1. సాయి పరిష్కరించిన చిన్న సమస్య
2. స్వప్నమందు గంగోదకమిచ్చి వ్యాధిని నయం చేసిన సాయి
3. అందరినీ చల్లగా చూస్తారు బాబా
సాయి పరిష్కరించిన చిన్న సమస్య
"సమర్థ సద్గురు సాయి మహరాజా! మీకు నా శతకోటి నమస్కారాలు. ఇంతకంటే మీకు మేమేం ఇవ్వగలం సాయీ?". తోటి సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నేనొక చిన్న సాయిభక్తురాలిని. ఏనాడో నేను నా జీవితాన్ని సాయి పవిత్ర పాదాల చెంత ఉంచాను. నా దినచర్య సాయితో ప్రారంభమై, సాయితోనే ముగుస్తుంది. ఏమి తిన్నా, ఏమి త్రాగినా సాయికి సమర్పించనిదే నేను స్వీకరించను. నా జీవితంలో సాయికి నివేదించని సమస్య లేనే లేదు. నా సమస్య ఎంత చిన్నదైనా సాయి నాకు పరిష్కారం చూపుతూ ఉన్నారు. సాయి లేకుండా నేను లేను. 'సాయి, సాయి, సాయి' అని సదా తలుస్తూ ఉంటాను. అలాగే సాయి సదా పలుకుతూ, నాకు సమాధానమిస్తూ ఉన్నారు. అందుకు నా(మన) సాయికి శతకోటి పాదాభివందనాలు.
2021, ఆగస్టు 14న మా తమ్ముడు కూతురి వివాహం జరిగింది. ఆ వివాహానికి ముందు నేను సాయికి ఒక చిన్న సమస్యని నివేదించాను. మా ఇల్లు సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న ఒక కాలనీలో ఉంటుంది. మా కాలనీలో ఇంకా కాలువల నిర్మాణం జరగనందున ప్రతీ ఇంటివాళ్లు ఇంకుడు గుంతలు త్రవ్వుకుని కాలక్షేపం చేస్తున్న కారణంగా వర్షాకాలంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల నేను, "సాయీ! పెళ్లికి బంధువులొస్తారు కదా. నీరు, బురద లేకుండా మన వీధిని బాగుచేయించండి. ఎంతో కొంతైనా సరిచేయించండి" అని సాయిని వేడుకున్నాను. తరువాత సుమారు 4, 5 రోజులకి వీధిలో నలుగురు, ఐదుగురు ఇంకుడు గుంతలు బాగుచేయించి, నీరు బయటకి రాకుండా చేయించారు. "సాయీ! నా మాట మన్నించావా తండ్రీ" అని సాయికి ఆనందంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. సాయి దయవల్ల నా మేనకోడలి వివాహం బాగా జరిగింది. "ధన్యవాదాలు సాయీ. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని మీకు తెలుసు. అవి కూడా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను తండ్రీ".
మా సాయిబాబా గుడిలో 25 సంవత్సరాలుగా ఉన్న విగ్రహం జీర్ణమవుతున్న కారణంగా క్రొత్తగా మరొక సాయి విగ్రహం గురుపౌర్ణమిరోజున ప్రతిష్ఠించారు. ఆ కార్యక్రమంలో ఉడతాభక్తిగా నాకు అవకాశమిచ్చినందుకు కూడా సాయికి శతకోటి ధన్యవాదాలు. మా కాలనీలో మంచిగా రోడ్లు, కాలువలు వచ్చి పూర్తి స్థాయిలో బాగుకావాలని సాయిని వేడుకుంటున్నాను. "సాయీ! అందరినీ చల్లగా చూడండి. అందరి సమస్యలూ పరిష్కరించి, అందరూ మీ మార్గంలో పయనించేలా చేయండి".
స్వప్నమందు గంగోదకమిచ్చి వ్యాధిని నయం చేసిన సాయి
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.
సద్గురువు, జగద్గురువు, రాజాధిరాజు అయిన శ్రీసాయి పాదపద్మములకు నా నమస్కారాలు. నా పేరు సూర్యనారాయణమూర్తి. నేను హైదరాబాదులోని విజయనగర్ కాలనీ నివాసిని. 2021, ఆగస్టు 20వ తేదీ సాయంత్రం హఠాత్తుగా నాకు తీవ్రంగా అలర్జీతో కూడిన జలుబు చేసి, మరునాటికి మరింత తీవ్రమైంది. ఆరోజు రాత్రి 103 డిగ్రీల జ్వరం కూడా వచ్చింది. నేను ఆ సమయంలో మా పెద్దమ్మాయివాళ్ళ ఇంట్లో ఉన్నాను. కరోనా కారణంగా ఆఫీసుకి వెళ్ళని నేను ఆమధ్యనే ఆఫీసుకి వెళ్తున్నందువల్ల ఇలా అయిందేమో, ఇక్కడే ఉండి మా అమ్మాయి కుటుంబానికి ఇబ్బంది కలిగించడం ఎందుకని ఆరోజు రాత్రి 9:00 గంటలకు మా ఇంటికి వచ్చేశాను. ఆ రాత్రంతా ఒకటే ఒళ్లునొప్పులు. వాటితో బాధపడుతూనే, 'ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః' అనే మంత్రాన్ని పఠిస్తూ పడుకున్నాను. మర్నాడు ఆదివారం కావడం వలన డాక్టరుని సంప్రదించలేకపోయాను. ఆ రాత్రి కూడా పై మంత్రాన్ని జపిస్తూ, "సోమవారం ఉదయానికి నాకు నయమైవ్వాలి" అని బాబాకి చెప్పుకుని పడుకున్నాను. ఆ రాత్రి ఒంటినొప్పులు తగ్గాయి, జ్వరం కూడా 101 డిగ్రీలకు వచ్చింది. సోమవారంనాడు డాక్టరుకి చూపించుకుంటే, "అది సాధారణ సీజనల్ జ్వరం" అని చెప్పి మందులిచ్చారు. ఆ రోజంతా 101 డిగ్రీల జ్వరం ఉంది. ఆ రాత్రి, ‘ఎప్పుడూ సత్వరమే పలికే బాబా ఇప్పుడు మౌనంగా ఉన్నరెందుక’ని తీవ్రంగా జపం చేస్తూ పడుకున్నాను. అదేరోజు మా పెద్ద బావగారిని(నా భార్య పెద్ద అన్న) ఆరోగ్యం విషమించినందువల్ల ఆసుపత్రిలో చేరినట్లు, కార్పొరేట్ హాస్పిటల్‌వాళ్ళు అతనిని తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నట్లు మాకు తెలిసింది. కానీ నా పరిస్థితి వలన వెంటనే వెళ్ళలేక కేవలం బాబాను ప్రార్థించి, "అతనికి మంచి జరగాల"ని కోరుకుంటూ ఉండసాగాను. ఆరోజు తెల్లవారుఝామున స్వప్నంలో నాకు బాబా ఆశీర్వాదం లభించింది. ఉదయాన నిద్రలేస్తూనే హుషారుగానూ, కొంత ఉపశమనంగానూ అనిపించింది. నాకున్న పరిచయస్థుల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రివాళ్ళు పెడుతున్న ఇబ్బందుల నుండి మా పెద్ద బావగారిని తప్పించి, అతను డిశ్చార్జ్ అయ్యేందుకు ప్రయత్నించాను. ఆరోజు అలా గడిచింది. ఆరోజు రాత్రి నాలుగు గంటలకు బాబా మళ్లీ స్వప్నదర్శనమిచ్చారు. ఆయన ద్వారకామాయిలో ఒక చేతిలో లోటాతో గంగాజలం పట్టుకుని కనిపించి, ఆ జలాన్ని మూడుసార్లు నా చేతిలో పోశారు. అదీకాక, 'పెద్ద బావగారి ఇబ్బందులు తొలగి డిశ్చార్జ్ అవుతార'ని తెలియజేశారు. ఆ తరువాత చాలాసేపు వ్యక్తిగతంగా నాకు అనేక బోధలు చేశారు. అప్పుడే హైదరాబాదుకి చెందిన మరో సాయిభక్తుడు ద్వారకమాయికి రాగా, బాబా అతనితో, “ఈ గంగాజలం తీసుకో” అన్నారు. అవి గంగాజలం కాదని అతను సందేహిస్తుంటే నేను అతనితో, "సాయి చేతితో ఇచ్చిన ఏ ఉదకమైనా గంగోదకమే కదా" అని చెప్పి, అతనికి కూడా ఆ జలాన్ని ఇవ్వమని సాయిని ప్రార్థించాను. బాబా అతనికి ఒక్కమారు జలమిచ్చి ఆశీర్వదించారు. అంతేగాక, " ‘సాయి’ అనే రెండు అక్షరాలలోనే సకల ఈశ్వరతత్వం ఉంది. ‘సాయి’ అంటే సృష్టి, స్థితి, లయ కారకుడు" అని చెప్పి బాబా అదృశ్యమయ్యారు. అంతటితో నా ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. ఇంక ఆరోజు, అనగా బుధవారం రాత్రి మా పెద్ద బావగారికి ఎటువంటి వ్యాధీ లేదని చెప్పి డిశ్చార్జ్ చేశారు. అంతేకాక, అతను కట్టిన డబ్బులలో ఏదో కొంత ఖర్చులుగా ఉంచుకుని మిగిలింది తిరిగి ఇచ్చేశారు. తమను ప్రేమించే భక్తులపై అత్యంత అనురాగ గంగాప్రవాహాన్ని కురిపిస్తున్న నా సాయికి కోటానుకోట్ల నమస్కారాలు.
శ్రీ సచ్చిదానందాయ నమః.
అందరినీ చల్లగా చూస్తారు బాబా
సాయిభక్తులందరికీ నమస్కారం. నేనొక సాయిభక్తురాలిని. 2021, ఆగష్టు 28న మా చిన్న కుమారుడు చిరంజీవి సాయి భార్గవ్ తేజ్‌కి కరోనా నెగిటివ్ అని వచ్చింది. ఇదంతా బాబా నా మీద కురిపించిన దయవల్లనే జరిగిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆరోజు ఉదయం నుంచి బాబుకి జ్వరం, గొంతునొప్పి, దగ్గు సమస్యలు ఉండటంతో తను వెళ్లి టెస్టుకి శాంపిల్స్ ఇచ్చి వచ్చాడు. అప్పటినుండి నేను బాబాని స్మరిస్తూ భారమంతా ఆయన మీదే వేశాను. తరువాత టీవీలో వస్తున్న సీరియల్ చూస్తుండగా, అందులో బాబా మాటలు విన్న నాకు కన్నీళ్లు ఆగలేదు. అందులో బాబా గోమాతతో, "నువ్వు బాధపడవద్దు. నిన్ను, నీ బిడ్డను నేను కాపాడుతాను" అని అన్నారు. ఆ దృశ్యం చూడగానే నాకు చాలా ధైర్యం వచ్చింది. ఆ రాత్రి వచ్చిన మా బాబు రిజల్ట్‌లో తనకి కరోనా నెగిటివ్ అని వచ్చింది. ఆనందంతో బాబాకి కృతజ్ఞతలు తెలుపుకుని, "తండ్రీ! అందరినీ ఇలానే కాపాడుతూ ఉండయ్యా. ఈ ప్రపంచాన్ని కరోనా బారినుంచి కాపాడు నాయనా" అని చెప్పుకున్నాను. వెంటనే బ్లాగులో పంచుకోవాలని ఇలా వ్రాశాను. అందరినీ చల్లగా చూస్తారు బాబా.
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDelete🙏💐🙏ఓం సాయిరాం🙏💐🙏
ReplyDelete862 days
ReplyDeletesairam
Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😃❤😊🌸🥰🌼😀🌺🌹
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteBaba ee gadda ni tondarga karginchu thandri pleaseeee
ReplyDeleteBaba pillala arogyam bagundali thandri
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteBaba ne daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi pl
ReplyDelete