నుంచి ప్రయాణం చేసి చేసి అలసిపోయి ఉన్నాం, పైగా నిద్ర కూడా వస్తుంది. అయినా మా ప్రయాణాన్ని సాగించి వేకువఝామున 3:30కి ఇంటికి చేరుకున్నాము. మొత్తం యాత్రలో మాకు తోడుగా ఉండి క్షేమంగా ఇల్లు చేర్చింది బాబానే, సందేహమేమీలేదు. "ధన్యవాదాలు బాబా. ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకోవడంలో కొద్దిగా ఆలస్యమైనందుకు క్షమించండి బాబా".
2021, సెప్టెంబర్ 23, గురువారం నేను స్కూలుకి బయలుదేరే హడావిడిలో నా చెవిదిద్దు ఎక్కడో పడేసుకున్నాను. స్కూలుకు వెళ్ళాక ఆ విషయం గ్రహించి, 'ఎక్కడ పడిపోయిందో ఏమిటో, ఇక అది దొరకద'ని ఆశ వదిలేసాను. తరువాత ఎందుకో నా మనసుకి నేను క్యాబ్ ఎక్కిన ప్రదేశంలో పడిపోయిందేమోననిపించి మనసులో, "చెవిదిద్దు దొరకాల"ని బాబాని వేడుకుంటూ ఎందుకైనా మంచిందని ఇంటికి ఫోన్ చేశాను. బాబా దయవల్ల అది ఇంటిలోనే దొరికింది.
2021, సెప్టెంబర్ 30, గురువారంనాడు ఉదయం 4 గంటలకే లేవాల్సిన నేను 5.10కి లేచాను. హడావిడిగా వంట మొదలుపెట్టి బాబాకు నైవేద్యంగా కిచిడి తయారుచేసాను. తరువాత పూజ చేస్తూ కొబ్బరికాయ తెచ్చివ్వమని మా పాపని అడిగాను. తను తెచ్చివ్వగానే అది నా చేతిలోంచి జారిపోయి కిందపడి పగిలింది. చూస్తే, ఆ కాయ కుళ్ళిపోయి ఉంది. నాకు టైం అయిపోతుండటంతో ఇంకేమీ పట్టించుకోకుండా హడావుడిగా దేవుడికి హారతి ఇచ్చి స్కూలుకి బయలుదేరిపోయాను. తరువాత మా పనమ్మాయి వచ్చి పని పూర్తి చేసుకుని వెళ్ళింది. తను అలా వెళ్లిన పది నిమిషాలకి గ్రానైట్ సింక్ పెద్ద శబ్దంతో ఒకపైపు భాగం క్రిందపడి విరిగిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేనందున ఎవరికీ ఏ గాయాలు కాలేదు. జరిగిన సంఘటన దృశ్యాలను మా పాప ఫోటో తీసి స్కూల్లో ఉన్న నాకు పంపింది. అవి చూడగానే అప్పటికి రెండురోజుల ముందు బ్లాగులో నేను చూసిన, "ఏమీ భయపడకు. నేనెప్పుడూ నీ ఇంటికి కాపాలా కాస్తున్నాను" అన్న బాబా సందేశం గుర్తుకొచ్చి, బాబా నన్ను పెద్ద ప్రమాదం నుండి కాపాడారని మనసులోనే బాబాకు నమస్కరించుకుని కృతఙ్ఞతలు చెప్పుకున్నాను. ఎందుకంటే, సాధారణంగా నేను ఎప్పుడూ పగిలిన ఆ సింక్ అంచుపైనే కొబ్బరికాయ కొడతాను. ఆరోజు కొబ్బరికాయ చేయిజారి కింద పడకుండా ఉంటే, నేను దాన్ని తీసుకుని వెళ్లి ఆ సింక్ అంచుపైనే కొట్టేదాన్ని. అదే జరిగితే ఆ బరువైన గ్రానైట్ పలకలు అప్పుడే పగిలి నా కాళ్ళ మీద పడి గాయాల పాలయ్యేదాన్ని. అసలే నేను డయాబెటిక్ అయినందున గాయాల నుండి తేరుకోవడానికి చాలా సమయం పట్టేది. అంతటి కష్టం నాకు రానివ్వకుండా నన్ను రక్షించడానికే నా చేతినుండి కొబ్బరికాయ జారిపోయేలా చేసారు బాబా. చూసారా! ఆ సర్వాంతర్యామి లీలలు. అంతటితో ఆయన లీల అయిపోలేదు.
అదేరోజు సాయంత్రం నేను స్కూలు నుండి తిరిగి వస్తున్నప్పుడు 5:30 - 6 గంటల మధ్యలో క్యాబ్‍లో నా స్నేహితురాలు విజయతో ఉదయం జరిగిన సాయి మహిమ గురించి పంచుకుంటుంటే మా స్కూల్లో మాథ్స్ టీచర్ అయిన పద్మజగారు వింటూ అనాలోచితంగా బాబాని తలుచుకున్నారు. సరిగ్గా అదే సమయంలో పద్మజ గారింట్లో ఆమె కూతురు పెరట్లోకి వెళ్ళబోతూ ఒక అడుగు బయటకు వేసి, రెండో అడుగు వేయబోతుండగా ఒక పెద్ద నాగుపాము బుసకొడుతూ తనపైకి వచ్చిందట. తక్షణం అప్రమత్తురాలైన ఆ పాప పరుగున ఇంటి లోపలికి వెళ్లి తలుపు వేసుకుందట. పాప చూడకుండా అడుగు వేసుంటే చాలా ప్రమాదం జరిగేది. ఆ పాపని బాబానే కాపాడారు. ఈ విషయాన్ని తాను బాబా లీలలు వింటున్న సమయంలోనే బాబా ఈ అద్భుతం చేసారని పద్మజగారు ఉద్వేగంతో చెప్పారు. "బాబా! దయగల ఓ తండ్రీ! సర్వవేళ, సర్వావస్థలందు మీరు ఇదేవిధంగా మమ్మల్ని కాపాడండి. మా అనారోగ్య సమస్యలను తొలగించి సర్వశుభములు చేకూరేలా ఆశీర్వదించండి".
చిన్న సమస్యతో సరిపెట్టిన బాబా
నా పేరు యశోద. మాది అనంతపురం. ముందుగా ఈ బ్లాగును నిర్వహిస్తున్న వారికి నమస్కారాలు. నేను ఇంతకుముందు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలు ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. మా అమ్మాయి నాగశ్వేత, మా అల్లుడు, మనవడు స్వీడన్‍లో నివాసముంటున్నారు. 2021, సెప్టెంబర్ నెల చివరి వారంలో మా అమ్మాయి మెట్ల మీద నుంచి జారిపడటంతో కాలు మలబడి బాగా వాపొచ్చి తను నడవలేకపోయింది. ఆ విషయం తెలిసి తన కాలు ఫ్రాక్చర్ అయ్యిందేమోనని నేను చాలా భయపడ్డాను. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో నేను స్వీడన్ వెళ్ళలేను. వెంటనే నేను మన తండ్రి సాయినాథునికి నమస్కరించుకుని, "అమ్మాయి కాలుకి ఫ్రాక్చర్ కాదు, చిన్న దెబ్బ, తగ్గిపోతుందని డాక్టరు చెప్పినట్లయితే, ఈ అనుభవాన్ని బ్లాగు ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకుంటాన"ని మొక్కుకున్నాను. డాక్టర్లు టెస్టులు చేసి, "కాలుకి చిన్న క్రాక్ వచ్చింది. పదిరోజుల్లో తగ్గిపోతుంద"ని చెప్పారు. ఆ విషయం తెలిసి నేను ఎంతలా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానో ఆయనకే తెలుసు. "బాబా! ఇలాగే మా అందరి మీద కరుణ చూపించు తండ్రి. మా అమ్మాయి విషయంలో ఇంకొక సమస్య ఉంది. అది కూడా మీరే తీరుస్తారని ఆశిస్తున్నాను. తొందరగా ఆ సమస్యను తీరుస్తారని నమ్ముతున్నాను బాబా". బాబాకి చెప్పుకున్న ఆ సమస్య తీరితే మరల మీ ముందుకు వస్తాను.
ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteJaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness.jai sairam
ReplyDeleteOm sai ram 1st sai leela is best.sai saved his devotee every mininute.that is sai power .
ReplyDeleteOM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram
ReplyDeleteOm sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha
ReplyDelete🕉 sai Ram
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🤗🌸😃🌹🥰🌺😀🌼💕
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete