ఈ భాగంలో అనుభవం:
- బాబా చూపిన దయ - 2వ భాగం
సాయి బంధువులందరికీ నమస్కారాలు. నా పేరు శాంతి. మేము అమెరికాలో ఉంటున్నాము. నేను ఇదివరకు ఒక కన్సల్టెన్సీలో కాంట్రాక్టు ఉద్యోగం చేశాను. ఆ కన్సల్టెన్సీవాళ్ళు ప్రతి నెల 15వ తారీకుకి జీతం వేసేవాళ్ళు. నేను చేస్తున్న ప్రాజెక్టు జూన్ నెలలో అయిపోయాక జూలై 15కి రావాల్సిన జీతం నా అకౌంట్లో పడలేదు. నేను, నా సహోద్యోగి వెండర్‌తో సెటిల్మెంట్ అవ్వలేదేమో అనుకొని ఉరుకున్నాము. అయితే తర్వాత నెల 15వ తేదీ వచ్చినా జీతం రాలేదు. నా సహోద్యోగిని అడిగితే, తనకి వచ్చిందని చెప్పాడు. దాంతో నేను కన్సల్టెన్సీవాళ్లకి మెసేజ్ చేశాను. కానీ వాళ్ళు నాకు రిప్లై ఇవ్వలేదు. ఇంకా వాళ్ళకి నాకు జీతం ఇచ్చే ఉద్దేశం లేదేమోననిపించి చాలా బాధేసింది. నెలంతా కష్టపడి పనిచేస్తే జీతం ఇవ్వకపోవడమేంటని చాలా ఏడుపొచ్చింది. చేతిలో ఉద్యోగం లేదు, రావాల్సిన డబ్బులు ఇవ్వట్లేదని ఏడ్చుకుంటూ బాబాని, "వాళ్ళు అంత అన్యాయం చేస్తుంటే మీరు ఎలా ఊరుకుంటున్నారు బాబా?" అని ప్రార్ధిస్తూ ఉండేదాన్ని. ఎప్పుడూ నా కళ్లలో నీళ్లు తిరుగుతుండేవి. అలా కొన్నిరోజులు గడిచాక కన్సల్టెన్ సీవాళ్ళు నా అకౌంట్ డిటైల్స్ మళ్ళీ పంపించమని మెసేజ్ పెట్టారు. నేను రిప్లై ఇచ్చిన వెంటనే నా అకౌంటులో డబ్బులు వేశారు. అంతేకాదు, మేము డబ్బులు వేసాము, ట్రాన్సాక్షన్ ఎలా మిస్ అయిందో అన్నారు. ఏదైతేనేం నాకు రావాల్సిన జీతం నాకు వచ్చింది. అంతా బాబా కృపవల్లనే. ఆయనే వాళ్ళ మనసు మార్చి నాకు ఇప్పించారు. కొన్ని రోజులు చాలా ఏడ్చినప్పటికీ సదా బాబాని ప్రార్థిస్తూ, ఆయన ధ్యాసలోనే ఉంటూ బాబాకి చాలా దగ్గరయ్యాను. అందుకే కుంతీదేవి 'ఎప్పుడూ కష్టాలు రావాలి. అప్పుడే భగవంతుని ధ్యాసలో ఉండొచ్చు' అని కష్టాలు కోరుకునేదేమో అనిపిస్తుంది. "చాలా థాంక్స్ దేవా".
నేను కాంట్రాక్టు ఉద్యోగం పోయాక కాంట్రాక్టు ఉద్యోగలైతే ప్రాజెక్టు అయిపోయాక తీసేస్తారని, శాశ్వత ఉద్యోగం చూసుకోవాలనుకున్నాను. అయితే నేను చేసిన టెక్నాలజీలో టెన్షన్ ఎక్కువగా ఉంటుందని, వేరే టెక్నాలజీ మీద ఉద్యోగం కోసం ప్రయత్నిద్దామనుకున్నాను. కానీ ఇల్లు, పిల్లల్ని చూసుకొనే బాధ్యత ఉన్నందున కఠినమైన టెక్నాలజీలు తీసుకోలేను. సరే, నేను ముందు మార్కెట్లో ఏ టెక్నాలజీ బాగుందో తెలుసుకోవాలనుకున్నాను. ఉద్యోగం పోతూనే సాయి దివ్యపూజ చేశాను కానీ, ఫలితం కనిపించలేదు. రోజులు గడుస్తున్నా ఏమి చేయాలో, ఎవరిని సంప్రదించాలో అర్థం కాలేదు. రోజూ బాబాని, "మీరే ఎవరి ద్వారా అయినా నాకు మార్గం చూపించమ"ని ప్రార్థిస్తూ ఎవరు ఏ టెక్నాలజీ చెప్పినా బాబానే వాళ్ళ రూపంలో చెప్పిస్తున్నారని ఆ టెక్నాలజీలో ట్రైనింగ్ తీసుకునేదాన్ని. అలా ఎన్ని నేర్చుకున్నానో నాకు, బాబాకే తెలుసు. కానీ ఉద్యోగం రాలేదు. నెమ్మదిగా నాలో ఆత్మనూన్యత భావం మొదలైంది. ఆత్మగౌరవం లేదు, పండుగలు, పబ్బాలు లేవు. ఏదో కోల్పోయినదానిలా ఉండేదాన్ని. గ్యాప్ వల్ల అదివరకు చేసిన ఉద్యోగ అనుభవం కూడా మర్చిపోయినట్టు అయ్యింది. వయసు పెరుగుతుంది, ఇంకా ఎప్పుడు చదివేది, ఎప్పుడు ఉద్యోగం వచ్చేదని ఎప్పు డూ టెన్షన్‌గా ఉంటూ పిల్లలతో సరదాగా గడపలేకపోయేదాన్ని. నా భర్తకి సహాయం చేయలేకపోయేదాన్ని, పిల్లలు పెరుగుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి ఎలా మేనేజ్ చేయాలని చాలా బాధపడేదాన్ని. అయితే ఎప్పుడు ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ తెరిచినా 'ఉద్యోగం వస్తుందన్న' సానుకూల బాబా సందేశాలు వచ్చేవి. అవి చూసి 'ఎక్కడ నుంచి వస్తుంది బాబా?' అనుకునేదాన్ని. బాబా మాట తప్పరని తెలుసు కానీ, పరిస్థితులు అస్సలు ఆశాజనకంగా ఉండేవికావు. అలా ఉండగా కొన్నిరోజుల తరువాత సచ్చరిత్ర సప్తాహ పారాయణం చేస్తే, బాబా తప్పకుండ కరుణిస్తారని పారాయణ మొదలుపెట్ టాను. పారాయణ చదువుతూ కూడా ఏడ్చేదాన్ ని. కళ్ళు మండి చదవడానికి ఇబ్బందయ్యేది. అంతలా బాధపడేదాన్ని. అదే సమయంలో నాకు సాయి ఉపాధి గ్రూప్ గురించి తెలిసింది. ఆ గ్రూపులో ఉన్నవాళ్లు ఉద్యోగం రావాలనే సంకల్పంతో ఒక్కొక్కరు ఒక్కో అధ్యాయం చొప్పున సచ్చరిత్ర ప్రతిరోజూ చదువుతారు. నేను ఆ గ్రూపులో చేరాను. తర్వాత ఒకరోజు నా మేనల్లుడితో మాట్లాడుతూ ఒక టెక్నాలజీ గురించి నాకు అవగాహన వుంది, దాని మీద ఉద్యోగ ప్రయత్నం చేద్దామనుకుంటున్నానని చెప్పాను. అప్పుడు తను ఆ టెక్నాలజీ మీద ఒక ఉద్యోగ నోటిఫికేషన్ పడిందని ఒక లింక్ పంపాడు. అది తెరిచి చూస్తే, ఆ యాడ్ 2024, నవంబర్‌లో వేసారు. నేను చూసిందేమో 2025, జనవరిలో. ఒక్క వారం కింద ప్రకటనలకే దిక్కు ఉండదు. అలాంటిది ఇన్నిరోజులు తర్వాత అప్లై చేస్తే ఎవరు చూస్తారని వద్దులే అనుకున్నాను. కానీ రెండురోజుల తర్వాత ఎందుకో అప్లై ఐతే చేద్దాం, పోయిందేముందిలే అని అప్లై చేసాను. సరిగ్గా 4 రోజుల తరువాత ఆ కంపెనీ నుండి 'వీసా స్టేటస్ ఏంటి?' అని నాకు ఇమెయిల్ వచ్చింది. అది చూసి నేను షాకయ్యాను. ఎందుకంటే, ఎంతోమంది అప్లై చేస్తుంటారు, నా ప్రొఫైల్ ఏ మూలకో పోతుందని నాకు అస్సలు ఆశలు లేవు. కానీ బాబా దయవల్ల నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడమే కాకుండా ఆ ఒక్క రౌండ్ ఇంటర్వ్యూతోనే నాకు ఆ ఉద్యోగం కంఫర్మ్ చేసి మార్చి 3కి జాయినింగ్ తేదీ ఇచ్చారు. అదంతా జరుగుతున్న సమయంలో నేను పోయిన జన్మలో ఎంతోమంది ఉద్యోగాలు తీసుంటాను, అందుకే ఇంతలా అనుభవిస్తున్నానని బాబాని, "నేను నచ్చకపోతే కనీసం నా తల్లిదండ్రులు, అత్తమామల ముఖం చూసైనా నాకు ఉద్యోగ భిక్ష పెట్టండి" అని ప్రార్థిస్తూ బాబా నామస్మరణ చేస్తూ ఉండేదాన్ని. చివరికి బాబా కరుణించారు. "ధన్యవాదాలు బాబా. మిమ్మల్ని చాలా ఇబ్బందిపెట్టాను. నన్ను క్షమించండి తండ్రీ. నా పరిస్థితితులు మీకు తెలుసు. అందుకే అలా ప్రవర్తించాను తండ్రీ. నేను ఎప్పుడూ దేని గురించి బాధపడుతుంటానో మీకు తెలుసు. మీరే మాకు తోడుగా ఉండి మనశాంతిని ఇవ్వాలి తండ్రీ". నా అనుభవాలు చదివిన మీ అందరికీ నా నమస్కారాలు. మీరంతా నేను నా ఉద్యోగంలో చక్కగా స్థిరపడాలని, పని మంచిగా, ప్రశాంతంగా చేసుకోవాలని బాబాని ప్రార్థించండి. బాబా ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఆయన పాదాలకు నమస్కరిస్తూ... సెలవు.
