సాయి వచనం:-
'ఇతరులకు చెప్పడానికి మనమెవరం? దానివలన మనలో అహం బలపడుతుంది.'

'మన ఆలోచనలు, మన చేతలు మనం ఎవరినైతే ఇష్టపడుతున్నామో, ప్రేమిస్తున్నామో ఆ వ్యక్తి చుట్టూ నిరంతరం పరిభ్రమించడమే- ప్రదక్షిణ' - శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 394వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - ఇరవైఎనిమిదవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

బాపూసాహెబ్ జోగ్, బూటీగార్లకి కిళ్ళీలంటే చాలా ఇష్టం. అందుకని రాత్రి భోజనం తరువాత రాధాకృష్ణమాయి వారికి కిళ్ళీలిచ్చేది. ఒకసారి నేను కూడా వారి వద్దనే ఉన్నాను. నాక్కూడా కిళ్ళీ ఇచ్చారు. దాన్ని నమలడం వల్ల నా పెదవులు పండాయి. పెదవులపై చిటికేసి రాధాకృష్ణమాయి, 'బాగా పండింది' అన్నది. తరువాత నేను మశీదుకు వెళ్ళినప్పుడు బాబా, "కిళ్ళీ ఎందుకేసుకున్నావు? ఇంకెప్పుడూ వేసుకోవద్దు'" అని అన్నారు. మర్నాడు భోజనానంతరం రాధాకృష్ణమాయి నాకు కిళ్ళీ ఇవ్వబోతే నేను, "బాబా వద్దన్నారు” అన్నాను. మాయి, “అవునవును, నీకు ప్రతి విషయంలోనూ బాబా అవునూ, కాదూ అని చెప్తారు. నిజం కదూ!' అన్నది. నేను సమాధానమివ్వలేదు. దాని తరువాత నేనెప్పుడూ కిళ్ళీ వేసుకోలేదు.

శిరిడీలో ఆదివారంనాడు సంత పెట్టటం అప్పుడప్పుడే కొత్తగా ప్రారంభం అవుతోంది. అప్పుడు రాధాకృష్ణమాయి నాతో, 'వామన్, నీవు సంతకు వెళ్ళి నీకిష్టమైన కూరలు తీసుకురా" అన్నది. ఆమె ఆదేశానుసారం నేను కూరలు తెచ్చాను. తరువాత డా౹౹పిళ్ళే వచ్చాడు. రాధాకృష్ణమాయి ఆయనతో, 'ఈరోజు వామన్‌ని పంపించి కూరలు తెప్పించాను. సాయంత్రం నేను స్వయంగా రొట్టెలూ, కూర చేసి నీకూ, అతనికీ భోజనం పెడతాను" అన్నది. డా౹౹పిళ్ళే ఆ మాటని ఆనందంగా అంగీకరించాడు. రాత్రి నియమానుసారం నేను ద్వారకామాయికి వెళ్ళాను. అప్పుడు బాబా నాకు రెండు వేరుశనగ గింజలిచ్చారు. ఆ గింజలు తినగానే నా ఆకలి తీరి కడుపు పూర్తిగా నిండినట్లు అనిపించింది. బాబా దర్శనం చేసుకుని తిరిగి వెళుతున్నప్పుడు బాబా, "వెళ్ళు! ఇప్పుడు వెళ్ళి నీ గదిలో కూర్చో, బయటకు రావద్దు" అన్నారు. కడుపు నిండి ఉండటం, అదీకాక బాబా గట్టిగా ఆజ్ఞాపించటం - వీటితో రాధాకృష్ణమాయి ఆహ్వానంపై లభించే భోజనం (రొట్టెలు) తినవద్దని స్పష్టమైంది. అందువలన రాధాకృష్ణమాయి పిలిచినప్పటికీ, 'నేను రాలేను' అని సమాధానమిచ్చాను. తరువాత చావడిలో శేజారతికి సిద్ధం అయ్యేటప్పుడు రాధాకృష్ణమాయి నన్ను గట్టిగా పిలిచింది. కానీ నేను బాబా ఆజ్ఞని దృఢంగా పట్టుకుని బయటకు రాలేదు. అందువల్ల నేను చావడిలో సేవ చేయలేకపోయాను. 

చావడి ఉత్సవం రోజున సామాన్యంగా పల్లకీ గానీ, లేక బాబా సమక్షంలో చామరాలు వీచటం గానీ లేక నెమలి పింఛాల విసనకర్రతో విసరటం గానీ చేసేవాణ్ణి. చాలాసార్లు దండాన్ని కూడా పట్టుకొనేవాణ్ణి. బాపూసాహెబ్ జోగ్ ఆరతి చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు కర్పూరం బిళ్ళలు సరైన సమయంలో అందిస్తుండేవాణ్ణి. ఆ సేవలను ఆరోజు నేను చేయలేకపోయాను. మర్నాడు మశీదుకి వెళ్లగా బాబా, "నిన్న రాత్రి పిలిచి పిలిచి అలసిపోయాను. 'నేను గోడను పిలుస్తున్నానా?' అనిపించింది. ఈ గోడలాగే నువ్వు కూడా కొంచెమైనా వినిపించుకోలేదు” అని అన్నారు. దాంతో నేను సందిగ్ధంలో పడిపోయాను. వేరుశనగపప్పు ఇచ్చిన వారూ బాబానే, గదిలోనుంచి బయటకు రావద్దని ఆదేశించిన వారూ ఆయనే. మరి వాళ్ళంతా పిలిచినప్పుడు బాబా ఆజ్ఞను మన్నించి నేను బయటకు రాకపోతే అందులో నా దోషం ఏముంది? అయితే బయటకు రావద్దన్న ఆదేశం రాధాకృష్ణమాయి భోజనం వరకే ఉన్నది. దానికోసం భక్తులు పిలిచినప్పటికీ చావడికి వెళ్ళకపోవటం, సేవను తప్పించుకోవటం, సేవను విసర్జించటం - ఈ తప్పు అజ్ఞానం వల్ల జరిగింది. బాబా ఆజ్ఞ ఒక పరిమిత కాలం వరకే ఉంది. ప్రయోజనం అయిపోయాక కూడా దాన్ని నేను వ్యర్ధంగా పట్టుకుని ఉన్నాను. భగవంతుని సేవను తప్పించుకోవటంతోపాటు బాబా ఆజ్ఞని ధిక్కరించటం కూడా జరిగింది.

"వామన్, ఈరోజు బాబా నీ కిచిడీ తినవలసి ఉంది" అని రాధాకృష్ణమాయి రెండుసార్లు నాతో చెప్పింది - నేను భోజనం వండటం ప్రారంభించినప్పుడు ఒకసారీ, మా పెద్దక్క మోఘీ నా మేనల్లుడితో వచ్చినప్పుడు రెండోసారీ. మోఘీ అక్కయ్య ఇక్కడికొచ్చిన మొదటిరోజునే కిచిడీ చేసి, నైవేద్యం పెట్టటానికి బాబా వద్దకు పంపించి, తరువాత రాధాకృష్ణమాయి వద్దకు తీసుకెళ్ళింది. రాధాకృష్ణమాయి ఎంతో ప్రేమతో ఆ కిచిడీ తినింది. బాబా, రాధాకృష్ణమాయి నా కిచిడీ తినే సమయంలో నా వృత్తి సహజంగానే తదాకారం అయింది. అలాంటి అనుభవమే రెండోసారి కూడా నాకు కలిగింది. దీంతో మహాత్ములకు లేదా ఈశ్వరుడికి సమర్పించబడిన నైవేద్యాన్ని వారు స్వీకరిస్తారని నాకు స్పష్టమైంది. స్వీకరించకపోతే సమర్పించబడని ఆహారం చెడుమార్గం వైపు తీసుకెళుతుంది. స్వీకరింపబడిన ఆహారం వృత్తిని తదాకారం చేస్తుంది. కనీసం సాత్విక వృత్తినీ, సాత్విక విచారాన్నీ ఉత్పన్నం చేస్తుంది.

కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి బాబా సోనాముఖి(గురివింద)నీ, ఇతర పదార్థాలనీ ఎన్నింటినో జమచేసి కషాయం చేసేవారు. దాన్ని యోగ్యమైన భక్తులకిచ్చేవారు. అది త్రాగిన తరువాత జంతికలూ, శనగపప్పూ తినమని ఇచ్చేవారు. దాని తరువాత కిళ్ళీ ఇచ్చేవారు. నేను శిరిడీలో ఉన్న ఆ పదకొండు నెలల సమయంలో బాబా రెండుసార్లు కషాయం తయారుచేశారు. బాబా మొదటిసారి నన్ను, "తీసుకో, త్రాగుతావా?” అని అడిగారు. దగ్గర్లో కూర్చున్న ఫకీరుబాబా, “మీరు ఇవ్వటమూ, వామనరావు త్రాగకపోవటమూనా? అలా ఎలా జరుగుతుంది?" అన్నాడు. నేను వెంటనే ఆ కషాయం త్రాగేశాను. ఈ రకంగా కషాయం ప్రసాదం నాకొకసారి ప్రాప్తించింది.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

5 comments:

  1. om sai ram nice experience very intrustion in reading.we are knowing new stories of sai.this is new to us

    ReplyDelete
  2. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  3. 🙏🌹 om Sri sairam tatayya 🌹🙏

    ReplyDelete
  4. ఓం సాయిరాం🌹🙏🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo