సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1799వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయినాథుని ఆశీస్సులు
2. ఊదీ మహిమ

శ్రీసాయినాథుని ఆశీస్సులు


నేను ఒక సాయిభక్తురాలిని. నాకు చాలా విరామం తర్వాత ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇది పూర్తిగా బాబా ఆశీర్వాదం. మొదట్లో నేను బాబా నాకు సహాయం చేయడం లేదని చాలా బాధపడ్డాను. కనీసం ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రావడం లేదని ఆయనతో గొడవ కూడా పడ్డాను("అందుకు క్షమాపణలు బాబా"). కానీ తర్వాత బాబా ఆశీస్సులతో నాకు ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి. ఒక ఉద్యోగం కంఫర్మ్ అయ్యే ముందురోజు బాబా నాకు స్వప్న దర్శనమిచ్చారు. ఆ కలలో నేను బాబాతో పోట్లాడుతూ విచారంగా ఉన్నాను. చుట్టూ ఉన్న భక్తులు బాబా ఆశీస్సులు తీసుకోమని నన్ను బలవంతపెట్టారు. దాంతో నేను విచారవదనంతో బాబా దగ్గరకి వెళ్లి, ఆయన పాదాలపై నా తల ఉంచి చాలా ఆశీర్వాదపూర్వకంగా భావించాను. కానీ నేను చాలా మూర్ఖురాలిని, అప్పుడు అదెంత విలువైన క్షణమో గ్రహించలేకపోయాను. మరుసటిరోజు మధ్యాహ్నం నేను అదివరకు ఇంటర్వ్యూ పూర్తిచేసిన ఒక కంపెనీవాళ్ళు త్వరలో ఆఫర్ లెటర్ పంపుతామని నిర్ధారించారు. ఆ తర్వాత నాకు ఆఫర్ లెటర్ వచ్చి నేను ఉద్యోగంలో కూడా చేరాను. కొన్ని రోజులకు టెక్నికల్ నాలెడ్జ్ నాకు తక్కువగా ఉందనిపించింది. తరువాత ఒకరోజు నాకు తగినంత విశ్వాసం, టెక్నికల్ నాలెడ్జ్ లేవని, భవిషత్తులో వాటిని మెరుగుపరుచుకోగలనో, లేదో అని ఆలోచిస్తూ బాధపడ్డాను. అదేరోజు నేను బాబా గుడికి వెళుతూ మనస్సులో బాబాని, "దయచేసి ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించండి బాబా. అలా అయితే భవిష్యత్తులో నా టెక్నికల్ నాలెడ్జ్ బాగుంటుంది" అని అనుకున్నాను. తర్వాత నేను గుడికి వెళ్లేసరికి బాబా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి తమ ఉనికిని నాకు తెలియజేసారు. నేను చాలా సంతోషించి, 'బాబా నాతో ఉన్నారు కాబట్టి నేను దేన్నైనా నేర్చుకోగలను' అనుకొని, "చాలా ధన్యవాదాలు బాబా. దయచేసి గురువుగా ఉండి నాకు అన్ని నేర్పించండి బాబా" అని బాబాతో చెప్పుకున్నాను.

2024, ఫిబ్రవరి 14న నా ఉద్యోగానికి సంబంధించిన చాలా విచిత్రమైన సమస్య ఒకటి వచ్చింది. ఆ సమస్య మీద నా టీమ్, ఇతర టీములు చాలా శ్రమించినప్పటికీ అది పరిష్కారం కాలేదు. ఆ సమస్య పరిష్కారంతో ముడిపడి నేను నెరవేర్చవలసిన బాధ్యతలు చాలా ఉండటం వల్ల ఆందోళన చెందుతూ బాబాను, "దయచేసి సమస్యకు  పరిష్కారం చూపండి బాబా" అని బాబాను ప్రార్థించాను. బాబా దయతో నాకు పరిష్కారం లభించింది, సమస్యకు మూలకారణాన్ని నేను కనుగొన్నాను.


ఒకరోజు నా కాళ్ళు తీవ్రమైన తిమ్మిరిగా ఉండటంతో ఫుట్ మసాజ్ బోర్డు ఉపయోగిస్తే కొంత ఉపశమనంగా ఉంటుందని అనుకున్నాను. కానీ ఫుట్ మసాజ్ బోర్డ్ కోసం వెతికితే అది దొరకలేదు. నేను అదివరకు ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు దాన్ని ఎక్కడో ఉంచి మర్చిపోయాను. దురదృష్టం కొద్దీ ఎంత వెతికినా కనిపించలేదు. అప్పుడు నేను ఒక భక్తుని అనుభవం గుర్తు చేసుకొని బాబాను, "దయచేసి నేను ఆ ఫుట్ మసాజ్ బోర్డుని ఎక్కడ పెట్టానో తెలియజేయండి" అని ప్రార్థించాను. అంతే, కొద్దిసేపటికి ఆ బోర్డుని ఎక్కడ ఉంచానో నాకు గుర్తు రావడంతో అది దొరికింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. దయచేసి ఎల్లప్పుడూ మా చేతులు పట్టుకొని మాతో ఉండండి బాబా. అలాగే సదా మా అమ్మానాన్నలతో ఉండండి. మీరే నాకు తల్లి, తండ్రి, గురువు, ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు నాకు కావాలి బాబా”.


సాయి స్మరణం సంకట హరణం

బాబా శరణం భవ భయ హరణం.


ఊదీ మహిమ


అందరికీ నమస్కారం. నా పేరు గౌతమి. ఒకసారి నా ఆరోగ్యం కాస్త బాగాలేదని డాక్టరుకి చూపించుకుంటే, నాకు బీపీ ఉందని, "2, 3 సార్లు టెస్టు చేసాక మందులు వాడదాము" అని అన్నారు. ముగ్గురు చిన్న పిల్లలున్న నాకు ఇప్పటినుంచే బీపీ వచ్చిందని అందరం ఆందోళన చెందాము. నేను బాబా దగ్గర బాధపడి, "బాబా! వచ్చే గురువారం వరకు చూస్తాను. ఈలోపు నాకు బీపీ తగ్గించండి" అని వేడుకొని ప్రతిరోజూ ఊదీ కలిపిన నీళ్లు తాగాను. గురువారంలోపు డాక్టర్ దగ్గరకి వెళ్లి ఎన్నిసార్లు చూపించుకుందామనుకున్నా వెళ్ళటం కుదరలేదు. చివరికి గురువారంనాడు వెళితే, అప్పుడు బీపీ లేదు. తర్వాత వరుసగా మరో 2 రోజులు చూసినా కూడా నాకు బీపీ లేదు. దాంతో డాక్టర్, "మందులు వాడనక్కర్లేదు. ఏదో టెన్షన్ వల్ల ఒకసారి కనిపించింది" అని అన్నారు. బాబా ఊదీ మహిమ చూసారా! "ధన్యవాదాలు బాబా. ఎప్పుడూ నాకు ఇలా తోడుగా ఉండండి బాబా".


సాయినాథ్ మహారాజ్ కి జై.


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo