సాయి వచనం:-
'మానవుడు మ్రొక్కులను చెల్లించి తీరాలి. లేకుంటే కష్టాలొస్తాయి!'

' ‘బాబా, బాబా’ అని నీ గుండె లోతుల నుండి పిలువు. నీ హృదయంలో దాచుకున్న వేదనలు, కోరికలు ఆ పిలుపుగుండా బయటపడేటట్లు పిలవాలి. అదే నామస్మరణ - భజన' - శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 351వ భాగం


ఖపర్డే డైరీ - ముప్పయిఆరవ భాగం

29-2-1912

ఉదయం ప్రార్థనానంతరం మా పంచదశి తరగతి నిర్వహించాము. మేము చదువుతున్నప్పుడు సాయిబాబా నడుస్తూ వెళ్ళారు. సాఠేవాడా వద్ద వారిని చూశాము. వారు చాలా అలసిపోయినట్లు కనిపించారు. వారు తిరిగి వచ్చాక మళ్ళీ వారిని చూశాను. వారు చాలా సాత్విక ధోరణిలో ఉన్నట్లు అనిపించారు. బాలాసాహెబ్ భాటే విశ్వాసనీయుడనీ, అతని భార్య నేతపని చేసే ఆమె అనీ, అతని కొడుకు బాబా కూడా 'సాలి'(నేతపనివాడు) అని చెప్పారు. వాసుదేవకాకా తన పూర్వజన్మలో ఒక రాజపుత్రుడనీ, అప్పుడతని పేరు జైసింగ్ అనీ సాయిసాహెబ్ చెప్పారు. అతనికి మాంసం అంటే చాలా ఇష్టమనీ, సాయిసాహెబ్, ఇంకా వేరేవాళ్ళూ అతన్ని 'మేక తల కావాలా' అని అడిగి అతని కోసం తెప్పించేవారనీ, జైసింగ్‌కి ఉన్న ముగ్గురు కొడుకులూ ఆర్మీలో ఉండేవారనీ, ఆయనకున్న ఒక్క కూతురూ చెడ్డమార్గంలో పడిపోయి, ఒక క్షురకునితో ఉండసాగిందనీ, అతనికి పిల్లల్ని కని అక్కడే చనిపోయిందనీ చెప్పారు.

వామన్ తాత్యా మధ్యాహ్న ఆరతి పూర్తయ్యే సమయానికి వచ్చి పూజచేయాలని కోరుకుని బాగా చీవాట్లు తినటం తప్ప అంతా మామూలుగానే జరిగిపోయింది. మధ్యాహ్న భోజనానంతరం కొద్దిసేపు విశ్రమించి పంచదశి తరగతిని సాయంత్రం వరకూ కొనసాగించి, అప్పుడు సాయంత్రవు వ్యాహ్యాళికి వెళ్ళే సాయిని చూడ్డానికి వెళ్ళాను. వాడా ఆరతి అయ్యాక మశీదుకి వెళ్ళి చావడి ఊరేగింపుకీ, అక్కడ జరిగే శేజారతికి హాజరయ్యాను. సాయిసాహెబ్ కోపం ప్రదర్శించారు. మశీదు కప్పుపై దీపాలు వెలిగించటానికి వెళ్ళినవారిని తిట్టారు. ఊరేగింపు మొదలైన సమయానికి బాపూసాహెబ్ జోగ్  భార్య తాయీజోగ్ మీదకు తన దండాన్ని విసిరారు. చావడిలో వారి దగ్గరకు వెళ్ళినందుకు బాపూసాహెబ్ జోగ్‌ని కొడతారనుకున్నాను నేను. అతని చేతులు పట్టుకొని, "ఆరతి ఎందుకిచ్చావు?" అన్నారు. కొద్దిసేపయ్యాక తమ దండంతో బాలాషింపీని, మేము 'మారుతి' అని పిలిచే త్రయంబకరావునీ కొట్టారు. బాలాషింపీ పారిపోయాడుగానీ, త్రయంబకరావు అలాగే నిలుచుని ఆ దెబ్బలను స్వీకరించి, సాయిమహారాజుకి సాష్టాంగ నమస్కారం చేశాడు. అతను పూర్తి అనుగ్రహాన్ని పొంది, కనీసం ఒక అడుగు ముందున్నాడనుకున్నాను. మేము తిరిగి వచ్చేటప్పుడు సాయిసాహెబ్ పెద్దగా మాట్లాడుతున్నారు. నేను బాలాసాహెబ్ భాటేతో మాట్లాడుతూ కూర్చున్నాను. భీష్మ భాగవతం, దాసబోధ చదివాడు.

1-3-1912

ఉదయం సుమారు పదకొండు గంటలకి మశీదుకు వెళ్ళాను. సాయిబాబా మంచి ధోరణిలో ఉన్నట్లనిపించారు. కానీ చాలా అలసిపోయినట్లున్నారు. త్రయంబకరావు ఫకీరుబాబాను దాదాపు తిట్టబోయినంత పనిచేశాడు. అది చూడబోతే నాకు చాలా స్వల్ప విషయంలా అనిపించింది. మధ్యాహ్న ఆరతి మామూలుగానే జరిగింది. సాయిబాబా దీక్షిత్‌నీ, నానాసాహెబ్ చందోర్కర్‌నీ, సాఠేనీ గుర్తుచేసుకున్నారు.

3-3-1912


నేను కాకడ ఆరతికి హాజరయ్యాను. సాయిబాబా చాలా ఆహ్లాదంగా ఉండి ఎలాంటి కఠిన పదజాలాన్నీ ఉపయోగించకుండా మశీదులోకి వెళ్ళిపోయారు. అబ్దుల్లా వ్రేళ్ళాడుతున్న ఓ దీపాన్ని తీస్తూ పొరపాటున వదిలేస్తే అది నేలమీదపడి బ్రద్దలైంది. సాయిబాబాకి ఇది చాలా కోపం తెప్పిస్తుందనుకున్నాను కానీ అలా జరగలేదు. ఆయన దాన్నసలు పట్టించుకోలేదు. వరండాలో బాగా గాలి వీస్తూండటం వల్ల మేము మా పంచదశి తరగతిని గదిలో ఏర్పాటుచేశాము. సాయిబాబా బయటకి వెళ్ళటం, తరువాత మళ్ళీ తిరిగి రావటం చూశాము. ముందుజన్మలో రెండు మూడేళ్ళపాటు నేనాయనతోనే ఉన్నాననీ, ఇంటిదగ్గర సౌఖ్యంగా జీవించటానికి కావలసినంత ఉన్నా నేను రాజుసేవకు వెళ్ళాననీ వారు చెప్పారు. ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకుందామనుకున్నప్పటికీ సాయిసాహెబ్ వాటిని చెప్పలేదు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

FacebookWhatsAppXFacebook SendGmailYahoo! MailLinkedInSMSBloggerEmailSumoMe

4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo
 
FacebookWhatsAppXFacebook SendGmailYahoo! MailLinkedInSMSBloggerEmailSumoMe