సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1785వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుగ్రహం

2. ఆర్తిగా 'బాబా' అని పిలిస్తే చాలు - అన్నీ ఆయన చూసుకుంటారు


బాబా అనుగ్రహం


నేను ఒక సాయిభక్తురాలిని. బాబా మన తల్లి, తండ్రి. ఆయన మనం అడిగిన ప్రతి సమస్యను తీరుస్తున్నారు. నాకు పెళ్ళై 9 సంవత్సరాలవుతుంది. బాబా దయవల్ల మాకు మొదట ఒక బాబు పుట్టాడు. తర్వాత నాకు బీపీ సమస్య ఉన్నందున మేము మళ్ళీ పిల్లల గురించి ఆలోచించలేదు. అలాగని ఇక మాకు పిల్లలు వద్దని కూడా అనుకోలేదు. బాబా దయవల్ల బాబు పుట్టిన 7 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ గర్భవతినయ్యాను. ఆ సమయంలో బీపీతో నేను చాలా ఇబ్బందిపడసాగాను. అందువల్ల హాస్పిటల్‌కి వెళ్లిన ప్రతిసారీ బాబా ఊదీ పెట్టుకొని వెళ్లేదాన్ని. అంతలా నేను బాబాను నమ్ముకున్నాను. బాబా ప్రతి స్కాన్ నార్మల్ ఉండేలా చూసారు. ఇలా ఉండగా 6వ నెల వచ్చాక బీపీ పెరిగి ఎన్ని మందులు వాడినా నార్మల్ కాలేదు. ప్రెగ్నెన్సీ సమయంలో బీపీ ఉండటమే చాలా రిస్క్, బీపీ వల్ల ఏదైనా జరగొచ్చు. ఆ కారణాల వల్ల నేను భయంతో తిండి కూడా సరిగా తినేదాన్ని కాదు. అటువంటి స్థితిలో నేను నాకు, కడుపులోని బిడ్డకి బాబా తప్ప వేరే దిక్కు ఎవరూ లేరని ఆయనపై పూర్తి నమ్మకముంచాను. బాబా దయవల్ల బీపీ ఎక్కువగా ఉన్నా మిగతా టెస్ట్ రిపోర్టులు నార్మల్‌గా వుంటుండేవి. అలా బాబా కృపతో 38 వారాల గడిచాక సర్జరీ చేయడానికి ఒక రోజు నిశ్చయించారు. ఆరోజు బీపీ ఎక్కువగా ఉంటే గనక సర్జరీ చేయరు. కానీ ఆరోజు తప్పితే వేరే ఏ రోజూ నక్షత్రం మంచిగా లేదు. అందువల్ల మేము చాలా ఆందోళన చెందాము. అయితే బాబా అద్భుతం చేశారు. ఆరోజు నా బీపీ నార్మల్‌గా ఉంది. దాంతో నా హార్ట్ బీట్ ఎక్కువగా ఉన్నా కూడా నాకు సర్జరీ చేసారు. ఆ రోజు హాస్పిటల్‌కి వెళ్ళేముందు బాబా పింక్ కలర్ డ్రెస్‌లో నాకు కనిపించారు. అప్పుడు నేను బాబా నాకు పాపని ఇస్తారని అనుకున్నాను. నేను అనుకున్నట్లే సర్జరీ విజయవంతంగా పూర్తై నాకు పాప పుట్టింది. బాబా నాకు ఆరోగ్యవంతమైన బిడ్డని ఇచ్చారు.


ఒకరోజు పాపకి పాలు పట్టాక తన ముక్కు నుండి, నోటి నుండి పాలు బయటకి వచ్చాయి. మాకు చాలా భయమేసింది. అప్పుడు నేను, "బాబా! పాపకి అలా కాకుండా చూడండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల మళ్ళీ అలా అవ్వలేదు. తర్వాత పాపకి 22వ రోజున జ్వరం వచ్చింది. అంత చిన్నపాపకి జ్వరమంటే మాకు చాలా భయమేసింది. పారాసెటమాల్ చుక్కలు వేసినా తగ్గలేదు. మరుసటిరోజు పాపని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తే బాబా దయవల్ల ఇన్ఫెక్షన్ ఏమీ లేదని యాంటీబయాటిక్స్ వ్రాసి ఇచ్చారు. నేను, "బాబా! ఏ ఇబ్బంది లేకుండా పాపకి జ్వరం తగ్గేలా అనుగ్రహించండి తండ్రీ" అని బాబాని వేడుకున్నాను. అంతే, బాబా దయతో పెద్దగా ఇబ్బంది లేకుండా జ్వరం తగ్గించారు. "అన్నిటికి ధన్యవాదాలు బాబా. హై రిస్క్ ప్రెగ్నెన్సీ నుండి నన్ను, నా పాపని కాపాడి సురక్షితంగా ఇంటికి చేర్చావు తండ్రీ. తను మీరు నాకిచ్చిన ప్రసాదం. తనకి ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా కాపాడు బాబా. అలాగే మా అబ్బాయికున్న ముక్కు ఇన్ఫెక్షన్ మరియు ఇతర ఆరోగ్య సమస్యల నుండి వాడిని బయటపడేయండి బాబా. మీ పాదాలకు శతకోటి వందనాలు బాబా".


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ఆర్తిగా 'బాబా' అని పిలిస్తే చాలు - అన్నీ ఆయన చూసుకుంటారు.


నా పేరు రాధ. మాది తెనాలి. పిలిస్తే పలికే దైవం సాయిబాబా. ఆర్తిగా 'బాబా' అని పిలిస్తే చాలు - అన్నీ ఆయన చూసుకుంటారు. కొంతకాలం నేను ఆయనకి దూరమైనప్పటికీ మళ్లీ నన్ను తమ దగ్గరకి తీసుకున్నారు. మా అమ్మాయి యు.ఎస్.ఏలో ఎమ్ఎస్ చేస్తుంది. యుఎస్ వెళ్లిన 5, 6 నెలల వరకు తనకి సరైన పార్ట్ టైం ఉద్యోగం దొరకలేదు, అందువల్ల నేను 2023, మేలో సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టాను. బాబా దయవల్ల తనకి అదే నెలలో క్యాంపస్‌లో తనకి పార్ట్ టైం ఉద్యోగం దొరికింది. తర్వాత సెలవులకి మా అమ్మాయి ఇండియా వచ్చినప్పుడు తనకి విపరీతమైన జ్వరం వచ్చింది. హాస్పిటల్‌కి వెళ్తే చాలా టెస్టులు చేసి రక్త శాతం చాలా తక్కువగా ఉందని, పెరగడానికి రెండు నెలలన్నా పడుతుందన్నారు డాక్టర్. కానీ అమ్మాయి ఒక నెలలోనే తిరిగి యుఎస్ వెళ్లాల్సి ఉండటంతో నేను బాబాని, "రక్తశాతం పెరిగేలా మీరే చూసుకోవాలి" అని ప్రార్థించాను. బాబా దయవల్ల తను తిరిగి వెళ్లే సమయానికి రక్తశాతం పెరిగింది. దాంతో ఆరు నెలలకి టాబ్లెట్లు తీసుకుని అమ్మాయి యుఎస్ వెళ్ళింది. "చాలా చాలా థాంక్స్ బాబా. దూరంగా ఉంటున్న తనకి నువ్వే తల్లి, తండ్రివై బాగా చూసుకో బాబా".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo