ఈ భాగంలో అనుభవాలు:
1. సాయికి దణ్ణం పెట్టుకున్న పది నిముషాల్లో దొరికిన డబ్బులు
2. బాబా కృప
3. బాబాని ప్రార్థించాక దొరికిన గొలుసు
సాయికి దణ్ణం పెట్టుకున్న పది నిముషాల్లో దొరికిన డబ్బులు
ఓం శ్రీసాయినాథాయ నమః. సాయి బంధువులందరికీ నమస్కారాలు. నేను ఒక సాయిభక్తుడిని. ఏ చిన్న విషయంలోనైనా నేను ఇబ్బందిపడితే, నాకు వెంటనే జ్ఞాపకం వచ్చేది సాయి నామం, సాయి రూపం మాత్రమే. మా ఇంటికి దగ్గరలో చిన్నపాటి నూకాలమ్మ గుడి ఉంది. ఆ గుడిని చూసుకొనేవాళ్ళ ఇంటిలోని వేరొకరు చనిపోవడం వలన ఏడాదిగా వాళ్ళు అమ్మవారి మంచి, చెడు చూసుకోలేకపోతుంటే నేను, మా ఇంటావిడ కలిసి ఆ గుడి బాధ్యతను స్వీకరించి మాకు తోచిన విధంగా మంచి, చెడు చూసుకున్నాము. ఆ బాధ్యతలో భాగంగా మేము అందరి ఆదరణతో అమ్మవారికి పుస్తెలతాడు, శతమానాలు చేయించాము. ఆ బాధ్యత పూర్తికాగానే అమ్మవారికి వెండి కాసులపేరు చేయిద్దామని నిర్ణయించుకొని భక్తుల నుండి చందాలు వసూలు చేస్తే 10,000 రూపాయలు వచ్చాయి. కానీ షాపువాళ్ళు 20,000 రూపాయలు అడిగారు. నేను సరేనని 5,000 అడ్వాన్స్ ఇచ్చి మిగిలిన 5,000 చిన్న పర్సులో ఉంచి, దాన్ని ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఎంత కాదనుకున్నా అవి అమ్మవారి సొమ్ము. కాబట్టి భుజాలు భుజాలు నొప్పి పుట్టేలా వారం రోజులు ఆ పర్సుకోసం ఇల్లంతా ఎంత గాలించినా అది దొరకలేదు. అలాంటి పరిస్థితిలో నాకు ఉన్న ఒకేఒక్క దిక్కు మన సాయినాథుడు. ఆయన్ని తలుచుకొని, "బాబా! దయచేసి ఆ పర్సు దొరికేటట్టు చేయండి. ప్లీజ్ బాబా. అవి అమ్మవారి సొమ్ము. నిన్ను వేడుకుంటే దొరుకుతాయనే నమ్మకం నాకుంది. పర్సు దొరికిన వెంటనే నీ సన్నిధికి వస్తాను. ఈ ఆనందం సాయిబంధువులందరికీ పంచుతాను" అని దణ్ణం పెట్టుకొని మళ్ళీ వెతికాను. పది నిమిషాల్లో ఆ పర్సు దొరికింది. వారం రోజులుగా దొరకనిది పది నిమిషాలు దొరకటం నిజంగా ఆశ్చర్యం. ఇది సాయి మహిమ కాక ఇంకేమిటి? మరుసటి శుక్రవారం సాయి దర్శనమునకు వెళ్లి నా ఆనందం మీతో ఇలా పంచుకున్నాను. సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
బాబా కృప
నా పేరు రవి. నేను ఇంతకు మునుపు బాబాతో నాకున్న అనుబంధం గురించి, అలాగే ఆయన కృపతో నేను పొందిన కొన్ని అనుభవాలను పంచుకున్నాను. ఇప్పుడు ఇంకొక అనుభవాన్ని తోటి సాయిబంధువులతో పంచుకుంటున్నాను. నేను నా భార్య 40వ పుట్టినరోజు సందర్భంగా ఆమెకోసం ఒక సర్ప్రైజ్ వేడుకను ప్లాన్ చేయాలని అనుకున్నాను. సన్నిహిత బంధువులను, స్నేహితులను సంప్రదించి మొత్తం ప్రణాళిక వేసి, ఆ వేడుకను ప్రత్యేకంగా, గుర్తుండిపోయేలా చేయడానికి పెద్ద పడవలో పార్టీ ఏర్పాటు చేసి ఏర్పాట్లన్నీ గోప్యంగా చేశాను. అయితే వాతావరణం ఎలా ఉంటుందో అన్న ఆందోళనతోపాటు, చాలామంది అతిథులకు ఈత రాకపోవడం వల్ల కొంత టెన్షన్గా అనిపించింది. అంతేకాక పార్టీకి ముందు జరిగిన కొన్ని సంఘటనలు నా భార్య మనసుని ప్రభావితం చేయడంతో ఆమె బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని అనుకుంది. దాంతో నేను మరింత ఆందోళనకు గురై, "అన్నీ బాగా జరగాల"ని బాబాను ప్రార్థించాను. తర్వాత పార్టీకి ఒక వారం ఉందనగా నేను సాయి సచ్చరిత్ర పారాయణ ప్రారంభించి బుధవారంకి పూర్తి చేశాను. మర్నాడు గురువారం నేను ఎప్పటిలాగే బాబాకు అభిషేకం చేసి, పూజ పూర్తి చేసాను. ఆరోజు సాయంత్రం బాబా గుడికి వెళితే, బాబా కృపవల్ల ఆయనకి అభిషేకం చేసే అవకాశం లభించింది. ఎంతో సంతృప్తికరమైన దర్శనంతో నా మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. బాబా దయవల్ల తరువాత రోజు ప్లాన్ చేసిన సర్ప్రైజ్ పార్టీ ఎంతో విజయవంతంగా జరిగింది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందించారు. వేడుక అందరికీ గుర్తుండిపోయే మధురానుభూతిగా మిగిలింది. ఇదంతా బాబా కృప వల్లే జరిగిందని నేను నమ్ముతున్నాను. బాబాకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
బాబాని ప్రార్థించాక దొరికిన గొలుసు
నా పేరు కనకదుర్గ. మాది ఖమ్మం. సాయిభక్తుల అనుభవాలు చదువుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఒకరోజు మా అమ్మ, "బంగారు గొలుసు ఎక్కడో పెట్టాను, దొరకట్లేదు" అని చెప్పింది. దాంతో మేము ఇంట్లో మొత్తం వెతికాము, బీరువాలో చూసాం. కానీ ఎక్కడా ఆ గొలుసు దొరకలేదు. ఇంకా గొలుసు పోయింది అనుకున్నాం. కానీ నేను బాబా మీద నమ్మకంతో, "బాబా! దయచేసి గొలుసు దొరికేలా చేయండి" అని బాబాను వేడుకొని మరోసారి వెతకడం మొదలుపెట్టాను. బాబా దయ చూపించారు. గొలుసు బీరువాలోని ఒక చిన్న డబ్బాలో దొరికింది. నిజానికి అదివరకు అదే బీరువాలో ఒక 3సార్లు వెతికాను. అప్పుడు దొరకనిది బాబాను ప్రార్థించాక దొరికింది. ఇది బాబా లీలనే. "ధన్యవాదాలు బాబా. చాలా చాలా ధన్యవాదాలు. ఇదే దయతో నేను ప్రేమించిన అతనితో నా పెళ్లి జరిపించండి బాబా ప్లీజ్".
