సాయి వచనం:-
'చెడుమాటలతో ఎవరినైనా బాధపెడితే నన్ను బాధపెట్టినట్లే! కానీ, ధైర్యంతో బాధను సహిస్తే నన్ను ఎల్లప్పుడూ సంతోషపరచినట్లు!'

' ‘బాబా, బాబా’ అని నీ గుండె లోతుల నుండి పిలువు. నీ హృదయంలో దాచుకున్న వేదనలు, కోరికలు ఆ పిలుపుగుండా బయటపడేటట్లు పిలవాలి. అదే నామస్మరణ - భజన' - శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 353వ భాగం


ఖపర్డే డైరీ - ముప్పయిఎనిమిదవ  భాగం 

9-3-1912

ఉదయం నేను కాకడ ఆరతికి హాజరయ్యాను. సాయిసాహెబ్ మంచి ధోరణిలో ఉన్నట్లు కనిపించారు. ఎప్పటిలాగే ఆశీర్వదించి, “భగవంతుడే అందరికంటే గొప్పవాడు" అన్నారు. తరువాత ఆయన మశీదుకి వెళ్ళారు. నేను తిరిగి వచ్చి నా ప్రార్థన చేసుకున్నాను. పంచదశి తరగతికి వెళ్ళటానికి తయారవుతుండగా ధన్‌జీషా ముంబాయి నుండి వచ్చాడు. అతను సాయిసాహెబ్‌కి మంచి పండ్లు తెచ్చాడు. మేం మాట్లాడుతూ కూర్చున్నాం. సాయిసాహెబ్ బయటకు వెళ్ళేటప్పుడు ఆయన్ను చూశాము. మా పంచదశి తరగతిని జరుపుకున్నాము గానీ, అది ఎక్కువసేపు జరుగలేదు. యథాప్రకారం నేను మశీదుకి వెళ్ళాను. సాయిసాహెబ్ "నింబారు"కి దక్షిణం వైపు క్రింద ఉన్న రెండు పిచ్చుకల చరిత్ర గురించి చెప్పారు. ఇప్పటిలాగే ఇంతకుముందు కూడా ఆ పిచ్చుకలు అక్కడే గూడుకట్టుకుని ఉంటూండేవని అన్నారు. వాటిని మృత్యువు కబళించింది. అది సర్పరూపంలో వచ్చి నింబారుని చుట్టుముట్టి వాటిని మ్రింగేసింది. ఆ పిచ్చుకలు మళ్ళీ ఇప్పుడు పుట్టి, ఇదివరలో ఎక్కడ గూడు కట్టుకున్నాయో ఖచ్చితంగా అక్కడే మళ్ళీ గూడుకట్టుకొని, ఇదివరకు ఎక్కడ కూర్చునేవో మళ్ళీ అక్కడే కూర్చున్నాయి. వాటిని తాను ముట్టుకోలేదనీ, మాట్లాడను కూడా లేదని అన్నారాయన. 

ఆయన ధన్‌జీషా పూజను అంగీకరించి, అతను సమర్పించిన పూలదండను తను ఎప్పుడూ ఉంచుకునే దానికన్నా ఎక్కువసేపు తన మెడలో ఉండనిచ్చారు. ఆ పూలు ఆయనకు నచ్చాయి. ఆయన కొన్ని ద్రాక్షపళ్ళను తిన్నారు. ధన్‌జీషా నాతోనే ఉంటున్నాడు. భోజనాలయిన తరువాత నేను కొద్దిసేపు పడుకున్నాను. తరువాత మా తరగతిని నిర్వహించాం - కాదు కొనసాగించాం. ఆ భాగాన్ని మేము చాలా ఆనందంగా ఆస్వాదించాం. సూర్యాస్తమయ సమయంలో మేము సాయి వ్యాహ్యాళికెళ్ళటాన్ని చూశాం. ఆయన ఆహ్లాదంగా ఉన్నారు కానీ, గోడమీద పూలతో చేసిన అలంకరణలని తాను లెక్కపెట్టననీ, అయితే తనకు మనుషులు కావాలన్నారు. రాత్రి భీష్మ స్వానుభవ దినకర్, దాసబోధ చదివాడు. బాలాసాహెబ్ భాటే కూడా వచ్చాడు. భజన కూడా జరిగింది.

10-3-1912

సాయిబాబా బయటకు వెళ్ళటం చూశాము. ఆయన తిరిగి వచ్చేటప్పుడు నేను మశీదుకి వెళ్ళాను. నన్ను నా పేరు పెట్టి పిలిచి, తమ తండ్రి చాలా ధనవంతుడనీ, ఉన్న డబ్బుని చాలా ప్రదేశాల్లో పాతిపెట్టాడనీ అన్నారు. ఒకసారి తమ తండ్రితో తమకు చాలా చిన్నవయసులో భేదాభిప్రాయం వచ్చి ఒక చోటుకి వెళ్ళారట. అది చాలా పెద్దగా, దట్టంగా ఉన్న బ్రహ్మజెముడు చెట్ల వరుస అనీ, అక్కడ భూమి లోపల పెద్ద ధనపురాశిని కనుగొన్నాననీ అన్నారు. సాయిసాహెబ్ దానిమీద కూర్చొని ఒక పెద్ద త్రాచుపాముగా మారిపోయారట. కొద్దిసేపు దానిపై కూర్చున్న తరువాత ఆయన ఎక్కడికో వెళ్ళిపోవాలని కోరిక కలిగిందట. అందుకని పొరుగు గ్రామానికి వెళుతుండగా దారిలో తన మానవ రూపాన్ని తిరిగి పొందారట. మనుషుల్ని చంపే ఒక వీధిలోకి ఆయన వెళ్ళారట. ఆయన అక్కడ తిరిగారు కానీ, దెబ్బలు తగలకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయారట. తరువాత ఆయన భిక్షకు వెళ్ళి అక్కడ దాచిపెట్టి ఉన్న నిధినంతా తీసుకువచ్చారట. 

మధ్యాహ్న ఆరతి యథాప్రకారం జరిగిపోయింది. నేను తిరిగి వెళ్తూండగా ఆయన అన్నారు: "ఇటు చూడు, జాగ్రత్త! కొందరు అతిథులు వస్తారు, వారిని రానీయకు” అని. అంటే దానర్థం - నేను కొన్ని అలజడి కలిగించే ప్రభావాలకు లోబడుతానని, దాన్ని ఎదుర్కోవాలని. మధ్యాహ్న భోజనానంతరం నేను కొద్దిసేపు నడుం వాల్చాను. తరువాత అన్నాసాహెబ్ ముతాలిక్ నుంచి ఉమ రజస్వల అయిందని ఉత్తరం వచ్చింది. అప్పుడు మతపరమైన, సామాజికపరమైన పండుగ చేయాలి. కానీ అది చాలా ఖర్చుతో కూడిన పని. నారాయణ ధమాంకర్ అమరావతి నుండి ఆర్థికపరమైన ఒత్తిడులు అన్నివైపులనుండీ వస్తున్నాయని రాశాడు. సాయిసాహెబ్ ఇచ్చిన హెచ్చరిక యొక్క ఆవశ్యకతను అవగాహన చేసుకున్నాను.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

FacebookWhatsAppXFacebook SendGmailYahoo! MailLinkedInSMSBloggerEmailSumoMe

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo
 
FacebookWhatsAppXFacebook SendGmailYahoo! MailLinkedInSMSBloggerEmailSumoMe