సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 291వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. మాట్లాడే ప్రతి మాటా వినే సాయి
  2. భక్తులు అడగటం మరచిపోయినప్పటికీ తన భక్తులకేమి కావాలో బాబా మరచిపోరు!

మాట్లాడే ప్రతి మాటా వినే సాయి

ఓం సద్గురవే నమః. సాయిబంధువులందరికి నమస్కారములు. నా పేరు సంధ్య. ఒకసారి మా కుటుంబమంతా కలిసి శిరిడీ వెళ్లాము. శిరిడీలో నేను పొందిన సాయి ప్రేమను సాటి సాయిబంధువులతో ఇప్పుడు పంచుకోబోతున్నాను.

సాధారణంగా నాకు గుడిలో దీపాలు వెలిగించటమంటే చాలా ఇష్టం. అందువల్ల శిరిడీ ప్రయాణమయ్యే ముందు శిరిడీలో దీపాలు వెలిగించాలని నెయ్యి, వత్తులు, ప్రమిద, ధూపం సిద్ధం చేసుకున్నాను. కానీ ప్రయాణం హడావిడిలో వాటిని ఇంట్లోనే మరచిపోయాను. శిరిడీ వెళ్లి బాబాను కనులారా తృప్తిగా దర్శించుకున్నాము. ఆ తరువాత లెండీవనంలోకి వెళ్లాము. అక్కడ వేపచెట్టు క్రింద దీపాలు వెలిగించి ఉన్నాయి. అది చూసి నేను, "సాయీ! నేను కూడా దీపాలు వెలిగించాలనుకొని, దానికోసం అన్నీ సిద్ధం చేసుకుని కూడా ఇంట్లోనే వాటిని మర్చిపోయి వచ్చాను. వాటిని నాతోపాటు తెచ్చుకొని ఉంటే నేను కూడా దీపం వెలిగించగలిగేదాన్ని కదా" అని మనసులో సాయితో మాట్లాడుతూ, లెండీవనాన్ని చూస్తూ మెల్లగా నడుస్తున్నాను. కాస్త ముందుకు వెళ్ళాక నందదీపాన్ని దర్శించుకున్నాను. ఆ ప్రక్కనే కొద్ది దూరం వెళ్లాక అక్కడ 'ఓం' ఆకారంలో ప్రమిదల వరుస ఉండటం చూశాను. అందులోని ఒక్క ప్రమిదలో నెయ్యి, వత్తి వేసి వెలిగించడానికి సిద్ధంగా ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ ప్రమిదను ఎవరయినా వెలిగించడానికి సిద్ధం చేసాక అగ్గిపెట్టె కోసం వెళ్లుంటారని కొద్దిక్షణాలు వేచి చూశాను. కానీ అక్కడ అగ్గిపెట్టె కూడా ఉండటం గమనించి, నా మాటలు విన్న సాయి నా కోసమే దీపం వెలిగించడానికి సిద్ధం చేసి ఉన్నారని భావించి ఆనందంగా ఆ దీపాన్ని వెలిగించాను. నా మనసునెరిగిన బాబా దీపం వెలిగించాలనే నా సంకల్పాన్ని ఇలా నెరవేర్చారు. ఇంటికి వచ్చాక అందరితో సంతోషంగా సాయిలీలను పంచుకున్నాను. బ్లాగులో భక్తుల అనుభవాలు చదువుతుంటే బాబా నాపై కురిపించిన ప్రేమ గుర్తుకు వస్తుంది. నా కళ్లలో ఆనందాశ్రువులు పొంగిపొర్లుతాయి. సాయి ఎవరినీ నిరాశపరచరు. మనం సాయితో మాట్లాడే ప్రతి మాటా సాయి వింటారని ఈ సాయిలీల ద్వారా తెలుసుకున్నాను. నా మనసునెరిగిన సాయి నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. త్వరలోనే మరొక అనుభవంతో మళ్లీ కలుసుకుందాం.

సద్గురు చరణం - భవభయ హరణం

భక్తులు అడగటం మరచిపోయినప్పటికీ తన భక్తులకేమి కావాలో బాబా మరచిపోరు!

ఓం శ్రీసాయి రక్షక శరణం. నా పేరు 'సాయి శరణ్'. ముందుగా అత్యంత కరుణాపూర్ణుడైన సాయిదేవునికి నా నమస్కారములు. మనలో ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించి మార్గనిర్దేశం చేయమని ఆయనను వేడుకుంటున్నాను. ఇక నా అనుభవం విషయానికి వస్తే..

