సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక - 353వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా ప్రసాదించిన సంతానం - ప్రభుత్వ ఉద్యోగం
  2. శ్రీసాయి రక్షణ

బాబా ప్రసాదించిన సంతానం - ప్రభుత్వ ఉద్యోగం

నా పేరు అంజలి. బాబా ఇప్పటివరకు నా జీవితంలో చూపించిన లీలలను మీ అందరితో పంచుకుంటానని అనుకున్నాను. అందులో భాగంగానే సాయితో నా మొదటి పరిచయం గురించి, ఏర్పరిచిన జీవనాధారం గురించి గత వారం మీతో పంచుకున్నాను. ఆ అనుభవం చదవాలనుకునేవారు ఇక్కడ ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి చదవగలరు.

(బాబా పరిచయం - ఏర్పరిచిన జీవనాధారం https://saimaharajsannidhi.blogspot.com/2020/03/344.html )

ఇప్పుడు తరువాత అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ముందుగా అందరికీ బాబా అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను.

2007 నవంబరు నుండి నేను, నా భర్త గుంటూరులో మా జీవితాన్ని ప్రారంభించాము. నేను ఉపాధ్యాయవృత్తిలోను, నా భర్త వ్యాపారరంగంలోను అడుగుపెట్టాము. నాకు చిన్నప్పటినుండి PCOD సమస్య ఉంది. ఆ సమస్య ఉన్నవాళ్ళకి పిల్లలు పుట్టడం చాలా కష్టం. అందువలన 2007వ సంవత్సరం చివరిలో డాక్టరుని సంప్రదించి పిల్లలు కోసం ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలుపెట్టాను. అదే సమయంలో నేను సాయివ్రతం పదకొండు వారాలు  చేద్దామనుకొని, "జీవితంలో చక్కగా స్థిరపడేలా మమ్మల్ని ఆశీర్వదించమ"ని బాబాను వేడుకుని వ్రతం ప్రారంభించాను. భక్తిశ్రద్ధలతో నాలుగైదు వారాలు సాయివ్రతం చేశాము. ఆ వ్రత సమయంలో కొట్టే కొబ్బరికాయలలో పూలు ఉండేవి. అది చూసి మాకు ఏదో శుభం చేకూరుతుందని అనుకున్నాము. 2008 ఫిబ్రవరిలో వచ్చిన శివరాత్రిరోజున కాకాని శివాలయానికి వెళ్ళాము. అక్కడ ఒక ముసలావిడ నన్ను పిలిచి మరీ రావిచెట్టుకి ఊయల కట్టించింది. బాబానే అలా చేయించి వుంటారని నా నమ్మకం. ఆయన అనుగ్రహం చూడండి! నేను మందులు వాడటం మొదలుపెట్టిన మూడు నెలల తరువాత ఒకరోజు నేను చెక్ అప్ కోసం నాకు ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ వద్దకు వెళ్ళాను. డాక్టర్ పరీక్షించి, నేను గర్భవతినయ్యానన్న శుభవార్త చెప్పారు. PCOD సమస్య ఉండి కూడా అంత త్వరగా గర్భం దాల్చినందుకు ఆ డాక్టర్ ఆశ్చర్యపోయారు. గర్భవతినన్న విషయం తెలియని నేను ముందురోజు పెద్ద బొప్పాయిపండు మొత్తం తినేశాను. మాములుగా అయితే గర్భంతో ఉన్నప్పుడు బొప్పాయిపండు తినడం ప్రమాదకరం. కానీ బాబా కృపవలన నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఆనందంతో మేము మనసారా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాము. ఆయన అనుగ్రహం వలన తొమ్మిది నెలలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగి 2008 డిసెంబరులో బాబా వరప్రసాదంగా మాకు పండంటి బాబు పుట్టాడు. నిజంగా అంతా బాబా ఆశీస్సుల ఫలితమే. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

ప్రభుత్వ ఉద్యోగం:

తరువాత కెరీర్‌లో ఇంకా స్థిరపడలేదన్న కొరత వుండేది నాకు. నేను చిన్నప్పట్నుంచీ చాలా కష్టపడి చదివాను, మంచి మెరిట్ స్టూడెంట్‌ని. బాబా నాకు ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వట్లేదని అనుకునేదాన్ని. 2005లో ఏపీజెన్‌కోలో మెరిట్ లిస్టులో ఉండి కూడా ఉద్యోగం రాలేదు. ఇంక నాకు గవర్నమెంట్ ఉద్యోగం రాదేమో అనిపించింది. అందుకే ఆ తరువాత అసలు గవర్నమెంట్ ఉద్యోగం కోసం నేను ప్రయత్నించలేదు. 2008 నుండి ప్రతిరోజూ సాయిలీలామృతం పారాయణ చేసేదాన్ని. ఒక నెలరోజుల్లో పుస్తకం పూర్తయ్యేది. మా అమ్మ ఆరోగ్యం సరిగ్గా వుండేది కాదు. అందువలన ఆమెకు ఆరోగ్యం ప్రసాదించమని బాబాను వేడుకునేదాన్ని. ఇప్పుడు బాబా అనుగ్రహంతో అమ్మ ఆరోగ్యం బాగుంది

2012లో ఏపీజెన్‌కో, ఏపీట్రాన్స్‌కోలో ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ వెలువడింది. నా స్టూడెంట్ సత్యనారాయణ, “ఒక్కసారి పరీక్ష వ్రాయండి మేడం, ఇప్పుడు కూడా మీరు ఉద్యోగానికి సెలెక్ట్ కాకపోతే ఇంక ఉపాధ్యాయవృత్తిలోనే ఉండండి” అని చెప్పి నాతో ఆ ఉద్యోగాలకు దరఖాస్తు చేయించాడు. అప్పటికి నేను ఇంజనీరింగ్ పూర్తిచేసి దాదాపు పది సంవత్సరాలు అయింది. పైగా కోచింగ్ తీసుకోవడానికి తగినంత సమయం కూడా లేదు, ఎందుకంటే ఉద్యోగానికి సెలవు పెట్టే అవకాశం లేదు. అందువలన నేను కేవలం 15 రోజులు రాత్రింబగళ్ళు కష్టపడి ప్రిపేర్ అయ్యాను. బాబా అనుగ్రహంతో ఏపీట్రాన్స్‌కో, విజయవాడ జోన్‌లో నేను ప్రథమస్థానంలో వచ్చాను. పోస్టింగ్ హైదరాబాద్ రూరల్ జోన్‌లో సూర్యాపేటకు దగ్గరలో వచ్చింది. కానీ నేను ఉద్యోగంలో చేరాలా, వద్దా అన్న సందిగ్ధంలో పడ్డాను, ఎందుకంటే జీతం చూస్తే నేను అప్పుడు చేస్తున్న ఉద్యోగానికి వచ్చే జీతంలో సగమే ఉంది. అందువల్ల ఆ ఉద్యోగంలో చేరితే మళ్ళీ ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని భయపడ్డాను. అటు చూస్తే తక్కువ జీతం, ఇటు చూస్తే గవర్నమెంట్ ఉద్యోగం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అయినప్పటికీ బాబా మీద భారం వేసి చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి గవర్నమెంట్ ఉద్యోగంలో చేరడానికి సిద్ధపడ్డాను. ఆరోజు కాలేజీవాళ్ళు నాకు ఫేర్‌వెల్ ఇచ్చారు. మా కాలేజీలో మెకానికల్ డిపార్టుమెంట్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న సుబ్బారావుగారు బాబాకు అంకితభక్తుడు. బాబా ఆయనకు కనపడి సమాధానమిస్తూ ఉంటారు. నా ఉద్యోగం గురించి బాబాను అడగమని ఆయనతో చెప్పమని నా స్టూడెంట్ నన్ను ఆయన దగ్గరకు తీసుకువెళ్లింది. నేను ఆ కాలేజీలో అయిదు సంవత్సరాలు పనిచేశాను. ఏరోజూ ఆయన గురించి నాకు తెలియలేదు. కానీ కాలేజీలో ఉండే ఆఖరిరోజున తెలిసింది. అప్పుడు నా ఉద్యోగం గురించి ఆయనతో చెప్పాను. నాకు బాగా గుర్తు, నేను సార్‌కి నా సమస్య గురించి వివరిస్తూనే ఉన్నాను, బాబా వరుసగా ఆయనకి సమాధానాలు చెబుతున్నారు. "అది నేను చూపిన మార్గమే, ఆమెకు అటువైపు బావుంటుంది. ఉపాధ్యాయవృత్తిలో ఎదుగుదల వుండదు. ఆమెను అటే వెళ్ళమను" అని చెప్పారు బాబా. ఆ మాటలు వింటూనే, నా బాబాకి నేనంటే ఎంత ప్రేమో తలచుకుంటూ నాకు తెలియకుండానే నా కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయాయి. ఇంక వేరే ఆలోచన చేయకుండా నల్గొండ జిల్లా నకిరేకల్‌కి ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయాము. బాబా ప్రసాదించిన ఉద్యోగంలో చేరాను. బాబా దయవలన ఒకటిన్నర సంవత్సరానికే జీతం పెరిగింది. అంతకుముందు నేను టీచరుగా తీసుకున్న జీతం కన్నా ఎక్కువే వచ్చింది. ఇదంతా బాబా అనుగ్రహమే. "బాబా! మీకు నా కృతజ్ఞతాపూర్వక మమకారాలు. మీ అనుగ్రహం ఎప్పుడూ మాపై ఇలాగే ఉండాలి తండ్రి".

శ్రీసాయి రక్షణ

నేను సాయిభక్తురాలిని. నేను కెనడా నివాసిని. సాయి తన భక్తులను తమ వద్దకు లాక్కుంటారు. అప్పటినుండి ఎప్పటికప్పుడు మనకు వారి ఆశీస్సులు లభిస్తుంటాయి. ఎందుకంటే, ఆయన ఎప్పుడూ మన క్షేమాన్ని కాంక్షిస్తుంటారు. సాయి నా జీవితంలోకి వచ్చినప్పటినుండి నేను ఏ అవసరం కోసమూ ఇంకొకరివైపు చూడలేదు. ఆయన మన తల్లి, తండ్రి, గురువు, దైవం. ప్రతిరోజూ నేను సాయిని, "నాకు, నా కుటుంబానికి ఏ హానీ జరుగకుండా సురక్షితంగా, మంచి ఆరోగ్యంతో ఉండేలా ఆశీర్వదించమ"ని ప్రార్థిస్తూ ఉంటాను. ఒకసారి వరుసగా రెండు రోజులు నా ఎడమచేయి, భుజం, మెడ భాగాలలో నొప్పి వచ్చింది. నేను సాయిని ప్రార్థించి నొప్పి నివారణ మందులు వేసుకున్నాను, కానీ నొప్పి తగ్గలేదు. నాకు చాలా ఆందోళనగా అనిపించింది. మూడవరోజు ఆఫీసు నుండి ఇంటికి వస్తూ డ్రైవింగులో ఉండగా నా ఛాతీ భాగంలో అసౌకర్యంగా అనిపించింది. ఇల్లు చేరుకున్నాక సాయి ముందు నిలబడి, "నాకెందుకిలా అవుతోంది?" అని బాబాను అడిగాను. తరువాత నేను గూగుల్‌లో సెర్చ్ చేసి నాకు కనిపిస్తున్న లక్షణాలన్నీ గుండెపోటుకు సంబంధించినవని తెలిసి భయపడ్డాను. వెంటనే నా భర్తతో, "నన్ను హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లి అత్యవసర విభాగంలో చేర్చమ"ని చెప్పాను. ఆ సమయమంతా నేను సాయిని ప్రార్థిస్తూ ఉన్నాను. మధ్యమధ్యలో 'ఎందుకిలా జరుగుతోంద'ని అని ఆయనను ప్రశ్నించాను. కానీ సాయి ఎప్పుడూ మనకు ఉత్తమమైనదాన్నే చేస్తారు. టెస్టులు చేశాక, "ఇప్పట్లో గుండెపోటు వచ్చేంత ప్రమాదం లేదుగానీ, రెండు పెద్ద ధమనుల్లో బ్లాక్స్ ఉన్నాయి. ఒకటి 97%, మరొకటి 75% వరకు మూసుకుపోయాయి. మీరు ముందుగానే రావడం చాలా మంచిదైంది" అని డాక్టర్ చెప్పారు. మరుసటిరోజు 2 స్టెంట్లను వేశారు. 24 గంటల తరువాత డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. వారంరోజుల్లో నేను నా సాధారణ జీవితాన్ని తిరిగి ప్రారంభించాను. సమస్యను ముందే తెలిసేలా చేసి హఠాత్తుగా నేను గుండెపోటుకు గురయ్యే కష్టాన్ని ఎదుర్కోకుండా బాబా కాపాడారు. నా సాయికి నేను చాలా కృతజ్ఞురాలినై ఉంటాను. ఆయన మనలను కష్టాల్లోకి నెట్టివేస్తున్నారని అనిపించినప్పటికీ మనం మన విశ్వాసాన్ని సడలనివ్వకూడదు. ఆయన ఎప్పుడూ మనకు ఉత్తమమైనదే చేస్తారు. ఎప్పటికీ మన క్షేమాన్నే చూస్తారు. "బాబా! మీకు వేలవేల ప్రణామాలు".


source:http://www.shirdisaibabaexperiences.org/2019/12/shirdi-sai-baba-miracles-part-2585.html


4 comments:

  1. Anjali garu is truly and completely blessed by Saibaba...
    Mam, Aa Subbarao gari mob no cheppagalara pl

    ReplyDelete
    Replies
    1. Sorry to say sir..he is no more..reached sai baba on Karthika pournami 2016

      Delete
  2. ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo