ఈ భాగంలో అనుభవాలు:
1. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు మన సాయినాథుడు
2. అడిగిన వెంటనే కష్టాలు తీర్చే బాబా ఉండగా భయమెందుకు?
అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు మన సాయినాథుడు
సాయిబంధువులకు నమస్కారం. నేను సాయిభక్తురాలిని. నాకు గురువు, దైవం అన్ని సాయే. నేనిప్పుడు పంచుకోబోయే అనుభవం మా జీవితంలో చాలా ముఖ్యమైనది. మేము పిల్లలకోసం 8 సంవత్సరాల ఎదురుచూసాం. మేము చాలా హాస్పిటళ్ళకి వెళ్లి చాలా టెస్టులు చేయించుకున్నాము. అందరూ మాకు సంతానం కలగడం కష్టమని చెప్పారు. మేము చాలా గుడులకు వెళ్ళాము. ఏ పుట్టలో ఏ పాము ఉందో అని ఎవరు ఏది చెబితే అది చేసాము. ఒకసారి మాకు తెల్సినవాళ్ళు తమ ఊరిలో ఒక బాబా ఉన్నారని, ఆయన రోజుకి గంట మాట్లాడతారని, ఆయన అన్ని చెబుతారని, ఎక్కడెక్కడి నుండో వచ్చి ఆయనతో చెప్పించుకుంటున్నారని చెప్పారు. అది ఒంగోలు దగ్గర చాలా మారుమూల గ్రామం. మేము అక్కడికి వెళ్ళాము కానీ, మాకు అక్కడ కూడా చేదు అనుభవం ఎదురైంది. ఆయన అందరి చేతులు చూసి మాట్లాడారుగాని నా చేయి చూసి ఏమీ మాట్లాడకుండా వెళ్లి గది తలుపులు వేసుకున్నారు. మేము చాలాసేపు ఎదురు చూసినప్పటికీ ఆయన బయటకి రాలేదు. చుట్టూ వున్న జనం నన్నే చూస్తూ మాట్లాడుకున్నారు. నేను చాలా ఏడ్చాను. ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. 3 ఏళ్ళ తర్వాత నాకు నెలసరి వస్తే చాలు, చాలా రోజులు బ్లీడింగ్ అవుతుండేది. కడుపునొప్పి తట్టుకోలేకపోయేదాన్ని. అలా 3 నెలల గడిచాక చివరకి హాస్పిటల్కి వెళితే, టెస్టులు చేసి టాబ్లెట్లు వాడమని ఇచ్చారు. తర్వాత వాళ్లే "IVF చేయించుకోండి. సక్సెస్ రేటు బాగుంది. మీరు ఆరోగ్యంగా ఉన్నందున మీకు ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్య ఉండద"ని అన్నారు. కానీ అది మావారికి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే, అది నాకు రెండో IVF అయినందున నా ఆరోగ్యం ఎక్కడ దెబ్బ తింటుందో అని మావారి భయం. పిల్లలు లేకపోయినా పర్లేదుగాని నేను మంచిగా ఉండాలని ఆయన అనేవారు. అయినా నేను సాయి మీద భారమేసి మావారిని ఒప్పించాను. నేను ముందుగా డాక్టరుతో IVF ప్రక్రియకు సంబంధించి అండం సేకరణ, ప్రవేశపెట్టడం మొదలైనవన్నీ గురువారమే చేయాలని చెప్పి మరీ ఒక గురువారం IVF మొదలుపెట్టించుకున్నాను. తర్వాత కూడా డాక్టర్ అపాయింట్మెంట్లు చాలావరకు గురువారమే పెట్టుకునేదాన్ని. మొదట అండం సేకరణ జరిగింది కానీ, ప్రవేశపెట్టడానికి కాలేదు. మేము సాయి చూసుకుంటారనుకున్నాము. బాబా దయవల్ల తర్వాత అండం సేకరణ, ప్రవేశం పెట్టడం జరిగింది. ఒక 15 రోజులయ్యాక ప్రగ్నెన్సీ టెస్ట్ చేసి నేను గర్భవతినని నిర్ధారించారు. ఇంకా మా ఆనందం అంతాఇంతా కాదు. నేను చాలా జాగ్రత్తగా ఉండసాగాను. నా తల్లిందండ్రులు నాకు చాలా అండగా ఉన్నారు. 3వ నెల వచ్చాక అందరికీ చెప్తే, అందరూ సంతోషించారు. నాకు 6వ నెల వచ్చాక నేను అమినోటిక్ ఫ్లూయిడ్ టెస్ట్ చేయించుకున్నాను. ఉమ్మనీరు తీసి చేసే ఆ టెస్టు చాలా జాగ్రత్తగా చేయాలి. లేదంటే కడుపులోని బిడ్డకి సమస్యవుతుంది. అందుకని నేను ఆ టెస్టుకి వెళ్ళినప్పుడు, చేసేటప్పుడు ఊదీ ప్యాకెట్ దగ్గర పట్టుకుని, సాయి నామజపం చేశాను. బాబా దయవల్ల 10 రోజుల తర్వాత అంతా నార్మల్ అని రిపోర్టు వచ్చింది. తర్వాత మా అత్తయ్యవాళ్ళు శ్రీమంతం కోసం తేదీ నిర్ణయించడానికి పంతులుగారి దగ్గరకి వెళ్తే, 'మీకు మనవడు పుడతాడ'ని చెప్పారు. మా జాతకంలో కూడా మొదటి సంతానం మగబిడ్డ అని ఉంది. మమ్మల్ని చూసినవాళ్ళు అందరూ కూడా అదే అంటుండేవారు. మా అత్తింట్లో కూడా అందరూ మగవాళ్లే, ఆడపిల్లలు లేరు. అందువల్ల నేను మా ఇంట్లో ఆడపిల్ల ఉంటే బాగుంటుందని అనుకునేదాన్ని(అది బాబా గుర్తు పెట్టుకున్నారేమో!). మావారికి కూడా అమ్మాయే కావాలని ఉండేది. 9వ నెల నిండాక నాకు కాన్పు అయి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చాను. చూసారా బాబా లీల!. సాయితండ్రికి నా అభినందనలు ఎలా తెలుపుకోవాలో నాకు తెలియదు. అందుకే ఆ తండ్రికి నమస్కరిస్తూ ఇలా నా ఈ అనుభవం మీ అందరితో పంచుకున్నాను. నా అనుభవాన్ని ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకొనే అవకాశాన్ని బాబా నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
సాయినాథ్ మహారాజ్ కి జై!
అడిగిన వెంటనే కష్టాలు తీర్చే బాబా ఉండగా భయమెందుకు?
సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య. మేము 2024, డిసెంబర్లో క్రిస్మస్ సెలవులకి మా ఊరు వెళ్లొచ్చాక LKG చదువుతున్న మా బాబు స్కూలుకి వెళ్ళనని ఒకటే మారం చేయడం మొదలుపెట్టాడు. మేము బలవంతంగా స్కూలుకి పంపిస్తుంటే మమ్మల్ని గిచ్చడం, కొట్టడం చేసేవాడు. ఇంకా నేను స్కూలుకి వెళ్ళను ఏం చేస్తారో చేసుకోండి అనేవాడు. మేము చాలా భయపడ్డాము. అప్పుడు నేను బాబాని ప్రార్థించాను. బాబా దయవల్ల వారం తర్వాత బాబు ఏడవకుండా స్కూలుకి వెళ్లి చదువుకోసాగాడు. ఇది చూడటానికి చిన్న విషయంలా ఉండొచ్చు కానీ నేను, నా భర్త మా బాబు గురించి చాలా బాధపడ్డాము.
2025, ఫిబ్రవరిలో మా సిస్టర్వాళ్ళ గృహప్రవేశం జరిగింది. సరిగ్గా అదే సమయంలో నాకు నెలసరి సమస్య ఉండటం వల్ల బాబాని, "నాకు ఏ ఇబ్బంది లేకుండా పూజ పూర్తయ్యేలా చేయి తండ్రీ" అని ప్రార్థించాను. బాబా దయవల్ల అంతా మంచిగా జరిగింది. అడిగిన వెంటనే మన కష్టాలు తీర్చే బాబా ఉండగా మనకెందుకు భయం? "నా సమస్యలను పరిష్కరించినందుకు ధన్యవాదాలు బాబా. సదా మమ్మల్ని మీ పాదాల చెంత సురక్షితంగా ఉంచుకోండి బాబా".