నేను దీర్ఘకాలిక 'గౌట్' రోగిని. ఇది కీళ్ళకు సంబంధించిన సమస్య. దీని కారణంగా కీళ్ళు వాచి, కదలికలు కష్టంగా మారుతాయి. ఈ వ్యాధి ఒకసారి వచ్చాక దానికి నివారణ లేదు. జీవించినంతకాలం మందులమీద ఉండాల్సిందే. దాని కారణంగా నా వేళ్ళలో తీవ్రమైన వైకల్యాలు ఏర్పడ్డాయి. నేను నా వేళ్ళను వంచలేను, నా చేతిని ఉపయోగించి ఆహారం తినలేను. నేను ఎప్పుడూ ఒక చెంచాను ఉపయోగించాల్సి వచ్చేది. నేను ఏదైనా ఫంక్షన్‌కు వెళ్ళవలసి వచ్చినప్పుడు, అక్కడ ఆహారం తీసుకుందామంటే చెంచాను సరిగ్గా పట్టుకునే శక్తి లేనందున అది క్రింద పడిపోతూ ఉండేది. నలుగురిలో నాకెంతో కష్టంగా, ఇబ్బందిగా ఉండేది. నేను పడే బాధను మాటల్లో చెప్పలేను. కొంతకాలం తర్వాత నేను, 'నా చేతిని సరిగ్గా చేయమ'నే కోరికతో సాయి దివ్యపూజను 7 వారాలు చేశాను. 7 వారాల పూజ పూర్తైన వెంటనే, అంటే అదేరోజు సాయి నాపై కరుణ చూపారు. అయితే నేను నా చేతివేళ్ళను నయం చేయమని సాయిని అడగటం పూర్తిగా మర్చిపోయాను. కానీ రోజూ ఊదీ మాత్రం నా వేళ్ళకు రాస్తూ ఉండేవాడిని. కొన్నిరోజుల తరువాత ఒకసారి నేను భోజనం చేసే సమయానికి నాకు చెంచా దొరకలేదు. కానీ నేను చాలా ఆకలితో ఉన్నందున నా వేళ్ళతో ఆహారం తినడానికి ప్రయత్నిద్దామని అనుకున్నాను. అద్భుతాలలోకే అద్భుతం! నేను నా వేళ్ళను మడవగలిగాను, నా వేళ్ళతో అన్నం పట్టుకుని సాధారణ వ్యక్తిలా తినగలిగాను. నేను పొందిన ఆనందాన్ని మాటల్లో ఎలా చెప్పను? నేను అడగటం మరచిపోయినప్పటికీ మన సాయి ఈ బిడ్డకేమి కావాలో మరచిపోలేదు. ఇప్పుడు నేను స్వయంగా నా చేతిని ఉపయోగించి తింటున్నాను. నా ఆరోగ్యంలో చాలా మెరుగుదల ఉంది. "చాలా ధన్యవాదాలు సాయీ!".

ఒకసారి నా చెవి బ్లాక్ అయి నొప్పిగా ఉండేది. నేను సరిగా వినలేక చాలా విసుగు చెంది, "నా చెవి సమస్యని నయం చేయమ"ని సాయిని ప్రార్థించి, చెవికి ఊదీ రాశాను. త్వరితగతిన నొప్పి తగ్గిపోయిందికాని ఇంకా కొంత బ్లాక్ సమస్య ఉంది. త్వరలోనే దాన్ని కూడా బాబా ఖచ్చితంగా తీసేస్తారని నాకు తెలుసు. "బాబా! నేను పిలిచినప్పుడల్లా మీరు నాకు సహాయం చేయడానికి వస్తున్నారు. కానీ నేను మిమ్మల్ని ప్రార్థించడం, దీపం వెలిగించడం మర్చిపోతున్నాను. నన్ను క్షమించండి దేవా! దయచేసి నాకు మార్గనిర్దేశం చేసి నన్ను మంచి వ్యక్తిగా చేయండి". 

సాయిబాబా మిమ్మల్ని, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించి, ఎల్లప్పుడూ మమ్మల్ని సరైన మార్గంలో నడిపించాలని కోరుకుంటున్నాను. దయచేసి పేదవాళ్ళపై, జంతువులపై దయచూపండి. మీకు వీలైనంతలో వాళ్ళకు సహాయం అందించడానికి ప్రయత్నించండి. 

అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


5 comments:

  1. Anantakoti brahmandanayaka rajadiraja yogiraja parahbramha Sri sachchidananda sadguru sainath maharajuki jai om sairam.

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🌹🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Baba na prasna/sandehaniki ki Samadhanam dorikindi.. ninnu badha petti unte sorry 🙏 .. nee meeda nammakam sadalakunda undela , nee darilo nadichela anugrahinchu 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  5. Om sri sairam 🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo