సాయి వచనం:-
'మంచిగానీ, చెడుగానీ నీవు కర్తవని అనుకొనరాదు. గర్వాహంకార రహితుడవై ఉండుము. అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందును.'

'సర్వజీవుల్లోనూ ఉన్న ఒకే భగవత్తత్త్వాన్ని గుర్తించమనీ, వారి దుఃఖాన్ని చేతనైనంతవరకు తొలగించమనీ బాబా ఉద్బోధించారు' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 915వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు
:

1. ప్రతిక్షణమూ కనిపెట్టుకొని ఉండే బాబా
2. సాయి అనుగ్రహ వీక్షణాలు
3. నేనున్నానంటూ ధైర్యాన్నిస్తున్న బాబా

ప్రతిక్షణమూ కనిపెట్టుకొని ఉండే బాబా


నేను సాయిభక్తురాలిని. మా పెద్దనాన్నకి, పెద్దమ్మకి కరోనా వచ్చిన తరువాత నాకు టెన్షన్‌గా ఉంటోంది. అంతేకాదు, మా కుటుంబ సమస్యలతో నేను తిండి, నిద్ర లేక నీరసించిపోయాను. నిజంగా నేను నరకం అనుభవించాను. నా పరిస్థితి అలా ఉంటే, ఏ పరిష్కారమూ చూపేది లేకపోయినా మా కుటుంబ సమస్యలు వినాలనే ఉత్సాహంతో మమ్మల్ని ఓదారుస్తామంటూ ఒకామె మా ఇంటికి వచ్చారు. ఆమెకున్న జలుబు, దగ్గు సమస్యలు చూసి నాకు భయమేసింది. కానీ తనను వెళ్లిపొమ్మని చెప్పలేక అలాగే భరించాను. నాతో మాట్లాడుతున్నంతసేపూ ఆమె దగ్గుతూనే ఉంది. మర్యాద కోసం ఫుడ్ ఆర్డర్ చేసి, అందరం కలిసి తిన్నాం. తరువాత నా గుండెల్లో ఒకటే దడ మొదలైంది. నా భర్త సరిగా లేరు. ఈ సమయంలో నాకు ఏదైనా వస్తే పట్టించుకునే నాథుడు లేడు. నా పరిస్థితి, నా బిడ్డ పరిస్థితి ఏమిటని చాలా భయపడి, "మాకు ఏమీ కాకుండా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయతో వారం గడిచింది, మేము బాగానే ఉన్నాం. "అయ్యా సాయినాథా! ప్రతిరోజూ నేను నీ ముందర ఏడుస్తూనే ఉన్నాను. నేను తింటున్నానో లేదో కూడా మీకు తెలుసు. ఈ మానసిక వేదన భరించలేనిదిగా ఉంది సాయీ. దయచేసి త్వరగా నాకు పరిష్కారం చూపించు".


నాకున్న సమస్యలతో నేను బాబాకి దూరం అవుతున్నాను. బాబా పారాయణ చేయలేకపోతున్నానని మనసులో బాధ ఉన్నా, పారాయణ చేయలేకపోతున్నాను, జపం చేయలేకపోతున్నాను. రోజూ 108 సార్లు బాబా కష్టనివారణ స్త్రోత్రం చదవాలనుకున్నాను. అంతలోనే పారాయణ గ్రూపులో మొదటిసారి కష్టనివారణ స్తోత్రం పంపారు. కొన్ని రోజులు చదివాను. తరువాత బాధతో వదిలేశాను. తరువాత సాయిలీలామృతం పారాయణ చేయాలనుకుని ఒక అధ్యాయం చదివాను. అప్పుడే మన బ్లాగులో సాయిలీలామృతం పారాయణ గురించి ప్రస్తావిస్తూ పంచుకున్న ఒక సాయిబంధువు అనుభవం వచ్చింది. కానీ నేను పారాయణ కొనసాగించలేకపోయాను. తరువాత బాబాకి వెండిపూలతో అష్టోత్తర పూజ చేశాను. ఎప్పుడూ లేనిది సరిగా అప్పుడే నిత్యపారాయణ గ్రూపులో నేను ఆరోజు చూసిన మొదటి మెసేజ్ అష్టోత్తరం. తరువాత బాబా సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టి, రెండురోజులు పారాయణ చేశాను. ఆ రెండు రోజులూ పారాయణ మహత్యానికి సంబంధించిన మెసేజ్‌లే చూశాను. ఇవన్నీ ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్నాయిలే అనుకున్నాను. 2021, సెప్టెంబరు 3న మా ఆఫీస్ లాప్టాప్‌లో 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగుని బ్లాక్ చేశారు. దాంతో మనసుకి మరింత బాధగా అనిపించింది. అప్పుడు, "బాబా! మీ బ్లాగు ఓపెన్ అయితే మీరు నన్ను గమనిస్తున్నారని భావిస్తాను" అని అనుకున్నాను. ఆశ్చర్యంగా బ్లాగు ఓపెన్ అయింది. కానీ నా అజ్ఞానంతో, ‘ఏదో లాప్టాప్ రీస్టార్ట్ చేయడం వల్ల ఓపెన్ అయిందేమోలే’ అనుకున్నాను. అంతే, వెంటనే మళ్ళీ బ్లాగు బ్లాక్ అయింది. నాకు కన్నీళ్లు ఆగలేదు. భక్తులు తమ కష్టాలని తీర్చుకోవడానికి దేవుడిని ఆశ్రయించడం మామూలే. కానీ, మన సాయినాథుడు మన కష్టాలు తీరడానికి మనం ఏమి చేయాలో ప్రతిక్షణమూ చెప్తూ ఉంటారు. నేను చేసే చిన్న పూజ కూడా "నేను చూస్తున్నాను" అంటారు. నేను ఆయన పటం ముందు ఏడ్చిన ప్రతిసారీ "నేనూ బాధపడుతున్నాన"ని చెప్తున్నారు. “బాబా! మీ కరుణ మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి. నా చెడు కర్మలు తీసేసి నాకు ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించండి బాబా".


ఇంకో అనుభవం : నాకు, మావారికి ఉన్న అపార్థాలు ఇతరులు కలుగచేసినవి. ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒకానొక దశలో మేము విడిపోతామన్న భయం నాకు కలిగింది. పగలు, రాత్రి అదే ఆలోచన. మనసు పనిచేయలేదు. మేము గుంటూరు వెళ్లినప్పుడు ఒక బాబా గుడికి వెళ్ళాం. అక్కడ ఊదీ తీసుకుని బాధపడుతూ ఉన్నాను. బాబా పాదాల వద్ద మణెమ్మగారు రచించిన సాయిసచ్చరిత్ర ఉంది. ఒకసారి చూద్దామని తెరిచాను. ఆశ్చర్యం! మా ఇంటిపేరుతో ఉన్నవారి గోత్రనామాలు ఆ పేజీలో ఉన్నాయి. వాళ్ళకి కూడా మాలాగే ఒక బాబు, పాప ఉన్నారు. అవి చూసేసరికి నా భర్త నాకు దూరం కారని ఏదో తెలియని ఉపశమనం. కానీ నా భర్త ఇంకా నా దగ్గరికి రాలేదు. ఆయన తొందరగా రావాలని కోరుకుంటూ బాబానే నమ్ముకుని ఉన్నాను.


సాయి అనుగ్రహ వీక్షణాలు


ముందుగా సాయిభక్తులకు నా నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. నేను యూరప్‌లో నివాసముంటున్న ఒక సాయిభక్తురాలిని. ఇదివరకు కొన్ని అనుభవాలను పంచుకున్న నేను, ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను.


నా భర్త ఈమధ్య ఒకరోజు పనిమీద బయటకి వెళ్లాల్సి వచ్చింది. అలా వెళ్లిన ఆయన చాలాసేపటి వరకు తిరిగి రాలేదు. బయట పరిస్థితులు బాగాలేనందున ఏమైందోనని నాకు చాలా టెన్షన్‌గా అనిపించింది. అప్పుడు నేను, "బాబా! నా భర్తకి ఏ ఇబ్బందీ లేకుండా తొందరగా ఇంటికి వచ్చినట్లయితే ఈ అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా ఎంతో దయతో నా భర్తకి ఏ ఇబ్బందీ లేకుండా చూసుకున్నారు. ఆయన కాసేపటికి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్ బాబా".


2021, సెప్టెంబరు 2వ తేదీ ఉదయం నిద్రలేచిన తరువాత అనుకోకుండా నా మెడ నరం పట్టేసి, చాలా నొప్పిపెట్టసాగింది. ఆరోజు నా భర్త ఇంటి దగ్గర లేరు. చిన్నబాబుతో మేనేజ్ చేసుకోవడం చాలా కష్టంగా అనిపించింది. అప్పుడు నేను, "బాబా! ఈరోజు పూర్తయ్యేలోపు నొప్పి తగ్గిపోతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల సాయంత్రానికల్లా నొప్పి తగ్గిపోయింది. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".


నేనున్నానంటూ ధైర్యాన్నిస్తున్న బాబా

సాయిబాబా భక్తులందరికీ మరియు ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా నమస్కారాలు. నా పేరు వరలక్ష్మి. నేను మొదటిసారి ఈ బ్లాగులో నా అనుభవాలను పంచుకుంటున్నాను. మా చిన్నబ్బాయికి కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి. అవి తగ్గిపోతే ఆ అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని నేను సాయినాథుని వేడుకుని, బాబా ఊదీని నీళ్లలో కలిపి తనకు ఇస్తున్నాను. బాబా ఆశీస్సులతో తన ఆరోగ్య సమస్యలు తగ్గుతున్నాయి. ఇంకా, తన చర్మం మీద దురదలు పెడుతుంటే, బాబా ఊదీని నీళ్లలో కలిపి వాడి శరీరమంతా రాస్తూ ఉండేదాన్ని. బాబా దయవల్ల ఇప్పుడు ఆ సమస్య తగ్గింది. అంతా ఆ సాయినాథుని మహిమ

నేను మామూలుగా సాయిబాబా ఫోటోని పూజగదిలో పెట్టుకుని పూజిస్తుండేదాన్ని. కానీ, ఆయన నామస్మరణ అంతగా చేసేదాన్ని కాదు. నేను సచ్చరిత్ర పారాయణ చేస్తాను అనుకుని 11 సంవత్సరాలకి, అంటే ఇప్పుడు చేశాను. సాయినాథుడు ఎంత దయామయుడు అంటే, మనం మర్చిపోయినా కూడా ఆయన మనల్ని మరచిపోరు. ఆయన తమ భక్తులు ఎక్కడున్నా ఏదోవిధంగా తమ దగ్గరికి లాక్కొని, నేనున్నానంటూ ధైర్యాన్ని ఇస్తారు. నేనిప్పుడు చాలా సమస్యలలో ఉన్నాను. "నేనున్నాను, నీకు సహాయం చేస్తాను. నువ్వు భయపడొద్దు" అని సాయినాథుడు చెపుతున్నారు. ఆయన నాకు కలలో చెప్పారేమో స్పష్టంగా తెలియదుగానీ, "నీ సమస్య తీరాలంటే, నువ్వు లలితా సహస్రనామం పఠించు, నీ కోరిక తీరుతుంది" అని నాకు ఒక మార్గం చూపించారు. ఆ సాయినాథుడే అమ్మవారి రూపంలో నాకు ఆ సమస్యల నుంచి విముక్తి కలిగించి ఆ నా కోరిక తీరుస్తారని ఆశిస్తున్నాను. నా అనుభవాలు చాలా ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు అన్నీ మీతో పంచుకుంటాను. 

సద్గురు శ్రీ సాయినాథునికి జై!


FacebookWhatsAppXFacebook SendGmailYahoo! MailLinkedInSMSBloggerEmailSumoMe

5 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😃🌺🥰🌸🤗🌹😀🌼

    ReplyDelete
  3. Jai sairam. Bless amma for her eye operation and bless me for good health and wealth. Jai sairam.

    ReplyDelete
  4. Om sairam baba na samasyalani teerchu th

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo
 
FacebookWhatsAppXFacebook SendGmailYahoo! MailLinkedInSMSBloggerEmailSumoMe