సాయి వచనం:-
'ప్రపంచం చాలా చెడ్డది. మనుషులు ఇంతకుముందు ఉన్నట్లుగా లేరు. పూర్వం పవిత్రంగా, విశ్వసనీయంగా ఉండేవారు. ఇప్పుడు వారు అవిశ్వాసులుగా, చెడు ఆలోచనలకు బద్ధులై ఉన్నారు.'

'ప్రతి వ్యక్తికీ లక్ష్యం ఉండాలి. మన లక్ష్యం (గమ్యం) ఎంత ఉన్నతమైనదో, పవిత్రమైనదో దానిని చేరే మార్గం అంతే ఉన్నతంగా, పవిత్రంగా ఉండాలి' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 577వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:

  1. కరుణాసముద్రుడు, ఆపద్బాంధవుడు సాయి
  2. కష్టమేదైనా సాయి పాదాలే శరణం

కరుణాసముద్రుడు, ఆపద్బాంధవుడు సాయి

ఓం సాయినాథాయ నమః

ఆపద్బాంధవుడు, కరుణాసముద్రుడు, 'సాయీ' అని మనఃపూర్వకముగా పిలువగానే 'ఓయ్' అంటూ నేనున్నానని పలికే దైవం సాయిబాబా పాదారవిందములకు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, సాయి ప్రేమానురాగాలను సాటి సాయిబంధువులతో ఆనందంగా పంచుకుంటున్నాను. ముందుగా 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి, తోటి సాయిబంధువులకు నా నమస్కారములు తెలియజేస్తున్నాను.

నా పేరు బి.ఎమ్.ప్రసాద్. నేను రెవెన్యూ డిపార్ట్‌మెంటులో తహశీల్దారుగా పనిచేసి, 2009 డిసెంబరులో పదవీవిరమణ చేశాను. నా చిన్నతనంలో, అనగా నేను 9వ తరగతి చదువుకునే రోజుల్లో స్కూల్లో నాకు కమ్యూనిస్టు పార్టీకి చెందిన కొందరితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారేకొద్దీ ఆ పార్టీ భావాలు నన్ను ఆకర్షించాయి. దాంతో, దేవుడు లేడనే భావనకు లోనయ్యాను. కానీ, నా భావాలతో నా కుటుంబసభ్యుల మరియు ఇతరుల మనోభావాలకు వ్యతిరేకిగా కాక ఎవరి నమ్మకాలు వారివి అనే ధోరణిలో ఉండేవాడిని. కొంతకాలం అలానే గడిచాక అనుకోకుండా ఒకరోజు సాయినాథుని జీవితచరిత్రపై వచ్చిన సినిమా చూడటం తటస్థించింది. ఆ సినిమాలో చూపించిన సాయిబాబా బాల్యం మొదలు నిర్యాణపర్యంతం వారి జీవన విధానం, వారి భిక్షావృత్తి, వారు ఆచరించే సామాన్య పద్ధతులు, వారి ఉపదేశాలు, సూచనలు, సూక్తులు, రోగులకు ఆయన చేసిన విచిత్ర వైద్యం, భక్తులకు వారిపై గల పూర్ణ భక్తివిశ్వాసాలు నాకు చాలా చాలా నచ్చాయి. అవి నా మనస్సును ఎంతగానో హత్తుకున్నాయి. ఆ క్షణం నుండి భగవంతుడంటే 'సాయి', గురువు అంటే 'సాయి', నాకంటూ అత్యంత ఆప్తుడు ఎవరైనా ఉన్నారంటే అది 'సాయి' అనేంత పూర్తి నమ్మకం ఏర్పడింది. సాయిబాబా అనుగ్రహంతో అప్పటినుండి నేను అనునిత్యం సాయిని తలచుకుంటూ, పూజిస్తూ, సాయి నా కుటుంబంలో ఒకరని అనుకుంటూ, ఆయనపై పూర్ణ భక్తివిశ్వాసాలతో జీవిస్తున్నాను.

సాయి నన్ను సర్వవిధాలా కాపాడిన అనుభవం:

ఒకప్పుడు నేను రెవెన్యూ డిపార్ట్‌మెంటులో సీనియర్ అసిస్టెంట్ హోదాలో మండల సివిల్ సప్లై స్టాక్‌ పాయింట్ ఇన్‌ఛార్జిగా నియమింపబడ్డాను. నా విధులను అనుసరించి పేద ప్రజలకు ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులను మండలంలోని చౌక దుకాణ డీలర్లకు సప్లై చేయిస్తుండేవాడిని. అయితే, స్టాక్ పాయింట్ నుండి డీలర్లకు నిత్యావసర వస్తువులను చేరవేసే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టరు సకాలంలో సరుకును రవాణా చేస్తుండేవాడు కాదు. పైఅధికారుల ఒత్తిడి మేరకు నేను ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టరుని, "సరైన సమయంలో సరుకు రవాణా చేయించాలి, అలా చేయలేకుంటే కాంట్రాక్టు రద్దు చేయవలసి వస్తుంద"ని మందలించాను. దాంతో ఆ కాంట్రాక్టరు నాపై ద్వేషం పెంచుకుని, పగతో కక్షసాధింపుచర్య తలపెట్టాలని అనుకున్నాడు. కానీ బయటికి మాత్రం ఏమీ తెలియనట్లు మంచిగా నాతో ఉంటూ వచ్చాడు. సుమారు నెలరోజుల తర్వాత అతను నా దగ్గరకు వచ్చి, "రవాణా చేసే వాహనం రిపేరుకు వచ్చింది. అది బాగుచేయించేందుకు 1000 రూపాయలు అవసరం పడింది. ఆ డబ్బు చేబదులుగా ఇస్తే, డబ్బు సమకూరిన వెంటనే ఇచ్చేస్తాన"ని చెప్పాడు. సరేనని నేను అతనికి వెయ్యి రూపాయలు ఇచ్చాను. వారం రోజుల తర్వాత నా డబ్బులు నాకు తిరిగి ఇస్తూ, ఏసీబీ వాళ్లను పిలుచుకొచ్చి, నేను లంచం అడుగుతున్నానని నాపై కేసు బనాయించాడు. దాంతో నన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఆ సమయంలో వృద్ధాప్యంలో ఉన్న నా తండ్రి జబ్బులతో బాధపడుతున్నాడు. నాకు భార్య, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు. వారందరి పోషణ భారం నాపై ఉంది. నాకు పెద్దలనుంచి ఆస్తిపాస్తులు వంటివేమీ రాలేదు. కేవలం జీతంతో బ్రతుకు బండిని నడిపిస్తూ జీవిస్తుండేవాడిని. హఠాత్తుగా  ఉద్యోగం నుండి సస్పెండ్ కావడంతో నా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆ కష్టకాలంలో మిత్రులుగాని, తోటి ఉద్యోగులుగాని, బంధువులుగాని ఎవరూ నన్ను ఆదుకోలేదు. రెండున్నర సంవత్సరాల పాటు కేసు విషయంగా కోర్టు వాయిదాలకు హైదరాబాదు తిరుగుతూ లాయర్ల ఖర్చుకు, కుటుంబపోషణకు చాలా అవస్థలుపడ్డాను. అలాంటి సమయంలో కరుణాసముద్రుడు, ఆపద్బాంధవుడు అయిన బాబా నా కర్మ పూర్తయ్యేంతవరకు నా వెన్నంటే ఉండి అభయమిస్తూ నడిపించారు. సర్వాంతర్యామి అయిన బాబా నన్ను ఎంతగానో ఆదుకున్నారు. ఆయన దయతో... 

1) నాపై ఏసీబీ వారు పెట్టిన కేసు నిర్ధారణ కాకుండా చేసి, హైదరాబాదు కోర్టులో కేసు కొట్టివేయించారు.

2) నాకు రావలసిన ప్రమోషన్ విషయంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చేశారు.

3) వృద్ధుడైన నా తండ్రి కాలం చేయడంతో ఆ కష్టకాలంలో నాకు కాస్త భారం తగ్గించారు.

4) నా ఇరువురి కుమార్తెలకు మంచి సంబంధాలు చూపించి, వివాహాలు చేయించారు.

5) నా కుమారుడి బీ.టెక్ పూర్తి చేయించి, ఉద్యోగాన్ని ప్రసాదించారు. మంచి కోడలిని, మనవరాలిని కూడా ప్రసాదించారు.

6) నివసించేందుకు చక్కటి గృహాన్ని కూడా బాబా ఇచ్చారు.

7) నేను పదవీవిరమణ చేశాక అదే డిపార్ట్‌మెంటులో డిప్యూటీ తహసీల్దార్ హోదాలో అవుట్‌సోర్స్ ఉద్యోగిగా నియమింపబడేలా అనుగ్రహించారు బాబా.

ఇప్పటికీ బాబా ఆశీర్వాదంతో ఆయనిచ్చిన ఉద్యోగం చేస్తూ ఆనందకరమైన జీవితాన్ని సాగిస్తున్నాను.

ఓం సాయిరాం!


కష్టమేదైనా సాయి పాదాలే శరణం

సాయిభక్తురాలు శ్రీమతి విద్యావతి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం శ్రీ సాయినాథాయ నమః. పిలిచిన వెంటనే పలికే దైవం, ఆపద్బాంధవుడు, కరుణాసముద్రుడైన సాయిబాబా పాదాలకు నమస్కరిస్తున్నాను. నా పేరు విద్యావతి. నా జీవితంలో బాబా ఎన్నోవిధాలుగా నన్ను కాపాడారు. బాబా నా బాధలన్నీ తొలగించారు. నాకు ఏ కష్టం వచ్చినా నేను బాబా పాదాలనే శరణువేడుతాను. 

ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో నాకు ఒక ఆరోగ్య సమస్య వచ్చింది. నేను బాబా పాదాలను శరణు వేడాను. ఒకరోజు ఈ బ్లాగులో సాయిభక్తుల అనుభవాలు చదువుతున్నాను. అందులో ఒక సాయిభక్తురాలు, తనకు ఆరోగ్య సమస్య వస్తే ‘ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః’ అనే బాబా మంత్రం జపించాననీ, బాబా దయవల్ల ఇప్పుడు తన ఆరోగ్యం బాగుందనీ రాశారు. అది చదివి నేను కూడా ‘ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః’ అనే బాబా మంత్రాన్ని నిరంతరం జపించసాగాను. తరువాత ఒకరోజు ఆసుపత్రికి వెళ్ళి చెకప్ చేయించుకున్నాను. నన్ను పరీక్షించిన డాక్టర్ నాకేమీ ఇబ్బందిలేదని చెప్పారు. ఇదంతా బాబా చేసిన అద్భుతం. ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను. “మీరు ప్రసాదించిన అనుభవాన్ని ఇంత ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను మన్నించండి బాబా! ఎల్లప్పుడూ మీ దయను నా మీద కురిపించండి తండ్రీ! నా జీవితమంతా మీ ఆశీస్సులతో నిండి ఉంది బాబా. నా తల్లి, తండ్రి మీరే బాబా. దయచేసి నాకు, నా భర్తకు, నా కుమారుడికి ఎల్లప్పుడూ అండగా ఉండండి. మా జీవితం చక్కగా, సంతోషంగా ఉండేలా మార్గనిర్దేశం చేయండి బాబా!”



8 comments:

  1. om sai ram today is thrusday babas day.i like this day

    ReplyDelete
  2. Om namo narayanaya
    Ekam SATH vipra bhudha vadanthi

    ReplyDelete
  3. Baba kapadu thandri saranu vedutunanu

    ReplyDelete
  4. ఓం సాయిరాం!

    ReplyDelete
  5. ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo