సాయి వచనం:-
'నీవు తినేటప్పుడు ప్రక్కన ఎవరైనా ఉంటే వారికి పెడతావనే మాట నిజమే. ఎవరూ లేకపోతే పెట్టకుండా తినడం నీ తప్పు కాదు. అది సరే! కానీ నా మాటేమిటి? నేనెప్పుడూ నీతోనే ఉన్నాను కదా! నీవు తినబోయేది నాకెప్పుడైనా పెట్టావా?'

'సాయిబాబాను ప్రార్థించు, బాబా తప్పక సహాయం చేస్తారు' - శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 350వ భాగం.


ఖపర్డే డైరీ - ముప్పయిఐదవ భాగం.

26-2-1912

కాకడ ఆరతికి హాజరయ్యాను. సాయిబాబా ఏమీ మాట్లాడకుండా మశీదుకు వెళ్ళిపోయారు. నాసిక్ స్త్రీలు ఈ ఉదయం వెళ్ళిపోయారు. తరువాత మా పంచదశి తరగతి నిర్వహించి సాయిబాబా బయటకు వెళ్ళటం, తిరిగి మశీదుకి రావటాన్ని చూశాము. వారు తమకొక సోదరుడున్నాడనీ, అతను అవిధేయతగా ప్రవర్తించటం వల్ల కులబహిష్కారం చేయబడ్డాడనీ ఒక కథ చెప్పారు. సాయిబాబా అతని మంచి, చెడులను చూసి తిరిగి కులంలోకి తీసుకున్నారట. మధ్యాహ్న ఆరతి అయ్యాక భోజనానంతరం కొద్దిసేపు విశ్రమించి పంచదశి కొనసాగించాము. పూణే నుంచి దాతార్ అనే ఆయన తన కొడుకుతో సహా వచ్చాడు. అతని కొడుకు ప్లీడరు వృత్తి చేస్తున్నట్లనిపిస్తోంది. వాళ్ళు హాల్లో బస చేశారు. సాయిసాహెబ్‌ను వ్యాహ్యాళిలో చూసేందుకు మశీదుకు వెళ్ళాము. వాడా ఆరతి అయ్యాక భాగవతము, దాసబోధ జరిగాయి. భజనలో శ్రీమతి కౌజల్గి, ఆమె కొడుకు పాల్గొన్నారు.

27-2-1912

నేను మామూలుగా లేచి, ప్రార్థన ముగించిన తరువాత పంచదశి తరగతి నిర్వహించాము. సాయిబాబా బయటకు వెళ్ళేటప్పుడు దర్శించుకోలేకపోయాము. వారు తిరిగి వచ్చేవరకు వారిని దర్శించలేకపోయాము. పదకొండు గంటలకు మేము మశీదుకు వెళ్ళినప్పుడు సాయిబాబా తామొక పొలంలోకి వెళ్ళామని, అక్కడ పెద్ద చిలుకలు ఉన్నాయని చెప్పారు. వారు అక్కడ ఉండటంతో అవి బెదరిపోయాయట. తాము మాత్రం వాటి సైజునీ, రంగునీ మెచ్చుకొంటూ చాలాసేపు అలాగే నిలుచుండిపోయారట. మధ్యాహ్న ఆరతి మామూలుగానే జరిగిపోయింది. మధ్యాహ్న భోజనానంతరం నేను కొద్దిసేపు విశ్రమించాక పంచదశి తరగతిని సాయిమహారాజు సాయంత్రపు వ్యాహ్యాళికి వెళ్లే సమయం వరకూ కొనసాగించి, వారిని చూడటానికి వెళ్ళాము. రాత్రి వాడా ఆరతి, శేజారతి జరిగాయి. భీష్మ దాసబోధ, భాగవతము చదివాడు.

28-2-1912

కాకడ ఆరతికి హాజరయి తిరిగి వచ్చి ప్రార్థన చేసుకొంటూండగా పూణే నుండి ధోండోబాబా వచ్చాడు. అతను బర్మానుండి ఇటీవలే వచ్చాడు. నేను నా స్నేహితుడు తిలక్ ఆరోగ్యం గురించి, అతని మానసికస్థితి గురించి అతనితో మాట్లాడుతూ కూర్చున్నాను. ఆ పరిస్థితిలో అది ఎంత బాగుండాలో అంత బాగుంది. నేను తిరిగి వచ్చి బార్‌లో ప్రాక్టీస్ చేయాలని అతను కోరుకున్నాడుగానీ, అది సాయిసాహెబ్ చెప్పే దానిమీద ఆధారపడి ఉంటుంది. మేము నిర్వహించిన పంచదశి తరగతికి బాలాసాహెబ్ భాటే హాజరయ్యాడు. సాయిసాహెబ్ బయటకు వెళ్ళటం చూసి, వారు మశీదుకు తిరిగి వచ్చాక మశీదుకి వెళ్ళాము. వారు 'జీవముని చెల్లిస్తాడా?' అని అడిగారు. జీవముని అంటే నాకర్థం కాకపోయినా, ఆజ్ఞాపిస్తే జీవముని చేస్తాడన్నాను. జీవముని చేయడన్నారు వారు. వారు నాకు చాలా పళ్ళు, స్వీట్లు ఇచ్చారు. మధ్యాహ్న ఆరతి అయింది. ఈరోజు ఏకాదశి అవటం వల్ల నేను, రఘునాథ్ తప్ప ఎవరూ అల్పాహారం గానీ, మధ్యాహ్న భోజనం గానీ తీసుకోరు. ధోండోబాబా ఉపవసించాడు. ఇతను దాదాకేల్కరు కొడుకు భావూతో కలిసి సాయంత్రం నాలుగ్గంటలకు పూణేకి వెళ్ళిపోయాడు. తరువాత మేము పంచదశి తరగతి నిర్వహించి సాయంత్రం సాయిమహారాజుని వ్యాహ్యాళి సమయంలో చూసేందుకు వెళ్ళాము. వారు చాలా ఉల్లాసంగా ఉన్నారు. నెమ్మదిగా నడుస్తూ, హాస్యస్ఫోరకంగా మాట్లాడారు. భీష్మ భాగవతము, దాసబోధ చదివాడు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

5 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo