సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 209వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • సాయిప్రభువు ఇచ్చిన గొప్ప అనుభవం

సాయిలీల పత్రికలో ప్రచురితమైన వాసుదేవ్ గారి అనుభవం ఈరోజు మీ ముందుంచుతున్నాము.

నేనొక మెకానికల్ ఇంజనీరుని. 1980వ సంవత్సరంలో నేను బెంగళూరులో ఒక చిన్న తరహా పరిశ్రమను నడుపుతుండేవాడిని. హఠాత్తుగా వ్యాపారంలో నా భాగస్వామితో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అతడు తన అనారోగ్యాన్ని సాకుగా చెప్పి వెంటనే వ్యాపారం నుండి వైదొలగుతానని పట్టుబట్టాడు. అందుకుగాను గుడ్‌విల్‌గా ఒక లక్షా పన్నెండు వేల రూపాయలను పరిహారంగా చెల్లించమని అడిగాడు. అయితే నేను ఆర్థికంగా పేద ఇంజనీరుని, పైగా నా దగ్గర ఉన్న కొద్దిపాటి మొత్తాన్ని అప్పటికే వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాను. నేను అనుభవిస్తున్న ఏకైక సంపద సాయిపై నాకున్న శ్రద్ధ(విశ్వాసం) మాత్రమే. పైగా పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలో ఉంది. భారీ ఋణాలు, బాధ్యతలు మాపై ఉన్నాయి. పరిస్థితి అలా ఉంటే నా భాగస్వామి యొక్క డిమాండును నేను అంగీకరించకపోతే, అతని నుండి నాకు సహకారం లభించదు. అది పరిశ్రమ నడవడానికి హానికరం. కాబట్టి ఆ సమస్య నాకొక సవాలు అయ్యింది. ప్రారంభంలో సమస్య పరిష్కరించలేనిదిగా అనిపించింది. నా స్నేహితులు, శ్రేయోభిలాషులు, “అప్పే చేయి, దొంగతనమే చేయి, కానీ ఏదో ఒక విధంగా డబ్బు ఏర్పాట్లు చేసి నీ భాగస్వామికి చెల్లించు. లేకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది” అని సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే నేను ఎవరిని వేడుకోవాలి? ఎక్కడ అప్పు పొందాలి? నేను ఏం చేయాలి? ఏదీ తెలియక మౌనంగా ఉండిపోయాను.

అలా ఉండగా 1980 జనవరి నెలలో నా స్నేహితుడొకడు శిరిడీ సందర్శించేందుకు ప్రణాళిక వేసుకుని, నేను మానసికంగా చాలా బాధపడుతున్నందున నన్ను, "తనతో శిరిడీ రావడానికి ఆసక్తి ఉందా?" అని అడిగాడు. మానసిక శాంతిని పునరుద్ధరించుకునే లక్ష్యంతో నేను వెంటనే అంగీకారం తెలిపాను. ఒకరాత్రికి మేము శిరిడీ నేలపై అడుగుపెట్టాము. మరుసటిరోజు బాబాకు అభిషేక సేవ చేసుకున్న తరువాత సమాధిమందిరంలో సాయి వెండిపాదాలపై రెండు చీటీలు ఉంచాను. ఒక చేతిలో 'భాగస్వామ్యాన్ని కొనసాగించమ'ని, రెండో దానిలో 'ఏదోవిధంగా భాగస్వామ్యాన్ని వదిలించుకోమ'ని వ్రాశాను. నిజానికి సాయి దివ్యపాదాలపై ఈ వెర్రి పని చేయడానికి చాలా సంశయించాను. కానీ చివరికి, 'నేను ఆయన బిడ్డనైనప్పుడు ఎందుకు భయపడాలి?' అని అనుకుని నా తండ్రి వద్దనుండి సహాయం తీసుకునేందుకు కాస్త స్వేచ్ఛ తీసుకున్నాను. ఆ తండ్రిని ప్రార్థించి ఆయన వెండిపాదాలపై ఉన్న రెండు చీటీల నుండి ఒకదాన్ని తీసుకున్నాను. తరువాత సమాధిమందిరం నుండి బయటకు వచ్చాక నేను చీటీ తెరచి చూశాను. అందులో 'ఏదో ఒకలా భాగస్వామిని వదిలించుకో' అని ఉంది. ఆ విషయాన్ని నాతో ఉన్న నా స్నేహితుడికి చెప్పాను. నేను సాయి పాదాల చెంత చేసిన వెర్రిపనికి నా స్నేహితుడు సంతోషించలేదు. తను నాతో, సాయి పాదాల వద్ద చీటీలు ఉంచకూడదని చెబుతూ, 'ఎలాగైనా నీకు భాగస్వామితో కొనసాగక తప్పదు' అని చెప్పాడు. ఆ సమయంలో నేను నా మనస్సులో, "నా భాగస్వామికి పరిహారంగా చెల్లించాల్సిన డబ్బులు ఎలా ఏర్పాటు చేసుకోవాలో నేను ఆలోచించుకోవాలి. అందుకు తగిన కృషి చేయాలి. నా సాయి తండ్రి తన అనుమతి ఇచ్చిన తరువాత అందుకు తగిన పరిష్కారం కూడా ఆయనే చూపించగలరనే విషయం కూడా నాకు తెలుసు. కాబట్టి సమస్య పరిష్కారం కోసం చిత్తశుద్ధితో సరైన దిశలో కష్టపడాలి" అని సంకల్పం చేసుకున్నాను.

బెంగళూరుకు తిరిగి వచ్చాక నేను ప్రతిరోజూ డబ్బులు ఏర్పాటు చేయగలిగే మార్గాల గురించి ఆలోచిస్తూ గడిపాను. అయితే సమస్యకు సరైన పరిష్కారం దొరకకుండానే చాలారోజులు గడిచిపోయాయి. అయినా నేను నా ఆలోచనలను పట్టువదలకుండా కొనసాగిస్తూ సమస్యను సాయి పాదాలకు అర్పించాను. ఒకరోజు నేను కొంత ఆర్థిక సహాయాన్ని అర్థిస్తూ నా సోదరుడి(వైద్యుడు)కి ఉత్తరం వ్రాశాను. తను రూ.30,000/- నాకు ఇవ్వడానికి తక్షణమే అంగీకరించాడు. ఇంకా రూ.20,000/- తక్కువగా ఉంది. దానికేమి చేయాలో తెలియలేదు. నా స్నేహితుల సహాయంతో నా భాగస్వామితో ఒక సమావేశం ఏర్పాటు చేసి, భాగస్వామ్యం రద్దుపరచుకునేందుకు దస్తావేజు రూపొందించాము. దస్తావేజు నిబంధనల ప్రకారం దస్తావేజుపై సంతకం చేసిన వెంటనే నేను అతనికి రూ.50,000 చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని 10 సమాన వాయిదాలలో చెల్లించాలి. అయితే నా దగ్గర రూ. 50,000 కు గాను రూ.20,000 తక్కువగా ఉన్నందున నేను చాలా నిరాశకు గురయ్యాను. దస్తావేజుపై సంతకం చేయాల్సిన రోజు, అనగా 21-8-1982 సమీపిస్తోంది. ఆ రోజు నా భాగస్వామి, నా స్నేహితులందరూ వస్తారు, డబ్బు ఏర్పాట్లు చేయలేని కారణంగా వాళ్ళందరి సమక్షంలో నేను అవమానం పాలవుతానని పదేపదే ఆలోచించుకుంటూ విపరీతమైన ఆందోళనతో రోజులు గడుపుతుండేవాడిని. ఆరోజు రేపనగా, అంటే 20-8-1982న ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో నేను మౌనంగా ఇంట్లో కూర్చుని ఉన్నాను. రేపటిరోజుని ఎలా ఎదుర్కొనేది అన్న ఆలోచనలతో నా మనసంతా నిండిపోయివుంది. ఇంతలో బాబా అద్భుతం చేశారు! మధ్యాహ్నం 2 గంటల సమయంలో నేను నా కుటుంబసభ్యులతో కలిసి భోజనం ముగించాను. అంతలో ఎవరో తలుపు తట్టడం వినపడింది. నేను తలుపు తెరచి చూస్తే, ఎదురుగా ఒక పాత స్నేహితుడు, తనతోపాటు ఒక పెద్దాయన ఉన్నారు. వేళకానివేళలో నా పాత స్నేహితుడి సందర్శన నన్ను ఆశ్చర్యపరిచింది. తను ఏమైనా నా వద్దనుండి ఆర్థిక సహాయాన్ని అర్థించడానికి వచ్చాడేమో అనుకున్నాను. అలా ఎందుకు అనుకున్నానంటే, నా జీవితంలో ఎవరూ నాకు డబ్బు ఇవ్వరు, కానీ చాలామంది నా వద్దనుండి తీసుకుంటారు. అది నా జీవిత అనుభవం. అయితే ఇది నా జీవితకాలంలోనే అసాధారణ అనుభవం. ఆ స్నేహితుడు తన వద్ద ఉన్న 20,000 రూపాయలను నా వద్ద ఉంచాలని అనుకుంటున్నట్లుగా చెప్పాడు. పైగా నాకు వీలున్నప్పుడే నామమాత్రపు వడ్డీతో తిరిగి చెల్లించమని చెప్పాడు. అలా ఎంత మొత్తమైతే నాకు అవసరమో అంతే మొత్తాన్ని చాలా సులువుగా నా ముందుకు తీసుకొచ్చారు బాబా. తరువాత నేను నా స్నేహితుడికి, పెద్దాయనకి ఆహారాన్ని అందించాను. వాళ్లిద్దరూ ఆ ఆహారాన్ని హృదయపూర్వకంగా స్వీకరించి, కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత వెళ్లిపోయారు. సమస్యలు పరిష్కరించుకుని నా చిన్న కర్మాగారాన్ని నా సాయిప్రభువుకే అంకితం చేశాను. నా జీవితంలో జరిగిన ఆ గొప్ప క్షణాన్ని నేను ఎలా మరచిపోగలను? అంతలా కనిపెట్టుకునివుండే నా సాయి నారాయణుడిని ఒక్క క్షణమైనా ఎలా మరచిపోగలను?

-కె. వాసుదేవ్,
బెంగళూరు - 560 058.

(మూలం: శ్రీసాయిలీల పత్రిక, అక్టోబర్ 1983)

4 comments:

  1. ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  2. 💐💐 Om Sairam💐💐

    ReplyDelete
  3. Baba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl house problem solve cheyandi Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo