సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 487వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:

  1. నా జీవితంలో శిరిడీ సాయిబాబా ప్రవేశం - వారి ఆశీస్సులతో జరిగిన వివాహం
  2. కోవిడ్ బారినుండి నన్ను కాపాడిన బాబా

    నా జీవితంలో శిరిడీ సాయిబాబా ప్రవేశం - వారి ఆశీస్సులతో జరిగిన వివాహం

    సాయిభక్తుడు గోపాలకృష్ణ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

    ఓం సాయిరాం! నా పేరు గోపాలకృష్ణ. మాది జానకీపురం గ్రామం. సాయిభక్తులందరికీ నమస్కారం. అందరిపై ఆ శిరిడీ సాయినాథుని కృప సమృద్ధిగా ఉండాలని కోరుకొంటున్నాను. బాబా నా జీవితంలోకి వచ్చి నేటికి మూడు సంవత్సరాలు దాటింది. ఈ మూడు సంవత్సరాల కాలంలో బాబా ఎన్నో రకాలుగా నన్ను ఆదుకున్నారు. అది 2017వ సంవత్సరం, అక్టోబరు నెల. నేను ఇంటి దగ్గర ఉండి బ్యాంకు ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాను. ఆ సమయంలో మా అక్క(బాబాయి కూతురు), బావగారు హైదరాబాదు నుండి మా ఇంటికి వచ్చారు. మాటల సందర్భంలో మా బావగారు నాతో, “నువ్వు హైదరాబాదు వచ్చి పరీక్షలకు ప్రిపేర్ అవచ్చు కదా” అని అన్నారు. నేను అందుకు అంగీకరించి కొన్నిరోజుల తరువాత హైదరాబాదు వెళ్లి మా అక్కావాళ్ళింట్లో కొన్ని నెలలు ఉన్నాను. ఆ సమయంలోనే బాబా నాకు దగ్గరయ్యారు.

    ఒకరోజు మా బావగారు నన్ను దిల్‌షుఖ్‌నగర్ లోని సాయిబాబా గుడికి తీసుకెళ్లారు. ఇద్దరం బాబా దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాము. మా అక్క, బావగారు ఇద్దరూ సాయిభక్తులు కనుక వాళ్ళింట్లో సాయిబాబా సచ్చరిత్ర నిత్యపారాయణ పుస్తకాన్ని చూశాను. ఆ పుస్తకం తీసుకుని మొదటి రెండు పేజీలు చదివాక మా అక్కను అడిగాను, ‘ఈ పుస్తకం ఎలా చదవాలి?’ అని. ‘సచ్చరిత్ర సప్తాహపారాయణ చేస్తే మంచిద’ని అక్క బదులిచ్చింది. నేను నా కోరికను మనసులోనే బాబాకు చెప్పుకొని పారాయణ మొదలుపెట్టాను. అలా పారాయణ చేస్తూ బ్యాంకు ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాను. మొదటి పారాయణ పూర్తయిన తరువాత మళ్ళీ రెండుసార్లు పారాయణ చేశాను. కానీ నాకు ఏ ఉద్యోగమూ రాలేదు. ‘బాబా నాకు ఏ ఉద్యోగాన్నీ ప్రసాదించలేద’ని చాలా బాధపడ్డాను. కానీ బాబాకి దూరం కాలేదు

    తరువాత నేను అక్కావాళ్ళింటినుండి హాస్టల్‌కి వెళ్ళాను. హాస్టల్‌కి వెళుతూ నాతో పాటు బాబా ఫోటోను తీసుకెళ్ళి నా రూములో గోడకు అంటించాను. అప్పటినుండి రోజూ స్నానం చేసిన వెంటనే బాబాకు నమస్కరించుకోవటం అలవాటుగా మారింది. తరువాత నేను బ్యాంకు ఉద్యోగాల కొరకు శిక్షణ ఇచ్చే ఒక సంస్థలో చేరి, మళ్లీ నా ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను. మూడు నెలలు గడిచిన తర్వాత అనుకోకుండా ఓరోజు మా ఇంటినుండి ఫోన్ కాల్ వచ్చింది, “ఒక పెళ్ళి సంబంధం వచ్చింది, పెళ్లి చేసుకుంటావా?” అని. పెళ్ళి విషయం గురించి నా తల్లిదండ్రులు ఎప్పటినుండో నన్ను అడుగుతున్నారు. వాళ్ళడిగిన ప్రతిసారీ ‘నాకు ఇప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు’ అని చెప్పేవాడిని. కానీ ఈసారి పెళ్ళికి అంగీకరించాను. నేను పెళ్ళి చేసుకోవటానికి అంగీకరించేసరికి మావాళ్ళు చాలా సంతోషించారు. తరువాత బాబా ఆశీస్సులతో నాకు వివాహం నిశ్చయమైంది. మొదటి శుభలేఖ బాబా గుడికి వెళ్లి బాబాకు సమర్పించాను. ఇక వివాహ సమయంలో నా జీవితంలో నేను ఊహించలేనటువంటి సంఘటన జరిగింది.

    అదేమిటంటే, పెళ్లి జరిగేరోజు సాయంత్రం ఆకాశమంతా మేఘావృతమై ఉంది. వర్షం పడే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. నేను చాలా భయపడ్డాను. “బాబా! పెళ్ళికి బంధువులంతా వచ్చారు. ఒకవైపు వర్షం వచ్చేలా ఉంది. నువ్వే ఎలాగైనా వర్షం రాకుండా చూడు బాబా!” అని బాబాను మనసులోనే వేడుకుంటూ వివాహ వేదిక మీదికి ఎక్కాను. బాబా అద్భుతం చేశారు. వాతావరణమంతా చాలా చల్లగా ఉన్నప్పటికీ వర్షం ఏమీ రాలేదు. బాబా అనుగ్రహంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా వివాహం ఎంతో వైభవంగా జరిగింది. మేము ఆహ్వానించిన వారంతా పెళ్లికి వచ్చారు. పెళ్ళికి వచ్చిన వారిలో ఒక సాధువు కూడా ఉండటం గమనించాను. బహుశా నన్ను ఆశీర్వదించటానికి బాబానే ఆ సాధువు రూపంలో పెళ్లికి వచ్చుంటారని నేను చాలా ఆలస్యంగా గ్రహించాను. బాబా నా జీవితంలో ప్రవేశించినప్పటినుండి ఏదో ఒక రూపంలో నన్ను ఆదుకుంటున్నారు.

    కోవిడ్ బారినుండి నన్ను కాపాడిన బాబా

    ఒక అజ్ఞాత సాయిభక్తుడు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

    ఓం సాయిరామ్! నేను 18 సంవత్సరాల నుండి సాయిబాబా భక్తుడిని. ఎన్నో క్లిష్టసమస్యల నుండి సాయిబాబా నన్ను ఆదుకున్నారు, ఆదుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం నేను ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాను. ఇటీవల మా కంపెనీ యజమాని తమ్ముడికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దాంతో ఆ కంపెనీలో పనిచేస్తున్న మా అందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. రిపోర్టుల గురించి నేను చాలా భయపడ్డాను. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, ఎలాగైనా నన్ను ఈ కోవిడ్ బారినుండి కాపాడమని వేడుకున్నాను. తరువాత కోవిడ్ పరీక్షల రిపోర్టులు వచ్చాయి. నాకు నెగిటివ్ అని మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసిన నా ఆనందానికి హద్దులు లేవు. కోవిడ్ బారినుండి నన్ను కాపాడిన బాబాకు అనంతకోటి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఎల్లప్పుడూ మమ్మల్ని ఇలాగే రక్షిస్తూ ఉండమని బాబాను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.

    సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


    సాయి ఊసే సాయి ధ్యాసే - లేదు లేదిక వేరె బాట



    శ్రీసాయిబాబా డెబ్భైఅయిదవ మహాసమాధి పూజోత్సవాలు 1993 విజయదశమి పర్వదినాన శిరిడీలోని సాయిపథం ప్రాంగణంలో వైభవంగా జరిగాయి. ఆ సందర్భంగా పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ సత్సంగమిది. వేదికపై వారు చేసిన ఈ చివరి ఉపన్యాసాన్ని అక్షరరూపంగా సాయిపథం పాఠకులకు అందిస్తున్నాము. ఆ వాక్సుధాధారలతో మన మనసులు పునీతమవగా సాయి ధ్యాననిమగ్నులమవుదాం.

    ఈరోజున బాబా 75వ మహాసమాధి ఉత్సవాల సందర్భంగా మనమందరము ఇక్కడ కలుసుకుని బాబా స్ఫురణలో ఉండటం శ్రీసాయి అనుగ్రహవిశేషంగా భావిస్తున్నాను. మనందరం సాయిపథంలో నడుస్తున్నాము, లేదా నడవాలని ఆశపడుతున్నాము. ‘బాబాపై భక్తిని ఇంకా ఎలా పెంపొందించుకోవాలి?’ అనే తపన మనందరిలోనూ ఉన్నది. ఏదో పొందాలి, ఏదో సాధించాలి అనుకుంటాము. కానీ ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. “మనకు నిజంగా ఏమి కావాలి? ఎందుకోసం ఇంతదూరం వచ్చాము? వీటివల్ల మనం అనుకున్నవి ఏమైనా నెరవేరుతున్నాయా? అసలు బాబా ఎవరు? మనము ఆయనకు పూజచేస్తే, ఆయన స్మరణచేస్తే, మనం అనుకుంటున్న లక్ష్యం - అది లౌకికమైన కోరిక కావచ్చు, ఆధ్యాత్మికమైన లక్ష్యం కావచ్చు, ఏదైనాసరే అది నేరవేరుతున్నదా? అవి తీరుతుంటే ఎలా తీరుతున్నాయి? బాబా మన కోరికలు ఎందుకు తీర్చాలి?” - ఈ విషయాల గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఇదిగో ఫలానా కోరిక ఉన్నది, మనం బాబాకు మ్రొక్కుకున్నట్లయితే, సాయిబాబా స్మరణ చేసినట్లయితే లేదా సాయిబాబాకు పూజ చేసినట్లయితే ఆ కోరిక నెరవేరుతుంది అనుకుంటున్నాము, అంతే.

    కానీ ఆ కోరికలు తీర్చటానికి వెనుకనున్న అసలైన సాయితత్త్వం గురించి సరైన అవగాహన లేకపోయినట్లయితే మనం ఇంత వ్యయప్రయాసలకు ఓర్చి, ఇంతదూరం వచ్చి ఇలా కూర్చొని ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడం వలన ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అసలు మనకు ఏం కావాలి? ఈ కోరిక యొక్క తత్త్వం ఏమిటి? ఈ ప్రశ్నలు ముందు మనకు రావాలి. వీటికి వేటికీ మన దగ్గర సమాధానం లేదు. మన జీవితం అనేటువంటిది ఒక డిగ్రీ కోర్సులా ఉన్నదనుకుంటే, ఎందుకు చదువుతున్నామో, ఏం చదువుతున్నామో అర్థంకాకుండా కాలేజీ అనే ఈ ప్రపంచంలో హాజరవుతున్నాము. పరీక్షకు కూర్చుంటున్నాము. పరీక్ష పేపరు వచ్చింది. మనం ఎందుకు పుట్టాం? మన జీవితలక్ష్యం ఏమిటి? దాని తత్త్వమేమిటి? మొదలయిన ప్రశ్నలకు మనవద్ద సమాధానాలు లేవు. దేనికీ సమాధానం తెలియని ప్రశ్నాపత్రం చూచిన విద్యార్ధి పరీక్ష హాలులో ఎటువంటి మనఃస్థితికి లోనవుతాడో అటువంటి మనఃస్థితికే మనం లోనవుతున్నాము. ఏకాంతంలో కూర్చుని ఒక్కసారి ఆలోచించి చూడండి. “అసలు నేనేంటి? ఈ అనంతకోటి జీవరాశులలో నేనెంతటివాడ్ని? నా పుట్టుకకు ఏమైనా ప్రయోజనం లేదా అర్థం స్ఫురిస్తున్నదా? ఉంటే అది ఏమిటి? దేనికోసం నేను పాటుబడుతున్నాను?” అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఒకరకమైన నిరాశ, నిస్పృహ వస్తుంది. ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు జీవిస్తున్నామో తెలియదు. నిష్కర్షగా, నిర్మొహమాటంగా చెప్పాలంటే, ఇంకా మరణించలేదు గనుక, మరణించేదాకా జీవించాలి గనుక. ఇంతకుమించి ఎవరైనా సమాధానం చెప్పగలరా? కాబట్టి, తెలియకుండా మన జీవితగమ్యం మరణమవుతోంది. దానినే బాబా “పిడకలు ఏరుకోవడం” అన్నారు. “ఎందుకొచ్చినట్లు? పిడకలు ఏరుకోడానికా? సద్గురువును తెలుసుకో!” అన్నారు. సద్గురువును తెలుసుకోకపోతే ఈ జీవితమంతా పిడకల వేట అన్నారు. పిడకలు ఏరుకోవడం అంటే మన చితిని మనమే సిద్ధంచేసుకోవడం. 

    మనకు తెలియకుండా మనందరిలో ఉండే నిస్పృహకు, మన జీవితం యొక్క లక్ష్యం, అర్థం తెలియకపోవడానికి కారణం ఏమిటయ్యా అంటే, జీవితం యొక్క తత్త్వం ఏమిటో అవగాహన లేకపోవడమే. కోరిక యొక్క తత్త్వం, ఈ కోరికలు మనం ఎట్లా తీర్చుకోవాలి అనేటువంటి విధానం తెలియకపోవడం. ఒకవేళ కోరిక నెరవేరినా ఇది నిజంగా తీరడంకాదేమో అని అన్పించడం. ఆధ్యాత్మికవేత్తలు దీనికి సమాధానంగానే రకరకాల మార్గాలు చెప్పారు. ఉదాహరణకు డిగ్రీ సంపాదించాలనే కోరిక ఉంది. మొదట్లో అదే జీవితలక్ష్యంగా మనకు అనిపిస్తుంది. డిగ్రీ రాగానే ఉద్యోగం కావాలనిపిస్తుంది. మరల ఉద్యోగం వస్తే, ప్రమోషను రావాలనుంటుంది. సమస్యలు సృష్టించుకోవడం, సమస్యలకు పరిష్కారం వెతుక్కోవడం. వీటితోనే గడిపేస్తుంటాము. కాబట్టి ఈ ఇంద్రియసుఖాలలో తాత్కాలికమైన సుఖం తప్ప మరి ఎటువంటి ప్రయోజనం లేదు. దీనికి అతీతమైన, శాశ్వతమైన సుఖం ఉన్నది, ఆనందం ఉన్నది. దానికోసం ప్రాకులాడాలంటే, ఈ ఇంద్రియ సుఖాలకు సంబంధించినటువంటి, ప్రాపంచికమైనటువంటి విషయాల్ని వదలిపెట్టు అని చెప్పారు. కానీ మనకు అది ఎంతవరకు సాధ్యం?

    ఇది వినడానికి బాగుండి, చూసేదానికి ఇంతకంటే వేరే మార్గం లేదని కూడా అనిపిస్తుంది. సమస్య చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఎదుటివారికి అది అర్థరహితం అనిపించవచ్చు. కానీ ఎవరి సమస్య వారికి చాలా కఠినమైనది, జటిలమైనది. ఎదుటివాడు చెప్పేటప్పుడు “అదేం సమస్య? దానిగురించి ఎందుకు తాపత్రయపడతావు? అన్నీ భగవంతుడే చూసుకుంటాడులే, వీటిగురించి తాపత్రయపడకు, శాశ్వతమైన ఆనందం కోసం ప్రయత్నం చెయ్యి, ముక్తికోసం ప్రయత్నం చెయ్యి” అని చెప్పడం తేలిక. కానీ చిన్న చిన్న విషయాలే మనల్ని తొలిచివేస్తాయి. వీటిని వదులుకోలేము. ప్రపంచంపట్ల మనకుండే ఇష్టాన్ని వదులుకోలేము, కనుక ఆధ్యాత్మికత వైపు మొగ్గడం అనేది మనకు అంత తేలికయిన పని కాదు. కాబట్టి ఒక సిద్ధాంతరీత్యా మాత్రం దాన్ని అంగీకరిస్తాము. 

    “ఎందుకయ్యా శిరిడీ వస్తున్నారు? ఎందుకు సత్సంగానికి వస్తున్నారు?” అని అడిగితే, “బాబా కృప కోసమండీ! ముక్తి కోసమండీ! ఆత్మసాక్షాత్కారం కోసమండీ!” అంటారు. ఇలా వారు చదువుకున్న వేదాంత గ్రంథాలలో వాళ్ళకు వచ్చినటువంటి పదాలు చెబుతారు. కానీ నిజంగా ముక్తి, మోక్షం అంటే ఏమిటో మనకు తెలుసా? అవి నిజంగా అవసరమా? ఆత్మ అంటూ ఒకటుంది, అది మనకు సాక్షాత్కారించాలా! ఎప్పుడూ చూడని, కనీవినీ ఎరుగనిదాన్ని, తత్త్వం ఏమాత్రం అంతుపట్టని ఒక స్థితిని గురించి మనం ప్రాకులాడటం, తాపత్రయపడటం ఎంతవరకు సాధ్యమవుతుంది? గుండెలమీద చేయి వేసుకుని చెప్పండి, ఎంతమందికి ఇవి నిజంగా అవసరమో! ఊరకే నోటిమాటగా చెపుతున్నాం. చెప్పేటప్పుడు ఏదో ఉన్నతమైన గమ్యము చెప్పాలి కనుక ముక్తీ, మోక్షము అని చెబుతాము. బాబా కృప అని చెబుతాము. రోజంతా మనం ప్రాపంచికమైన, లౌకికమైన విషయాల గురించి, సమస్యల గురించి ఆలోచిస్తాము. కానీ అవి చెప్పుకోవటానికి మనకు సంకోచం. ఈ సంకోచం ఎందువల్ల వచ్చింది? తరతరాలుగా మనకు ఇవన్నీ తుచ్ఛమైనటువంటివి అని ఒక రకమైన brainwash జరిగి వున్నది. ఈ ప్రాపంచిక కోరికల గురించి అడగటం గానీ, మాట్లాడటం గానీ, అసలు అవి ఉన్నాయని చెప్పుకోవటం గానీ తప్పు అని. ఇలా ఈ శుష్కవేదాంతం మన స్థితి ఇది అని చెప్పుకునేటువంటి ధైర్యం కూడా మనకు లేకుండా చేస్తోంది. కాబట్టి ఏం చేస్తున్నాం, ముక్తి - మోక్షం అని చెబుతున్నాము. ఎప్పుడో ఏదో వస్తుందని అంటున్నాము. దాన్ని ఒక ప్రక్కన పెట్టుకొని మన వ్యవహారం మనం చేసుకుంటూ పోతున్నాము. కనుక మన జీవితంలో ఈ ఆధ్యాత్మికత అనేది ఒక భాగం కాకుండా పోతోంది. తెలియకుండా ప్రతి మనిషికి ఆధ్యాత్మికత అంటే భయం ఏర్పడుతోంది.

    వయస్సులో ఉన్నటువంటి పిల్లవాడు, కాలేజీ చదువులు చదువుకుంటున్న పిల్లవాడు ఒక రెండు సత్సంగాలకు వెళ్లినట్లయితే, వెంటనే తల్లిదండ్రులు ఏమంటారు? “ఇప్పుడే ఎందుకురా ఇవన్నీ? ఇంకా time ఉందిలే నీకు, ఇప్పుడే పోకు” అంటారు.  సినిమాలకు పోయినా, పేకాటాడినా, చిల్లర తిరుగుళ్ళు తిరిగినా పెద్దగా పట్టించుకోరు, పెద్దగా భయపడరు. కానీ వాడు సత్సంగానికి గానీ భజనకు గానీ పోతే, కొంపమునిగినట్లుగా బాధపడతారు. ఎందుకని? వాడు జీవితానికి పనికిరాకుండా పోతాడేమోనని భయం. 

    ఆధ్యాత్మికత అంటే అది మనల్ని జీవితానికి పనికిరాకుండా చేసేటువంటిది అన్న అభిప్రాయం మనకు ఉన్నట్లే కదా! ఎప్పుడయ్యా మరి ఈ ఆధ్యాత్మికత అంటే! మనము ప్రాపంచికమైన సుఖాలన్నీ అనుభవించి, మన బాధ్యతలన్నీ తీర్చుకొని, బాగా ముసలివాళ్ళము అయి, ఇంద్రియాలు సరిగా పని చెయ్యనప్పుడు - అప్పుడు ఆధ్యాత్మికత అంటాము. వీడు చూద్దామన్నా వీడి ముఖం చూడ్డానికి ఎవరూ ఉండరు. అప్పుడిక వీడు జయించేదేమిటి? జయించేందుకు ఏముంటుందని? చిట్టచివరలో బాబా ముఖం, ఆధ్యాత్మికత ముఖం చూడాలని మనం చెబుతున్నాము. అంటే అన్నీ అయిపోయిన తరువాత చివరకు ఆయన. కాబట్టి మన మనస్సులో మనకు తెలియకుండా ఆధ్యాత్మికత అంటే ఎలాంటి అభిప్రాయం ఉన్నదో ఆలోచించుకోండి. ఒకరకమైన భయం ఉంది. ఆ భయాన్ని ఆధారంగా చేసుకొని, దానితో మంచిగా ఉంటూ, నీవు నా జోలికి రావద్దు అని చెబుతూ maintain చేసుకుంటూ పోతాము. ఎంతవరకు ఉండాలో, అంతవరకే ఉండాలి అని కొంచెం లౌక్యం జోడిస్తాము. ఇదే మనకు, ధర్మానికి, ఆధ్యాత్మికతకు పట్టిన గ్లాని, జబ్బు. ఇట్లా ధర్మానికి గ్లాని, జబ్బు పట్టినప్పుడు భగవంతుడు అవతరిస్తాడు అని చెప్పారు మహనీయులు. ఇప్పుడు పట్టినటువంటి గ్లాని ఏమిటి? అని అంటే ఇదే. ఆధ్యాత్మికత అంటే ప్రాపంచికానికి అతీతమైనటువంటిది, భిన్నమైనటువంటిది, వ్యతిరేకమైనటువంటిది. ప్రపంచంలో ఉన్నంతవరకూ మనకు ఆధ్యాత్మికత వంటపట్టదు. ఆధ్యాత్మికత వంటబట్టిందా, ఇక వాడు ప్రపంచానికి పనికిరాడు. ఇదో, అదో తేల్చుకోవాలి, అనే ఒక ఆలోచన మన నరనరాలలో, రక్తంలో జీర్ణించుకుపోయింది. చెప్పేవాడికి, వినేవాడికి, అర్థం కాని రీతిలో వల్లించబడుతున్న మెట్టవేదాంతం వల్ల ఏర్పడిన జబ్బు ఇది. మాట్లాడితే ఆత్మ, పరమాత్మ, పరబ్రహ్మం, ముక్తి, మోక్షం, మనస్సును అంతర్ముఖం చెయ్యడం, అమనస్కం చెయ్యడం.. ఇట్లాంటి పదాలు ఎంత మాట్లాడితే అంత మనం ఆధ్యాత్మికతలో ‘మునిగిపోయినట్లు’ లెక్క. ఇది ఆధ్యాత్మికతకు పట్టిన గ్లాని. ఈ గ్లానిని తొలగించడానికే బాబా వచ్చారు.

    మన దు:ఖానికి కారణం ఏమిటి? మనలో రకరకాల కోరికలున్నాయి. ఈ కోరికలు తీరాలి. ఈ కోరికలు నెరవేరితే మనకు ఆనందం. ఆ ఆనందం శాశ్వతమో, అశాశ్వతమో మనకు అనవసరం. అది అశాశ్వతమైనా మనకు అదే కావాలి. ఎప్పుడో శాశ్వతమైన సుఖం వస్తుందని, ఈరోజు అందివచ్చిన సుఖాన్ని, అది అశాశ్వతమైనదైనా సరే దులుకోము ఎవరైనా! అయినా అదేదో తెలియదు, వస్తుందని గ్యారంటీ లేదు. ఎవరినైనా అడిగితే ఇవ్వలేమంటున్నారు. లేదా, అన్నీ వదలిపెట్టుకొని వస్తే ఇస్తామంటున్నారు. దీనిగురించి భగవాన్ రమణమహర్షి చాలా చక్కగా చెప్పారు. 

    ఒకసారి ఆయన దగ్గరకు వేదాంతాన్ని బాగా తలకెక్కించుకొన్న ఒకామె వచ్చింది. భగవాన్ దగ్గర కూర్చొని, ధ్యానం చేసుకొని, మనస్సును అంతర్ముఖం చేసుకొని, ఇంకా అలాంటివి ఏవేవో చేసుకొని వెళ్ళేటప్పుడు అడిగింది, "భగవాన్! నాకేమీ కోరికలు లేవు. ఆ ముక్తి అంటారే అది ఇస్తే నేను వెళ్ళిపోతాను” అంది. ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆమె మళ్ళీ అడిగింది. “ఊఁ! సరి” అన్నారు. ఆయన పద్ధతి అది. ఆయన ఇచ్చాడో లేదో కూడా చూసుకోకుండా, ఇక తన పనయిపోయినట్లు ఆమె వెళ్ళిపోయింది. బహుశా గడప దాటిన తరువాత ఆ విషయం ఆమెకు గుర్తుండకపోవచ్చు కూడా. ఆమె అట్లా వెళ్ళగానే భగవాన్ కడుపు పట్టుకుని పకపకా నవ్వసాగారు. అక్కడున్నవాళ్ళందరూ అడిగారు, భగవాన్ ఎందుకు నవ్వుతున్నారని. “ఆఁ, ఆమె మాటలకులే” అన్నారు. “ఆ మాటల్లో తప్పేముంది, మేమందరమూ కూడా అందుకేగా వచ్చాము? మేము అడగాల్సిన మాటలే ఆమె అడిగింది” అన్నారు. “ఆఁ! ఏమీ లేదు. నాకింకేం అక్కర్లేదు, ముక్తి మాత్రం కావాలి అన్నందుకు నవ్వు వచ్చింది. ఏ కోరికా లేకపోతే మిగిలేది ముక్తేగా! ఇక నేనిచ్చేదేమిటి?” అన్నారాయన. కాబట్టి మనం అడిగేటటువంటిది ఎంతటి అసంబద్ధమైనదో ఒక్కసారి ఆలోచించండి. మనకేమీ అక్కర్లేదు, ముక్తి కావాలనటం నోటి మాటలాంటిది. ఆ మాట రమణమహర్షి లాంటి సద్గురుమూర్తికి నవ్వు తెప్పించింది. అంత హాస్యాస్పదమైన విషయాన్ని మనం చాలా సీరియస్‌గా, చాలా గొప్పగా చెబుతాం. ఈ గ్లానిని తొలగించుకోవటానికి, మనం ఎక్కడ ఉన్నామో అక్కడనుంచి మనలను నడిపిస్తూ ఏమీ అవసరం లేని స్థితికి రావాలంటే ఏమి చేయాలో అది చేసేవాడే సమర్థ సద్గురువు. నిజమైనటువంటి సద్గురువు ఆధ్యాత్మికత ప్రపంచానికి వ్యతిరేకమైనటువంటిది, భిన్నమైనటువంటిది అని బోధించడు. సద్గురువు యొక్క పని ఏమిటంటే - మనం క్రింద ఉన్నాము, క్రిందినుంచి చేయి పట్టుకొని మనలను పైకి తీసుకువెళ్ళాలి! ఆయన పైన కూర్చొని ‘పైకిరా’ అనటం కాదు. పైకి రాగలిగితే ఇంకేముంది? మనల్ని ఆయన తీసుకుపోయేదేముంది? దీన్ని యోగి వేమన చక్కగా చెప్పాడు ఒక పద్యంలో .... “ఇహము లేదు పరము గలదు అన్నవాడి మాట కల్ల మాట. ఇహములోనే పరము చూపువాడే సద్గురువు!!” మనం ఇహంలోనే ఉన్నాము. ఇక్కడికి, ఆ సద్గతో, ముక్తో, మోక్షమో మనకు అందించేవాడే సద్గురువు.

    ఒకవేళ ఆయన(సద్గురువు) ఇహంలో ఉన్న మనకు ముక్తినో, మోక్షాన్నో ఇవ్వదలచినా తీసుకునే స్థితిలో మనము లేము. వివేకానందస్వామి ఆజన్మసిద్ధుడని చెప్పారు రామకృష్ణ పరమహంస. అంతటి కారణజన్ముడికి రామకృష్ణ పరమహంస సమాధిస్థితినిస్తే, “నాకు ఇల్లుంది, సంసారముంది, నాకు తల్లిదండ్రులున్నారు, నాకు బాధ్యతలున్నాయి. నన్నేమి చేస్తున్నావు?” అని కేకలు పెట్టాడు. అప్పుడు రామకృష్ణులు “నీకిప్పుడు కాదులే” అన్నారు.

    కాబట్టి దానిని తీసుకునే సామర్థ్యాన్ని కూడా ఆయనే కలగచేయాలి. ఇవ్వడం ఒకటి, తీసుకునే సామర్థ్యాన్ని కలగచేయడం ఒకటి. ఈ రెండుపనులు చేసే కార్యక్రమాన్ని అవతారకార్యంగా ధరించి ఉద్భవించినటువంటి సమర్థ సద్గురువు శ్రీసాయిబాబా.

    శ్రీసాయిబాబా ముక్తి, మోక్షం వంటి మాటలెప్పుడూ మాట్లాడలేదు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ వివిధ ప్రాపంచిక కోరికలతోనే వచ్చారు. ఆయన ఆ కోరికలన్నింటినీ తీరుస్తూనే ఉన్నారు. ఎందుకు తీరుస్తున్నారు? అంటే- దానికి ఆయనే చెప్పారు. “నా భక్తుడు అడిగేవన్నీ నేను ఇస్తూనే వుంటాను, నేను ఇవ్వదలుచుకుంది వారడిగేంతవరకు” అని. అయితే ఆయనేమి ఇవ్వదలుచుకున్నారో మాత్రం చెప్పలేదు. సరే! అదేమిటన్న జిజ్ఞాస మనకు కలగాలి కదా! మనం అడిగేవన్నీ ఆయన ఇస్తుంటే చాలు అనుకుంటాము. కానీ, ఆయన ఇచ్చే పద్ధతి ఎలా వుంటుందంటే, ఇలా మన కోరికలు తీరుస్తూ తీరుస్తూ, ఒకనాటికి ఆయన ఇవ్వదలుచుకుంది మనం తీసుకునే స్థితికి తీసుకుపోతారు.

    ఉదాహరణకు, అప్పుడే స్కూల్లో చేర్పించిన పాపను స్కూలుకు పంపించాలి. పాప రోజూ స్కూలుకి వెళ్ళేందుకు మొరాయిస్తుంది. ఏం చేస్తాము? స్కూలుకి వెళితే చాక్లెట్లు ఇస్తామని లాలిస్తాము. ఇంకా వరుసగా నెలరోజులు వెళితే సైకిలు కొనిస్తామని చెపుతాము. పాప స్కూలుకెళుతుంది. పాప వెళ్ళేది చాక్లెట్లకోసమే. కానీ, మన లక్ష్యం మాత్రం పాపను స్కూలుకు పంపించడం. ఇట్లా ఎప్పటిదాకా ఇస్తాము? తనకు తానుగా స్కూలుకు వెళ్ళేంతవరకు ఇస్తాము. అదేవిధంగా మనం మన కోరికలను బాబాను అడుగుతూ వుంటాము. ఆయన తీరుస్తూవుంటారు. అలా ఎప్పటిదాకా అంటే ఆయన ఇవ్వదలుచుకుంది మనం అడిగేంతవరకన్నమాట.

    ఇంకా బాబా, “నా భక్తుడ్ని నేనే ఎన్నుకుంటాను. నా సంకల్పం లేకుండా ఎవ్వరూ శిరిడీకి రారు” అని చెప్పారు. మరి బాబా ఎలా ఎన్నుకుంటారు? ఏ అర్హత, ప్రాతిపదికపై ఎన్నుకుంటారు? ఈ కోటానుకోట్ల జీవులలో వీళ్ళే నా భక్తులు అనుకోవడానికి ఆయనకు ప్రాతిపదిక ఏమిటి? మనను ఆయన చెంతకు లాగేదేమిటి? మన సాధనాపటిమా? మన పూర్వజన్మసుకృతమా? మనకంటే ఇంకా బాగా సాధనచేసేవారు దొరకరనా? మనలనే ఎందుకు ఎన్నుకున్నారాయన? దానికి సమాధానం బాబానే చెప్పారు
    “నాకు వాళ్ళకు ఉన్నటువంటి ఋణానుబంధం” అని. “పూర్వజన్మ సంబంధం వల్ల మనందరము కలుస్తాము. అల్లాహ్ నాకు కొంతమంది జీవులను కేటాయించారు. వాళ్ళ బాగోగులను నేను చూసుకోవాలి” అన్నారు సాయిబాబా. అంటే ఈ కేటాయింపు ఆయనకూ మనకు వున్న ఋణానుబంధంవల్లనే జరుగుతుంది.

    ఇక్కడ ‘ఋణానుబంధం వల్ల మనము సాయిభక్తులమయ్యాం’ అన్నది గుర్తుపెట్టుకుంటే ఏం జరుగుతుంది? ‘అన్నీ బాబానే చూసుకుంటారు’ అన్న అవగాహన పెరుగుతుంది. ఉదాహరణకు, ఒక బిడ్డ వున్నాడు. తల్లిదండ్రుల మీద ఎంతగా ఆధారపడతాడు? భోజనం, విద్య వంటి అన్ని విషయాలూ తల్లిదండ్రులే చూసుకుంటారు అనుకుంటాడు. ఆ నమ్మకం ఎందుకు కలుగుతుంది? వారు తల్లిదండ్రులు గనుక, ఋణానుబంధం వుంది గనుక. అట్లా ఇతరులను నమ్మగలడా? పక్కవాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళకూ మనకూ ఏమిటి సంబంధం? అనుకుంటాడు. కాబట్టి ఏదో ఒక సంబంధం వుండాలి. ఈ సంబంధం వలన మనకు ఒక ‘సెక్యూరిటీ’భద్రత ఏర్పడుతుంది. మనం బాబా దగ్గరకు వచ్చినది ఆయనకూ మనకూ ఉన్న ఋణానుబంధం వలన కాబట్టి మన కోరికలు తీర్చడం ఆయన బాధ్యత. అది ఆయనకు బాధ్యత అయిందంటే ఆయన మనవాడు. మనం ఆయనవారం. 

    మన కోర్కెలు తీరేదానికి ఆయన మార్గం కనుక ఆయనకు శరణాగతి చెందుతున్నాం. ఈ కోరికలన్నీ బాబా వలనే తీరుతాయి, ఆయన తీర్చగలడు, ఆయన ద్వారా అవుతుంది అని మనకు తేలుతుంది. ఆయనగానీ అనుకుంటే పని అయిపోతుంది అంటాము. అది నమ్మే ఆయనను ఆశ్రయిస్తాము. దీనితో ఇక్కడ బాబాపై ఇంకా ఇంకా ఆధారపడటం మొదలవుతుంది. తేలికగా ఆయనను ప్రేమించగలము, తేలికగా ఆయనపై ఆధారపడగలము. మరింతగా ఆయనతో ఋణానుబంధం పెంచుకొంటాము. కోరిక తీరితే ఆయన ద్వారానే తీరాలి, వేరే అవకాశం లేదు అనేటటువంటి నమ్మకం, విశ్వాసం, స్ఫురణ మనకు కలుగుతుంది. లేదూ, ఎవరికైనా రాలేదు, ఫలానా కోరిక తీరలేదు అంటే ఒక్కసారి మరలా ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళు బాబామీద మాత్రమే ఆధారపడివున్నారా? ఇంకా వేరే ఎక్కడా ఆధారపడిలేరా? అని అడిగితే, “లేదండీ, మేము బాబానే నమ్ముకుని ఉన్నాము” అంటాడు. 

    ఒక అరగంట మాట్లాడిన తర్వాత, “మొన్న ఒక వాస్తుసిద్ధాంతిగారు వచ్చారండీ, మా ఇంట్లో ఈశాన్యం తగ్గిందట, బహుశా అందువల్ల వచ్చివుంటాయండీ ఈ కష్టాలు” అంటాడు. ఆ తర్వాత ఇంకొక గంటాగి మెల్లగా, “నా జాతకచక్రం చూసి చెప్పారండీ, నాకు నలభయ్యవయేడు దాకా శని ఉందట. ఆ తర్వాత బాగుంటుందట” అంటాడు. ఇంక అక్కడ బాబా చేసేదేమిటి? ఈ వచ్చిన కష్టాలకు కారణం ఇంట్లో ఈశాన్యం తగ్గడం, అది గానీ పెరిగితే కష్టాలు తీరుతాయి! కాబట్టి ఇక్కడ కష్టం తీర్చేది ఈశాన్యమూల. ఇంక బాబామీద ఏం విశ్వాసం ఉన్నట్లు? జాతకమూ, గ్రహస్థితి మీదే కష్టసుఖాలు మారుతూంటే బాబా అనుగ్రహం వలన మారేదేమిటి? మధ్యలో ఎవరో వచ్చి శాంతులు, పూజలు, పరిహారాలు చేయించమని చెప్పగానే “ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో, బాబా సకలదేవతాస్వరూపం కదా! ఈ పూజలూ ఆయనకేగా చెందుతాయి” అనుకోవడం, ఎవరెలా చెప్పితే అదల్లా చేయడం. ఈవిధంగా మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాము. కేవలం బాబా మీద మాత్రమే ఆధారపడటం చేతకావటం లేదు. ఎప్పుడైతే ఆ శరణాగతి భావన రాదో బాబాకూ మనకూ ఉన్న ఋణానుబంధాన్ని మర్చిపోతాము. ఆ శరణాగతి పూర్తిగా రాకుండానే పని అయితే ఏమవుతుంది? అప్పటికే చాలా రాళ్ళు వేసివుండటం వలన, చాలామందికి మ్రొక్కుకునివుండటం వలన ఎవరివలన, దేనివలన మనపని జరిగిందో గ్రహించలేము. దానివలన బాబా తన చెంతకు చేర్చుకునే పద్ధతిలో కలిగే మార్పులు వచ్చే అవకాశం లేదు. అలా అని బాబా వాళ్ళను వదిలేయరు. వాళ్ళు దారికి రావడానికి కాస్త ఆలస్యం అవుతుందంతే!

    అయితే చాలామంది విషయంలో ఏం జరుగుతుందంటే, ఈ కోరిక తీరబోయే సమయానికి వారిలో ఆ కోరిక పట్ల కోరిక, ఆసక్తి తగ్గిపోతుంది. ఎక్కువగా జరిగేదదే! ముందు ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల ఒక కోరిక కోరేస్తాము. తీరా ఆ కోరిక తీరే సమయానికి ఈ కోరిక తీరడం అంత అవసరమా అనుకుంటాము. కాబట్టి యిక్కడ కోరిక తీరే ‘ప్రాసెస్’ లోనే సంస్కరింపబడతామన్నమాట. అందుకే ఎవరికైనా బాబానుండి అనుభవం రావడంలేదు, కోరిక తీరడం లేదు అంటే ఈ రకమైన పూర్తి విశ్లేషణ చేసుకుంటూ పోవాలి. “మనం బాబా మీదనే ఆధారపడి ఉన్నామా? నిజంగా మనం బాబా భక్తులమేనా? ఆయన్నొక్కడ్నే ఆశ్రయించి ఉన్నామా? ఆయనపట్ల అనన్య ప్రేమ, భక్తి ఉన్నాయా?” అని యోచించుకోవాలి. నారద భక్తి సూత్రాలలో చెప్పినట్లుగా అనన్యభక్తి అంటే ఇంకే విషయంతోనూ పంచుకోలేనటువంటి ప్రేమ! అటువంటి ప్రేమ, భక్తి మామూలుగా కలగదు. ఒక్కసారి బాబా గురించి ఒక మాట చెబితేనో, ఎప్పుడో ఒక కోరిక తీరితేనో జరగదు. ఆయన్నే పూర్తిగా స్మరణలో పెట్టుకోవడం కూడా జరగదు.

    మామూలుగా అందరికీ ఉండే ఇంకో సమస్య ఉంది. “బాబా స్మరణ చేస్తున్నాను కానీ బాబా మీద నాకు మనస్సు నిలబడటంలేదు, బాబా గుర్తుకు రావడంలేదు” అంటాము. “స్మరణ బాబా మీదనే ఉన్నదా?” ఆ ప్రశ్న వేసుకోవాలి మళ్ళీ. మనస్సుకు సహజంగా ఉండే గుణం ఏమిటి? బాగా ఇష్టమైన విషయంపట్లగానీ, బాగా ద్వేషించే విషయం మీదగానీ అప్రయత్నంగా మనస్సు దానంతటదే లగ్నం అవుతుంటుంది. ధ్యానానికి కూర్చుంటాము. కళ్ళు మూసుకోగానే ఇంకేవో విషయాలు వచ్చేస్తాయి. ఉదాహరణకు, ఆరోజు మనకేదో అవమానం జరిగివుందనుకోండి! “వాడు నన్నంత మాటంటాడా? వాడి అంతు చూడాల్సిందే, ఏ విధంగా వాడికి బుద్ధి చెప్పాలి?” అని ఆలోచిస్తుంటాము. లేదా ఎవరిమీదైనా బాగా ఇష్టం ఉంటే అటుపోతుంది మనసు. ఇదంతా అప్రయత్నంగా జరిగేదే. ఇక్కడ బాబాపట్ల ఉండాల్సినంత ఇష్టం లేకపోవడం వలన మాత్రమే ధ్యానం కుదరటం లేదు అని తెలిసిపోతుంది. 

    సాధన అంటే ఏమిటి? బాబాపట్ల ప్రేమ పెంచుకోవడమే. ఇష్టం పెంచుకుంటే స్మరణ పెరుగుతుంది, ధ్యానం దానంతటదే జరుగుతుంది. సరే! బాబా పట్ల ఇష్టం పెంచుకోవాలి. ఇష్టం ఎలా పెరుగుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే, అసలు మనకు ఇష్టాయిష్టాలు ఎలా కలుగుతాయో, ఎలా పెరుగుతాయో గమనించాలి. సాధారణంగా మనకు ఒక వస్తువు లేదా, వ్యక్తితో ఉండేటటువంటి సంబంధం (కాంటాక్ట్) వల్ల ఇష్టాయిష్టాలు కలుగుతాయి. అదెలాగో చూద్దాం. ఇద్దరు వ్యక్తులు రెండు నెలలపాటు ఒక రూములో కలిసి ఉన్నారంటే క్రమంగా సన్నిహితులౌతారు. వీడి సమస్యలు వాడు, వాడి సమస్యలు వీడు ఆలోచించడం, ఇద్దరూ కలిసి వాటిని తీర్చుకోవడం కోసం ప్రయత్నం చేయడం చేస్తారు. ఒకరోజు ఒకడెవడైనా ఊరికి పోతే వాడికి ఉత్తరం వ్రాయడం, ఫోను చేయడం, వాడ్ని చూడలేకుండా ఉండలేకపోవడం.. ఇవన్నీ జరుగుతుంటాయి. ఏదో కారణంగా కొన్నాళ్ళు వాళ్ళిద్దరూ దూరంగా ఉండటం జరిగితే, ఒక్కనెల చూడాలని బాగా అనుకుంటారు. రెండోనెలకి మెల్లగా మర్చిపోతారు. వాడికి అక్కడ కొత్త స్నేహితులు ఏర్పడతారు. వీడికిక్కడ సరిక్రొత్త స్నేహితులేర్పడుతారు. ఎవరికి వారైపోతారు. ఇక్కడ కాన్స్‌టెంట్‌గా ఉన్న టచ్ లేకపోతే ఇష్టం పోతున్నది. ఒక విషయాన్ని గురించి పదిసార్లు చూడడం, పదేపదే వినడం జరిగితే దానిమీద ఇష్టం పెరుగుతుంది. ఒకటి, రెండు సినిమాలు చూడగానే వాటిమీద ఇంట్రస్టు పెరిగి ఇక వరుసగా సినిమాలు చూడాలనిపిస్తుంది. సినిమాలపై యిష్టం పెరుగుతుంది. ఏదో కారణంగా పరీక్షలుండో లేదా ఇట్లా శిరిడీ వచ్చినపుడో చూడరు గనుక ఒక గ్యాప్ ఏర్పడుతుంది. మరలా ఊరికిపోయి చూసుకుంటే ఏమవుతుంది? సినిమాలపట్ల ఆసక్తి తగ్గిపోయివుంటుంది.

    అలాగే బాబాతో ఇష్టం పెరగాలంటే ఏం చేయాలి? ఆయనతో కాన్స్‌టెంట్‌ టచ్ పెట్టుకోవాలి. అది ఎట్లా పెంచుకోవాలి? ఆయన భౌతిక శరీరంతో ఉంటే ఆయన సన్నిధిలో కూర్చుని, ఆయన సేవ చేసుకుంటూ ఉండటం ద్వారా ఆయనతో సంబంధం పెరుగుతుంది అనుకుంటే, మరి ఆయన భౌతికంగా లేరే? ఎట్లా? ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరగాలంటే ఒకరి పనులు మరొకరికి నచ్చాలి. అప్పుడే సన్నిహితులౌతారు. నచ్చకపోతే దూరం అయిపోతారు. కాబట్టి ఇక్కడ మనను దగ్గర చేర్చేది నచ్చిన పనులే. బాబాతోనూ అనుబంధం పెంచుకోవాలంటే ఆయన చేసిన పనులు తెలుసుకోవాలి. అవి ఆయన చరిత్ర చదివితే తెలుస్తాయి. ఆయన తత్త్వం అర్థం చేసుకోవడానికి, ఆయన ఎలాంటి వారు? మనను ఉద్దరిస్తారా, లేదా అన్న పద్ధతిలో చరిత్రను విశ్లేషణాత్మకంగా చదవాలి. అంతేకానీ, పారాయణ అంటే, స్నానంచేసి, వ్యాసపీఠం దగ్గర కూర్చుని, అగరుబత్తి వెలిగించి, మొత్తం పుస్తకాన్ని ఏడు భాగాలుగా విభజించి, ఫలానా పేజీదాకా మొదటిరోజుకి అనుకొని, ఆ పేజీలో ఒక వేలుంచి పేజీలు తిప్పడం కాదు. అప్పుడు ఆ ఫలానా పేజీ మీదే ఉంటుంది దృష్టి, ఇక చరిత్రలోని సారాంశం మనసుకేం పడుతుంది? కాబట్టి ఒక్కసారైనా సరే చరిత్రలోనుంచి బాబాలో వ్యక్తమయ్యే తత్త్వం ఏమిటి? ఏం చెప్పారాయన? ఒకలీల జరిగినపుడు ఆ భక్తుని స్థానంలో నేనుంటే ఎలా ఫీల్ అవుతాను? ఇలా ప్రతివిషయం గురించి తరిచి చూసుకుంటూ ఒక్క లీల చదివినా చాలు! నిజానికి ఆ ఇంట్రస్ట్ ఉంటే ఒక్క లీలతో ఆపము. నవల చదివినట్లుగా బాబా చరిత్ర చదువగల్గుతాము. చరిత్ర అవగాహనతో చదవడం వలన ఆనందం, తృప్తి కలుగుతాయి. లేకపోతే మామూలు జీవితం ఎంత అర్థరహితంగా ఉంటుందో, మనం శిరిడీ రావడం, సత్సంగాలు చేసుకోవడం ఇదంతా కూడా అంతే అర్థరహితమై పోతుంది. అర్థరహితమైన జీవితంలో ‘పారాయణ’ కూడా ఒక అర్థరహితమైన సాధన అవుతుంది. ఈ జీవితానికొక అర్థాన్ని చెప్పేటట్లుగా ఉండాలి మనం చేసేపని. ఈ అవగాహన పెంచుకొని ఆ నేపధ్యంలో జరిగేటటువంటి సాధన నిజమైన సాధన. అటువంటి సాధన చేసినప్పుడే మనం నిజమైన ‘సాయిపథం’లో పయనించినవాళ్ళమవుతాము.

    శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    సమాప్తం...

    source:  సాయిపథం ప్రధమ సంపుటం.

    సాయిభక్తుల అనుభవమాలిక 486వ భాగం....



    ఈ భాగంలో అనుభవాలు:
    1. నా తల్లిదండ్రులకు బాబా చేసిన సహాయం
    2. తొలి దర్శనంతో బాబాతో ఏర్పడిన అనుబంధం

    నా తల్లిదండ్రులకు బాబా చేసిన సహాయం

    ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

    సాయిరాం! నేను సాయిభక్తురాలిని. ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలలో నుండి ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఇది పెద్ద విషయం కాకపోయినా నాకు చాలా ముఖ్యమైనది. మా ఇంట్లో నీళ్ళు రాకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉండేది. నీళ్లు కావాలంటే బయటనుండి తెచ్చుకోవాలి. మా తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అవడం వల్ల నీళ్లు తెచ్చుకోవటానికి చాలా ఇబ్బందిపడేవారు. వాళ్ల కోసం ఎవరో ఒకరు ఇంట్లో ఉండవలసి వచ్చేది. పోనీ నీళ్లు తీసుకుని రావడానికి బయటవాళ్ళను ఎవరినైనా పెడదామంటే నీళ్లు ఏ సమయంలో వస్తాయో తెలియదు, ఒక్కోరోజు ఒక్కో సమయంలో వచ్చేవి. తరువాత కొన్నాళ్ళకు పంచాయతీవాళ్ళు ఇంటింటికీ కుళాయిలు పెట్టించారు. మేము కుళాయి నుండి నీళ్లు ట్యాంకులోకి వెళ్లే విధంగా ఒక రబ్బరు ట్యూబ్ పెట్టాము. కానీ నీళ్లు ట్యాంకులోకి వెళ్లలేదు. అప్పుడు నేను, “బాబా! నా తల్లిదండ్రుల ఇబ్బంది చూడలేకపోతున్నాను. మీరు మీ పాదాల నుండి గంగాయమునలను ప్రవహించేలా చేశారు. మీరు తలచుకుంటే సాధ్యం కానిది ఏమీ లేదు. అలాంటిది కుళాయిలోని నీళ్ళు ట్యాంకులోకి వెళ్లేలా చేయడం మీకు ఎంత పని? దయచేసి కుళాయిలోని నీళ్ళు ట్యాంకులోకి వెళ్లేలా చేయండి బాబా!” అని మనసులోనే బాబాను ప్రార్థించాను. బాబాను ప్రార్థించిన వెంటనే నీళ్ళు ట్యాంకులోకి వెళ్లడం చూసి ఆశ్చర్యపోయాను. ఆనందంతో బాబాకు ఎన్నోసార్లు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబాను మనస్ఫూర్తిగా వేడుకుంటే జరగనిదంటూ ఏమీ ఉండదు. ఆలస్యం అవుతుందని బాధపడవద్దు, మనకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో బాబాకు తెలుసు. నా తల్లిదండ్రులకు బాబా చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మరువలేను.

    ఓం సాయిరాం! జై సాయిరాం!

    తొలి దర్శనంతో బాబాతో ఏర్పడిన అనుబంధం

    ఏలూరు నుండి సాయిభక్తుడు నాగు తనకు బాబాతో ఉన్న అనుబంధాన్ని మనతో పంచుకుంటున్నారు.

    సాయి సేవకులకు సాయిరాం! బాబా గురించి నాకు అంతా తెలుసు అని అనుకోవడం నా భ్రమ. నిజంగా నాకు బాబా గురించి ఏమీ తెలియదు. అసలు నేను బాబా సేవ చేస్తున్నానంటే నాకే నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను...

    నా పేరు నాగు. మాది ఏలూరు. నేను ఎప్పుడూ కూడా ఇంట్లో పూజ అనేది చెయ్యలేదు. అసలు పూజ ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. కానీ నాకు భజనలంటే చాలా ఇష్టం. మా నాన్నగారు మా ఇంటి దగ్గర ఉన్న వినాయకుడి గుడిలో కోశాధికారిగా ఉండేవాళ్ళు. ఒకసారి మా నాన్నగారు గుడికి సంబంధించిన జమాఖర్చుల వివరాలు చెప్పమని కొందరిని అడిగితే, ‘నీకు మేమెందుకు లెక్కలు చెప్పాలి?’ అని అన్నారు వాళ్ళు. ఆ మాటలు అన్నది ఎవరో కాదు, మా నాన్నగారి దగ్గర చిన్నప్పటినుంచి ఉన్నవాళ్ళే. వాళ్ళే అలా అనేసరికి మా నాన్నగారు ఆ పదవి నుంచి తప్పుకున్నారు. 

    2012లో ఒకరోజు మా అమ్మగారు నాతో, “తంగెళ్ళమూడి దగ్గర బుడిదప్పన్నవారి వీధిలో బాబా గుడి ఉన్నది, గురువారం అక్కడికి వెళ్ళు” అని చెప్పింది. గురువారం రోజు నేను బాబా గుడికి బయలుదేరుతుంటే బాబాకు సమర్పించమని అమ్మ బెల్లంబూందీ ఇచ్చింది. బెల్లంబూందీ తీసుకుని బాబా గుడికి వెళ్ళి బాబాను దర్శించుకున్నాను. అప్పుడు మొదలైంది బాబాతో నా అనుబంధం. అంతకుముందు బాబా గురించి నాకు తెలియదు. అంతకుముందు పూజ ఎలా చేయాలో కూడా తెలియని నేను ఇప్పుడు ఎన్ని వేల సాయిభజనలు చేశానో తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉంటుంది. బాబా అనుగ్రహంతో ఈ నిమిషం వరకు సాయిభజనలు చేస్తూనే ఉన్నాను. జీవితాంతం ఇలాగే బాబా సేవాభాగ్యం కొనసాగాలని మనస్ఫూర్తిగా బాబాను కోరుకుంటున్నాను. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. నా జీవితంలో ఎన్నో సాయిలీలలు జరిగాయి.

    సదా సాయి నామస్మరణ చేద్దాం, సాయిని తలుద్దాం. 

    ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి.


    సాయిభక్తుల అనుభవమాలిక 485వ భాగం....


    ఈ భాగంలో అనుభవాలు:

    1. బాబా స్మరణతో అంతా సుఖాంతం
    2. "బాబా! మీరే మాకు రక్ష!"

    బాబా స్మరణతో అంతా సుఖాంతం

    నా పేరు గోపాలకృష్ణ. మాది హైదరాబాద్. నేను ఎన్నో సంవత్సరాల నుండి సాయికి అంకితభక్తుడిని. నేను చాలాసార్లు శిరిడీ, గాణుగాపురం, పిఠాపురం దర్శించాను. నాకు బాబా ఎన్నోరకాలుగా సహాయం చేశారు. ఆ అనుభవాలలో నుండి కొన్నిటిని ఇప్పుడు మీతో పంచుకుంటాను.


    2020, మార్చి 21న మా అబ్బాయివాళ్ళు బెంగళూరులో గృహప్రవేశం ఏర్పాటు చేసుకున్నారు. మేము ఆ గృహప్రవేశానికి మార్చి 10వ తారీఖున హైదరాబాదు నుండి బయలుదేరి బెంగళూరు వెళ్ళాము. క్రొత్త ఫ్లాట్ మార్చి 20వ తారీఖుకి పూర్తయింది. మార్చి 21వ తారీఖు ఉదయం 5.30కి గృహప్రవేశం చేసుకున్నాము. ఆరోజే క్రొత్తింటికి సామాన్లు షిఫ్ట్ చేయటం కోసం ప్యాకర్స్ అండ్ మూవర్స్ బుక్ చేస్తే ఆ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీవాళ్ళు ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ చేశారు. షిఫ్టింగ్ కోసం సామాన్లన్నీ రెడీ చేశాము. వేరే ట్రాన్స్‌పోర్ట్ వాళ్ళని బుక్ చేసుకుందామనుకుంటే మా సొసైటీవాళ్ళు, “కోవిడ్ కారణంగా ఇప్పుడు ఫ్లాట్ ఖాళీ చేయటానికి అనుమతి లేదు, బయటివాళ్ళని సొసైటీ లోపలికి రావటానికి అనుమతించకూడదని అసోసియేషన్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు” అని చెప్పారు. ఆ సమయంలో నేను సాయి నామస్మరణ చేసుకుంటూ అసోసియేషన్ ఆఫీసుకి వెళ్ళి ఫ్లాట్ ఖాళీ చేయటానికి ఒక గంట అనుమతి ఇవ్వమని అభ్యర్థించాను. బాబా అనుగ్రహంతో సొసైటీవాళ్ళు అనుమతించారు. తరువాత ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాము. బాబాకు నమస్కారం చేసుకుని, “బాబా, ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ కావాలి, మీరే ఎలాగైనా ఒక వెహికల్ పంపించండి బాబా” అని బాబాను పార్థించాను. బాబా అనుగ్రహంతో మా అబ్బాయివాళ్ళు ముందు బుక్ చేసి క్యాన్సిల్ అయిన ట్రాన్స్‌పోర్ట్ వాళ్ళకంటే తక్కువ ధరకే ఒక వెహికల్ బుక్ అయింది. బాబా దయవల్ల సాయంత్రానికల్లా మా సామాన్లు క్రొత్తింటికి షిఫ్ట్ చేశారు. తరువాత రోజు నుండి లాక్‌డౌన్ మొదలైంది. బాబా దయవల్ల ఏ సమస్యా లేకుండా గృహప్రవేశం చక్కగా జరిగింది. ఎంతో ఆనందంతో బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాము.

    2020 జులై 3వ తారీఖున మా చిన్నబ్బాయి హైదరాబాదు నుండి బెంగళూరుకి స్వంత కారులో బయలుదేరాడు. తను ఒంటరిగా ప్రయాణం చేస్తుండటంతో కాస్త భయపడ్డాము. ఆ సమయంలో మేము బెంగళూరులోనే ఉన్నాము. తను క్షేమంగా బెంగళూరు చేరేలా అనుగ్రహించమని బాబాను ప్రార్థిస్తూ సాయంత్రం 4 గంటల వరకు సాయి నామస్మరణ చేస్తూ ఉన్నాము. బాబా మా అబ్బాయిని క్షేమంగా బెంగళూరు చేర్చారు. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!”

    ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి

    "బాబా! మీరే మాకు రక్ష!"

    నేను ఒక సాయిభక్తురాలిని. ముందుగా సాయి మహారాజుకి నా శతకోటి నమస్కారములు. మాకు ఏ సమస్య వచ్చినా మన సాయి తండ్రికి చెప్పుకొని, అవి నెరవేరితే ఈ బ్లాగ్ ద్వారా తోటి భక్తులతో మా ఆనందాన్ని, బాబా ప్రేమను పంచుకోగలుగుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది.

    ఇటీవల నా అనుభవాలను కొన్ని మీతో పంచుకున్నాను. అందులో మా విదేశీ ప్రయాణం గురించి ప్రస్తావించాను. బాబా దయతో మా ప్రయాణమంతా బాగా జరిగింది. అన్నింటా బాబానే దగ్గరుండి నన్ను ఇంటికి చేర్చారు. కరోనా మూలంగా అడుగడుగునా భయమే. అయినా ఏ ఇబ్బందీ లేకుండా బాబా చూసుకున్నారు

    అసలు విషయమేమిటంటే, ఇక్కడికి చేరుకున్నాక ఇక్కడి చలికి ఒకరోజు గొంతు నొప్పిగా అనిపించింది. దాంతో భయపడి, "బాబా! మీరే మాకు రక్ష" అని ప్రార్థించి, బాబా ఊదీని నుదుటిపై ధరించి, కొంత గొంతుపై రాసుకొని, మరికొంత నీళ్లలో కలుపుకొని త్రాగాను. రెండురోజుల్లో అంతా మామూలుగా అయిపోయింది. బాబానే మనందరి పాలిట వైద్యుడు. "ధన్యవాదాలు బాబా! ఇకముందు కూడా మీరే అందరి ఆరోగ్యాలను చూడాలి బాబా!" అని మా కుటుంబ బాధ్యత (భారం) అంతా బాబా పైన వేసి, బాబా నామజపం చేస్తూ ఉన్నాను.

    ఒక సాయి పాద సేవకురాలు.


    సాయిభక్తుల అనుభవమాలిక 484వ భాగం....



    ఈ భాగంలో అనుభవాలు:
    1. ఆరోగ్యం, మొబైల్ రీఛార్జ్ ప్రసాదించిన బాబా
    2. ఏ డాక్టరూ తగించలేని నొప్పిని బాబా తగ్గించారు

    ఆరోగ్యం, మొబైల్ రీఛార్జ్ ప్రసాదించిన బాబా

    నల్గొండ నుండి సాయిభక్తురాలు శ్రీమతి సుమలత తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

    సాయిబంధువులందరికీ సాయిరాం! ఈ బ్లాగును నిర్వహిస్తున్న బృందానికి, సాయిభక్తులకు నా నమస్కారాలు. నా పేరు సుమలత. మాది నల్గొండ. నేను చిన్నప్పటినుంచి బాబా భక్తురాలిని. నాకు ఏ సమస్య ఉన్నా ముందుగా బాబాకు చెప్పుకుంటాను. బాబా ఆశీస్సులతో నాకు కలిగిన అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. 

    ఒకరోజు ఉన్నట్టుండి నాకు జ్వరము, జలుబు వచ్చాయి. కరోనా సోకిందేమో అని భయపడ్డాను, చాలా బాధపడ్డాను. వెంటనే బాబాకు నమస్కరించుకుని, “బాబా! మీ అనుగ్రహంతో నాకు ఈ జలుబు, జ్వరం తగ్గితే సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను” అని బాబాకు మొక్కుకున్నాను. బాబాను ప్రార్థించిన రెండు రోజుల్లో నాకు జలుబు, జ్వరం తగ్గిపోయాయి. “చాలా ధన్యవాదాలు తండ్రీ! మాకు తోడుగా, మా ఇంటికి పెద్దదిక్కుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించండి. చాలా ధన్యవాదాలు బాబా!”

    ఇప్పుడు చెప్పబోయే అనుభవం బాబా మా అమ్మాయికి ప్రసాదించినది. మా అమ్మాయి పదవతరగతి చదువుతోంది. తనకి ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయని ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చి, ఒక నెల రీఛార్జ్ చేశాము. రీఛార్జ్ గడువు ముగిసింది, మళ్ళీ రీఛార్జ్ చేయించమని మా అమ్మాయి గొడవ చేసింది. మేము చేయించలేదు. దాంతో తను బాబాకు నమస్కరించుకుని, “తాతయ్యా! నాకు త్వరగా రీఛార్జ్ చేయించండి” అని ప్రార్థించింది. ఆశ్చర్యం! బాబాను ప్రార్థించిన రెండు రోజుల్లో మా అమ్మాయి మొబైల్ కి 249 రూపాయలకు రీఛార్జ్ అయినట్టు మెసేజ్ వచ్చింది. నేను గానీ, మావారు గానీ రీఛార్జ్ చేయించలేదు. ఇది మీ అందరికీ చాలా చిన్న విషయం కావచ్చు, కానీ మాకు మాత్రం ఒక పెద్ద అనుభవం. “బాబా! మా అమ్మాయికి ఏ సమస్య ఉన్నా మీరే చూసుకోవాలి. మీరే తనని ఒక ఉన్నత స్థాయిలో ఉంచాలి. అలాగే మేము మ్రొక్కుకున్న చిన్న చిన్న కోరికలను త్వరలోనే తీరుస్తారని ఆశిస్తున్నాము”. 

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 

    అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ఏ డాక్టరూ తగించలేని నొప్పిని బాబా తగ్గించారు

    సాయిభక్తురాలు శ్రీమతి లక్ష్మి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

    సాయిబంధువులకు నా నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ బ్లాగుని నేను మొదటిసారి చూసింది మార్చి నెలలో. బాబా ప్రసాదించిన అనుభవాలు చదువుతూ ఉంటే సాయి చరిత్ర పారాయణ చేసినంత సంతోషంగా ఉంటోంది. నేను పెళ్లయిన తర్వాత నుంచి బాబాను ఎక్కువగా ఆరాధిస్తున్నాను. అప్పట్నుంచి చాలా విషయాలలో బాబా నాకు సహాయం చేస్తున్నారు. 

    ఇటీవల లాక్ డౌన్ మొదలయ్యాక నాకు విపరీతమైన పంటినొప్పి వచ్చింది. పంటినొప్పి వలన ఎడమప్రక్కన ఉన్న పన్నుతో పాటు చెవి, కన్ను, తల కూడా విపరీతంగా నొప్పిపుట్టటం మొదలైంది. నొప్పి తగ్గడానికి మాత్రలు వేసుకున్నప్పటికీ తగ్గకపోయేసరికి లాక్ డౌన్ లోనే ఒక హాస్పిటల్ కి వెళ్ళాను. అక్కడి డాక్టర్ ఇచ్చిన మందులు వాడినా నొప్పి తగ్గలేదు. అందువల్ల ఈసారి ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళాను. నన్ను పరీక్షించిన డాక్టర్, ‘పన్ను కట్ చేసి తీయాలి, కుట్లు పడతాయి’ అని చెప్పారు. పన్ను కట్ చేసి తీయాలి అనేసరికి నాకు చాలా భయమేసింది. తర్వాత నొప్పి తగ్గటానికి ఆ డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకుంటున్నప్పటికీ పంటినొప్పి తగ్గలేదు. ఒకరోజు రాత్రి తట్టుకోలేనంత నొప్పి వచ్చింది. నొప్పి భరించలేక బాగా ఏడుస్తూ బాబాతో నా బాధను చెప్పుకుని, “బాబా! నా పంటినొప్పిని తగ్గించండి. మీ అనుగ్రహంతో ఈ పంటినొప్పి తగ్గితే సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. ఏ డాక్టరూ తగించలేని నొప్పిని బాబా తగ్గించారు. బాబాకు నా జీవితాంతం ఋణపడి ఉంటాను. “బాబా! నీ పాదాలపై నా శిరస్సునుంచి నిన్ను శరణు వేడుతున్నాను, మా భారాలను నీ భుజాల మీద వేసుకుని మమ్మల్ని మంచిదారిలో నడిపించు తండ్రీ!”

    నిజానికి పంటినొప్పి తగ్గి నెలరోజులు అయింది. కానీ నా అనుభవాన్ని బ్లాగులో ఎలా పంచుకోవాలో తెలియక ఇంత ఆలస్యమైంది. మనపై ఎంతో ప్రేమను చూపే బాబా నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. మరో అనుభవంతో త్వరలోనే మళ్ళీ కలుస్తాను.


    సాయిభక్తుల అనుభవమాలిక 483వ భాగం....


    ఈ భాగంలో అనుభవాలు:
    1. తోడు ఉన్నానని మరోసారి ధైర్యాన్నిచ్చిన బాబా
    2. బాబా నా ప్రార్థనలు విన్నారు

    తోడు ఉన్నానని మరోసారి ధైర్యాన్నిచ్చిన బాబా

    పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

    సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వాహకులకు, సాయిబంధువులకు ఓం సాయిరామ్! ఈ బ్లాగును ‘ఆధునిక సాయి సచ్చరిత్ర’ అనవచ్చు. నాకు బాబా మీద శ్రద్ధ లోపించిన ప్రతిసారీ ఈ బ్లాగ్ నాలో ధైర్యాన్ని, బాబా మీద నమ్మకాన్ని పెంచుతుంది. నేను గతంలో కొన్ని అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఆర్థిక, మానసిక సమస్యలు అలాగే ఉన్నప్పటికీ, ఈ కష్టకాలంలో ‘బాబా నాకు తోడుగా ఉన్నారు’ అని ప్రతిసారీ నిదర్శనం ఇస్తూనే ఉన్నారు. 

    రెండు వారాల క్రితం, అంటే 24 జూన్ 2020 తేదీన బాబా చరిత్ర సప్తాహపారాయణ పూర్తి చేశాను. మామూలుగా నేను సాయిసచ్చరిత్ర గానీ లేదా సాయిలీలామృతం గానీ పారాయణ చేస్తుంటాను. కానీ సమయం చాలక, ఇంట్లో సమస్యలతో ఏకాగ్రత కుదరక ఈసారి బొమ్మకంటి వారు రాసిన బాబా సచ్చరిత్ర పారాయణ చేశాను. నా బద్ధకంతో బాబాను అశ్రద్ధ చేస్తున్నాననే అపరాధ భావన నాలో అలాగే ఉంది. కానీ ఏం చెయ్యను? లాక్ డౌన్ కష్టాలు మా కుటుంబంలో శాంతి లేకుండా చేశాయి మరి. 

    25వ తేదీ తెల్లవారుఝామున బాబా పెద్ద పాలరాతి విగ్రహం రూపంలో నాకు కలలో దర్శనమిచ్చారు. నేను నిరంతరం బాబా గురించి చదువుతున్నాను కనుక బాబా అలా దర్శనమిచ్చారేమో అనుకున్నాను. ఆ సాయంత్రం నేను, మావారు లాప్ టాప్ బాగుచేయించటానికి కారులో బయటకు వెళ్ళాం. అనుకోకుండా ఒక మిత్రురాలిని కలిశాము. తరువాత ఆ దారిలో వెళుతుండగా బాబా గుడి కనిపిస్తే, మా పిల్లలు చిన్నవాళ్ళు కావటం వల్ల కోవిడ్ పరిస్థితుల్లో గుడిలోకి అనుమతి ఉండదని కారులోనుంచే బాబాకు నమస్కారం చేసుకున్నాం. తిరిగి వచ్చే దారిలో నేను మళ్ళీ బాబా గుడికి నమస్కారం చేస్తుంటే, మావారు నన్ను ‘గుడిలోకి వెళ్లి బాబా దర్శనం చేసుకుని రమ్మ’న్నారు. నా ఆనందానికి అవధులు లేవు. ఎంతో ఆనందంతో గుడిలోకి వెళ్ళాను. నాకు కలలో కనిపించినట్టే గుడిలో బాబా తెల్లని దుస్తుల్లో దర్శనమిచ్చారు. ఆయన వైపు మనం ఒక అడుగు వేస్తే ఆయన మన వైపు వంద అడుగులు వేస్తారు. లాక్ డౌన్ కారణంగా మావారు బాబా గుడిలోకి వెళ్ళటానికి కోప్పడతారనుకుంటే ఆయనే స్వయంగా వెళ్ళమన్నారు. అదొక ఆశ్చర్యమైతే, బాబా నాకు కలలో కనపడిన విధంగానే గుడిలో దర్శనమిచ్చారు, అదొక ఆనందం. ఆ ఆనందంలో తృప్తిగా బాబాను దర్శించుకుని ఇంటికి తిరిగి వచ్చాను.

    దేవుడిచ్చిన అన్నయ్య విషయంలో స్పర్థలు అలాగే ఉన్నాయి. మావారి ఉద్యోగంలోనూ, నా ఉద్యోగంలోనూ సమస్యలు అలాగే ఉన్నాయి. కానీ, ఒకటే నమ్మకం - మన సుఖాల్లో దైవం మన పక్కనే నడిస్తే, కష్టాల్లో మనల్ని ఎత్తుకుని నడుస్తాడు. కానీ, అహం, చంచలమనస్సు ఆ విషయం గుర్తురానివ్వవు. ఇదే అనుభవం మొన్న గురుపూర్ణిమ నాడు నాకు కలిగింది. 

    ఒకసారి నా చెవితమ్మెలు ప్రమాదవశాత్తూ తెగిపోయాయి. డాక్టర్ దగ్గరకు వెళ్ళి చెవితమ్మెలకు కుట్లు వేయించాలనుకున్నాము. కానీ పిల్లల ఫీజులకు, ఆన్లైన్ క్లాసులకు ఇబ్బంది కలుగుతుందని ఆగాల్సి వచ్చింది. గురుపూర్ణిమనాడు మావారు, “పిల్లలు ఇంట్లోనే ఉండి బోర్ ఫీలవుతున్నారు. మిత్రులతో కలిసి సరదాగా బయటకు వెళదాం” అన్నారు. కానీ నేను, “వద్దు, తెగిన నా చెవితమ్మెలు చూసి అందరూ నవ్వుకుంటారు, నేను రాను” అని మావారితో పోట్లాడాను. కానీ చివరికి వెళ్ళక తప్పలేదు. మావారి స్నేహితుని భార్య నన్ను పెద్దగా గమనించలేదు. నాతో మామూలుగానే మాట్లాడారు. ఆ విధంగా బాబా నేను అవమానపడకుండా కాపాడారు.

    అదేరోజు ఇంటికి వచ్చి ఫోన్ చూసుకోగానే సంధ్య హారతి సమయంలో బాబా ఆకుపచ్చని శాలువాలో దర్శనమిచ్చిన ఫోటోలు మా బాబా వాట్సాప్ గ్రూపులో కనిపించాయి. బాబా ఫోటో క్రింద, “నాకు పూజాతంతు అక్కర్లేదు, భక్తి ఉన్న చోటే నా నివాసము” అన్న బాబా సందేశం ఉంది. బాబా ఆకుపచ్చని దుస్తుల్లో కనిపిస్తే నాకు మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం. ఆ రకంగా నాకు తోడు ఉన్నానని బాబా మరోసారి ధైర్యాన్నిచ్చారు

    ఈ సందర్భంగా నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి - బాబా తన భక్తులకు అవమానం జరగనివ్వరు. రెండు - బాబా చరిత్ర పారాయణ చేసేటప్పుడు అవి చిన్న కథలైనప్పటికీ పారాయణలో శ్రద్ధ ముఖ్యం, అంతేగానీ తంతు లేదా తొందరపాటు కూడదు.

    త్వరలోనే నాకు దేవుడిచ్చిన అన్నయ్య నాతో మాట్లాడతాడని, ఆ అనుభవాన్ని కూడా ఈ బ్లాగులో పంచుకుంటానని నాకు నమ్మకం కలుగుతోంది. ఈ అవకాశం ఇచ్చిన బ్లాగ్ నిర్వాహకులకు ధన్యవాదాలు. ఓం సాయిరామ్!

    బాబా నా ప్రార్థనలు విన్నారు

    సాయిభక్తురాలు శ్రావణి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

    సాయి మహారాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వహిస్తున్న సభ్యులకు, తోటి సాయిభక్తులకు నా నమస్కారములు. నా పేరు శ్రావణి. సాయిబాబా నాకు ప్రసాదించిన అనుభవాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. 

    మొదటి అనుభవం: 

    ఇది ఒక స్థలానికి సంబంధించినది. మా ఇంటి ప్రక్కన ఉండేవాళ్ళు మా తప్పేమీ లేకుండానే మాతో ఏ విషయమూ చెప్పకుండా మా పైన కంప్లైంట్ ఇచ్చారు. నేను చాలా బాధపడ్డాను. బాబాకు నమస్కరించుకుని, “బాబా! మా తప్పు ఉంటే మమ్మల్ని శిక్షించండి. వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళని శిక్షించండి” అని బాబాను ప్రార్థించాను. బాబా నా ప్రార్థన విన్నారు. ఎలాంటి గొడవలూ జరగకుండా బాబా మమ్మల్ని కాపాడారు. సంతోషంగా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

    రెండవ అనుభవం: 

    మా నాన్నగారు పని చేస్తున్న ఆఫీసులో ఇటీవల అందరికీ కరోనా పరీక్షలు చేశారు. అందులో ఒక సభ్యుడికి పాజిటివ్ అని వచ్చింది. మా నాన్నగారి రిపోర్టు రాలేదు. మాకు చాలా భయమేసి, "రిపోర్టు నెగటివ్ గా రావాల"ని బాబాను ఆర్తిగా ప్రార్థించాను. బాబా నా ప్రార్థన విన్నారు. రిపోర్టులు నెగటివ్ అని వచ్చాయి. “థాంక్యూ సో మచ్ బాబా!” అందరికీ బాబా ఆశీస్సులు వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.


    సాయిభక్తుల అనుభవమాలిక 482వ భాగం....


    ఈ భాగంలో అనుభవం:
    • బాబాకు తన సమయమంటూ తనకుంటుంది

    నేను ఒక సాయిభక్తురాలిని. బాబాను ప్రేమించండి, ఆయన మనల్ని ప్రేమిస్తారు. నిజంగా బాబా మన సమస్యలను విని పరిష్కరిస్తారు. కొన్నిసార్లు మనం నిర్దిష్టమైన కొన్ని గంటల్లో మన సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటాం, కానీ బాబాకు తన సమయమంటూ తనకుంటుంది. అది రెండు నిమిషాలు కావచ్చు లేదా కొన్ని రోజులు కావచ్చు. అయితే ఆయన ఖచ్చితంగా సమస్యల నుండి బయటపడటానికి మనకు సహాయం చేస్తారు. బాబా నాకు ప్రసాదించిన అలాంటి ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటున్నాను.

    నాకు 28 సంవత్సరాలు వచ్చినా నేను విద్యార్థిగా చదువుకుంటూ ఉండేదాన్ని. అందుచేత నాకు సంపాదన ఉండేది కాదు. నాన్నని డబ్బు అడగడానికి నాకు చాలా సంకోచం. అందువలన సాధారణంగా నేను సెమిస్టర్ చివరిలో మాత్రమే ఆయనను డబ్బులు అడిగేదాన్ని. ఒకవేళ మధ్యలోనే అనుకోని ఖర్చులు వస్తే, సమయానికి ముందే నా దగ్గరున్న డబ్బులు అయిపోయి నా పరిస్థితి మాటల్లో చెప్పలేని విధంగా ఉండేది. 

    ఒకసారి నా ల్యాప్‌టాప్ పనిచేయడం మానేసింది. ఎందరో భక్తులు తమ అనుభవాల్లో తమ ల్యాప్‌టాప్‌లు మొబైల్‌లు చెడిపోయినప్పుడు బాబాని ప్రార్థించినట్లు నేను కూడా సాయిని "నా ల్యాప్‌టాప్‌ పనిచేసేలా చేయమ"ని ప్రార్థించాను. కానీ వాళ్ళ విషయంలో అవి తిరిగి పనిచేసినట్లు, మూడు రోజులైనా నా విషయంలో జరగలేదు. ఈలోగా గురువారం వచ్చింది. ఆరోజు నేను, "ఈరోజు రిపేర్ చేయించడానికి నా ల్యాప్‌టాప్ షాపుకి తీసుకుని వెళ్ళనా?" అని చీటీల ద్వారా బాబాను అడిగాను. బాబా 'శనివారం వెళ్ళమ'ని సందేశం ఇచ్చారు. దాంతో నేను శనివారంనాడు నా ల్యాప్‌టాప్ తీసుకుని షాపుకి వెళ్లాను. షాపతను 700 రూపాయలు ఖర్చవుతుందని చెప్పి, మరుసటిరోజు రమ్మన్నాడు. ఇంక నాకు టెన్షన్ మొదలైంది. ఎందుకంటే నా వద్ద 200 రూపాయలు, ఎటిఎమ్‌లో 45 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఏమి చేయాలో నాకు తెలియలేదు. షాపు నుండి తిరిగి వస్తున్నప్పుడు, 'బాబా నా ప్రార్థనను ఎందుకు వినట్లేదు? నన్ను ఎందుకు ఇంత కఠినంగా పరీక్షిస్తున్నారు?' అని ఆలోచిస్తూ, "నా సమస్యను పరిష్కరించమ"ని గట్టిగా బాబాను ప్రార్థించాను. బాబా సహాయం చేస్తారని నమ్మకం ఉన్నప్పటికీ నేను చాలా బాధపడ్డాను.

    నేను అప్పటికే నా స్నేహితురాలి వద్ద 1000 రూపాయలు అప్పు తీసుకున్నాను, తిరిగి ఇవ్వలేదు కూడా. హేయమైన నా పరిస్థితి గురించి చెప్పి ఇతర స్నేహితులను డబ్బు అడగటానికి సిగ్గుపడ్డాను. ఆ రాత్రంతా నాకు నిద్రలేదు. ఏ తెల్లవారుఝామునో నిద్రపట్టి లేచేసరికి 12 గంటలు అయ్యింది. ఎవరిని డబ్బు అడగాలో అర్థంకాక చాలా ఆందోళనపడిన తరువాత ఒక స్నేహితురాలికి ఫోన్ చేశాను. కానీ ఆమె క్యాంపస్‌లో లేదని తెలిసి తనకి ఫోన్ చేసిన కారణాన్ని చెప్పడానికి సాకులు వెతుక్కున్నాను. దిక్కుతోచని స్థితిలో నేను నిస్సహాయంగా, "నాకు ఒక మార్గం చూపించమ"ని బాబా ముందు ఏడ్చాను.

    నిరంతరం అదేపనిగా సమస్య గురించి ఆలోచిస్తున్నందువల్ల తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పి కూడా వచ్చింది. తరువాత నేను నా స్నేహితురాలి గదికి వెళ్లి అక్కడ కాసేపు పడుకున్నాను. అక్కడ శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి ఉన్న క్యాలెండర్ ఉంది. నేను దాన్ని చూస్తూ ఒక నిమిషంపాటు శాంతిని అనుభవించి, శివుడిని చూస్తూ, "మీరే నా సాయి. సాయిశివా, దయచేసి నాకు ఒక పరిష్కారం చూపించండి. నేను నాన్నని డబ్బు అడగాలని మీరు అనుకుంటే, దయచేసి నా బిడియాన్ని, ఆత్మగౌరవాన్ని, అహాన్ని నాశనం చేసి, నా మనసును మార్చి ఆయనను అడిగేందుకు నాకు శక్తినివ్వండి" అని ప్రార్థించాను. నేను చాలా కృంగిపోయి ఉన్నాను, తలనొప్పి చాలా తీవ్రంగా ఉంది. "దేవుడు నా మాట వింటున్నాడు, నన్ను చూస్తున్నాడు, కానీ నా సమస్యను పరిష్కరించడం లేదెందుకు?" అని అలోచిస్తూ నా మనసు విరిగిపోతోంది.

    కొద్దిసేపట్లో హఠాత్తుగా నా స్కూల్ స్నేహితురాలు నన్ను కలిసింది. ఆనందంతో ఆమె 5 నిమిషాలు పాటు నన్ను కౌగిలించుకుంది. దాదాపు నేను ఏడ్చే స్థితిలో ఉన్నాను. కానీ నేను నా కన్నీళ్లను నియంత్రించుకున్నాను. ఆమె నేనుంటున్న గదికి సమీపంలోనే  ఉంటుంది. తరువాత ఆమె నాతో సాయిబాబా, గీత మొదలైనవాటి గురించి మాట్లాడింది. అంతలో తను నా ఫోన్ స్క్రీన్ మీద ఉన్న సాయిని చూసి, నేను కూడా సాయిని నమ్ముతున్నానని గ్రహించి చాలా సంతోషించింది. నేను కూడా చాలా త్వరగా తనతో కనెక్ట్ అయ్యి నా సమస్య గురించి చెప్పాను. ఆమె నాకు వెంటనే 500 రూపాయలు ఇచ్చింది. మేము తన రూమ్మేట్‌తో కలిసి డిన్నర్ చేశాము. నా రూమ్మేట్ లేనందువలన తను ఆ రాత్రి నా గదిలో పడుకుంది. నా కుటుంబసభ్యులను కలిసినంత అనుభూతి కలిగి, నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. తరువాత నేను నొప్పి నివారణ మందులు వేసుకొని ఈ అనుభవం గురించి వ్రాయడం ప్రారంభించాను. అప్పుడు నా సాయి శనివారానికి ముందు ల్యాప్‌టాప్ రిపేరుకి ఇవ్వడానికి ఎందుకు అనుమతించలేదో అర్థమైంది. ఎందుకంటే, నా స్నేహితురాలు ఆదివారం వస్తుందని ఆయనకు తెలుసు. ఐదురోజులు చాలా ఇబ్బందిపడ్డ తరువాత నేను ఆ టెన్షన్ నుండి బయటపడ్డాను. అయితే ఆ సమయంలో నా చదువుకు ఇబ్బంది కలుగకుండా నా స్నేహితుల ల్యాప్‌టాప్‌ ఉపయోగించుకునేలా ఏర్పాటు చేశారు బాబా. అది నా సాయి గొప్ప ఆశీర్వాదం. ఆయన చాలా గ్రేట్. ఆయన ప్రేమ నిజంగా వందమంది తల్లుల ప్రేమకు సమానం. "నా సాయిశివా, మీకు చాలా ధన్యవాదాలు. లవ్ యు సాయి". బాబా మన మాటలు వింటారు. ఆయనపై దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండండి.

    source:http://www.shirdisaibabaexperiences.org/2020/03/shirdi-sai-baba-miracles-part-2680.html


    నానాసాహెబ్ రాస్నే



    బాబా అనుగ్రహంతో దామూఅన్నాకి కలిగిన మొదటి సంతానమే దౌలత్ షా అలియాస్ దత్తాత్రేయ దామోదర్ రాస్నే అలియాస్ నానాసాహెబ్ రాస్నే. తనకు ఐదేళ్ళ వయస్సు వచ్చాక తండ్రి పుట్టువెంట్రుకలు తీయించి, అక్షరాభ్యాసం చేయించడానికి శిరిడీ తీసుకుని వెళ్ళాడు. బాబా దౌలత్ షా చేయిపట్టుకుని పలక మీద బలపంతో 'హరి' అని వ్రాయించారు. తరువాత తనని శిరిడీలోని బడికి పంపించారు.
    [clip_image001%255B4%255D.jpg]
    నానాసాహెబ్ రాస్నేకు ఏడు సంవత్సరాల వయస్సున్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి శిరిడీ వెళ్ళాడు. ఒకరోజు అతను మశీదులో కూర్చుని బాబా పాదాలు ఒత్తుతున్నాడు. ఆ సమయంలో బాబా అక్కడున్న పిల్లలకి తమ స్వహస్తాలతో మిఠాయిలు పంచుతున్నారు. చిన్నపిల్లవాడైనందున సహజంగానే తన దృష్టి మిఠాయిల వైపు మళ్ళింది. ఫలితంగా బాబా పాదాలు ఒత్తడంలో శ్రద్ధ మందగించింది. పక్కనే ఉన్న తల్లి అది గమనించి, "మిఠాయిల వైపు చూస్తూ బాబా సేవను నిర్లక్ష్యం చేస్తున్నావా?" అని పిల్లవాణ్ణి కొట్టింది. వెంటనే బాబా కోపంతో, "ఏయ్ ముసలీ! పిల్లవాణ్ణి ఎందుకు కొట్టావు?" అన్నారు. అప్పుడు ఆమె బాబాతో, "బాబా! కుదురుగా మీ సేవ చేసుకునే మంచి బుద్ధిని పిల్లవాడికి ప్రసాదించండి" అని వేడుకుంది. "పిల్లవాడు చక్కగా నా సేవ చేసుకుంటాడు. భగవంతుడు వాడికి స్వచ్ఛమైన బుద్ధిని ప్రసాదిస్తాడు. భయపడకు, ఇక వాడినెప్పుడూ కొట్టకు" అని అన్నారు బాబా.

    నానాసాహెబ్ రాస్నేకు పన్నెండేళ్ళ వయస్సప్పుడు తన సోదరునితో కలిసి శిరిడీ వెళ్ళాడు. వారిద్దరి వద్ద 100 రూపాయలున్నాయి. బాబా మొదట 10 రూపాయలు, తరువాత 15 రూపాయలు, ఇలా చాలాసార్లు దక్షిణ అడిగి తీసుకున్నారు. చివరికి అతని సోదరుని జేబులో 25 రూపాయలు మాత్రమే మిగిలాయి. అప్పుడు వాళ్ళు బాబాకు దక్షిణ సమర్పించేందుకు, తిరుగు ప్రయాణానికి అవసరమైన డబ్బులు పంపమని అహ్మద్‌నగర్‌లోని తమ వాళ్ళకి లేఖ వ్రాశారు. ఆ సాయంత్రం బాబా నానాసాహెబ్ సోదరుణ్ణి 25 రూపాయల దక్షిణ అడిగారు. అందుకతను, “మా దగ్గరున్న డబ్బంతా అయిపోయింది, తిరుగు ప్రయాణానికి మాకు డబ్బులు అవసరమ”ని బదులిచ్చాడు. బాబా వెంటనే, "ఎందుకు అబద్ధం చెబుతావు? నీ జేబులో 25 రూపాయలున్నాయి. ప్రయాణ ఖర్చులకి డబ్బులు పంపమని నగర్‌కు జాబు వ్రాశారు కదా! ఆ డబ్బు మనియార్డర్ ద్వారా రేపు మీకు అందుతుంది, భయపడవద్దు" అని అన్నారు. అతను వెంటనే బాబాకు 25 రూపాయలు దక్షిణగా సమర్పించాడు. బాబా తరచుగా, "ఎవరు నాకు ఒకటి సమర్పిస్తారో వారికి నేను రెండు ఇస్తాను. రెండు ఇచ్చినవారికి ఐదిస్తాను. ఐదు ఇచ్చినవారికి పదిస్తాను!" అని చెబుతుండేవారు. బాబా ఆవిధంగా తమను ఆశ్రయించిన భక్తుల వద్దనుండి తీసుకున్న మొత్తానికి ఎన్నోరెట్లు తిరిగి ఇస్తారు.

    నానాసాహెబ్ రాస్నే పెళ్ళీడుకి వచ్చినప్పుడు పెద్దలు అతనికి వివాహం చేయ నిశ్చయించారు. అప్పుడు అతనికి నాలుగు సంబంధాలు వచ్చాయి. అందులో 2,500 లేదా 3,000 రూపాయల కట్నం ఇచ్చే సంబంధం కూడా ఒకటి ఉంది. బాబాను సంప్రదించకుండా, వారి అనుమతి లేకుండా ఏ పనీ చేయని అతని తండ్రి దామ్యా ఆ నలుగురు అమ్మాయిల జాతకాలు తీసుకుని శిరిడీ వెళ్ళాడు. వాటిని బాబా ముందుంచి, "ఏ సంబంధాన్ని ఖాయం చేసుకోమంటారు బాబా?" అని అడిగాడు. బాబా ఒక పేదింటి అమ్మాయి జాతకం ఎంపిక చేసి అతని చేతిలో పెట్టారు. అతడు మరో ఆలోచన చేయక ఆ అమ్మాయితోనే వివాహం ఖాయపరిచాడు. వివాహాన్ని పండరీపురంలో చేయ నిశ్చయించి, "వివాహానికి రమ్మ"ని బాబాను ఆహ్వానించాడు దామ్యా. అందుకు బాబా, "నేను నీతో ఉన్నాను. భయపడవద్దు. నువ్వెప్పుడు తలచుకున్నా నేను నీ చెంత ఉంటాను" అని సమాధానమిచ్చారు. అయినా అతను వివాహానికి రమ్మని బాబాను ఒత్తిడి చేశాడు. అప్పుడు బాబా, "భగవంతుని అనుమతి లేనిదే నేను ఏ పనీ చేయలేను. నా తరఫున శ్యామాను పంపుతాను" అన్నారు. పండరీపురంలో జరిగిన నానాసాహెబ్ రాస్నే వివాహానికి శ్యామా హాజరయ్యాడు. పెద్ద మొత్తంలో కట్నం ఇచ్చే సంబంధాన్ని వదులుకుని పేదింటి సంబంధాన్ని ఖాయం చేసుకున్నాడని ప్రజలు పలురకాలుగా దామూశేఠ్‌ను విమర్శించసాగారు. అతడు ఆ విమర్శలకు గాని, ద్రవ్య ప్రలోభానికి గాని లోనుకాకుండా బాబా చెప్పినట్లే నడుచుకున్నందున నానాసాహెబ్ వైవాహిక జీవితం సంతోషదాయకంగా ప్రారంభమైంది.

    నానాసాహెబ్ రాస్నే దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు జన్మించారు. కానీ ఆ ముగ్గురూ పుట్టిన కొన్ని నెలలకే మూర్ఛరోగంతో మరణించారు. మగపిల్లవాడు 1926లో చనిపోయాడు. అతని భార్య ఆరోగ్యం కూడా క్షీణించింది. ఆమె మరో వివాహం చేసుకోమని అతడిని ఒత్తిడి చేసింది. కానీ అతను తీవ్రమైన నిరాశానిస్పృహలకు లోనై సంసారజీవితంపై విరక్తి చెందాడు. అట్టి స్థితిలో అతనొకసారి శిరిడీ వెళ్లి బాబా సమాధి ముందు కూర్చుని, "బాబా! అల్పాయుష్కులైన ఇంతమంది పిల్లలను ఇచ్చే బదులు పూర్ణాయువు గల ఒక్క బిడ్డను ప్రసాదించండి, లేదంటే ఆత్మోద్ధరణకు మార్గం చూపండి" అని ప్రార్థించాడు. అలా ప్రార్థిస్తూనే అతను కన్నీళ్ళపర్యంతమయ్యాడు. ఇంతలో బాబా సమాధి నుండి "నీకు పిల్లలు పుడతారు" అని ఒక స్వరం వినిపించింది. అతను ఆశ్చర్యపోయాడు. అవధులు లేని ఆనందంతో బాబా సమాధి ముందు సాష్టాంగపడ్డాడు. పిల్లలు కలుగుతారన్న దానికంటే తన ప్రార్థనలకు సద్గురువు స్పందించారని అతను ఆనందపరవశుడయ్యాడు. తరువాత అతను వాడాలో నిద్రిస్తుండగా బాబా స్వప్న దర్శనమిచ్చి, "పిల్లవాడు చనిపోయాడని చింతించకు. వాడు తల్లిదండ్రులకు హాని కలిగించే మూలా నక్షత్రంలో జన్మించాడు" అని చెప్పారు. ఆ స్వప్నంలో అతను బాబా ఛాతీపై సూర్యుని వలే ప్రకాశిస్తున్న ఒక కాంతివలయాన్ని చూశాడు. ఆ వలయం లోపల చనిపోయిన అతని బిడ్డని ఒడిలో పెట్టుకుని బాబా కూర్చుని ఉన్నారు. "నీకు ఈ బిడ్డవల్ల ప్రమాదముంది. అందుకే వీడిని నేను తీసుకెళ్ళాను. నీకు మరో బిడ్డను ప్రసాదిస్తాను, భయపడవద్దు" అని అన్నారు. అప్పటికే అతని కుటుంబం అహ్మద్‌నగర్ నుండి పూనాకు తరలి వెళ్ళింది. అతను ఇంటికి వెళ్ళి చనిపోయిన పిల్లవాని జాతకచక్రం తీసి చూశాడు. బాబా చెప్పినట్లు వాడు మూలా నక్షత్రంలోనే పుట్టాడు. 

    శిరిడీ నుండి వచ్చిన పదిహేను నెలల తరువాత 1928లో పండరీపురంలో ఉన్నప్పుడు నానాసాహెబ్ రాస్నేకి ఒక కుమారుడు జన్మించాడు. వాడు పూర్ణారోగ్యవంతుడు. వాడికి ‘ఫల్గుణ్ వద్య’ అని పేరు పెట్టారు. పదిహేను నెలల తరువాత నానాసాహెబ్ తన తండ్రితో కలిసి శిరిడీ వెళ్ళాడు. అప్పుడు అతని తండ్రి బాబా సమాధి వద్ద "రెండవ మనవడిని ప్రసాదించమ"ని బాబాను ప్రార్థించాడు. బాబా కృపవలన 1931 సంవత్సరంలో నానాసాహెబ్ రాస్నేకు మరొక కుమారుడు జన్మించాడు.  పుట్టిన రెండవరోజున పిల్లవాడికి తీవ్రమైన జ్వరం వచ్చింది. వాడికి బాబా ఊదీ, తీర్థం ఇచ్చి, బాబా శేషవస్త్రాన్ని ఒక తాయెత్తులో పెట్టి పిల్లవానికి కట్టారు. వెంటనే జ్వరం తగ్గి పిల్లవాడు పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. ఆ పిల్లవాడికి ‘సాయిదాస్’ అని పేరు పెట్టారు. పిల్లవాడికి సంవత్సరం నిండిన తరువాత వాడిని తీసుకుని శిరిడీ వెళ్లారు. బాబాకి అభిషేకం చేయించి, బాబా సమాధి మీద కప్పేందుకు వస్త్రాన్ని సమర్పించి, బ్రాహ్మణులకు అన్నసంతర్పణ చేశారు.

    నానాసాహెబ్ రాస్నే ఇలా చెప్పాడు: "నానాటికీ నాకు సాయియందు భక్తివిశ్వాసాలు వృద్ధి చెందుతున్నాయి. నేను సాధుసత్పురుషులందరినీ సాయిబాబా రూపాలుగానే చూసేవాడిని. వారిని దర్శించినప్పుడు బయటకు గాని, మనసులో గాని, "సమర్థ సద్గురు సాయినాథునికి ప్రణామాలు" అని నమస్కరించుకునేవాడిని. 1927లో నేను ఖేడ్‌‌గాంభేట్ వెళ్లి, నారాయణ్ మహరాజ్‌ని దర్శించి, "సమర్థ సద్గురు సాయినాథునికి ప్రణామాలు" అని నమస్కరించాను. వారు నాతో, "నీ గురువు పరమగురువు. వారు నాకంటే ఎంతో గొప్పవారు. నువ్వు నావద్దకు రావడమెందుకు? నీ ప్రారబ్ధము, సంచితము అక్కడే ఉంది. నీ ఎన్నిక శ్రేష్ఠమైనది. నువ్వు అక్కడికే వెళ్ళు. గమ్యం చేరుతావు(నీ ఆశయాలన్నీ అక్కడే సిద్ధించగలవు)" అని అన్నారు.

    1927లో జాతకచక్రంలోని నక్షత్ర ప్రభావం వల్ల నానాసాహెబ్ రాస్నే ఆరోగ్యం క్షీణించింది. అతను ప్రతి ఆదివారం పూనా నుండి 40 మైళ్ళ దూరంలోని జున్నర్ సమీపంలో ఉన్న సీతారాం ఉత్తరేశ్వర్ (శివాలయం) ఆలయానికి వెళ్లి పూజలు చేసేవాడు. ఒక ఆదివారం రాత్రి 9 గంటలకి అతను అచ్చటి విగ్రహంపై పువ్వులు ఉంచి, "సాయిబాబాకు ప్రణామాలు" అని నమస్కరించుకున్నాడు. అప్పుడు అతనికి ఆ విగ్రహం వద్ద ఒక వెలుగు, ఆ వెలుగులో అతను నిరంతరం స్మరించే సాయిబాబా రూపం కనిపించాయి. అప్పటినుండి అతని ఆరోగ్యం మెరుగుపడింది.

    సీతారాం ఉత్తరేశ్వర్ ఆలయమున్న ప్రాంతంలో జానకీదాస్ అనే సాధువు నివసిస్తుండేవారు. ప్రతి ఆదివారం నానాసాహెబ్ రాస్నే అక్కడికి వెళ్ళినపుడు ఆయనను దర్శించి, సాయిబాబాను స్మరించుకుంటూ వారికి నమస్కరించేవాడు. ఒకసారి ఆ సాధువు అతనితో, "నీవు గొప్ప మహాత్ముని ఆశ్రయించావు. నాలాంటి సామాన్య సాధువు వద్దకు ఎందుకు వస్తావు? మాలాంటి వారమంతా సాయిబాబా పాదాలనే ఆశ్రయిస్తాం" అని అన్నారు. తరువాత అతను తన బసకు వెళ్లి నిద్రపోయాడు. ఆ రాత్రి కలలో అతనికి బాబా ఫకీరు వలే కనిపించి, "నీవు చాలా ఆతురత పడుతున్నావు. నీ సంపూర్ణ శరీరాన్ని, మనస్సును నాకు భిక్షగా సమర్పించు" అని అన్నారు.

    రాస్నే: “నేను ఈ భిక్షను సమర్పించి నా తండ్రికి తెలియజేస్తాను”.

    బాబా: “నీ తండ్రిని సంప్రదించకుండా నీవు ఈ పని ఎలా చేయగలవు?”

    రాస్నే: “నా శరీరానికి యజమానిని నేనే! నా తండ్రికి ఇంకా కుమారులు ఉన్నారు. మీరే వారికి కుమారులను ప్రసాదించారు. మీరిచ్చిన దానిని తిరిగి మీకివ్వడానికి నా తండ్రి అభ్యంతరం చెప్పరు".

    అప్పుడు బాబా అతని శరీరాన్ని తమ అరచేతుల్లోకి తీసుకుని తమ హృదయం దగ్గర జేబులో వేసుకున్నారు. బాబా ఎంతో దయతో తనను వారి హృదయం చెంతకు చేర్చుకున్నారని అతను ఆనందపారవశ్యంలో మునిగిపోయాడు. నిద్రనుండి మేల్కొన్నాక అతనెంతో ఆనందాన్ని అనుభూతి చెందాడు. అంతేకాకుండా తన మనస్సు వైరాగ్యంతో నిండి నిర్లిప్తంగా ఉన్నట్లు గ్రహించాడు. అంతటితో ఏ విషయమూ మునుపటివలె అతన్ని ఆకర్షించలేదు, మనసుపై ప్రభావం చూపలేదు.

    1931లో గాజుల వ్యాపార నిర్వహణ బాధ్యతను నానాసాహెబ్ రాస్నేకు అప్పగించారు. అతడు ఆ వ్యాపారానికి బాబా పేరు పెట్టాలని పట్టుబట్టాడు. బాబా చిత్రపటం ముందు చీటీలు వేసి, బాబా అనుమతి తీసుకుని తమ వ్యాపారానికి 'శ్రీ సమర్థ సాయినాథ్ & కంపెనీ' అని పేరు పెట్టారు. ఈ వ్యాపారాన్ని నిజాయితీగానూ, మనస్సాక్షి సమ్మతంగానూ అతను నడపసాగాడు.

    1932 సెప్టెంబరులో నానాసాహెబ్ రాస్నే తీర్థయాత్రలో ఉన్నప్పుడు ముత్రా అనే ప్రదేశంలో అతనికి కలరా సోకింది. దాదాపు మరణం తప్పదనిపించింది. అతని చివరి కోరిక ఏమిటని అతని తండ్రి అడిగాడు. అందుకతను, "నన్ను శిరిడీ తీసుకుని వెళ్ళండి. నేను మరణిస్తే నా శ్రీకృష్ణుడైన సాయిబాబా చెంత నన్ను దహనం చేయండి" అని కోరాడు. కానీ బాబా పటాన్ని అతని తలవద్ద ఉంచి అగరుబత్తీలు వెలిగించి, తరచూ అతనికి ఊదీ తీర్థం ఇచ్చారు. అతను కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. అర్థరాత్రి సమయంలో అతని మరదలు సుభద్రాబాయిని గుజరాత్‌లోని సిద్‌పూర్ సమీపంలోని ఉనవకు చెందిన మీరాదాతార్ అనే ప్రఖ్యాత ముస్లిం సాధువు ఆవహించి మాట్లాడుతూ, "మీరు సాయిబాబాను ప్రార్థిస్తున్నారు. వారు నా మామ. వారు వయోభారంతో నడవలేకున్నారు. వారు తమ తరఫున నన్ను పంపారు. కనుక నేను వచ్చాను. భయపడవద్దు. వారి కృపాశీస్సులు మీకు లభిస్తాయి. వారిని మీరు రేపు దర్శించుకుంటారు. ఒక కప్పు కాఫీ తయారుచేసి రోగికి ఇవ్వండి, భయపడవద్దు" అని చెప్పాడు. తరువాత వాళ్ళు కాఫీ తయారుచేసి అందులో బాబా ఊదీ కలిపి అతని చేత త్రాగించారు. కొద్దిసేపటికి అతని జ్వరం తగ్గి, విరోచనాలు ఆగిపోయాయి. మరుసటిరోజు అతనికి చికిత్స చేస్తున్న వైద్యుడు అంత త్వరగా కోలుకున్న అతనిని చూసి ఆశ్చర్యపోతూ, "నిన్న ఇతను మృత్యువుకు అతి సమీపంలో ఉన్నాడు. ఒక్కరోజులో ఇంత మార్పు ఎలా వచ్చింది?" అని ప్రశ్నించాడు. అందుకతను, "శ్రీసాయిబాబా వైద్యులకే వైద్యుడు. వారి పవిత్ర ఊదీయే నన్ను కాపాడింది" అని బదులిచ్చాడు.

    బాబా కృపావర్షంలో తడిసిన పుణ్యాత్ముడు నానాసాహెబ్ రాస్నే. చిన్నవయస్సులోనే అతని మనస్సులో బాబాపట్ల భక్తి నాటుకుంది. అతను తన జీవితాన్ని బాబా పాదాలకు సమర్పించాడు. "సద్గురువే కర్త, మన జీవితాలను నడిపేది ఆయనే" అని అతను హృదయపూర్వకంగా నమ్మేవాడుఅతని ప్రతి చర్యా బాబాతో అనుసంధానింపబడి ఉండేది. క్రమంగా అతనిలో విరక్తి పెరిగింది. సంసార జీవితం పట్ల అతనికి ఎలాంటి ఆకర్షణా ఉండేది కాదు. భౌతిక విషయాలు, సంతోషాలకు సంబంధించిన కోరికలు వాటంతటవే తొలగిపోయాయి. చాలా కఠిన స్వభావిగా అతను ప్రసిద్ధి చెందినప్పటికీ, అతని హృదయం మాత్రం అంతే దయతో నిండి ఉండేది.

    పనికిమాలిన మాటలతో నిర్లక్ష్యంగా ప్రవర్తించే భక్తులను నానాసాహెబ్ అసహ్యించుకునేవాడు. అతను మోసాన్ని సహించేవాడు కాదు. అతనెప్పుడూ బాబాను "మై బాబా(నా బాబా)" అని పిలిచేవాడు. అతను తరచూ, “ప్రజలు నా బాబాను వేధిస్తున్నారు. అందరూ నా బాబాను దోచుకోవడానికి కుట్ర చేస్తున్నారు. నా బాబాను మోసం చేయడానికి, బాధపెట్టడానికి ప్రయత్నించవద్దు. ఆయన అగ్నిస్వరూపుడు" అని చెప్తుండేవాడు. ఇంకా ఇలా అనేవాడు: “ఇంట్లోని చిన్న మందిరంలో కూర్చోవడం నా బాబా స్వభావంలో ఎన్నడూ లేదు. నా బాబా ఒక సామాన్యుడిలా మసలుకున్నారు. ఆయన తన మాటల్లో చాలా ఉర్దూ పదాలను ఉపయోగించేవారు” అని. బాబాతో అతనికి అంత దగ్గరి అనుబంధం ఉండటానికి కారణమేమిటంటే, స్వయంగా బాబానే దామూ అన్నాతో అతని మొదటి కొడుకును తనకు ఇవ్వమని అడిగారు. అంటే, అతను ఆయనకి చెందినవాడు. బాబా అతనికి పారమార్థిక పురోగతిని ప్రసాదించారు. బాబాని స్మరించి అతనెవరికైనా ఊదీ, తీర్థాలు ఇస్తే రోగాలు నయమయ్యేవి, సమస్యలు పరిష్కరింపబడేవి.

    ఒక గురుపూర్ణిమనాడు బాబాకు వేసిన మాల నుండి నయాపైసా నాణెమొకటి నానాసాహెబ్ చేతుల్లో పడింది. ఎంతో భక్తితో అతను దానిని తన జీవితాంతం భద్రపరచుకున్నాడు. అతనెప్పుడూ ఆ నాణాన్ని తన చొక్కా బటన్ పట్టీలో పెట్టుకుని అపురూపంగా చూసుకునేవాడు. ఆ నాణెం గురించి అతను, “నా వార్షిక ఆదాయం సుమారు 5,000 రూపాయలు. కానీ ఈ ప్రపంచంలోని ఏ నాణెమూ ఈ నయాపైసాతో సరిపోలదు. దీనికి విలువ కట్ట శక్యం కాదు. ఇది చాలా అమూల్యమైనది" అని అనేవాడు. మరణాంతరం తనని దహనం చేసేటప్పుడు తన శరీరంతోపాటు ఆ నాణేన్ని కూడా దహనం గావించాలని అతను తన కోరికను కుటుంబసభ్యులతో చెప్పాడు. వాళ్ళు అలాగే చేశారు.

    బాబా భక్తులలో చాలామంది ఏకాదశి శుభదినాన కన్నుమూశారు. నానాసాహెబ్‌కి కూడా ఏకాదశి రోజే తుదిశ్వాస వీడాలని బలమైన కోరిక ఉండేది. అతను తన చివరిరోజుల్లో తన నివాసాన్ని శిరిడీకి మార్చాడు. ఆషాఢ ఏకాదశి రోజున అతను ఒక చిన్న సంఘటన కారణంగా క్రింద పడిపోయాడు. భారమంతా తన భుజాల మీద పడటంతో కాలర్ ఎముక దెబ్బతింది. అతనిని సంస్థాన్ వారి సాయి ఆసుపత్రిలో చేర్చారు. అదేరోజున అతను కన్నుమూశాడు. ఏకాదశి రోజు మరణించాలన్న తన ప్రియభక్తుని కోరికను బాబా నెరవేర్చారు.

    నానాసాహెబ్ రాస్నే మంచి వక్త, సామాజిక కార్యకర్త. అతను తన జీవితంలో ఎక్కువ భాగం శ్రీసాయిబాబా లీలలను, బోధనలను ప్రచారం చేయడంలోనే గడిపాడు. అతను కొంతకాలం శిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టీగా బాధ్యతలు నిర్వహించాడు. ఆ బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించి శ్రీసాయి సేవలో తరించాడు. బాబా సమాధిమందిరంలో ఇతర భక్తుల చిత్రపటాల నడుమ దత్తాత్రేయ దామోదర్ రాస్నే చిత్రపటాన్ని కూడా ఉంచి సంస్థాన్ అతన్ని గౌరవించింది.

    సమాప్తం... 

     డీవోటీస్ ఎక్స్‌పీరియన్సెస్ బై బి.వి.నరసింహస్వామి 
    Shri Sai Leela Magazine September-October 2007
    http://www.saiamrithadhara.com/mahabhakthas/dattatreya_damodar_rasane.html
    http://bonjanrao.blogspot.com/2012/12/dattatreya-damodar-rasane.html?view=timeslide.

    సాయిభక్తుల అనుభవమాలిక 481వ భాగం....


    ఈ భాగంలో అనుభవం:
    • ఏమి ఈ బాబా లీల!

    ఓం శ్రీ సాయినాథాయ నమః.

    సాయిభక్తులందరికీ నా నమస్కారములు. నా పేరు అంజనా గుప్తా. మాది వరంగల్ జిల్లా నర్సంపేట. నేను మీ అందరికీ పరిచయస్తురాలినే. ఇంతకుముందు ఈ బ్లాగ్ ద్వారా నా మొదటి అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నాను. ఇది నా రెండవ అనుభవం. మొదటి అనుభవం తర్వాత ఆరు నెలల లోపే నాకు రెండవ అనుభవాన్ని ప్రసాదించారు సద్గురు సాయినాథుడు. ఒక బుధవారం రాత్రి ఎప్పటిలానే బాబాను తలచుకుంటూ పడుకున్నాను. గురువారం తెల్లవారుఝామున నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో అరవై నుండి డెబ్భై సంవత్సరాల మధ్య వయస్సులో ఉండే ఒక వృద్ధుడు కనిపించారు. ఆయన అచ్చం బాబాలానే ఉన్నారు. ఆ కలలో నేను ఒక ఫంక్షన్ కోసం పరకాల వెళ్లాను. ఫంక్షన్ అయిపోయిన తర్వాత బస్టాండ్ వద్దకు వచ్చి బస్సు కోసం ఎదురుచూస్తూ ఉన్నాను.  నాతోపాటు మా పిల్లలిద్దరు కూడా ఉన్నారు. చేతిలో లగేజీ ఉంది. ఎంతసేపు ఎదురుచూసినా బస్సు రావట్లేదని నేను చాలా అసహనానికి గురి అవుతున్నాను. ఆ సమయంలో ఆ వృద్ధుడు (బాబా) నా దగ్గరకు వచ్చి, బిడ్డా! ఇక్కడ బాబా మందిరం ఉంది. బాబాను దర్శించుకోకుండానే వెళ్ళిపోతున్నావెందుకు? ఎక్కడ బాబా మందిరం ఉన్నా తప్పకుండా దర్శించుకుని వెళ్తావు కదా, మరి ఎందుకు తల్లీ బాబాను దర్శించుకోకుండానే వెళ్లిపోతున్నావు? నీకు బాబాను దర్శించుకోవాలని అనిపించటంలేదా?” అని అన్నారు. నేను, “బాబా మందిరం ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు కదా!” అన్నాను. దానికి ఆ వృద్ధుడు, “అయ్యో తల్లీ, నీకు తెలియదా? ఈమధ్య ఈ బస్టాండుకు దగ్గరలోనే బాబా మందిరం నిర్మించారు. నువ్వు నాతో రా! నీకు చూపిస్తాను, బాబా దర్శనం చేయించి పంపిస్తాను” అని నన్ను తనతో పాటుగా బస్టాండ్ దగ్గర ఒక మూలమలుపు నుండి లోపలికి తీసుకువెళ్తున్నారు. అలా కొంతదూరం వెళ్ళాక, “నేను నడవలేకపోతున్నాను, కాళ్ళు నొప్పి పుడుతున్నాయి, మందిరం ఇంకా ఎంత దూరం ఉంద”ని అడిగాను. అందుకాయన, “ఇక్కడే, ఇక్కడే, దగ్గరకు వచ్చేశాము” అని చెబుతూ అలా నన్ను నడిపిస్తూనే ఉన్నారు. ఇద్దరు పిల్లలతో, చేతిలో లగేజీతో నడవడం చాలా కష్టంగా ఉంది నాకు. దాంతో నేను, “ఇక్కడే, ఇక్కడే అని చాలా దూరం నడిపిస్తున్నావు, ఇంక నేను నడవలేను” అంటూ ఆ వృద్ధునిపై కోప్పడి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాను. (ఆ వృద్ధుడు బాబానే అని కలలో నాకు తెలియదు కదా!) ఆయనేమో, “అయ్యో తల్లీ! ఇంత దూరం వచ్చి బాబా దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోతావా?” అని అంటున్నారు. నాకేమో విసుగు, చిరాకు, కోపం అన్నీ వస్తున్నాయి. అయినా ఒక్కసారి ఆలోచించాను, బాబా మందిరానికి వెళ్ళి వెళ్తేనే బావుంటుందేమో అని. “సరే, ఇంత దూరం వచ్చాను కదా, ఇంకాస్త దూరం నడిస్తే బాబా మందిరం వచ్చేస్తుందేమో” అనుకొని వెనక్కి తిరిగి చూస్తే ఆ వృద్ధుడు కనిపించలేదు. అక్కడున్నవాళ్లని ఆ వృద్ధుడి గురించి, బాబా మందిరం గురించి అడిగితే, నేను చెప్పిన ఆనవాళ్లతో ఎవరూ లేరని చెప్పి, “ఇక్కడ బాబా మందిరం లేదు, ఆ వృద్ధుడెవరో కనిపించట్లేదంటున్నావు, అసలిక్కడ బాబా మందిరమే లేనప్పుడు బాబా మందిరం చూపిస్తానని ఎలా తీసుకెళ్తాడు నిన్ను?” అని అన్నారు. అప్పుడు అర్థమైంది నాకు, ఆ వృద్ధుడు మరెవరో కాదు, బాబానే అని. “అయ్యో, సాయినాథా! నా దగ్గరికి వచ్చింది, నాతో తిరిగింది, నన్ను నడిపించింది, నాతో మాట్లాడింది నువ్వేనా?” అని బాబాను గుర్తించలేకపోయినందుకు చాలా బాధపడ్డాను, వేదనచెందాను. కానీ, మందిరం కనిపించకపోయినా బాబా దర్శనమిచ్చారని కలలోనే చాలా సంతోషించాను కూడా.

    తెల్లవారాక మావారికి నా కల గురించి వివరించాను. అటు తర్వాత మావారితో, “మీకు ఎవరైనా పరకాలకు చెందినవాళ్లు తెలిస్తే బస్టాండుకు దగ్గరలో ఏదైనా సాయిబాబా మందిరం ఉందేమో తెలుసుకోండి” అని చెప్పాను. “సరే, నేను తెలుసుకుంటాను” అన్నారు మావారు. కానీ నాలుగయిదు రోజులైనా మాకు పరకాలలో సాయిబాబా మందిరం ఉందో, లేదో తెలియలేదు. ఆ విషయం ఎలా తెలుసుకోవాలో అర్థంకాక చాలా బాధపడ్డాను. అలాగే వారం రోజులు గడిచిపోయింది. తొమ్మిదవరోజున “పరకాల బస్టాండ్ దగ్గర సాయిబాబా మందిరం కట్టడానికి శంకుస్థాపన జరిగింది” అని న్యూస్ పేపర్లో మెయిన్ పేజీలో కలర్ ఫోటోతో ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన చూస్తూనే ఒళ్ళు ఝల్లుమంది. “ఏమి ఈ బాబా లీల! అసలు అక్కడ బాబా మందిరం లేదు కదా! అంటే, నాకు ముందుగానే అక్కడ బాబా దర్శనం ఇచ్చార”ని చాలా పులకించిపోయాను. పరకాలలో బాబా మందిరం కట్టడానికి ముందే ఆ విషయం నాకు తెలిసినందుకు సంతోషించాను. 

    కలలో ఏ విధంగా అయితే నేను ఫంక్షనుకి వెళ్లి, తరువాత బాబా మందిరానికి వెళ్ళినట్టుగా వచ్చిందో, అదేవిధంగా ఆ కల వచ్చిన 8 సంవత్సరాలకు నేను ఒక ఫంక్షనుకి హాజరైన తరువాత పరకాలలోని సాయిబాబా మందిరానికి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాను. ఆ కార్యక్రమానికి దాదాపు పాతికమందిమి ప్రైవేట్ వెహికల్స్‌లో వెళ్ళాము. అందులో ఇరవైమంది గత కొన్ని సంవత్సరాలుగా తరచూ బిజినెస్ పనిమీద పరకాలకు వస్తూ పోతూ ఉన్నప్పటికీ ఏనాడూ బాబా మందిరానికి వెళ్ళి బాబా దర్శనం చేసుకోలేదు. నా వల్ల వాళ్ళందరూ బాబా దర్శనం చేసుకోవడం జరిగింది. బాబా దర్శనంతో వాళ్ల సంతోషానికి అవధులు లేవు. నేను కూడా బాబా మందిరాన్ని చూసి ఎంతగా పులకించిపోయానో మాటల్లో చెప్పలేను. ఎందుకంటే, ప్రతి తల్లి తన కడుపులో బిడ్డను మోస్తూ ఆ బిడ్డ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. నేను కూడా పరకాలలోని బాబా మందిరాన్ని చూసినప్పుడు అలాంటి అనుభూతిని పొందాను. నిజంగా నాకిది రెండవ అనుభవం అయినప్పటికీ నా జన్మ ధన్యమైందని అనుకున్నాను. బాబా ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజూ నాతో ఉండి నన్ను నడిపిస్తూ ఉన్నారు అనే దానికి ఇది చక్కటి నిదర్శనం. ఇది జరిగి కొన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ నా కళ్ళకు కట్టినట్టుగా కనబడుతోంది. సదా మా ఇంట, మా వెంట ఉండి మమ్ము నడిపిస్తూ వారి ఆశీస్సులు మాపై కురిపిస్తూ మా జీవితాలను ధన్యం చేస్తున్న బాబాకు కోటానుకోట్ల కృతజ్ఞతలు.

    ఈ బ్లాగులో బాబా ప్రసాదించిన అనుభవాలను పంచుకుంటున్నవారికి నా కృతజ్ఞతలు. సాయిబంధువులందరికీ ఒక చిన్న విన్నపం, పరకాలలోని బాబా మందిరాన్ని దర్శించుకోవాలని ఎవరైనా అనుకుంటే ఒక పూర్తి రోజును కేటాయించుకోండి. అలా ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ బాబా మందిరం అంత అద్భుతంగా ఉంటుంది, అక్కడికి వెళితే తిరిగి రావాలనిపించదు. మరొక అనుభవంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సాయిబంధువులందరికీ ప్రేమపూర్వక కృతజ్ఞతలు.


    సాయిభక్తుల అనుభవమాలిక 480వ భాగం....


    ఈ భాగంలో అనుభవాలు:
    1. కోరుకున్న దర్శనాన్ని అనుగ్రహించిన బాబా
    2. నమ్మకంతో ఉంటే బాబా అన్నీ చేస్తారు

    కోరుకున్న దర్శనాన్ని అనుగ్రహించిన బాబా

    ఓం సాయిరాం! ముందుగా బాబాకి నా ప్రణామాలు. సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు అలేఖ్య. నేను, మావారు ఇద్దరమూ సాయిభక్తులము. గత కొన్ని సంవత్సరాల నుండి నేను సాయిభక్తురాలిని. అయితే రెండు సంవత్సరాల నుండి బాబాను పూర్తిగా నమ్ముతున్నాను. నాకు ఎటువంటి బాధ కలిగినా, కష్టం ఎదురైనా బాబాతోనే పంచుకుంటున్నాను. ఆయన సదా నా వెన్నంటే ఉండి, నాకు సహాయం చేస్తున్నారు. ఇటీవల బాబా ప్రసాదించిన ఒక అద్భుతమైన అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను.

    నేను బాబాకు సంబంధించిన వీడియోలు, మిరాకిల్స్ యూట్యూబ్‌‌లో చూస్తున్న ప్రతిసారీ, "బాబా! మీరు అందరికీ ఏదో ఒక రూపంలో మీ దర్శనభాగ్యాన్నిస్తున్నారు. మాకు ఎప్పుడు అలా దర్శనమిస్తారు?" అని అనుకుంటూ ఉండేదాన్ని. ఒకరోజు నా మనసు అసలేమీ బాగాలేదు. బాధతో ఆ రాత్రంతా యూట్యూబ్‌‌లో బాబా వీడియోలు చూస్తూ ఉండిపోయాను. మరుసటిరోజు గురువారం. ఎప్పటిలానే నేను పూజకి సిద్ధం చేస్తూ బాబా మూర్తిని పట్టుకుని, "మీ దర్శనభాగ్యాన్ని మాకీరోజు కలిగించరా బాబా?" అని ఎంతో బాధగా అడిగాను. మరుక్షణమే అద్భుతమైన లీలను, దర్శనాన్ని ప్రకటితం చేశారు బాబా. బాబా ఫోటో మీద నాకు బాబా రూపం కనబడింది. నన్ను నేను నమ్మలేకపోయాను. కాస్త నిశితంగా పరిశీలించాను. విషయం ఏమిటంటే, హారతి ఇస్తున్నపుడు వచ్చే పొగ కారణంగా గోడంతా నల్లబారిపోయింది. ఆ మసిలో చాలా స్పష్టంగా బాబా ముఖం దర్శమిస్తోంది. అది బాబా ఫొటో మీద ప్రతిబింబించింది. పట్టరాని ఆనందంతో నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. బాబా నాకిచ్చిన దర్శనాన్ని ఎవరితోనైనా పంచుకున్నప్పుడు వారికి చూపడానికి, అందరూ బాబా లీల తెలుసుకోవాలని వెంటనే మొబైల్‌తో ఫొటోలు, వీడియో తీశాను. “కష్టాలు, బాధలు వచ్చినపుడు మాకు ధైర్యం చేకూర్చడానికి, రక్షణనివ్వడానికి బాబా వచ్చారని, ఈరోజు నుండి బాబా మాతోనే ఉంటార”ని నాకనిపించింది. వెంటనే మావారికి ఫోన్ చేసి చెప్పాను. బాబా లీలకు తను కూడా చాలా సంతోషించారు. తరువాత మా బంధువులందరితో బాబా లీలను ఆనందంగా పంచుకున్నాను. "పిలిస్తే పలుకుతాను, తలిస్తే దర్శనమిస్తాను, మీ వెన్నంటి ఉండి మిమ్మల్ని నడిపిస్తాను" అని తన భక్తులకు బాబా ఇచ్చిన నిదర్శనమిది. "బాబా! మీ దర్శనం కోసం తపించేపోయే ఈ భక్తురాలికి చక్కటి అనుభవాన్నిచ్చిన మీకు చాలా చాలా ధన్యవాదాలు!"

    ఓం సాయిరామ్

    నమ్మకంతో ఉంటే బాబా అన్నీ చేస్తారు

    సాయిభక్తురాలు శ్రీమతి జ్యోతి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

    ముందుగా నా సాయితండ్రికి నమస్సుమాంజలి. నేను పదవతరగతి చదువుతున్నప్పటి నుండి సాయిబాబాకి మామూలు భక్తురాలిని. నా పెళ్లికి కొద్దిరోజుల ముందునుండి బాబా మీద నాకు నమ్మకం ఏర్పడింది. ప్రతి విషయంలో బాబాను తలచుకుని చేయడం అలవాటైంది. చిన్న చిన్న విషయాలు దగ్గర నుండి ప్రతి విషయాన్నీ పూర్తయ్యేలా బాబా చేస్తుండేవారు. అయితే బాబా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నా కొన్ని ముఖ్యమైన విషయాలు గత మూడు సంవత్సరాలుగా జరగటంలేదు. నాకు బాగా నిరాశగా ఉంటోంది. బాధ కూడా ఉన్నప్పటికీ బాబా తప్పకుండా చేస్తారనే నమ్మకంతో ఉన్నాను.

    కొంతకాలం క్రితం నా భర్త పదోన్నతి కోసం ప్రయత్నిస్తే, కోపంతో పైఅధికారులు తనని బదిలీ చేశారు. దానివల్ల మేము కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది. బదిలీపై వెళ్లిన నెలరోజులకే తిరిగి వచ్చేస్తారని అనుకుంటే సంవత్సరం దాటినా స్వస్థలానికి బదిలీ కాలేదు. నా భర్తతో పాటు మరో 53 మందికి కూడా బదిలీ అయింది. అందరూ పదోన్నతి కోసం కోర్టులో కేసు వేశారు. ఆ కేసు వెనక్కి తీసుకుంటేగానీ స్వస్థలానికి బదిలీ కాదన్నారు. అప్పుడు నా భర్త, మరో ఇద్దరు సహోద్యోగులు తప్ప మిగతా అందరూ కేసును వెనక్కి తీసుకున్నారు. నా భర్త మాత్రం, “మా తప్పేమీ లేదు, మేమెందుకు కేసు వెనక్కి తీసుకోవాలి?” అని అంటున్నారు. ఈ అవకాశం పోతే మళ్ళీ స్వస్థలానికి బదిలీ కాదేమో అని మా బాధ. దానికి తోడు ‘మీరు కేసు వెనక్కి తీసుకోకపోతే ముగ్గురికీ స్వస్థలానికి బదిలీ కాదు’ అని అందరూ అన్నారు. అప్పుడు నేను, “బాబా! మమ్మల్ని ఈ సమస్య నుండి బయటపడేయండి. మీరు మాత్రమే ఈ పని చేయగలరని నా నమ్మకం. ఈ సమస్య తీర్చితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. ఎలాగైనా మాకు సహాయం చేయండి బాబా” అని బాబాను వేడుకున్నాను. మన దయగల బాబా నా బాధను అర్థం చేసుకొని కేసును వెనక్కి తీసుకున్న వాళ్ళతో పాటు మిగతా ముగ్గురికి కూడా స్వస్థలాలకు బదిలీ అయ్యేలా చేశారు. నా భర్తకి కూడా స్వస్థలానికి బదిలీ అయ్యిందని తన స్నేహితుడు ఫోన్ చేసి చెప్పగా, అది విని నేను ఎంతో సంతోషించాను. సంవత్సరంనుండి ఎదురుచూస్తున్న అవకాశం వచ్చింది అని నా కళ్లలో ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబాను నమ్మినవాళ్ళకి అన్యాయం జరగదు అని బాబా నాకు మళ్ళీ నిరూపించారు. మనం సహనంతో ఉంటే బాబా మనకు అన్నీ చేస్తారు

    సాయినాథ చరణం శరణం.


    సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

    Subscribe Here

    బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

    Delivered by FeedBurner

    Followers

    Recent Posts


    Blog Logo