సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 318వ భాగం


ఖపర్డే డైరీ - నాలుగవ భాగం

11-12-1910.

పొద్దున - నా స్నానపూజాదులు అయాక, బాంబేకి చెందిన హరిభావు దీక్షిత్, కీ.శే. ఆత్మారామ్ పాండురంగ కుమారుడు తర్ఖడ్, అకోలాకు చెందిన అన్నాసాహెబ్ మహాజని వంశస్థుడయిన మహాజని వచ్చారు. మామూలుగానే మేం సాయిసాహెబ్ దర్శనానికి వెళ్ళాం. ఈరోజు సంభాషణ రెండు సంఘటనలవల్ల విశిష్ఠతను, ప్రాముఖ్యతను సంతరించుకొన్నది. సాయి మహారాజు తానొక మూల కూచుని తన అధోభాగాన్ని చిలుక యొక్క అధోభాగంతో మార్పిడి చేసుకుందామని కోరుకున్నారట. ఆ కోరుకున్న మార్పు వచ్చినా ఒక సంవత్సరం పాటు ఆ సంగతి తెలుసుకోలేకపోయారట. ఒక లక్ష రూపాయలు నష్టం వచ్చిందట. అప్పుడు ఆయన ఒక స్తంభం వద్ద కూచోటం మొదలెట్టేసరికి ఒక పెద్ద సర్పం కోపంతో లేచిందట. అది అంతెత్తున ఎగిరి అక్కడి నుంచి క్రిందపడుతోందట. అంతలో గబుక్కున సంభాషణ మార్చి, తాను ఒక చోటుకి వెళ్ళాననీ అక్కడ మొక్కలు నాటి నడిచే మార్గం నిర్మించాక గానీ ఆ గ్రామపెద్ద తనని అక్కడ నుంచి వెళ్ళనివ్వలేదని చెప్పారు. వారు ఆ రెండు పనులు పూర్తి చేశారట.

ఆ సమయంలో కొంతమంది లోపలికి వచ్చారు. అందులో ఒక వ్యక్తితో ఆయన, "నేను తప్ప నిన్ను చూసేవాళ్ళెవరూ లేరు" అన్నారు. చుట్టూ చూస్తూ ఆయన, "అతనికి దూరపుబంధువైన ఆమె రోహిల్లాని పెళ్ళాడితే, అతను ఈ మనిషిని దోచుకున్నాడ"ని అన్నారు. "ప్రపంచం చాలా చెడ్డది" అనీ, "మనుషులు మునుపటిలా లేరు. పూర్వం వాళ్ళు చాలా ప్రశాంతంగా, నిజాయితీగా ఉండేవారు, కానీ ఇప్పుడు వాళ్ళు అపనమ్మకాలతో ఉంటూ, చెడ్డపనుల గురించే తీవ్రంగా ఆలోచిస్తున్నారు" అనీ అన్నారు. సాయి ఇంకా ఏదో అన్నారు కానీ అదేమిటో నేను పట్టుకోలేకపోయాను. అది అతని తండ్రి గురించీ, తాత గురించీ, ఇంకా తండ్రిలాగానూ, తాతలాగానూ అయిన అతని గురించీనూ.

అప్పుడు దీక్షిత్ పళ్ళు తీసుకొచ్చాడు. సాయిసాహెబ్ అందులో కొన్ని తిని మిగతావి అందరికీ పంచారు. అప్పుడు అక్కడే వున్న ఆ తాలూకా మామల్తదారు బాలాసాహెబ్, 'సాయి మహారాజు కేవలం ఒకే రకమైన పండ్లను ఇస్తున్నార'న్నాడు. "మనకుండే భక్తిభావాన్ని బట్టి సాయి మహారాజు మనం సమర్పించిన పళ్ళను అంగీకరించటమో, తిరస్కరించటమో చేస్తారు" అని మా అబ్బాయి తన స్నేహితుడు పట్వర్ధన్‌తో అన్నాడు. మా అబ్బాయి దాన్నే నాతో చెప్పటానికి ప్రయత్నించి అలాగే పట్వర్ధన్‌తో కూడా చెప్పాలనుకున్నాడు. దీనివల్ల కొంచెం కలకలం చెలరేగింది. సాయి మహారాజు కోపంతో ప్రజ్వలించే ప్రకాశవంతమైన కళ్ళతో అద్భుతంగా నా వైపు చూసి నేనేమంటున్నానో అడిగారు. నేనేం మాట్లాడటం లేదనీ, పిల్లలు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారని అన్నాను. ఆయన నా కుమారుడి వైపూ, పట్వర్ధన్ వైపూ చూసి వెంటనే తమ ధోరణి మార్చేసుకున్నారు.

అందరం బయటికి వస్తున్నప్పుడు బాలాసాహెబ్ మిరీకర్, 'సాయి మహారాజు అంతసేపూ హరిభావూ దీక్షితో మాట్లాడుతూనే ఉన్నార'న్నాడు. మధ్యాహ్నం మేం భోజనాలు చేస్తున్నప్పుడు అహ్మద్ నగర్‌లో స్పెషల్ మేజిస్ట్రేటూ, ఈనాముదారూ అయిన మిరీకర్ వాళ్ళ నాన్న వచ్చారు. ఆయన గౌరవనీయులైన పాతకాలం పెద్దమనిషి. ఆయన సంభాషణ నాకు చాలా నచ్చింది. సాయంత్రం సాయిసాహెబ్‌ను మేం మామూలుగా దర్శనం చేసుకుని, రాత్రి మాట్లాడుకుంటూ కూచున్నాం. నూల్కర్ కొడుకు విశ్వనాథ్ రోజూలాగే భజన చేశాడు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo