"శ్రీసాయిబాబా శిరిడీలో భౌతిక శరీరంతో సంచరిస్తున్నప్పుడు దర్శించిన భక్తులు ఎంత ధన్యులో” అని ఈనాడు మనం అనుకుంటాం. బాబా 'అలా' మనకు భౌతికంగా ‘సాక్షాత్కరించాల'ని తపిస్తాము. కానీ ఆనాడు బాబాను శిరిడీలో దర్శించుకొన్న వారికి బాబా దర్శనం ఒక ‘సాక్షాత్కారం'గా అనిపించకపోవడం సహజం, ఆనాడు కూడా బాబా శిరిడీలో కాక మరోచోట కొందరికి “భౌతికంగా” కనిపించినా (ఉదా|| బలరాం మాన్కర్ కు మచ్ఛీంద్రగఢ్లో, మహల్సాపతికి జజూరి లో దర్శనమిచ్చినట్లు), కనీసం స్వప్న దర్శనమిచ్చినా, దాన్ని సాక్షాత్కారంగా భావించారు కానీ, శిరిడీలో నిత్యం అందరికీ కనిపిస్తూండే రూపాన్ని దర్శించడం సాక్షాత్కారమని భావించలేకపోయారు.
బాబాను అత్యంత సన్నిహితంగా సేవించిన ప్రముఖ భక్తులలో శ్రీదాసగణు మహరాజ్ ఒకరనే విషయం సాయిభక్తులందరకూ తెలిసిందే. కానీ దాసగణు బాబాను తన గురువుగా భావించేవాడు కాదు. దాసగణుకు వామన్ సాహి ఇస్లాంపూర్ కర్ అనే బ్రాహ్మణగురువు వేరేవున్నాడు. ఆ గురువు వద్ద మంత్రోపదేశం కూడా పొందాడు. మొదట శివభక్తునిగా వుండి, తరువాత పండరివిఠలునిచే ఆకర్షింపబడి, వార్కరీ సాంప్రదాయంలో తన సాధన కొనసాగించాడు శ్రీదాసగణు.
బాబా ఒకసారి దాసగణును శిరిడీలో భాగవత సప్తాహం చెయ్యమని ఆదేశించారు. అప్పుడు దాసగణు బాబాతో, “బాబా నాకు సాక్షాత్కారం కావాలి. నీవు చెప్పినట్లే భాగవత సప్తాహం చేస్తాను. కానీ దాని ఫలంగా నాకు సాక్షాత్కారాన్ని అనుగ్రహిస్తారా?” అని అడిగాడు. దానికి బాబా, “విఠలుడు కనిపిస్తాడు. కానీ ఆయన్ను చూడడానికి సరైన భావం వుండాలి" అని సమాధానమిచ్చారు. దాసగణు సప్తాహం పూర్తి చేశాడు. కానీ 'సాక్షాత్కారం' కాలేదు. అప్పుడు దాసుగణు బాబాను “నాకు సాక్షాత్కారం అనుగ్రహిస్తానని మాట ఇచ్చారు. కానీ కాలేదు” అని ఫిర్యాదు చేసాడు. బాబా “అలానే ఇంకొన్నిరోజులు చూడు!” అన్నారు. తరువాత కొంతకాలానికి, 1916 భాద్రపద మాసంలో, పండరియాత్ర చేయాలని సంకల్పించుకన్నాడు దాసగణు. కానీ నానాసాహెబ్ చందోర్కర్ వతిడి చేసి అతణ్ణి శిరిడీ తీసుకొచ్చి బాబా అనుమతితో సంకీర్తనలు నిర్వహించమని కోరాడు. అలా నేడు, రేపు అంటూండగానే ఆశ్వయుజ మాసం కూడా వచ్చింది. బాబా తన పండరి యాత్రను ఆటంకపరచారని దాసగణుకు మనసులో బాధగా వుంది. “భగవంతుడైన పండరినాధుణ్ణి దర్శించడానికి అడ్డుపడుతున్న యీ బాబా ఏం గురువు?” అని ఒకసారి అనుకున్నాడు కూడా, అలా అతననుకొన్న వెంటనే, నానాసాహెబ్ చందోర్కరుతో బాబా, “నానా ఇతడు పండరి పోతానంటే ఆపవద్దు!" అని, దాసగణును పిలిచి “నీవిక పండరిపురం వెళ్ళు " అన్నారు. దాసగణు, “బాబా! మీరు చాలాకాలంగా నా కోరికను దాటవేస్తున్నారు. నాకు సాక్షాత్కారం ఎప్పుడు అనుగ్రహిస్తారు?” అని అడిగాడు. దానికి బాబా, “ఇప్పుడు నన్ను చూస్తున్నావు కదా? అదే సాక్షాత్కారం - నేనే దైవాన్ని!” అన్నారు. “ఇటువంటిదేదో చెప్తారని అనుకొంటూనే వున్నాను. మీరు చెప్పింది నాకు తృప్తిగా లేదు” అంటూ, తన ప్రారబ్దంలో ‘సాక్షాత్కారం' పొందే భాగ్యం లేదని సరిపెట్టుకొన్నాడు దాసగణు.
బాబా దాసగణుకిచ్చిన సమాధానం చదువుతూ వుంటే, బైబిల్లో ఏసుక్రీస్తు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. బాబాను దాసగణు అడిగినట్లే ఏసుక్రీస్తును ఆయన సన్నిహిత భక్తుడైన ఫిలిప్ అడుగుతాడు “ప్రభూ, మాకు స్వర్గంలో వున్న ఆ తండ్రిని చూపించి, సంతృప్తిని ప్రసాదించండి” అని. దానికి ఏసుప్రభువు, “ఫిలిప్, నీవు ఇంతకాలం నాతో వున్నా నన్ను తెలుసుకోలేదు. నన్ను చూస్తే ఆ తండ్రిని (దైవాన్ని) చూచినట్లే! అయినప్పుడు, (ప్రత్యేకంగా) మళ్ళి ఆ తండ్రిని చూపమని నీవడగడమేమిటి? నా మాట నమ్ము. నేను ఆ తండ్రిలో వున్నాను. ఆయన నాలో వున్నాడు” అని సమాధానమిచ్చారు.
- పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.
సోర్స్: సాయిపథం ప్రధమ సంపుటము.
ఓం సాయిరాం.
ReplyDeleteఓం సాయిరాం...🌹🙏🏻🌹
ReplyDeleteఓం సాయిరామ్🙏💐🙏
ReplyDeleteOM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram
ReplyDeleteఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
💐💐💐💐ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి💐💐💐💐
ReplyDelete