సాయి వచనం:-
'అందరూ భగవదంశలే! అందువల్ల ఎవరూ ఎవరినీ ద్వేషించకూడదు. అందరిలోనూ ఈశ్వరుడు వసిస్తాడు. ఇది మరువవద్దు.'

'సాయిభక్తులందరూ వివేకంతో ఆత్మవిమర్శన చేసుకుంటూ, నిజమైన సాయి సాంప్రదాయమేమిటో తెలుసుకుని ముందుకుపోవాలి' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 626వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. ఆరోగ్యదాత సాయి
  2. మనోవాంఛను నెరవేర్చిన బాబా

ఆరోగ్యదాత సాయి

నేను హైదరాబాద్ నుండి శ్రీమతి లక్ష్మి. ముందుగా సాయిబంధువులందరికీ నమస్కారం! 2008, నవంబరు నెలలో నేను హైదరాబాదులో ఒక పెళ్ళికి వెళ్తున్నప్పుడు అనుకోకుండా బండి మీద నుండి పడిపోవటంతో నుదుటి పైభాగంలో దెబ్బతగిలి నేను స్పృహ కోల్పోయాను. కొంతసేపటికి స్పృహ వచ్చింది గానీ, చాలా మగతగా ఉండింది. ఎలాగో తమాయించుకుని దారిలో ఒక డాక్టరుని సంప్రదించి, మందులు తీసుకుని ఇంటికి వచ్చేశాను. రెండు రోజులకి నా ఎడమకన్ను పూర్తిగా ఎర్రబడి, కమిలిపోయినట్లు అయింది. నాకు చాలా భయమేసింది. ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాను. ఆయన 'బ్రెయిన్ స్కానింగ్ తీయాలి' అన్నారు. అది వింటూనే భయంతో నా గుండె దడదడలాడింది. బాబాను తలచుకుని, "నాపై కృప చూపమ"ని ప్రార్థించాను. బాబా దయవల్ల రిపోర్ట్ నార్మల్ అని వచ్చింది. డాక్టర్, "భయపడాల్సినంతగా ఏమీ లేదు. మందులతో తగ్గిపోతుంది" అని చెప్పారు. కొద్దిరోజుల్లో నాకు పూర్తిగా నయమైపోయింది

అయితే ఈమధ్యకాలంలో అప్పుడప్పుడు నా తలలో కొంచెం నొప్పిగా అనిపిస్తుండటం వలన పది, పన్నెండేళ్ల క్రితం జరిగిన ఆ దుర్ఘటన మళ్ళీ ఇప్పుడు ప్రభావం చూపుతుందేమోనని భయం వేసింది. అప్పుడు మన 'ఆరోగ్యదాత సాయి' మీద భారం వేసి, "నాకు ఏమీ కాకుండా చూడమ"ని ప్రార్థించాను. తరువాత మాకు తెలిసిన ఒక డాక్టరును కలిసి పరిస్థితి వివరించాను. ఆయన నన్ను పరీక్షించి, "ఏమీ లేదు, అనవసరంగా కంగారుపడవద్దు" అని ధైర్యం చెప్పారు. ఇదంతా సాయినాథుని దయ. "సాయీ! చాలా చాలా ధన్యవాదాలు తండ్రీ. మీ భక్తులందరికీ ఎల్లప్పుడూ తోడు-నీడగా ఉంటూ రక్షణనివ్వు తండ్రీ!"

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


మనోవాంఛను నెరవేర్చిన బాబా

నా పేరు పుష్పలత. మేము హైదరాబాద్ నివాసులం. నేను గత 20 సంవత్సరాలుగా బాబానే మనసా, వాచా, కర్మణా నమ్మి కొలుస్తున్నాను. ఆయన దయతో వృత్తిరీత్యా, కుటుంబపరంగా సంతృప్తికరమైన జీవితాన్ని పొందాను. బాబా నాకు, నా కుటుంబానికి చాలా అనుభవాలు ప్రసాదించారు. వాటిలో నుండి ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

నేను ఒక ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు అమ్మాయిలు. మా పెద్దమ్మాయికి ఎంసెట్ పరీక్షలో 11,043వ ర్యాంకు వచ్చింది. మా అమ్మాయిని కంప్యూటర్ సైన్సులో ఇంజనీరింగు (సి.ఎస్.ఈ) చేయించాలని మా ఆశ. కానీ జనరల్ కేటగిరీకి చెందినందువల్ల మా అమ్మాయికి వచ్చిన ర్యాంకుకు హైదరాబాదులోని టాప్ టెన్ కాలేజీలలో సి.ఎస్.ఈలో సీటు రావడం కష్టమే. అది తెలిసి కూడా మేము బాబాపై నమ్మకం ఉంచి, ఆయన మీదే భారం వేశాము. తరువాత కౌన్సిలింగ్‌లో మా అమ్మాయికి VNRVJIET (Vallurupalli Nageswara Rao Vignana Jyothi Institute of Engineering and Technology) లో EIE (Electronics and Instrumentation Engineering) సీటు వచ్చింది. అదే బాబా ప్రసాదం అనుకుని 1,31,000+12,700 రూపాయలు ఫీజు కట్టి మా అమ్మాయిని ఇంజనీరింగులో చేర్చాము. తరవాత బాబా ప్రసాదించిన అద్భుత వరాన్ని చూడండి!

అనుకోకుండా 2020, నవంబరు 19, గురువారంనాడు ఇంటర్నల్ స్లైడింగ్ ఆప్షన్ ద్వారా జనరల్ కేటగిరిలో మా అమ్మాయికి మేము ఆశపడిన CSE (Internet of Things [IoT]) సీటు వచ్చింది. చిత్రమేమిటంటే, మా అమ్మాయితో CSE సీట్లు అయిపోయాయి. ఈ అద్భుతం కేవలం బాబా కృప వలన మాత్రమే జరిగింది. మేము మా అమ్మాయికి CSEలో సీటు వస్తుందని అస్సలు అనుకోలేదు. నేను చేసింది ఒక్కటే, ఆరోజు గురువారంనాడు కౌన్సిలింగ్ జరిగేటప్పుడు బాబాను మనస్ఫూర్తిగా స్మరిస్తూ, నా కోరికను వారితో చెప్పుకుని ఆపై, "నీ నిర్ణయమే మా జీవిత గమ్యమ"ని భారం ఆయన మీద వేశాను. బాబా దయతో మా అమ్మాయికి సీటు వచ్చింది. మా ఆనందానికి హద్దులు లేవు. నా ఆనందాన్ని మా అమ్మకి, అక్కకి ఫోన్ చేసి చెబితే, 'అదంతా బాబా చల్లని చూపు' అని సంతోషించారు. ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితంలో బాబా అద్భుతలీలలు ఎన్నో..! ఎన్నెన్నో...!! "బాబా! మేము అనుకున్న గ్రూపులో సీటు ప్రసాదించినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు".

సాయినాథ్ మహరాజ్ కీ జై!



8 comments:

  1. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  2. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  3. సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Baba santosh ki help chesinanduku thanks baba alage ma amma ki problem cure cheyi thandri sainatha nenne namukunanu thandri

    ReplyDelete
  6. Baba please daya chupinchayya sai sai sai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo