సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 61వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 61వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 120

శ్రీ నీలకంఠ రామచంద్ర సహస్రబుద్దే గారు శ్రీ సమర్థ సాయిబాబా గురించి తనకు వచ్చిన అనుభవాలను 18-2-1920 వ తారీఖున ఒక ఉత్తరం వ్రాసారు. ఆ ఉత్తరంలో చాలా భాగం తప్పక చదవవలసినదిగా అనిపించడం జరిగింది. ఆ ఉత్తర సారాంశం క్రింది విధంగా ఉంది. 

(8) ఆ తరువాత నేను ఎప్పుడెప్పుడు శిరిడీకి వెళ్ళినా, ప్రతిసారి బాబా నన్ను రూ. 15/- దక్షిణ అడిగేవారు. ఒక సందర్భంలో నా వద్ద డబ్బులు లేనందువలన, “నా వద్ద లేవు” అని చెప్పాను. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ లేదా బాపూసాహెబ్ జోగ్ వద్ద నుండి తీసుకొని తెచ్చివ్వమని బాబా చెప్పారు. అప్పుడు నేను బాపూసాహెబ్ జోగ్  వద్దకు వెళ్ళాను. కానీ ఆయన కలవకపోవడం వలన కాకాసాహెబ్ దీక్షిత్ వద్దకు వెళ్ళాను. “మీ డబ్బుల గురించి నాకు తెలియదు. నేను పారాయణ గ్రంథాన్ని ఇస్తాను. అందులో మీ 15 రూపాయలను వెతుక్కోండి” అని దీక్షిత్ చెప్పారు. కానీ నేను ఆ పారాయణగ్రంథం చదివే గొడవలో పడకుండా బాబా వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పాను. ఆ పదిహేను రూపాయల అర్థమేమిటో తెలియచేయమని విన్నవించుకున్నాను. కాని “ఇప్పుడు వదిలేయ్, తరువాత చూద్దాం. మనకు అంత తొందరవద్దు” అని బాబా చెప్పారు. దాంతో నేను మౌనంగా కూర్చొని ఆలోచిస్తుండగా నాకు దగ్గరనున్న నోటు పుస్తకంలో ఇదివరకెపుడో వ్రాసుకొనియున్న రెండు ఓవీలు నా దృష్టిలో పడి నా మనసుకు శాంతి కలుగజేస్తాయి. ఆ ఓవీలు క్రింది విధంగా ఉన్నాయి. “సదా నా నామాన్ని జపించు, ధ్యానంతో మనసును అధీనంలో ఉంచు! ప్రాణాన్ని ప్రాణాయామంలో లీనం చేయి, ఇంద్రియాలు అదుపులో ఉంటాయి. ఆత్మవివేచనతో బుద్ధిని అధీనం చేయి! జీవాన్ని అధీనంలో ఉంచితే పరమాత్మ సుఖం ప్రాప్తించి నాలో ఏకరూపం చెందుతావు” ఆ రెండు ఓవీలలో ఐదు యోగసాధనలు మరియు పది ఇంద్రియాల అధీనము వంటి ఆత్మజ్ఞానప్రాప్తి గురించిన పది సాధనలు చెప్పడం జరిగింది. “నేను శిరిడీకి వెళ్ళిన ప్రతిసారి ఆయన 15 రూ. దక్షిణ అడగడం అందుకే!” అనే ఆలోచన నా మనసులోకి వచ్చింది. “శ్రద్దయే జ్ఞానం కలుగజేస్తుంది” అనేది భగవత్ వాక్యం! నా శ్రద్ధ గుడ్డిది కాదు.

( 9 ) నా చివరి శిరిడీ యాత్రలో బాబాను దర్శనం చేసుకోగానే “నీవు వచ్చి మంచి పనిచేసావు. నేను నిన్నే గుర్తు చేసుకుంటున్నాను” అనే ఇదివరకెన్నడూ వినని మాటలు బాబా ముఖతః వెలువడ్డాయి. అదే చివరి దర్శనం అనే ఆలోచన బాబా దేహ విసర్జన చేసారనే వార్త నాకు చేరే వరకు నాకు రాలేదు. ఆ ట్రిప్పులోనే నేను తిరిగి వెళ్ళే సమయం నిర్ధారించుకుని, రెండు-మూడు రోజుల నుండి కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా మధ్యాహ్నం బయలుదేరేందుకు అనుమతిని కోరుతూ వస్తున్నాను. కారణం కోపర్గాం నుండి సాయంత్రం రైలు బయలుదేరుతుందని మేమందరం అనుకుంటున్నాము. అనుమతిని అడిగిన ప్రతిసారి “రేపు ఉదయం వెళ్ళనీ” అని బాబా చెప్పసాగారు. చివరకు ఒకరోజు నేను వినతి చేసుకొని మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళడానికి అనుమతిని కోరి కోపర్గాం స్టేషన్ కు వెళితే ఆ బండి సమయం మారడం వలన మరుసటి రోజు ఉదయం వరకు స్టేషనులోనే నేను బస చేయవలసి వచ్చింది. 

(10) ఒకసారి మా మిత్రుడు గణపతిరావ్ అజ్ గావ్ కర్ తన స్నేహితులు కొందరితో కలసి శిరిడీకి వెళ్ళారు. అప్పుడు తనకు ఠాణేలోని జిల్లా కోర్టులో ఒక కేసులో సర్కారు అప్పీలుకు సంబంధించి సర్కార్ వకీలుకు వివరాలు చెప్పడానికి ఆదివారం వెళ్ళవలసి రావడంతో తాను మొదటి రోజు తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతిని కోరారు. “తాను అంత హడావుడిగా వెళ్ళవలసిన పనిలేదు” అని బాబా చాలాసార్లు చెప్పారు. కానీ ఆ మాటలపై మాలాంటి అజ్ఞానులకు విశ్వాసం ఎలా కుదురుతుంది? చివరకు గణపతిరావు అభ్యర్థన మేరకు “సరే, వేళ్ళు నీ ఇష్టం” అని బాబా అన్నారు. గణపతిరావు అనుకున్న విధంగా ఠాణే కోర్టులో హాజరయ్యారు. అప్పుడు సర్కారీ వకీలు “కేసు విచారణకు రావడం ఎనిమిది రోజులు వాయిదా పడింది” అని తెలియజేయడంతో సాక్ష్యం ఇవ్వడం 8 రోజులు వెనుకకు పడడం చూసి గణపతిరావోకు బాబా మాటలలో అర్ధం భోధపడి ఆశ్చర్యానికి లోనయ్యాడు. అటువంటి ఎన్నో లీలలను నేను ప్రత్యక్షంగా చూశాను.

బాబా చేతికి ఏదో దెబ్బ తగిలింది. దానిపై ప్రతిరోజు ఉదయం ఒక పెద్ద చిరిగిపోయిన గుడ్డను ఎంత గట్టిగా కట్టేవారంటే, దాని వలన ఇతరులెవరికైనా ఐతే ఎంతో నొప్పి కలుగుతుంది. అది తప్ప ఆ గాయానికి మరి ఏ ఇతర ఔషధోపచారాన్ని ఉపయోగించేవారు కాదు. ఏదయినా మంచి ఔషధోపచారాన్ని ప్రయత్నించాలని భక్తులు చాలామంది ఎంతో బ్రతిమాలారు. ఒకసారి భక్తులు అలాగే బ్రతిమాలుతుంటే “బాగా ఎండిపోయిన ఒకటి లేదా రెండు వేల పిడకలను తీసుకువచ్చి వాటిని వెలిగించాలి. అవి ఉజ్వలంగా మండుతుంటే ఆ మంటలలో (తమ శరీరాన్ని వేలుతో చూపిస్తూ) దీనినంతా అందులో వేసి, ప్రక్కన నిలబడి ఏం జరుగుతుందో తమాషా చూడాలి” అని బాబా అన్నారు. దానినే నిజమైన జ్ఞానం అని అంటారు.

తరువాయి భాగం రేపు

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

3 comments:

  1. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  2. Saranu saranu sai.. na Manasu telisina dayagala tandrivi 🙏 baba nee voodi ni naku pampinchu 🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo