సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1704వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అయ్యగారి రూపంలో బాబా సహాయం
2. పెద్ద కష్టం నుండి కాపాడిన బాబా

అయ్యగారి రూపంలో బాబా సహాయం


నేను ఒక సాయి భక్తురాలిని. మాది ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట. గత సంవత్సరం నేను చాలా బాధల్లో, ఇబ్బందుల్లో ఉండి మానసిక వేదనను అనుభవిస్తూ తట్టుకోలేక 2022, సెప్టెంబర్ 28న ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేమిటంటే, నేను మా అత్తింటిలో ఉండకుండా మా అమ్మవాళ్ళింటికి గానీ, ఇంకెక్కడికైనా వెళ్లి ఆధ్యాత్మిక జీవనం సాగిద్దామని. అటువంటి సమయంలో ఒక అయ్యగారు వచ్చి నాకు అన్ని విషయాలు చెబుతూ, ముందు చూపుతో జరగబోయే వాటిని కూడా చెప్పారు. నేను, "మీరు చెప్పేవి నమ్మాలంటే నాకు మీరు ఏదైనా సహాయం చేయాలి" అని చెప్పి, నేను తీసుకున్న నిర్ణయం గురించి తెలియజేసి నేను ఇంత బాధల్లో ఉన్నానని అన్నాను. అప్పుడు ఆయన, "నేను ఆ బాధను తీర్చడానికే వచ్చానమ్మా! నా మాట నమ్ము" అని అన్నారు. ఆ రోజు మొదలు ఈరోజు వరకు ఆయన ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకి మా ఇంటికి వస్తున్నారు. ఆయన నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా సమస్యలన్ని ఒక్కొక్కటిగా నేను ఊహించని విధంగా పరిష్కారమయ్యాయి. నేను, నా భర్త చాలా సంతోషంగా ఉన్నాము. ఆ అయ్యవారి రూపంలో బాబానే నాకు సహాయం చేస్తున్నారని నా నమ్మకం.


ఇకపోతే, 18 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఏ గుడికి గానీ, పుణ్యక్షేత్రాలకు గానీ వెళ్లే అవకాశం మాకు రాలేదు. ఎందుకంటే, మాది ట్రాన్స్పోర్ట్ వ్యాపారం. దాన్ని వదిలేసి వెళ్ళడానికి కుదిరేది కాదు. అదీకాక మా అత్తగారు, మామగారు, మా పెద్ద మామగార్ల బాధ్యతలన్నీ చూసుకుంటూ మేము ఎక్కడికీ వెళ్లలేకపోయేవాళ్ళం. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా మా వ్యాపారం వల్ల ఎటూ వెళ్లలేకపోతుండేవాళ్ళము. అయ్యగారు నా జీవితంలోకి వచ్చాక మమ్మల్ని మొదటగా దగ్గర్లో ఉన్న ముక్తేశ్వరపురం, వేలాద్రి, గరుడాచలము వంటి గుళ్లకు వెళ్లి రమ్మన్నారు. అయితే నేను వికలాంగురాలిని. నాకు నడిచే స్తొమత లేదు. మా పెళ్లయిన కొత్తలో మా అత్తగారువాళ్ళు మమ్మల్ని శిరిడీ తీసుకొస్తామని బాబాకి దణ్ణం పెట్టుకున్నారు. కానీ 18 సంవత్సరాలుగా శిరిడీ వెళ్లే అవకాశం దొరకలేదు. ఒకవేళ వెళదామన్నా నాకు వెళ్లాలంటే భయం. నడక, ఆ ప్రయాణాలు నేను చేయలేను. అందువల్ల అవన్నీ పెట్టుకోవద్దని అనుకున్నాను. ఈ విషయాలన్నీ అయ్యగారికి తెలిసి, "నీకు ఎటువంటి భయం లేదు. నేను దగ్గరుండి మిమ్మల్ని శిరిడీ తీసుకెళ్లి, తీసుకొస్తాను" అని ధైర్యం చెప్పి నన్ను, మావారిని, మాతోపాటు మరో 22 మందిని శిరిడీకి పంపించారు. మంచిగా బాబా దర్శనం చేసుకొని తిరిగి వచ్చాము. అప్పుడు అయ్యగారు, "అమ్మా! దర్శనం బాగా అయిందా?" అని అడిగారు. నేను, "అంతా బాగా జరిగింది కానీ, ద్వారకామాయి లోపలికి వెళ్ళలేదు, కొబ్బరికాయ ధునిలో వేయలేదు, ఊదీ తెచ్చుకోలేదు స్వామి" అని చాలా బాధతో అన్నాను. అప్పుడాయన, "నువ్వు శిరిడీ నుండి చిన్న బాబా విగ్రహాలు తెచ్చుకున్నావు కదా! రావి ఆకులో బాబా విగ్రహాన్ని పెట్టి నీ పూజ మందిరంలో పెట్టుకో. ఒక అద్భుతం జరుగుతుంది" అని చెప్పారు. మేము ఆయన చెప్పినట్లుగా రావి ఆకు తెచ్చుకొని, దానిమీద చిన్న బాబా విగ్రహం పెట్టి దణ్ణం పెట్టుకున్నాం. ఒక్క గంటలో ఊదీ వచ్చింది. ధుని వద్దకి వెళ్ళలేదని బాధపడుతున్నందుకు బాబానే స్వయంగా మాకు ఊదీ ప్రసాదించారని బాబాకి దణ్ణం పెట్టుకొని చాలా సంతోషించాం. ఆ రోజు అంటే 2023, ఏప్రిల్ 6 నుంచి ఈరోజు వరకు ఊదీ వస్తూనే ఉంది. ఆ ఊదీ ఔషధంలా పనిచేస్తుందని అయ్యవారు చెప్పినందువల్ల మేము ఆ ఊదీ అంతా భద్రంగా భద్రపరుచుకుంటున్నాము. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

పెద్ద కష్టం నుండి కాపాడిన బాబా


సాయిబంధువులందరికీ నమస్కారాలు. నా పేరు వెంకటేష్. మాది నంద్యాల. నా జీవితంలో నాకు ఎదురైన పెద్ద కష్టం నుండి బాబా నన్ను ఎలా కాపాడారో నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఒకసారి మేము ఒకరి స్థలాన్ని తాకట్టు పెట్టుకొని కొంత డబ్బు వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు ఒక సంవత్సరం తర్వాత మా డబ్బు మాకు  వెనక్కి ఇచ్చి, వాళ్ళ స్థలం వాళ్ళు విడిపించుకున్నారు. అక్కడితో అంతా అయిపోయింది. మా డబ్బు మాకు వచ్చినందుకు మేము సంతోషంగా ఉన్నాము. తర్వాత పది నెలలకి హఠాత్తుగా నాకు పోలీస్ స్టేషన్ నుండి వాళ్ళు నా మీద కేసు పెట్టారని ఫోన్ వచ్చింది. అది విని నేను హడలిపోయాను. కాస్త ధైర్యం తెచ్చుకొని అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకొని పోలీసు స్టేషన్‌కి వెళ్లి మొత్తం డాక్యుమెంట్లన్నీ పోలీసులకు చూపించాను. వాళ్ళు అన్ని చూసి సరిగానే ఉన్నాయి అన్నారు కానీ, అవతలివాళ్ళ తరఫున సాక్షి సంతకం పెట్టినవాళ్ళను తీసుకొని రమ్మన్నారు. అసలు వాళ్ళ తరుఫు సాక్షిదారులను మేము ఎలా తీసుకొచ్చేది అని అనిపించింది. అయినా వాళ్ళకోసం విచారిస్తుంటే, ఇద్దరు సాక్షుల్లో ఒకరు మరణించారని తెలిసింది. రెండో అతనికి కాల్ చేస్తే, లిఫ్ట్ చేయలేదు. అప్పుడు నాకు ఏమీ చేయాలో అర్థంకాక, "బాబా! నన్ను ఈ కేసు నుండి ఎలా అయినా బయటపడేయండి" అని బాబాను బ్రతిమాలుకున్నాను. బాబా దయవల్ల సిఐగారు ఆ సాక్షిని తీసుకొని రమ్మని ఒక కానిస్టేబుల్‌ని అతని ఇంటికి పంపారు. అతను వచ్చి మూడు నిమిషాల్లో నాకు ఫెవర్‌గా చెప్పాడు. దాంతో ఆ కేసు నుంచి నా పేరు తొలగించారు. "ధన్యవాదాలు బాబా. నాకెంతో ఇష్టమైన మా అమ్మ ఆరోగ్యం క్షిణించింది. దయచేసి తన ఆరోగ్యం బాగుండేలా చేయి తండ్రీ".


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo