సాయి వచనం:-
'ఆత్మజ్ఞానానికి నిరంతరం ధ్యానం అవసరం. ధ్యానం వలను మనస్సు స్థిరమవుతుంది. సర్వగతుడైన ఈశ్వరునియందు మనసు నిలపడమే పరమార్థం. ఇది కుదరకపోతే నా ఆకృతిని నఖశిఖపర్యంతమూ అహర్నిశలూ నీ మనసులో నిలుపుకో! నీ మనస్సు ఆ ఒక్క రూపాన్నే పొందుతుంది. ధ్యానించే నీవు, ధ్యానింపబడే నేను, ధ్యానమనే క్రియ వేరుగా అనుభవమవక, సర్వగతమైన చైతన్యమే అనుభవమవుతుంది.'

'బాబా నిరసించిన వ్యర్థ ఆచారాల్లో ఉపవాసం ఒకటి. ఉపవాసమంటే - మనస్సును, వ్యర్థమైన విషయాలతో నింపక, ఖాళీగా ఉంచుకొని, అందులో మన ఉపాసనాదైవాన్ని ప్రతిష్ఠించుకొని, ఆయనకు అంతరంగంలో దగ్గరవడం అన్నమాట. ఉపవాసం అనే పదానికి అర్థం: 'ఉప' అంటే దగ్గరగా లేదా సమీపంలో, 'వాసము' అంటే ఉండటం. ఇష్టదైవానికి దగ్గరగా ఉండటం. కానీ ఆ అసలైన అర్థం పోయి ఉపవాసమంటే నిరాహారంగా ఉండటంగా మారింది' - శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 400వ భాగం


సాయిశరణానంద అనుభవాలు -  ముప్పైనాలుగవ భాగం.

నిన్నటి తరువాయిభాగం..... 

ఒకసారి మాయి నాతో, “మీ భార్యాభర్తలిద్దరికీ 20 రూపాయలు చాలు. అంతకంటే ఎక్కువ ఉందనుకో, దానితో ఏం చేస్తాం? ఈ బాబా సంసారానికి సాయం చేయరాదూ?” అన్నది. తరువాత ఆమె వామన్ నార్వేకర్‌ తో, నా పేరు మీద 125 రూపాయల విలువ గల వెండి దీపపు సెమ్మెలు శ్రీరామనవమి కోసం తయారుచేయించమని చెప్పింది. అలాగే నెలకి 25 రూపాయల చొప్పున వాయిదా పద్ధతిలో నార్వేకర్ కి డబ్బులు చెల్లించమని నాకు చెప్పింది. శ్రీరామనవమికి నేను శిరిడీ వెళ్ళాను. ఆరోజు అందరూ ఆరతి సమయంలో పూజాసామగ్రి తీసుకుని మసీదుకు వెళుతున్నారు. అప్పుడే మాయి వెండి దీపపు సెమ్మెలలో నెయ్యి, వత్తులు వేసి వాటిని పళ్ళెంలో పెట్టింది. “ధోవతి నడుముకి సరిగ్గా కట్టుకో!” అని ఆదేశించి, ఆ పళ్ళేన్ని నా చేతిలో పెట్టి, “చూడు, నేను ద్వారకామాయి మెట్లెక్కి పైకి వెళుతున్నాను” అన్నది. నేను వెళ్ళేటప్పుడు నా వీపుమీద చేతిస్పర్శ తగిలి వెనక్కి తిరిగి చూస్తే రాధాకృష్ణమాయి ఉన్నది. ఆమె, “వెళ్ళు” అన్నది. ఆమె ఆ సూక్ష్మస్వరూపాన్ని ఇతరులెవరూ చూడలేకపోయారనుకుంటా! ఎందుకంటే ఎవరూ కూడా ఆమె ద్వారకామాయికి వచ్చిందన్న మాటే చెప్పుకోలేదు. అదీకాక ఆమె బాబా సమక్షానికి వెళ్ళటం నిషేధించబడింది. అంతేకాదు, బాబా ఎదురుగా వెళ్ళకపోవటమనేది ఆమె వ్రతం కూడా అయి ఉండొచ్చు. అయితే ఆమె నాకు మాత్రం స్థూలరూపంలో దర్శనమిచ్చి, నా వీపుపై తట్టి నాతో, “వెళ్ళు, పైకి వెళ్ళి సెమ్మెల్లో దీపాలు వెలిగించు" అన్నది.

నేను నవసారిలో నివసించేటప్పుడు రాధాకృష్ణమాయి నుంచి నాకు లేఖ వచ్చింది. అందులో, "బాబా ఆరోగ్యం బాగాలేకపోవటం వల్ల మధ్యాహ్నం పూట పాయసం తప్ప ఏమీ తినటం లేదు. కానీ ఇక్కడ మంచి చిక్కటి పాలు కావలసినన్ని దొరకటం లేదు. అందువల్ల నువ్వు రోజుకు సుమారు ఎనిమిది శేర్ల పాలిచ్చే కఠియావాడి ఆవును పంపితే చాలా బావుంటుంది. బాబాకు ఇది ఉత్తమమైన సేవ అవుతుంది. ఒకవేళ అలాంటి ఆవు దొరికితే శ్రీతాత్యాపాటిల్‌కి కూడా ఒక ఆవు కావాలట, అతనికోసం కూడా ఒక ఆవును కొను. అందుకోసం కావలసిన డబ్బును ప్రస్తుతం నువ్వు ఏర్పాటు చేయి. తరువాత నేను నీకిస్తాను" అని వ్రాసింది. దాంతో నా చెల్లెలి చిన్నపూసల బంగారు గొలుసును అమ్మేసి రెండు ఆవులను కొని శిరిడీ పంపించాను. ఆవులను పంపేసిన తరువాత నేను శిరిడీ వెళ్ళవలసివచ్చింది. అప్పుడు రాధాకృష్ణమాయి, “నీ చెల్లెలికి వెంటనే డబ్బు అవసరమైతే చెప్పు. నేను ఏర్పాటు చేస్తాను” అన్నది. నేను “చెల్లెలికంత తొందరేం లేద”ని చెప్పాను. ఈ సంభాషణ వృత్తాంతాన్నంతా చెల్లెలికి చెప్పినప్పుడు తను కూడా, “నిజమే, నాకు తొందరేమీలేదు” అన్నది. పైన చెప్పిన సేవ తరువాత చెల్లెలి డబ్బును తిరిగి ఇచ్చేటప్పుడు బంగారం ధర తగ్గినందువల్ల ఆమెకి చాలా లాభం కలిగింది.

ఈసారి శిరిడీలో నేను ఎక్కువకాలం ఉండటానికి వీల్లేకపోయింది. అప్పుడు నాతోపాటు టాంగాలో శిరిడీ వచ్చిన శ్రీముంగీసాహెబ్‌తో, "ఒకవేళ బాబా అనుమతి దొరికితే నేను కూడా ఈరోజే బయలుదేరాలి. అందువల్ల దయచేసి నన్ను తీసుకెళ్ళటానికి రాధాకృష్ణమాయి ఇంటికి రండి!” అని చెప్పాను. ఆరోజు భోజనం తరువాత నన్నెక్కువ గారాబం చేయాలని రాధాకృష్ణమాయి మనసులో అనుకున్నట్లున్నది. కానీ ఆ సమయంలోనే శ్రీముంగీ నన్ను గట్టిగా పిలిచాడు. అందువల్ల నేను బయటకు వచ్చి అతనితో పాటు బాబా వద్దకు వెళ్ళాను. తిరిగి వెళ్ళటానికి బాబా నాకు అనుమతి ఇవ్వకపోవటమే కాక నన్ను తమవద్ద అరగంటసేపు కూర్చోపెట్టుకున్నారు. మాయి స్నేహబంధనం నుంచి నన్ను దూరంగా ఉంచాలని వారి ఉద్దేశ్యమై ఉంటుంది.

నవసారిలో నివసిస్తున్న రోజుల్లో నేనెప్పుడూ అస్వస్థుడనై ఉండేవాణ్ణి. ఒకసారి సాయంకాలంపూట నాకు ఎంత కంగారుపుట్టిందంటే, వెంటనే ముంబాయి వెళ్ళిపోవాలన్న ఆలోచనతో లాంతరు తీసుకుని ఏ సామానూ లేకుండానే నా సోదిరితో కలిసి బయలుదేరాను. త్రోవలో ఒక తెలిసినవారి ఇంటి వద్దకు చేరుకునేసరికి ముందుకు నడిచే శక్తి లేకపోయింది. అందువల్ల నా సోదరి, నేను ఆ రాత్రి మాకు పరిచితులైన ఆ వ్యక్తుల ఇంట్లో గడిపాము. తెల్లవారాక నా వ్యధంతా దూరమైపోయింది. గడచిన రాత్రి ఊపిరాడక తీవ్రంగా శ్వాస పీల్చవలసి వచ్చి చాలా కంగారుపడిపోయాను. అదంతా సర్దుకుని ఇప్పుడు నాకు ఎంత బాగుందనిపించిందంటే, వెంటనే ఇంటికి చేరుకుని అసలు నాకేమీ జరగనట్లే పనిచేయటం మొదలెట్టాను. కానీ ఆ ముందురాత్రి మాత్రం గంటా, రెండు గంటలు కూడా నేను బ్రతుకుతానని అనిపించలేదు.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

  1. om sai baba these leelas are very good to read.devotee gave lamps to baba.every nice experience

    ReplyDelete
  2. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  3. 🙏🌹ఓం శ్రీ సాయిరాం తాతయ్య🌹🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo