సాయి వచనం:-
'ఇదే నా హెచ్చరిక! నువ్వు త్రాగుడు మానాలి. లేకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను!'

'ప్రతి వ్యక్తికీ లక్ష్యం ఉండాలి. మన లక్ష్యం (గమ్యం) ఎంత ఉన్నతమైనదో, పవిత్రమైనదో దానిని చేరే మార్గం అంతే ఉన్నతంగా, పవిత్రంగా ఉండాలి' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 363వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • బాబా చెప్పిన ప్రతీ పదం ఎంత నిజం!

నేను ఒక సాయిభక్తురాలిని. నేను యుఎస్ఏ నివాసిని. మావారు 15 సంవత్సరాలుగా ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. తను ఎప్పటినుండో క్రొత్త కంపెనీకి మారాలని అనుకుంటున్నారు. కానీ, పిల్లలు చిన్నవాళ్ళైనందున పాత కంపెనీలోనే సౌలభ్యంగా ఉంటుందని అందుకు తగిన ప్రయత్నాలేవీ చేయలేదు. ఇప్పుడు పిల్లలు కాస్త పెద్దయ్యారని 2019 జనవరిలో తను కొత్త ఉద్యోగం కోసం దరఖాస్తు చేయడం ప్రారంభించారు. మొదట్లో తను చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే, తనకి చాలా అనుభవం ఉన్నందున ఉద్యోగం సంపాదించడం చాలా సులభమైన పని అని అనుకున్నారు. బాబా దయవల్ల ఒక ప్రముఖ సంస్థనుండి తనకి ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. మొదటి రౌండ్ ఇంటర్వ్యూ నుండి చివరి రౌండ్ వరకు చాలా బాగా జరిగింది. మావారు దాదాపు ఆ ఉద్యోగం తనకి ఖచ్చితంగా వస్తుందని అనుకున్నారు. కానీ చివరి రౌండ్ జరిగిన రెండురోజుల తర్వాత కంపెనీవాళ్ళు తాము వెతుకుతున్న సరైన అభ్యర్థి మావారు కాదని ఒక ఇ-మెయిల్ పంపారు. అది చూసి నేను, మావారు నిర్ఘాంతపోయాము.

కొన్నివారాలపాటు మావారు దానిగురించే ఆలోచిస్తూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి దాదాపు నిరాశకు లోనయ్యారు. నేను సహాయం కోసం నా బాబాను తలచుకుని, "పరిస్థితిని ఎదుర్కోవటానికి, ముందుకు సాగడానికి అవసరమైన సహాయం చేయమ"ని హృదయపూర్వకంగా ప్రార్థించాను. ఆయన దయవలన నెమ్మదిగా మావారు ఆ స్థితి నుండి బయటకు వచ్చి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే మళ్ళీ తనకి తిరస్కరణలే ఎదురయ్యాయి. కానీ ఈసారి తను ఆశను కోల్పోలేదు. ఇదంతా నా బాబా దయవల్లనే. నేను తరచూ మావారి ఉద్యోగ విషయం గురించి క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్‌లో బాబాను అడుగుతూ ఉండేదాన్ని. బాబా నుండి ఎప్పుడూ సానుకూల స్పందన వస్తూ ఉండేది. ముఖ్యంగా, “మీ పని ఆదివారంనాడు స్నేహితుడి ద్వారా, మరొక వ్యక్తి ద్వారా పూర్తవుతుంది” అని వస్తుండేది.

తరువాత నేను నవగురువార వ్రతం ప్రారంభించాను. ఇక్కడినుండి బాబా అద్భుతం మొదలవుతుంది. నా భర్త స్నేహితుడొకడు ఒక స్టార్ట్-అప్(ప్రారంభ సంస్థ) కంపెనీకి దరఖాస్తు చేయమని సలహా ఇచ్చాడు. అతను తనకి ఆ సంస్థ యొక్క V.P (వైస్ ప్రెసిడెంట్) బాగా తెలుసునని, ఆ ఉద్యోగం నా భర్తకు అనుకూలంగా ఉంటుందని చెప్పాడు. తరువాత అతను నా భర్త రెజ్యూమ్‌ని తన V.P స్నేహితుడికి మెయిల్ చేశాడు. అదే సమయంలో నా భర్తకు తన కలల కంపెనీ నుండి కాల్ వచ్చింది. అతని ఆనందానికి హద్దులు లేవు. అప్పుడే స్టార్ట్-అప్ కంపెనీ నుండి కూడా ఒక కాల్ వచ్చింది. రెండు ఇంటర్వ్యూలు గురువారంనాడే షెడ్యూల్ చేశారు. నా భర్త తనకి తన కలల కంపెనీలో ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని అనుకున్నారు. కానీ క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్‌లో బాబా ఇచ్చిన సమాధానం కారణంగా తనకి స్టార్ట్-అప్ కంపెనీలో ఉద్యోగం వస్తుందని నేను అనుకున్నాను. నా భర్త ఆశ్చర్యపోయేలా తన కలల కంపెనీ నుండి తిరస్కరణ ఎదురైంది. స్టార్ట్-అప్ కంపెనీ నుండి కూడా కొన్నివారాలపాటు ఎటువంటి స్పందన లేదు. నా భర్త పూర్తిగా ఆశలు కోల్పోయి డీలాపడిపోయారు. నేను, పిల్లలు తన విషయంలో చాలా బాధపడ్డాం, ఆందోళన చెందాం.

అయితే నా బాబాపై నాకు పూర్తి నమ్మకం ఇంకా ఉంది. నేను నా వ్రతాన్ని కొనసాగిస్తున్నాను. ఒకరోజు నా భర్త స్నేహితుని నుండి తన కూతురి పుట్టినరోజు వేడుకకు రమ్మని మాకు ఆహ్వానం వచ్చింది. మేము ఆ పార్టీకి వెళ్ళాము. ఆరోజు ఆదివారం. ఆ స్టార్ట్-అప్ కంపెనీ వి.పి కూడా ఆ పార్టీకి వచ్చారు. అతను నా భర్తను పక్కకు పిలిచి, "మీరు ఇంటర్వ్యూను చాలా బాగా ఎదుర్కొన్నారు. మీకు సరైన స్థానం కల్పించడానికి నేను హెచ్.ఆర్.తో కలిసి పనిచేస్తున్నాన"ని చెప్పాడు. ఎంత అద్భుతం! నా బాబా చెప్పిన ప్రతీ పదం ఎంత నిజం! నా భర్తకు ఆ వార్త ఆదివారంనాడు తన స్నేహితుడి ద్వారాను, మరోవ్యక్తి ద్వారాను తెలిసింది. నా కళ్ళ నుండి కన్నీళ్ళు ధారాపాతమయ్యాయి, నా శరీరం రోమాంచితమైంది. హృదయపూర్వకంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

నా వ్రతంలో 9వ వారం వ్రతం ముగియడానికి ముందే నా భర్త కొత్త కంపెనీలో మేము ఊహించిన దానికంటే మంచి స్థాయిలో మంచి వేతనంతో ఉద్యోగంలో చేరారు. బాబా చాలా దయగలవారు. మన జీవితంలో బాబా ఉండటం ఎంత గొప్ప విషయమో నేను మాటల్లో చెప్పలేను. బాబా లేని నా జీవితాన్ని నేనస్సలు ఊహించలేను. "ధన్యవాదాలు బాబా!"

source: http://www.shirdisaibabaexperiences.org/2020/01/shirdi-sai-baba-miracles-part-2592.html


3 comments:

  1. om sairam
    sairm always be with me

    ReplyDelete
  2. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo