సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

తర్ఖడ్ కుటుంబ అనుభవాలు - 6వ భాగం


'మారియమ్మ' బారి నుండి బాబా రక్షణ

ప్రియమైన సాయిభక్తులారా! మనం 21వ శతాబ్దంలో పయనిస్తున్నా, ఇప్పుడు నేను వివరించబోయే మా నాన్నగారి అనుభవంలో నమ్మకముంచుతారని విశ్వసిస్తున్నాను. శిరిడీలో ఒకసారి కలరా మహమ్మారి వ్యాపించిందని శ్రీసాయిసచ్చరిత్ర చదివినవారికందరికీ తెలిసిన విషయమే. అటువంటి అంటువ్యాధులు ప్రబలినపుడు, మరణాలను అదుపులో ఉంచటానికి 'మారియమ్మ' అనే గ్రామదేవతను ప్రార్థించాలని గ్రామస్తులు నమ్మేవారు. ఈ రోజుల్లోలాగా అప్పట్లో వైద్య సదుపాయాలు కానీ, గ్రామాభివృద్ధి కానీ ఏమీ లేకపోవడంవల్ల గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలడమనేది సర్వసాధారణమైన విషయం. అప్పటికి ఇంకా ప్రచారసాధనాలు కూడా అంతగా లేని కారణంగా మా నాన్నగారు శిరిడీ చేరుకున్న తరువాత కానీ శిరిడీలో కలరా వ్యాధి ప్రబలి ఉందని తెలుసుకోలేకపోయారు. అయితే అప్పటికే బాబా మీద పూర్తి నమ్మకం ఏర్పడినందువల్ల, తన గురించి బాబా తగిన జాగ్రత్తలు తీసుకుంటారనీ, ఒకవేళ శిరిడీలో ఉండటం నిజంగా ప్రమాదకరమయితే బాబా తనను వెంటనే ముంబయి వెళ్ళమని ఆజ్ఞాపిస్తారని కూడా ఆయనకు బాగా తెలుసు. అందుచేత ఆయన ఎటువంటి భయాందోళనలకు లోనవకుండా ఎప్పటిలాగానే తన పూజాదికాలు నిర్వర్తించారు.

తరువాత రెండు, మూడు రోజులలో శిరిడీ చుట్టుప్రక్కల గ్రామాలలో కూడా కలరా భయంకరంగా విజృంభించడం, మరణాల సంఖ్య పెరిగిపోవడం చూసి ఆయన తనలో తాను బాగా భయపడిపోయారు. ఒకరోజు సాయంత్రం, తన విధి నిర్వహణలో భాగంగా ఆయన పెట్రోమాక్స్ లైట్లు వెలిగించి మసీదులో ఉంచడానికి మసీదు మెట్లు ఎక్కుతుండగా, హఠాత్తుగా బాబా ఉగ్రులై ఆయనపై తిట్ల వర్షం ప్రారంభించారు. అది ఆయనకు ఒక కొత్త అనుభవం.

బాబా కోపం తారాస్థాయికి చేరుకుంటోంది. విపరీతమైన కోపంతో బాబా, మా నాన్నగారిని ఏడు ముక్కలుగా నరికి మసీదులో పాతిపెట్టేస్తానని అన్నారు. బాబా మాటలు విని ఆయన విపరీతంగా భయపడిపోయారు. తాను తెలియక ఏదో తప్పుచేసి ఉంటానని, అదే బాబా కోపానికి కారణమయివుంటుందని తలచి, ఆయన వెంటనే బాబా పాదాలపైపడి క్షమించమని అర్థించడం మొదలుపెట్టారు. బాబా కోపంతో, ఆయనను అక్కడే కూర్చొని తన కాళ్ళు ఒత్తమని ఆదేశించారు. మా నాన్నగారు వెంటనే బాబా ఆజ్ఞను శిరసావహించి ఆయన పాదాలవద్ద కూర్చొని బాబా కాళ్ళు ఒత్తసాగారు. బాబా ఏదో గొణుగుతూ, ఇంకా కోపంగా ఉండటం మా నాన్నగారు గమనించారు.

కొంతసేపటి తరువాత, తన కళ్ళముందు భయంకరమైన రూపంతో ఉన్న 'కాళికాదేవి'ని చూసి, మా నాన్నగారికి భయంతో ముచ్చెమటలు పోశాయి. రక్తంతో తడిసిన నాలుకతో చూడటానికి ఆమె ఎంతో భయానకంగా ఉంది. ఈ దృశ్యం చూసి మా నాన్నగారికి స్పృహ కోల్పోతున్నట్లనిపించింది. తనకు తెలీకుండానే, ఆయన తన శరీరంలోని శక్తినంతా కూడదీసుకుని భయంతో బాబా కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. తనను రక్షించమని బాబాను అడుగుదామని ప్రయత్నిస్తున్నారు, కానీ విపరీతమైన భయంతో ఆయన నోటి నుండి ఒక్క మాట కూడా బయటకు రావడం లేదు. ఆయన భయంతో బాబాను, కాళికాదేవిని మార్చి మార్చి చూస్తున్నారు. బాబా తనతో ఏదో చెప్తున్నట్లు కనిపిస్తున్నది కానీ, ఏదీ వినపడటం లేదు, అర్థం కావటం లేదు. మరుక్షణమే ఆయన స్పృహ కోల్పోయారు. 

కొంత సేపటికి ఆయన స్పృహలోకి వచ్చేసరికి, బాబా తనను కుదుపుతూ లేపటానికి ప్రయత్నిస్తున్నారని అర్థమయింది. ఆయన పూర్తిగా స్పృహలోకి వచ్చేసరికి, తన శరీరమంతా చెమటతో తడిసి ముద్దయి ఉన్నారు. బాబా ఆయనతో, “భావూ! నేను నీతో నా కాళ్ళు ఒత్తమని చెప్పాను. కానీ నువ్వు నా కాళ్ళు ఎంత గట్టిగా పట్టుకున్నావంటే నీ చేతిగోళ్ళతో నన్ను గాయపరుస్తున్నట్లుగా ఉంది” అన్నారు.

మా నాన్నగారికి బాగా దాహం వేసి బాబాను మంచినీళ్ళు అడిగారు. బాబా మసీదులోని కుండలోని నీరు తెచ్చి ఇచ్చారు. మంచినీళ్ళు తాగిన తర్వాత, కొంచెం నెమ్మదించి మా నాన్నగారు మామూలు స్థితికి వచ్చారు. ఆయన వెంటనే తనకు అటువంటి భయానకదృశ్యాలను చూసి తట్టుకునే శక్తి లేదని, అందువల్ల భవిష్యత్తులో అటువంటి దృశ్యాలను చూపించవద్దని బాబాను వేడుకున్నారు. ఆయన బాబాతో, ఇక నాలుగు రోజులపాటు తాను ఆహారం కూడా తీసుకోలేనని, ఇకముందు కూడా అలా చూపించేటట్లయితే మళ్ళీ శిరిడీకి రావాలా, వద్దా అని కూడా తిరిగి ఆలోచించాల్సి వస్తుందని అన్నారు. అప్పుడు బాబా, “భావూ! నువ్వు సరిగ్గా ఏం చూశావో చెప్పు!” అన్నారు.

మా నాన్నగారికి జరిగినదంతా బాగా గుర్తుండటంవల్ల పూసగుచ్చినట్లు బాబాతో చెప్పారు. ఆయన బాబాతో, “భయంకరంగా ఉన్న ఆ వ్యక్తితో మీరు ఏదో చెబుతున్నారు. కానీ స్పృహలో లేని కారణంగా నేనేమీ వినలేకపోయాను!” అన్నారు. బాబా ఆయనతో, “భావూ! నువ్వు చెబుతున్న ఆ భయంకరమైన వ్యక్తి మరెవరో కాదు, 'మారియమ్మ'. ఆమె నీ ప్రాణాన్ని అడుగుతోంది. నేను తిరస్కరించి ఆమెను ఇక్కడ్నుంచి వెళ్ళమంటున్నాను. కానీ, ఆమె వెళ్ళడానికి నిరాకరిస్తోంది. నేనప్పుడు ఆమెతో, కావాలంటే ఇంకొక అయిదు మందిని తీసుకుని వెళ్ళమని, నా భావూను మాత్రం దూరం కానివ్వనని అన్నాను. ఆఖరికి ఆమె తన ప్రయత్నాన్ని విరమించుకుని మసీదును వదలి వెళ్ళిపోయింది. భావూ! జాగ్రత్తగా గుర్తుంచుకో! నిన్ను శిరిడీకి రప్పించింది చంపడానికి కాదు. నువ్వు నా పాదాల వద్ద ఉన్నంతకాలం నా నుంచి ఎవ్వరూ నిన్ను వేరుచేయలేరు.”

మా నాన్నగారికది బాబా అనుగ్రహించిన పునర్జన్మలా అనిపించి, బాబా పాదాలపై పడి, తనకటువంటి భయానక దృశ్యాలు చూపించవద్దని, వాటిని చూసి తట్టుకునే శక్తి లేదని మరొకసారి బాబాను అర్థించారు. ఆ భయంకర దృశ్యాన్ని గుర్తుచేసుకుంటే చాలు, ఆ రాత్రంతా ఆయనకు నిద్ర పట్టేది కాదని ఆ సంఘటన గురించి చెబుతున్నప్పుడల్లా మా నాన్నగారు అనేవారు. 

ప్రియమైన సాయిభక్తులారా! ఈ అనుభవాన్ని చదివిన తరువాత మీకు కొన్ని సందేహాలు కలుగుతాయని, వాటిని నివృత్తి చేసుకోవాలనుకుంటున్నారని నాకు తెలుసు. కాని నేను ముందే చెప్పినట్లు, శ్రీసాయిబాబా భగవంతుని అవతారమేనని మీరు నమ్మండి. ఆయనకు మానవాతీత శక్తులున్నాయి. అవసరమయినప్పుడు వాటిని తమ భక్తులను రక్షించడానికి ఉపయోగించేవారు. బాబా అనుగ్రహంవల్ల ఇటువంటి ప్రాణభిక్ష అనుభవాలు పొందినవారు చాలామంది ఉండవచ్చని నేను దృఢంగా నమ్ముతున్నాను. దుష్టశక్తుల బారినుండి తన భక్తులను రక్షించడం తన ముఖ్యకర్తవ్యమని బాబా ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. ఆయన మా నాన్నగారితో, “భావూ! నేను నా భౌతిక దేహాన్ని విడచిన తరువాత, ప్రజలు చీమల బారుల్లా శిరిడీకి వస్తారు. బాగా గుర్తుంచుకో! ఈ మసీదులో కూర్చొని నేనెన్నడూ అసత్యం పలుకను” అన్నారు. 

ప్రియమైన పాఠకులారా! ఈ 21వ శతాబ్దంలో శిరిడీలో ఏమి జరుగుతున్నదో (భక్తులు తండోపతండాలుగా బాబా దర్శనార్ధం శిరిడీకి రావడం) మనమంతా ఈరోజు చూస్తున్నాము, అనుభూతి చెందుతున్నాము. ఈ ప్రపంచం అంతమయ్యేంతవరకు యిది ఇలాగే కొనసాగుతూ ఉంటుందని నేను భావిస్తున్నాను.

సోర్స్ : "Live Experiences of the Tarkhad Family with Shri Sai Baba of Shirdi"



ముందు భాగం

కోసం

బాబా పాదుకలు

తాకండి.


నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 

 


తరువాయి భాగం

కోసం

బాబా పాదాలు

తాకండి.




4 comments:

  1. ఓం సాయిరాం జీ 🙏

    ReplyDelete
  2. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete
  3. Om sai ram tandri, amma nannalani Ammamma tataya ni ayur arogyalatho kshamam ga kapadandi tandri vaalla purti badyata meede, naaku manchi arogyanni echi ofce lo anni situations bagunde la chusukondi baba pls, ninna ofce lo nannu oka problem nunchi kapadinanduku chala thanks tandri, neeve ma dikku.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo