ఈ భాగంలో అనుభవం:
కాన్పు సమయంలో, తర్వాత బాబా అనుగ్రహం
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!! నేను ఒక సాయిభక్తురాలిని. బాబా ప్రతిక్షణం నా క్షేమాన్ని చూస్తుంటారన్న దానికి నిదర్శనం నా అనుభవాలే. నా మనసు బాగలేనప్పుడు నేను వాటినే మళ్ళీమళ్ళీ తలుచుకొని, 'ఆ సమస్యల నుండి గట్టెక్కించిన బాబా ఇప్పుడు కూడా నన్ను అనుగ్రహిస్తారని' నమ్మకం వహిస్తాను. ఇకపోతే, నేనిప్పుడు కొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. వాటిలో ఒకటి నేను ఎలా జరగాలని కోరుకున్నానో అలానే జరిపించారు బాబా. నేను 9 నెలల గర్భవతిగా ఉన్నపుడు నా మలద్వారం వద్ద పుండు లేచింది. మొదట మొలలు ఏమో! గర్భంతో ఉన్నప్పుడు సాధారణంగా వస్తాయనుకున్నాను. కానీ రోజురోజుకి నొప్పి ఎక్కువై కూర్చోలేని పరిస్థితి వచ్చి డాక్టర్ దగ్గరకి వెళ్తే, "అది చీము గడ్డ. యాంటీబయాటిక్స్ ఇస్తాను. వాటికి తగ్గకపోతే చిన్న సర్జికల్ ప్రాసెస్ చేయించుకోవాల్సి ఉంటుంది" అని చెప్పింది. మరో 15 రోజుల్లో కాన్పు ఉండగా ఆ సమస్య వచ్చినందుకు నేను చాలా ఆందోళన చెందాను. నొప్పి తీవ్రమై నేను కూర్చోలేని, పడుకోలేని, నిలబడలేని పరిస్థితితో 2 రోజులు చాలా బాధపడుతూ తట్టుకోలేక ఏడ్చాను. మా నాన్న నా బాధ చూడలేక డాక్టర్లకి ఫోన్ చేసి మాట్లాడటం మొదలుపెట్టారు. దూరంలో ఉండే హాస్పిటల్ అయితే నేను వెళ్ళలేనని దగ్గర్లో ఉండే డాక్టర్కి ఫోన్ చేస్తే, ఆయన "వెంటనే వస్తే, సర్జికల్ ప్రొసీజర్ చేస్తాను. నొప్పి ఉండదు, రండి" అని చెప్పారు. నేను చాలా కష్టపడుతూ వెళ్లి, డాక్టర్ గది ముందు అతి ప్రయాసతో కూర్చున్నాను. అప్పుడు నాకు బాబా చరిత్రలోని పిళ్ళై నారి కురుపుల లీల గుర్తుకు వచ్చి, "ఆ లీలలో లాగా నా బాధను మరుజన్మకి వాయిదా వేయమని" బాబాను ప్రార్థించాను. తర్వాత డాక్టర్ పిలిచారు. నేను లోపలకి వెళ్ళాక ఆయన పరీక్షిస్తుంటే అద్భుతం జరిగింది. పిళ్ళై కురుపులాగా నాకున్న పుండు పగిలిపోయింది. సర్జికల్ ప్రొసీజర్ లేకుండానే ఆ పుండు బాధ తగ్గింది. డాక్టర్ "పుండు పగిలింది. నర్సుతో క్లీన్ చేయించుకొని వెళ్ళండి" అని అన్నారు. నర్స్ క్లీన్ చేసేటప్పుడు నొప్పి కలిగినప్పటికీ క్లీనింగ్ అవ్వగానే అప్పటిదాకా పడ్డ బాధ అంతా నిమిషాల్లో తగ్గిపోయింది. ఏడుస్తూ హాస్పిటల్కి వెళ్లిన నేను నొప్పి తగ్గి ప్రశాంతంగా ఇంటికి వచ్చాను. నా చేత పిళ్ళైలా కర్మఫలం అనుభవింపజేసి నిమిషాల్లో నన్ను మామూలుగా చేసారు బాబా.
ఇక నా మరో అనుభవం నానాచందోర్కర్ కుమార్తె మైనతాయి అనుభవం లాంటిది. నా కాన్పుకి నిర్ణయించిన రోజు నేను వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. నాకు నొప్పులు రావడానికి సెలైన్ పెట్టారు. ఒకపక్క నొప్పులు తట్టుకోగలనో, లేదో అని, ఇంకోపక్క నొప్పులు రాకపోతే సి సెక్షన్ చేయించుకోవాల్సి వస్తుంది అన్న భయాలతో నాకు చాలా గాబరాగా అనిపించింది. అయితే 3 రోజులైన నొప్పులు రాకపోయేసరికి డాక్టర్ ఆపరేషన్ చేస్తామన్నారు. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "నాకు ఆపరేషన్ వద్దు బాబా. నొప్పులు వచ్చి నార్మల్ డెలివరీ అయితే బాగుంటుంది" అని అనుకున్నాను. ఆ తర్వాత వేరే డ్యూటీ డాక్టర్ వచ్చి, పరీక్ష చేసి, "స్కాన్ తీసి నెల అవుతోంది కాబట్టి ఇంకోసారి తీయించండి. ఎందుకు నొప్పులు రావడం లేదో అర్థమవుతుంది" అని చెప్పింది. మేము వెళ్ళి స్కాన్ తీయిస్తే, అందులో అంత నార్మల్గానే ఉంది. ఆ స్కాన్ రిపోర్ట్ ప్రకారం కాన్పుకి ఇంకా ఒక వారం ఉందని తేలింది. మొదటి డాక్టరు, "నొప్పులు రావడానికి 3 రోజులు సెలైన్ పెట్టినందువల్ల ఇక నార్మల్ కాన్పుకి వెయిట్ చేయొద్దనుకున్నాం కానీ, ఆమె స్కాన్ ప్రకారం ఇంకా టైమ్ ఉంది. కాబట్టి 4 రోజులు వెయిట్ చేద్దాం" అని చెప్పింది. నేను బాబా దయవల్ల అప్పటికి ఆపరేషన్ ఆగింది అనుకున్నాను. ఆ తర్వాత రెండో రోజు ఉమ్మ నీరు లీక్ అవడం, నొప్పులు కూడా మొదలవడం జరిగింది. నొప్పులు తీవ్రతరం అవుతున్నప్పుడు నాకు బాబా తప్ప ఇంకెవరూ గుర్తు రాలేదు. నన్ను ఆ వేదన నుండి తొందరగా బయటపడేయమని, లేకపోతే తన దగ్గరకైనా చేర్చుకోమని మనసులో కుమిలిపోయాను. "బిడ్డ పుట్టాక శిరిడీ తీసుకొచ్చి ద్వారకామాయిలో ఆయన పాదాల చెంత ఉంచుతాను" అని బాబాకి మొక్కుకున్నాను. ఇంకా బాబా చరిత్రలోని మైనతాయి లీల తలుచుకుంటూ గడిపాను. తన బిడ్డ బాధ చూడలేక కాబోలు ఆ తండ్రి 6 గంటల్లో నాకు ప్రసవం అయ్యేలా అనుగ్రహించారు. చాలామందికి 24 గంటలు, 12 గంటలు ఉండే పురిటి నొప్పులు నాకు కేవలం 6 గంటలు ఉండటం బాబా అనుగ్రహంగా భావించాను. అన్నిటికంటే పెద్ద వరం నాకు బాబు పుట్టడం. ఎందుకిలా అంటున్నానంటే, మా ఇంట్లో మేము ఇద్దరం ఆడపిల్లలం. అందుకని నాకు బాబు పుట్టాలని కోరుకున్నాము. దాన్ని బాబా నెరవేర్చారు. త్వరలోనే నా మొక్కు తీర్చుకోవడానికి శిరిడీ వెళ్తాను. ఇకపోతే, కాన్పు అనంతరం నా కాళ్ళు పట్టుకుపోయి 15 రోజులు నడవలేకపోయాను. కానీ బాబా అనుగ్రహం వల్లనే కొద్దిరోజుల్లో నేను మామూలు అయ్యాను. ఆ తర్వాత ఒక వారందాకా మా బాబుకి నా పాలు తాగడం అలవాటు కాలేదు. అప్పుడు మళ్ళీ బాబానే దిక్కు అని, ఆయన్ని ప్రార్థించుకున్నాక బాబు పాలు తాగడం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడు మళ్ళీ తాగేవాడు కాదు గాని, బాబాకి మ్రొక్కుకున్నంతనే తాగేవాడు. ఇలా డెలివరీ అప్పుడు, డెలివరీ తర్వాత బాబా నన్ను అనుగ్రహించారు. ఈ విధంగా ఆయన ప్రతిక్షణం నా మొర ఆలకిస్తూ, నా కోరికలు తీరుస్తూ నాకు క్షేమమైనది చేస్తూ నన్ను అనుగ్రహిస్తున్నారు. ఆయనను నమ్మడమే మనం చేయాల్సింది. ఆయన చేసేదే మనకు శ్రేయస్కరం. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!